
త్రిపురలో 85%, అస్సాంలో 76%
సార్వత్రిక ఎన్నికల రణరంగంలో తొలి దశ పోలింగ్ పర్వం ఘనంగా మొదలైంది.
ఉత్సాహంగా ఓటింగ్‌లో పాల్గొన్న ప్రజలు
ప్రశాంతంగా ముగిసిన పోలింగ్
అగర్తల/గువాహటి: సార్వత్రిక ఎన్నికల రణరంగంలో తొలి దశ పోలింగ్ పర్వం ఘనంగా మొదలైంది. అస్సాంలో 5 లోక్‌సభ స్థానాలకు (తేజ్‌పూర్, కలియాబోర్, జార్హాత్, దిబ్రూగఢ్, లఖీంపూర్), త్రిపురలో ఒక లోక్‌సభ స్థానానికి (త్రిపుర-వెస్ట్) సోమవారం జరిగిన పోలింగ్‌లో మహిళలు, వృద్ధులు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. త్రిపురలో 85 శాతం పోలింగ్ నమోదవగా అస్సాంలో 76 శాతం ఓటింగ్ నమోదైంది. తేజ్‌పూర్ నియోజకవర్గంలో మారుమూల గ్రామమైన ఫుల్గురి నేపాలిపామ్ గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన 301 మంది ఓట్లు వేశారు. అస్సాం సీఎం తరుణ్ గొగోయ్, భార్య డాలీ గొగోయ్, కుమారుడు గౌరవ్ గొగోయ్.. జోర్హాత్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
‘‘అస్సాంలో మోడీ మేజిక్కేమీ లేదు, ఉన్నదల్లా నా మేజిక్కే. మేం పది స్థానాలు గెలుస్తామని ఇంతకుముందే చెప్పాను. కాంగ్రెస్ అంతకంటే ఎక్కువే గెలుస్తుందని ఇప్పుడు చెప్తున్నాను’’ అని తరుణ్ గొగోయ్ ఓటేసిన అనంతరం చెప్పారు. త్రిపుర సీఎం, సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు మాణిక్ సర్కార్ సోమవారం విలేకరులతో మాట్లాడుతూ దేశంలో మోడీ గాలి ఏమీ లేదని, కార్పొరేట్ మీడియాయే దాన్ని సృష్టించిందని విమర్శించారు. అస్సాంలోని 5 స్థానాలకు గొగోయ్ కుమారుడు గౌరవ్ సహా 51 మంది అభ్యర్థులు బరిలో నిలవగా త్రిపుర-వెస్ట్ నుంచి 13 మంది అభ్యర్థులు పోటీ చేశారు.
పోలింగ్ శాతం పెరిగే అవకాశం...
త్రిపురలో రాత్రి 7 గంటలకు 200 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు ఇంకా బారులుతీరి ఉన్నందున పోలింగ్ శాతం పెరగొచ్చని త్రిపుర ప్రధాన ఎన్నికల అధికారి అశుతోష్ జిందాల్ తెలిపారు. త్రిపురలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదన్నారు. అస్సాంలో సాంకేతిక కారణాల వల్ల 93 ఈవీఎంలను మార్చామని...ఈ కారణంగా పోలింగ్‌కు కాసేపు అంతరాయం ఏర్పడటం వల్ల రీపోలింగ్ నిర్వహించే అవకాశం ఉందని అస్సాం ప్రధాన ఎన్నికల అధికారి విజయేంద్ర తెలిపారు. అయితే దీనిపై ఈసీ తుది నిర్ణయం తీసుకుంటుందన్నారు. మొత్తంమీద తొలి దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 2009 సార్వత్రిక ఎన్నికల్లో అస్సాంలో మొత్తంగా 69.60 పోలింగ్ శాతం నమోదవగా త్రిపుర-వెస్ట్‌లో 86.25 శాతం పోలింగ్ నమోదైంది. అస్సాంలోని మరో మూడు స్థానాలకు, త్రిపురలోని మరో స్థానానికి ఈ నెల 12న రెండో దశలో పోలింగ్ జరగనుంది.