Sanjay Gandhi
-
ఇందిర ఆత్మ, జాతి వాణి హక్సర్
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి జైరాం రమేష్ రచించిన ‘ఇంటర్‌ట్వైన్డ్ లివ్స్: పీఎన్ హక్సర్ అండ్ ఇందిరాగాంధీ, ఎ బయాగ్రఫీ ఆఫ్ హక్సర్‘ పుస్తకాన్ని జూన్ 19న ఆవిష్కరించనున్నారు. ఈ సందర్భంగా ఆయన సాక్షి ప్రతినిధి కృష్ణమోహన్రావుకి ఇంటర్వ్యూ ఇచ్చారు. భారతీయ దౌత్యం, విదేశీ విధానాలపై విస్తృతానుభవం కలిగిన పీఎన్ హక్సర్‌ని 1950లో తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఎంపిక చేసుకున్నారని, పదిహేనేళ్లపాటు నెహ్రూ ఆధ్వర్యంలో పనిచేసిన హక్సర్‌ని 1967లో ఇందిరాగాంధీ మళ్లీ ఎంపిక చేసుకున్నారని జైరాం చెబుతున్నారు. హక్సర్.. భారతీయ రాజకీయ చరిత్రలోని సంక్లిష్ట దశలో, అత్యంత సంక్షుభిత సంవత్సరాల్లో చాణక్యుడి పాత్రను పోషించారు. ప్రధానమంత్రి ప్రధాన కార్యదర్శిగా.. జాతి వాస్తవ చైతన్య ప్రదాతగా, ఇందిరాగాంధీకి విశ్వసనీయ వ్యక్తిగా చరి త్రకెక్కారు. సంజయ్ గాంధీ కలల ప్రాజెక్టు అయిన మారుతి కారు తయారీపై విభేదించిన హక్సర్, ఇంది రకు దూరం జరిగారు. జైరాం రమేష్ ఇంటర్వ్యూ సంక్షిప్తపాఠం సాక్షి పాఠకులకు అందిస్తున్నాం. హక్సర్‌పై పుస్తకం రాయడానికి కారణం? ఇందిరాగాంధీ హయాంలో 1967–73 మధ్యకాలంలో పీఎన్ హక్సర్ అత్యంత ప్రభావశీలుడైన, శక్తిమంతుడైన ప్రభుత్వ ఉన్నతాధికారిగా వ్యవహరించారు. బ్యాంకుల జాతీయీకరణ, రాజభరణాల రద్దు, బంగ్లాదేశ్ ఆవిర్భావం, పాకిస్తాన్‌పై విజయం, 1971 లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో గెలుపు, 1972లో సిమ్లా ఒప్పందం, పాకిస్తాన్, న్యూ ఢిల్లీ మధ్య 1973 నాటి ఒప్పందం వంటి ఇందిర సాటిలేని విజయాలన్నింటికీ సూత్రధారి హక్సర్. ఈ అన్నింటిలో హక్సర్దే ప్రధాన పాత్రా? ఇందిరాగాంధీ రాజకీయనేత. కానీ ఈ పరిణామాలన్నింటిలో కీలకపాత్ర వహించింది మాత్రం పీఎన్ హక్సర్. ఇద్దరి భాగస్వామ్యమే ఈ విజయాలకు మూలం. సుదీర్ఘకాలంగా నెహ్రూ, ఇందిర కుటుం బంతో హక్సర్ సన్నిహిత సంబంధాలు నెరిపారు. జీవితాంతం మార్క్సిస్టుగానే ఉండిన హక్సర్ 1970లలో భారత ఆర్థిక వ్యవస్థ వామపక్షవిధానాల వైపు మొగ్గు చూపడానికి తానే బాధ్యుడు. 1969లో బెంగళూరులో జరిగిన జాతీయ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నిలువునా చీలిపోవడం, తదుపరి పరి ణామాలన్నింట్లో హక్సర్ ఇందిర వెన్నంటే ఉన్నారు. ఇందిరకు భావజాలపరంగా, నైతికంగా మూలస్తంభంగా హక్సర్ వ్యవహరించారు. ఇందిర కుమారుడు సంజయ్ గాంధీతో విభేదాల కారణంగా 1973 జనవరి 15న హక్సర్ ఇందిరకు దూరం జరిగారు. ఇందిరకు హక్సర్ పంపిన చివరి సూచన పీవీ నరసింహారావుకు సంబంధించింది కావడం విశేషం. మొదట జై తెలంగాణ ఉద్యమాన్ని, తర్వాత జై ఆంధ్రా ఉద్యమాన్ని బలపర్చిన పీవీ తన్ను తాను పూర్తి అసమర్థుడిగా నిరూపించుకున్నారని, ఆనాటి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై దృఢవైఖరి అవలంబించాలని ఇందిరకు హక్సర్ సలహా ఇచ్చారు. హక్సర్ అంత శక్తివంతుడైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధునిక భారత చరిత్రలో కానరారు. ఇందిర నియంతృత్వానికి హక్సరే కారణమా? లేదు.. లేదు. 1973 జనవరిలో ఇందిరకు హక్సర్ దూరం జరిగారు. కానీ ఆమె ఆయన్ని మళ్లీ ప్రణాళికా సంఘం డిప్యూటీ చైర్మన్‌గా నియమించారు. ఈ స్థానంలో హక్సర్ 1975 మార్చి వరకు ఇందిరతో పనిచేశారు. 1975లో ఇందిర విధించిన ఆంతరంగిక అత్యయిక పరిస్థితిని హక్సర్ వ్యతిరేకించారు. ఎమర్జెన్సీ కాలంలో ఆయన సంజయ్ గాంధీ బాధితుడైనప్పటికీ, ఇందిరకు విధేయుడిగానే ఉండేవారు. ఎమర్జెన్సీని తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ బహిరంగంగా దాని గురించి వ్యాఖ్యానించలేదు. జరుగుతున్న పరిణామాల గురించి హక్సర్ ఇందిరను వ్యక్తిగతంగా కలిసి చెప్పేవారు. బ్యూరోక్రాట్‌గా హక్సర్ ఔన్నత్యం ఏమిటి? పాలనా వ్యవహారాల్లో హక్సర్ అత్యంత నిజాయితీపరుడు. అందుకే 1987లో రాజీవ్ గాంధీ చైనాతో సంబంధాలను సాధారణ స్థాయికి తీసుకురావడం కోసం హక్సర్‌ను చైనాకు పంపారు. ఆ తర్వాతే రాజీవ్ 1988లో చైనా పర్యటించారు. పాలనపై హక్సర్ ప్రభావం స్థాయి ఏమిటి? పాలనలో సరైన వ్యక్తులను ఎంచుకోవడమే హక్సర్ గొప్పదనం. ఆయన ఎంపిక చేసినవారే ఆధునిక భారత వ్యవస్థ నిర్మాతలయ్యారు. ఆయన తీసుకొచ్చిన ఎంఎస్ స్వామినాథన్ అత్యున్నత వ్యవసాయ శాస్త్రజ్ఞుడై హరిత విప్లవానికి ఆద్యుడయ్యారు. ఇక ఆయన ఎంపిక చేసిన డాక్టర్ మన్మోహన్ సింగ్ 1970లో ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు అయ్యారు. ఇస్రో చైర్మన్‌గా హక్సర్ ఎంపిక చేసిన సతీష్ ధావన్ భారత అంతరిక్ష కార్యక్రమాలకు పితామహుడయ్యారు. ఇక హోమీ సేత్నా పొఖ్రాన్ అణుపరీక్షల్లో కీలక పాత్ర పోషించారు. హక్సర్ సలహమేరకే సోనియా గాంధీ పీవీ నరసింహారావును కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమించారు. అలా పీవీ ప్రధాని కావడానికి కూడా హక్సరే ఆద్యుడు. 1973లో పీవీ అసమర్థుడని పేర్కొన్న హక్సర్ 1991లో కాంగ్రెస్‌లో లుకలుకలు లేకుండా వీవీ చేయగలడని నిర్ధారించుకోవడం విశేషం. సంజయ్‌గాంధీతో విభేదాలకు కారణం? భారత్‌కు ప్రజా రవాణా ముఖ్యం కానీ కార్లు కావని హక్సర్ అభిప్రాయం. రెండోది ప్రధానమంత్రి నివాసంలో ఉంటూ ఆమె కుమారుడు కారు తయారీలో పాలుపంచుకోవడంతో హక్సర్ విభేదించారు. అయితే మారుతి కార్ ప్రాజెక్టు వాస్తవరూపం దాల్చనుందని గుర్తించగానే హక్సర్ ప్రధాని కార్యాలయం నుంచి బయటకు వచ్చేశారు. జైరాం రమేష్ -
సంజయ్ గాంధీ నా తండ్రి: ప్రియాసింగ్ పాల్
న్యూఢిల్లీ: ఇందిరాగాంధీ చిన్న కొడుకు, దివంగత కాంగ్రెస్ నేత సంజయ్ గాంధీ తన తండ్రి అని ప్రియాసింగ్ పాల్ అనే మహిళ సంచలన ప్రకటన చేసింది. విడుదలకు సిద్దమైన హిందీ సినిమా ‘ఇందూ సర్కార్’లో తన తండ్రి, ఇందిరాగాంధీల చరిత్రకు వక్రభాష్యం చెప్పారని ఆరోపిస్తూ 48ఏళ్ల ప్రియాసింగ్ సోమవారం మీడియా ముందుకొచ్చారు. సినిమాలో 30 శాతం నిజాలుంటే, 70 శాతం అబద్ధాలున్నాయని, అబద్దాలనే నిజాలు అనుకునేలా సినిమాలో చూపించారని ఆమె ఆరోపించారు. సినిమా దర్శకుడికి లీగల్ నోటీసులు సైతం పంపానన్నారు. పసికందుగా ఉన్న తనను షీలా సింగ్, బల్వంద్ పాల్ దంపతులు దత్తత తీసుకున్నారని చెప్పారు. పెళ్లికాకముందు సంజయ్‌కు జన్మించిన కూతురినని తన పెంపుడు తల్లితండ్రులు చెప్పారన్నారు. -
ఇందు సర్కార్
భారత దివంగత మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ జీవితం ఆధారంగా మధుర్ బండార్కర్ తెరకెక్కించిన చిత్రం ‘ఇందు సర్కార్’. ఆమె విధించిన ఎమర్జెన్సీ పరిస్థితుల నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుంది. ఇందిరా గాంధీ పాత్రను సుప్రియా వినోద్ చేశారు. ఇందిరాగాంధీ రెండో తనయుడు సంజయ్‌గాంధీ రోల్‌ను నీల్ నితిన్ ముఖేష్ చేశారు. ఇందు అనే అమ్మాయి పాత్రను కృతీ కుల్హరీ చేశారు. నిజ జీవిత కథలను తెరెకెక్కించడంలో మధుర్ బండార్కర్ ప్రతిభావంతుడు. ఈ చిత్రం పై అంచనాలు పెరగడానికి అదో కారణమైతే మరో కారణం సుప్రియ, నీల్ నితిన్ లుక్స్. అచ్చంగా ఇందిరా గాంధీలా సుప్రియ లుక్, సంజయ్‌లా నీల్ లుక్ ఉండటం విశేషం. పాత్రలకు తగ్గ ఆర్టిస్టులను ఎన్నుకోవడంలో మధుర్ సిద్ధహస్తుడని లుక్స్ చూసినవాళ్లు అంటున్నారు. ఈ సినిమా జూలై 28న విడుదల కానుంది. -
తెరపై సంజయ్‌గాంధీ స్టోరీ!
బాలీవుడ్లో ఇప్పుడు జీవితకథా చిత్రాలదే హవా అనిపి స్తోంది. సినీతారలు, రాజకీయ నేతల నుంచి క్రీడాకారుల వరకూ ఎవరినీ వదిలిపెట్టట్లేదు అక్కడి దర్శక, నిర్మాతలు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జీవితం ఆధారంగా ‘ఇందిర’ అనే చిత్రంలో విద్యాబాలన్ టైటిల్ రోల్ చేయనున్నట్లుగా ఇటీవల వార్తలు వచ్చాయి. తాజా కబురేమిటంటే ఇందిరాగాంధీ చిన్న కుమారుడు సంజయ్‌గాంధీ జీవితాన్ని వెండితెరపై చూపించడానికి బాలీవుడ్ దర్శక-నిర్మాత హన్సల్ మెహతా ఏర్పాట్లు చేస్తున్నారట. ప్రముఖ పాత్రికేయుడు వినోద్ మెహతా రచన ‘ద సంజయ్ స్టోరీ’ ఈ చిత్రానికి ఆధారం. దేశంలో ‘ఎమర్జెన్సీ’ ఘట్టానికి 40 ఏళ్లయిన వేళ ఈ చిత్ర ప్రకటన రావడం విశేషం. -
ఇందిర మందలించారు
* నేను 1980 ఎన్నికల్లో పోటీ చేయడం ఆమెకు ఇష్టంలేదు: ప్రణబ్ * ఓటమి అనంతరం మందలించారు * అయినా మంత్రి పదవి ఇచ్చారు న్యూఢిల్లీ : రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ‘ద డ్రమాటిక్ డికేడ్ : ద ఇందిరా గాంధీ ఇయర్స్’ పేరుతో తాను రాసిన పుస్తకంలో గత స్మృతులపై పలు ఆసక్తికర అంశాలను వెల్లడించారు. 1980 లోక్‌సభ ఎన్నికల్లో తాను పోటీ చేయడం ఇందిరా గాంధీకి ఎంతమాత్రం ఇష్టంలేదని, కానీ తాను పట్టుబట్టడంతో అంగీకరించారని పేర్కొన్నారు. అయితే తాను పోటీ చేసిన బోల్పూర్లో 68,629 ఓట్ల తేడాతో ఓడిపోయానని, ఓటమితో కుంగిపోయానని వెల్లడించారు. ఫలితాల రోజు అప్పటికే తన భార్య గీత ఢిల్లీ వెళ్లారని, ఇందిర తనను కలవాలనుకుంటున్నారని, వెంటనే ఢిల్లీ రావాలంటూ కబురు పెట్టారని వివరించారు. ఆరోజు ఢిల్లీ చేరుకుని నేరుగా ఇందిరను కలవడానికి వెళ్లానని, అప్పటికే తన ఓటమి వార్త విన్న ఇందిర అసంతృప్తిగా ఉన్నారంటూ సంజయ్‌గాంధీ చెప్పారని పేర్కొన్నారు. రాత్రి 9 గంటలకు ఇందిర వద్దకు వెళ్లగా, ఎన్నికల్లో పోటీ చేయాలన్న తన తప్పుడు