ఇందిర మందలించారు
* నేను 1980 ఎన్నికల్లో పోటీ చేయడం ఆమెకు ఇష్టంలేదు: ప్రణబ్
* ఓటమి అనంతరం మందలించారు
* అయినా మంత్రి పదవి ఇచ్చారు
న్యూఢిల్లీ : రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ‘ద డ్రమాటిక్ డికేడ్ : ద ఇందిరా గాంధీ ఇయర్స్’ పేరుతో తాను రాసిన పుస్తకంలో గత స్మృతులపై పలు ఆసక్తికర అంశాలను వెల్లడించారు. 1980 లోక్‌సభ ఎన్నికల్లో తాను పోటీ చేయడం ఇందిరా గాంధీకి ఎంతమాత్రం ఇష్టంలేదని, కానీ తాను పట్టుబట్టడంతో అంగీకరించారని పేర్కొన్నారు. అయితే తాను పోటీ చేసిన బోల్‌పూర్‌లో 68,629 ఓట్ల తేడాతో ఓడిపోయానని, ఓటమితో కుంగిపోయానని వెల్లడించారు. ఫలితాల రోజు అప్పటికే తన భార్య గీత ఢిల్లీ వెళ్లారని, ఇందిర తనను కలవాలనుకుంటున్నారని, వెంటనే ఢిల్లీ రావాలంటూ కబురు పెట్టారని వివరించారు. ఆరోజు ఢిల్లీ చేరుకుని నేరుగా ఇందిరను కలవడానికి వెళ్లానని, అప్పటికే తన ఓటమి వార్త విన్న ఇందిర అసంతృప్తిగా ఉన్నారంటూ సంజయ్‌గాంధీ చెప్పారని పేర్కొన్నారు. రాత్రి 9 గంటలకు ఇందిర వద్దకు వెళ్లగా, ఎన్నికల్లో పోటీ చేయాలన్న తన తప్పుడు నిర్ణయంపై ఆమె తీవ్రంగా మందలించారని వివరించారు. ఆమె తిట్లన్నీ భరిస్తూ నిలబడి పోయానని, చివరకు శాంతించాక బుట్టెడు పండ్లు ఇచ్చి ఇంటికి పంపారన్నారు.
ఆ తాను ఓడినా కాంగ్రెస్ గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని, అభ్యర్థుల ఎంపిక లో కూడా ఇందిర దృఢంగా వ్యవహరించారని తెలిపారు. ఇక ఓడిపోయిన ఇందిర తనకు మంత్రి పదవి ఇచ్చారని ప్రణబ్ తెలిపారు. ప్రమాణ కార్యక్రమమూ ఉత్కంఠగా సాగిందని, 1980 జనవరి 14న అప్పటి ఇందిర సహాయకుడిగా ఉన్న ఆర్.కె.ధావన్ నుంచి... ఉదయం 11 గంటలకల్లా రాష్ట్రపతి భవన్‌కు చేరుకోవాలని ఉదయం 9.30కి తనకు కబురు వచ్చిందని వివరించారు. ప్రమాణీ చేసే మంత్రుల వరుసలో తనకు సీటు లేకపోవడంతో ఎంచేయాలో తెలియక ఇందిర వైపు చూడగా, ఏదో జరిగిందని ఆమె వెంటనే అర్థం చేసుకున్నారని, కొద్దిసేపటికి ధావన్ వచ్చి వేచి ఉండమన్నారని తెలిపారు. ఆయన కేబినెట్ సెక్రెటరీ, రాష్ట్రపతి కార్యదర్శి వద్దకు వెళ్లగా జాబితాలో తన పేరు టైప్‌చేసి కాక చేత్తో రాసి ఉందన్న సంగతి వెల్లడైందని, దాంతో తనకు సీటు ఎందుకు ఏర్పాటు చేయలేదో తెలిసిందని ప్రణబ్ పేర్కొన్నారు. వెంటనే ఇందిర అప్పటికప్పుడు చేత్తో లేఖరాసి దానిని రాష్ర్టపతి కార్యదర్శికి పంపగా తనకు కుర్చీ ఏర్పాటు చేశారని ప్రణబ్ వివరించారు.