సర్కార్ ప్రసంగంలో అభ్యంతరాలేమిటీ?
సర్కార్ ప్రసంగంలో అభ్యంతరాలేమిటీ?
Published Wed, Aug 16 2017 1:56 PM | Last Updated on Sun, Sep 17 2017 5:35 PM
న్యూఢిల్లీ: దేశ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని త్రిపుర ముఖ్యమంత్రి మానిక్ సర్కార్ తన రాష్ట్ర ప్రజలనుద్దేశించి చేసిన ప్రసంగాన్ని దూరదర్శన్, ఆకాశవాణి అగర్తలా విభాగం ప్రసారం చేయడానికి నిరాకరించడం పట్ల వివాదం రాజుకుంటోంది. తన ప్రసంగాన్ని యథాతధంగా ప్రసారం చేయడానికి నిరాకరించడం అసాధారణం, అప్రజాస్వామికం, అసహనం, నిరంకుశత్వం అని మానిక్ సర్కార్ విమర్శించగా, స్వయం ప్రతిపత్తిగలిగిన దూరదర్శన్, ఆకాశవాణిలు కేంద్ర సమాచార, ప్రసారాల శాఖలో భాగమైనట్లు వ్యవహరించడం ఏమిటని వామపక్ష పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. మళ్లీ ఎమర్జెన్సీ కాలంనాటి ఆంక్షలు వస్తున్నాయని ప్రజాస్వామ్యవాదులు విమర్శిస్తున్నారు.
స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్టు 12వ తేదీన దూరదర్శన్, ఆకాశవాణిలు మానిక్ సర్కార్ ప్రసంగాన్ని రికార్డు చేశాయి. దీన్ని ఆగస్టు 15 తేదీన ప్రసారం చేయాల్సి ఉండింది. అయితే మానిక్ సర్కార్ ప్రసంగంలో అభ్యంతరకరమైన అంశాలు ఉన్నాయని, అవి ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నందున యథాతధంగా ప్రసంగాన్ని ప్రసారం చేయడం కుదరదని చెబుతూ ఆగస్టు 14వ తేదీన సీఎం కార్యాలయానికి ఏఐఆర్ డైరెక్టర్ జనరల్ తరఫున అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ పేరిట ఓ లేఖ అందింది. గౌరవనీయులైన ముఖ్యమంత్రిగారు తన ప్రసంగ పాఠాన్ని మార్చుకున్నట్లయితే దాన్ని ప్రసారం చేయడానికి తమకు అభ్యంతరం లేదని తెలిపింది.
ఢిల్లీలోని ప్రసార భారతి సీఈవోతో సంప్రతింపులు జరిపాకే తాము ఈ నిర్ణయానికి వచ్చామని కూడా ఆ లేఖలో స్పష్టం చేసింది. అయితే అందులో ఒక్క అక్షరాన్ని కూడా మార్చడం తమకు ఇష్టం లేదని సీఎం కార్యాలయం స్పష్టం చేయడంతో మానిక్ సర్కార్ ప్రసంగాన్ని దూరదర్శన్, ఆకాశవాణిలు ప్రసారం చేయలేదు. ఇంతకు మానక్ సర్కార్ లేఖలో అంత అభ్యంతరకరమైన అంశాలు ఏమీ ఉన్నాయి. భావ స్వాతంత్య్రం కలిగిన ప్రజాస్వామ్య దేశంలో స్వయంప్రతిపత్తిగల ప్రసార భారతికి నచ్చని అంశాలేమిటో, అవి ఎందుకు నచ్చలేదో ఓ సారి చూద్దాం!
ప్రియమైన త్రిపుర ప్రజలారా!
దేశ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మీ అందరికి శుభాకాంక్షలు. స్వాతంత్య్రం కోసం పోరాడిన అమర వీరులకు నా నివాళులు. స్వాతంత్య్రం కోసం పోరాడి ఇప్పటికీ మనందరి మధ్యనున్న యోధులకు నా గౌరవ వందనాలు. స్వాతంత్య్ర దినోత్సవం అంటే సంప్రదాయబద్ధంగా ఏటా జరుపుకునే ఓ పండుగ కాదు. ఈ దినానికి చారిత్రక ప్రాధాన్యతతోపాటు మన భావోద్రేకాలు ముడివడి ఉన్నాయి. ఈ సందర్భంగా మనం ఆత్మావలోకనం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
భిన్నత్వంలో ఏకత్వం మన సంప్రదాయ సంస్కతి. లౌకిక భావాల వల్లనే మన భారతీయులంతా కలిసిమెలిసి బతుకుతున్నారు. ఈరోజున మన లౌకిక భావానికి ముప్పు వాటిల్లుతోంది. కులమతాల ప్రాతిపదికన సమాజంలో విభనలు తీసుకరావడానికి కుట్రలు జరుగుతున్నాయి. సంకుచిత భావాలు జాతీయ స్ఫూర్తిని దెబ్బతీస్తున్నాయి. గోరక్షణ పేరిట దళితులు, మైనారిటీలపై దాడులు జరుగుతున్నాయి. వారిలో అభద్రతా భావం పెరిగిపోతోంది.
భారత దేశంలో ఓ మత రాజ్యాన్ని స్థాపించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. స్వాతంత్య్ర పోరాటానికి పురిగొల్పిన ఆదర్శాలు, కన్న కలలను దెబ్బతీసే విధంగా విచ్ఛిన్నకర శక్తులు రాజ్యమేలుతున్నాయి. స్వాతంత్య్ర ఉద్యమంతో ఏ మాత్రం సంబంధంలేని, పైగా స్వాతంత్య్ర ఉద్యమాన్ని అణచివేసేందుకు ప్రయత్నించిన జాతి వ్యతిరేకులు నేడు రకరకాల పేర్లతో చెలామణి అవుతూ దేశ ఐక్యతను, సమగ్రతలను దెబ్బతీస్తున్నారు. దేశభక్తిగల ప్రతి పౌరుడు దేశ ఐక్యతకు కట్టుబడి ఈ విచ్ఛిన్నకర శక్తులకు వ్యతిరేకంగా సంఘటితంగా నిలబడాలి’ అని మానిక్ సర్కార్ పిలుపునిచ్చారు.
‘నేడు సమాజంలో ధనిక, పేద అంతరాలు పెరిగిపోతున్నాయి. అపారమైన దేశ సంపద కొద్ది మంది వ్యక్తుల చేతుల్లోకి చేరిపోగా మెజారిటీ ప్రజలు నోటి దగ్గరికి కూడు కూడా అందక కుమిలిపోతున్నారు. కొద్ది మంది కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేస్తూ సామాజిక అంతరాలను పెంచి పోషిస్తున్న ప్రస్తుత ఆర్థిక, సామాజిక విధానానికి ప్రత్యామ్యాయ విధానం తప్పకుండా ఉంది. మెజారిటీ పేద ప్రజలను ఆదుకునే అలాంటి ప్రత్యామ్నాయ ఆర్థిక, సామాజిక విధానాన్ని సాధించడం కోసం త్రిపుర ప్రజలంతా ఒక్కటవ్వాలి.
కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు భిన్నంగా రాష్ట్ర ప్రజలకు మేలు చేసేందుకు ఉన్నంత పరిధిలో ఈ ప్రభుత్వం కషి చేస్తోంది. ఇది సరిపోదు. ప్రత్యామ్నాయ ఆర్థిక విధానాన్ని సాధించడం ఒక్కటే పరిష్కారం. అందుకు జరిగే పోరాటంలో ప్రతి ఒక్కరు భాగస్వామి కావాలని కోరుకుంటున్నాను’ అని మానిక్ సర్కార్ తన ప్రసంగ పాఠంలో పేర్కొన్నారు.
Advertisement