నిర్ణయంపై ఆమె తీవ్రంగా మందలించారని వివరించారు. ఆమె తిట్లన్నీ భరిస్తూ నిలబడి పోయానని, చివరకు శాంతించాక బుట్టెడు పండ్లు ఇచ్చి ఇంటికి పంపారన్నారు. ఆ తాను ఓడినా కాంగ్రెస్ గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని, అభ్యర్థుల ఎంపిక లో కూడా ఇందిర దృఢంగా వ్యవహరించారని తెలిపారు. ఇక ఓడిపోయిన ఇందిర తనకు మంత్రి పదవి ఇచ్చారని ప్రణబ్ తెలిపారు. ప్రమాణ కార్యక్రమమూ ఉత్కంఠగా సాగిందని, 1980 జనవరి 14న అప్పటి ఇందిర సహాయకుడిగా ఉన్న ఆర్.కె.ధావన్ నుంచి... ఉదయం 11 గంటలకల్లా రాష్ట్రపతి భవన్‌కు చేరుకోవాలని ఉదయం 9.30కి తనకు కబురు వచ్చిందని వివరించారు. ప్రమాణీ చేసే మంత్రుల వరుసలో తనకు సీటు లేకపోవడంతో ఎంచేయాలో తెలియక ఇందిర వైపు చూడగా, ఏదో జరిగిందని ఆమె వెంటనే అర్థం చేసుకున్నారని, కొద్దిసేపటికి ధావన్ వచ్చి వేచి ఉండమన్నారని తెలిపారు. ఆయన కేబినెట్ సెక్రెటరీ, రాష్ట్రపతి కార్యదర్శి వద్దకు వెళ్లగా జాబితాలో తన పేరు టైప్‌చేసి కాక చేత్తో రాసి ఉందన్న సంగతి వెల్లడైందని, దాంతో తనకు సీటు ఎందుకు ఏర్పాటు చేయలేదో తెలిసిందని ప్రణబ్ పేర్కొన్నారు. వెంటనే ఇందిర అప్పటికప్పుడు చేత్తో లేఖరాసి దానిని రాష్ర్టపతి కార్యదర్శికి పంపగా తనకు కుర్చీ ఏర్పాటు చేశారని ప్రణబ్ వివరించారు. -
మరోసారి నోటి తీట తీర్చుకున్న అజాంఖాన్
వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తలలో ఉండే ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మైనారటీ వ్యవహారాల శాఖ మంత్రి మహ్మద్ అజాం ఖాన్ మరో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి తన నోటి తీట తీర్చుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని బిజనోర్లో ఎన్నిక ప్రచారంలో భాగంగా అజాంఖాన్ మాట్లాడుతూ.... భారతదేశ దివంగత ప్రధాని ఇందిరా గాంధీ ఇద్దరు కుమారులు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ, చిన్న కుమారుడు సంజయ్ గాంధీలు... వారి చేసిన పాపాలకు అల్లా ఆగ్రహానికి గురయ్యారని... అందుకే వారి జీవితం విషాదాంతంగా ముగిసిందని వెల్లడించారు. అందుకే రాజీవ్ 1991లో మానవబాంబు దాడిలో మరణించాగా, సంజయ్ 1980లో విమాన ప్రమాదంలో మృతి చెందారని చెప్పారు. ఇందిరా గాంధీ ఎమర్జన్సీ విధించినప్పుడు సంజయ్ గాంధీ అడింది ఆట పాడింది పాటగా సాగిందని... ఆ సమయంలో దేశ యువతకు బలవంతంగా కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స చేసిన సంగతిని అజాం ఖాన్ ఈ సందర్బంగా గుర్తు చేశారు. అలాగే రాజీవ్ గాంధీ చేసిన పనులు కూడా అల్లా ఆగ్రహానికి గురైయ్యారని అజాం ఖాన్ ఆరోపించారు. అందుకే వారు అల్లా ఆగ్రహానికి గురై మరణించారని అజాం ఖాన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో అజాంఖాన్, అమిషాలు బహిరంగ సభలలో ప్రసంగించ వద్దని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇటీవల కార్గిల్ యుద్దంపై తీవ్ర సంచలన వ్యాఖ్యలు చేసిన అజాంఖాన్‌పై శనివారం యూపీ పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.