సాక్షి, అగర్తలా: త్వరలో జరగనున్న త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే ధ్యేయంగా బీజేపీ జోరుగా ప్రచారం కొనసాగిస్తోంది. సీఎం మాణిక్ సర్కార్‌ను లక్ష్యంగా చేసుకుని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ విమర్శనాస్త్రాలు సంధించారు. సాక్షాత్తూ సీఎం సొంత నియోజకవర్గంలో ఓ యువతిపై అత్యాచారం జరిగితే కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించే తీరికలేని వ్యక్తి మాణిక్ సర్కార్ అంటూ స్మృతి మండిపడ్డారు.
ఛండీపూర్ నియోజకవర్గం రంగ్రంగ్ టీ ఎస్టేట్ స్కూల్ ఫీల్డ్‌లో సోమవారం బీజేపీ ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న సందర్భంగా సీఎం మాణిక్ సర్కార్‌పై స్మృతి ఇరానీ నిప్పులు చెరిగారు. సొంత నియోజకవర్గంలోని ప్రజలకే న్యాయం చేయలేని వ్యక్తి సీఎంగా ఎలా పనికి వస్తారని స్థానికులను ప్రశ్నించారు. మాణిక్ సర్కార్ గెలిచిన నియోజకవర్గంలోనే ఓ యువతిపై అత్యాచారం జరిగితే కనీసం వెళ్లి బాధితులను పరామర్శించి వారి సమస్యలను తెలుసుకోవడానికి తీరిక లేకుండా ఉన్న ముఖ్యమంత్రికి.. చంఢీగఢ్‌లో జరిగిన ర్యాలీలో పాల్గొని నిరసన తెలిపేందుకు మాత్రం సమయం ఉంటుందని స్మృతి ఇరానీ ఎద్దేవా చేశారు. గత 25 ఏళ్ల వామపక్షాల పాలనలో త్రిపురలో పేదరికం పెరిగిందని, అభివృద్ధి పూర్తిగా నిలిచి పోయిందన్నారు.
కేంద్ర బడ్జెట్‌లో 10 కోట్ల మంది పేదలకు రూ.5 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం కల్పించిందని, అగర్తలా ఎయిర్‌పోర్ట్ ఆధునికీకరణకు సైతం రూ.400 కోట్లను కేటాయించినట్లు తెలిపారు. త్రిపుర అభివృద్ధి చెందాలంటే బాధితులను సైతం పట్టించుకోని మాణిక్ సర్కార్‌కు ఓటేస్తారా.. అభివృద్ధి కోసం పాటుపడుతున్న బీజేపీకి ఓటేస్తారో ప్రజలో నిర్ణయించుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. త్రిపురలో ఫిబ్రవరి 18న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment