బీజేపీని ఓడిస్తేనే..  దేశం భద్రం | Manik Sarkar Comments On BJP | Sakshi
Sakshi News home page

బీజేపీని ఓడిస్తేనే..  దేశం భద్రం

Published Wed, Dec 14 2022 1:26 AM | Last Updated on Wed, Dec 14 2022 1:26 AM

Manik Sarkar Comments On BJP - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీని ఓడించకపోతే దేశానికి భద్రత లేదని త్రిపుర మాజీ సీఎం మాణిక్‌ సర్కార్‌ ఆందోళన వ్యక్తం చేశారు. దేశాన్ని రక్షించడా నికి ఎస్‌ఎఫ్‌ఐ నాయకత్వంలో విద్యార్థులు శంఖారావం పూరించాలని పిలుపునిచ్చారు. వినాశకరమైన నూతన విద్యా విధానాన్ని రద్దు చేసేలా పోరాటం చేయాలని విజ్ఞప్తి చేశారు. బలీయమైన జాతీయ ఉద్యమాన్ని నిర్మించి కొత్త విద్యా విధానాన్ని తిప్పి కొట్టాలని సూచించారు. ఎస్‌ఎఫ్‌ఐ జాతీయ మహా సభలు మంగళవారం హైదరాబాద్‌లో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో మాణిక్‌ సర్కార్‌ మాట్లాడారు.  

అన్ని రంగాలూ దుర్భర స్థితిలోనే..: ‘దేశం ప్రస్తుతం క్లిష్ట పరిస్థితుల్లో, దిగజారుతున్న దశలో ఉంది. విద్య సహా అన్ని రంగాలు దుర్భర పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ నియంతృత్వ కూటమి ప్రజా ప్రయోజనాలను దెబ్బతీస్తోంది. కేంద్రం విద్యారంగాన్ని ధ్వంసం చేస్తోంది. ప్రైవేటుపరం చేస్తోంది. పేద, మధ్య తరగతిని దెబ్బతీసేలా జాతీయ విద్యా విధానాన్ని తెచ్చింది. జాతీయ విద్యా విధానం బలహీన వర్గా లు, గిరిజనులు, దళితులు, మైనారిటీల ప్రయోజనాలకు తూట్లు పొడుస్తుంది. సంపన్న వర్గాల చేతుల్లోకి పోతుంది.
మంగళవారం నెక్లెస్‌ రోడ్డులో ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తల ర్యాలీ 

పేదలకు దూరం అవుతుంది. అలాగే పాఠ్యాంశాలను, సిలబస్‌ను మార్పు చేయాలని బీజేపీపై ఆర్‌ఎస్‌ఎస్‌ ఒత్తిడి తెస్తోంది. విద్య మౌలిక లక్ష్యం కష్టాల్లో ఉన్నవారికి తోడ్పాటునివ్వడం, శాస్త్రీయ థృక్పథాన్ని తీసుకురావడం. అందుకు విరుద్ధంగా విద్యా విధానం తెస్తున్నారు. నూతన విద్యా విధానంలో విభజన తత్వాన్ని నూరిపోస్తున్నారు. మూఢ నమ్మకాలను, సనాతనత్వాన్ని, సంప్రదాయాలను ప్రవేశపెడుతున్నారు. ఏ కోణంలో చూసినా పాఠ్యాంశాలను కలుషితం చేస్తున్నారు. స్వాతంత్య్ర పోరాటాలను వక్రీకరిస్తున్నారు..’అని మాణిక్‌ సర్కార్‌ విమర్శించారు.  

ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయి? 
‘దేశంలో కోట్లాదిమంది ఉద్యోగాల కోసం పరితపిస్తున్నారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోదీ 2014లో వాగ్దానం చేశారు. అలా ఇప్పటివరకు 16 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. కానీ ఇవ్వలేదు. కొత్తవి సృష్టించకపోగా ఖాళీగా ఉన్న లక్షలాది ఉద్యోగాలను భర్తీ చేయడం లేదు. నియామకాల పద్ధతినే మార్చేశారు. తాత్కాలికంగా నియమిస్తున్నారు. దీనితో నిరుద్యోగం ఎన్నడూ లేనంతగా పెరిగింది. సైన్యంలోనూ తాత్కాలిక పద్ధతిలో అగ్నిపథ్‌ను తీసుకొచ్చారు. నాలుగేళ్లు వాడుకొని వదిలేసేలా మార్చారు. దాన్ని వ్యతిరేకించాలి. పారిశ్రామిక, వ్యవసాయ రంగాలూ అలానే ఉన్నాయి. కార్మికులకు జీతాలు, హక్కులు లేవు. కార్మికుల 42 హక్కులను కాలరాశారు..’అని చెప్పారు.  

మతాల మధ్య చిచ్చు... 
‘బీజేపీ ప్రభుత్వం హిందువులు, ముస్లింలు, క్రైస్తవుల మధ్య వైషమ్యాలను పెంచుతోంది. ప్రజాస్వామ్య, పౌర హక్కులను కాలరాస్తోంది. రాజ్యాంగాన్ని భ్రష్టు పట్టిస్తోంది. వ్యవస్థను భగ్నం చేసే కుట్రకు పాల్పడుతోంది. ప్రజల మీద దాడులు చేస్తోంది. రాజ్యాంగాన్ని, న్యాయవ్యస్థను, ఎన్నికల కమిషన్‌ను తన గుప్పిట్లో పెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని కాలరాయాలని చూస్తోంది. ఈ పరిస్థితుల్లో విద్యార్థులే దేశాన్ని కాపాడుకోవాలి..’మాణిక్‌ సర్కార్‌ పిలుపునిచ్చారు. రైతులు, కార్మికులు, దళితులు ఇలా అన్ని వర్గాల ప్రజల కోసం విద్యార్థులు పోరాడాలన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ మహాసభల్లో ఈ అంశాలపై చర్చించాలని సూచించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement