కిశోర్ కుమార్ మీద సంజయ్ గాంధీ కినుక వహించాడు. ‘ఇరవై సూత్రాల పథకం’ ప్రచారం కోసం దూరదర్శన్ లో మొదలెట్టిన ‘గీతోం భరీ షామ్’లో పాడమని కిశోర్‌ని సంజయ్ గాంధీ ఆదేశించాడు. డబ్బులు లేకుండా కిశోర్ పాడడు. ఆదేశిస్తే అసలు పాడడు. దాంతో కిశోర్ గొంతుకు రేడియోలో తాళం పడింది. సినిమాల్లో పాడిస్తే ఏం గొడవోనని నిర్మాతలు వెనక్కి తగ్గారు.
‘ఆరాధన’ సూపర్ హిట్ తర్వాత కిశోర్‌కు వచ్చిన తిప్పలు ఇవి. అప్పుడు కొంతమంది రఫీ దగ్గరకు వచ్చి ‘కిశోర్‌కు శాస్తి జరిగింది. ఈ కాలాన్ని ఉపయోగించుకోండి’ అన్నారు. రఫీ ఏం మాట్లాడలేదు. ఢిల్లీ వెళ్లి సంజయ్‌ను కలిశాడు. ‘మీరు కిశోర్ మీద బ్యాన్ ఎత్తేయండి. అందుకు బదులుగా ఒకటి కాదు పది ప్రోగ్రామ్‌లు చేసిస్తాను’ అన్నాడు. ఆ వెంటనే నౌషాద్‌ను వెంటబెట్టుకుని దూరదర్శన్‌లో ప్రోగ్రామ్ ఇచ్చాడు. కిశోర్ బ్యాన్ పోయింది.
పత్రికలు కూడా కిలాడీవి. రాజేష్ ఖన్నా స్టార్‌డమ్‌తో కిశోర్ గొంతు గిరాకీలోకి రాగానే ‘రఫీ పని అయిపోయింది’ అని రాయడం మొదలెట్టారు. రికార్డింగులు లేక రఫీ గోళ్లు గిల్లుకుంటున్నాడని రాశారు. కిశోర్ తైనాతీలు ఇవన్నీ తెచ్చి కిశోర్‌కి చూపించారు. కిశోర్ సంతోషించాడా? ప్రెస్‌మీట్ పెట్టి ‘ఇలాంటి వెధవ రాతలు మానండి. ఆయనంటే నాకు చాలా గౌరవం. మీరు ఎవర్ని గెలిపించి ఎవర్ని ఓడిస్తారు?’ అన్నాడు. ఈ ఇద్దరిని కొంతమంది ఫలానా మతం అనుకుంటారు. ఈ ఇద్దరు మాత్రం ఈ దేశవాసులు. రామ్, రహీమ్‌ల సన్మతి ఎరిగినవారు.
రంజాను మాసంలో రికార్డింగుకు వచ్చి ‘హుక్కే మే ధువా’ (హుక్కా పొగ) అనే పదం చూసి పాడనన్నాడు రఫీ ఉపవాసానికి భంగమని. మతం అంటే అంత నిష్ఠ. సాటి మతం పట్ల? అంతే నిష్ఠ. ‘మన్ తర్‌పత్ హరి దర్శన్ కో ఆజ్’.... ‘బైజూ బావరా’లో రఫీ పాడితే కన్నీరు ఆగదు వినేవారికి.
ఆ కాలంలో అనేక ఆలయాల్లో ఇది ప్రభాతగీతం. దీనిని పాడింది, రాసింది, స్వరం కట్టింది... రఫీ, షకీల్ బదాయునీ, నౌషాద్. ‘నా గొంతు రొటీన్ అవుతోంది. నాకు భజనలు పాడాలని ఉంది’ అని రఫీ వస్తే ఖయ్యాం ఆ కోరిక మన్నించి భజనలు పాడించి అపురూపమైన రికార్డు విడుదల చేశాడు. ‘రఫీ గొంతులో దేవుడు ఉన్నాడు’ అని అందరూ అనేవారే. ఆ దేవుడు అల్లాయా, ఈశ్వరుడా వెతకడం అల్పుల పని.
1950–70ల మధ్య మన దేశ సినీ సంగీతం దాదాపు అన్ని భాషల్లో స్వర్ణయుగం చూసింది. సినిమా – దేశవాసులను కలిపే కొత్త మతం అయ్యింది. కళాకారులు వినోద ఉల్లాసాలకే కాదు సామ రస్య, సౌభ్రాతృత్వాలకు ప్రవక్తలుగా మారారు. దేశ విభజన చేదు నుంచి జనాన్ని బయట పడేయడానికి గుర్తెరిగి బాధ్యతగా నడుచుకున్నవారే అందరూ! ‘తూ హిందు బనేగా నా ముసల్మాన్ బనేగా ఇన్‌సాన్ కీ ఔలాద్ హై ఔలాద్ బనేగా’... (నువ్వు హిందువువి కావద్దు, ముసల్మానువి కావద్దు, మనిషిగా పుట్టినందున మనిషిగా మిగులు) అని సాహిర్ రాయగా రఫీ పాడి చిరస్మరణీయం చేశాడు.
మదన్ మోహన్ ట్యూన్ చేసిన ‘కర్‌చలే హమ్ ఫిదా’... రఫీ పాడితే నేటికీ సరిహద్దు సైనికులకు తేజోగీతమే. గాంధీజీని బలిగొన్నారన్న వార్త తెలియగానే సంగీత దర్శకులు హన్స్‌లాల్–భగత్‌రామ్, గీతకర్త రాజేంద్ర కిషన్ కలిసి ఆయనకు నివాళిగా ‘సునో సునో అయ్ దునియావాలో బాపు కీ ఏ అమర్ కహానీ’ రూపొందిస్తే ఇంకెవరు పాడతారు రఫీ తప్ప! బాపు పాదాల ఎదుట పారిజాతాల కుప్ప గదా ఈ పాట.
సరళత్వము, తీయదనము, స్వచ్ఛత... వీటిని ప్రదర్శించడం ద్వారా ముప్పై ఏళ్ల పాటు పాడి కోట్ల మంది అభిమానులను పొందిన అమృత గాయకుడు రఫీ. ‘సుహానీ రాత్ ఢల్ చుకీ, ‘చౌద్‌వీ కా చాంద్ హో’, ‘బహారో ఫూల్ బర్సావో’, ‘ఓ దునియా కే రఖ్‌వాలే’, ‘ఖోయా ఖోయా చాంద్’, ‘దీవానా హువా బాదల్’, ‘క్యా హువా తేరా వాదా’... ఈ పాటలకు అంతూ పొంతూ ఉందా? కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు... ఏ ప్రాంతమో ఏ భాషో... అందరూ రఫీ అభిమానులు.
రోజువారీ పనిలో, కాయకష్టంలో, సేద తీరే వేళ, వేడుకల్లో రఫీ.. రఫీ... రఫీ! కూతురిని అత్తారింటికి సాగనంపేటప్పుడు ప్రతి తండ్రి తలుచుకుని ఉద్వేగాశ్రువులు రాల్చే పాట ‘బాబుల్ కి దువాయే లేతీ జా’... షంషాద్ బేగం, గీతాదత్, లతా, ఆశా... అందరూ రఫీకి జోడీలే. దిలీప్ కుమార్, దేవ్ ఆనంద్, షమ్మీ కపూర్, అమితాబ్... అందరూ అభినయకర్తలే. రఫీ పాడటంతో సగం నటన. మిగిలిన సగమే వీరు చేయాల్సి వచ్చేది.
55 ఏళ్లకు మరణించాడు రఫీ. రేపటి డిసెంబర్ 24కు శత జయంతి. అయినా ఇన్నాళ్లకూ కాసింత కూడా మరపునకురాని సుర గాయకుడు. పాటనూ, ప్రేమనూ పంచి అందరి చేత ‘రఫీ సాబ్’ అనిపించుకున్నవాడు. ఆయన మృతదేహం ఆస్పత్రిలో ఉంటే ‘భూపిందర్ సింగ్ – రఫీ తమ్ముడు’ అని సంతకం పెట్టి ఇంటికి చేర్చిన గాయకుడు భూపిందర్‌ది ఏ మతం? చనిపోయిన అన్న రఫీది ఏ మతం? ఆ రోజు ఆకాశం నుంచి ఆగని వర్షం.
ఇసుక వేస్తే రాలని జనం. గాంధీ గారు మరణించినప్పుడు ఇంత జనం వచ్చారట. రఫీ శత జయంతి ముగియనున్న ఈ వేళ అందరం వెలికి తీయవలసింది, జాగృత పరచవలసినది ఆయన పంచిన ఈ ప్రేమనే, ప్రేమమయ గీతాలనే! విద్వేష గీతాన్ని ఎవరు ఆలపించాలనుకున్నా కావలించుకుని వినిపిద్దాం రఫీ గీతం – జిందాబాద్ జిందాబాద్ అయ్ మొహబ్బత్ జిందాబాద్. జీతే రహో రఫీ సాబ్! అభీనా జావో ఛోడ్‌కర్ కె దిల్ అభీ భరా నహీ...
దేశం పాడిన గాయకుడు
Published Mon, Dec 23 2024 12:06 AM | Last Updated on Mon, Dec 23 2024 12:06 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment