పోరు పాఠం | Today from the National Conference of Agricultural Workers Union | Sakshi
Sakshi News home page

పోరు పాఠం

Published Wed, Jul 30 2014 2:52 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

పోరు పాఠం - Sakshi

పోరు పాఠం

  • నేటి నుంచి వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ మహాసభలు
  •  మొదటి రోజు ర్యాలీ, భారీ బహిరంగ సభ.. లక్ష మంది సమీకరణ లక్ష్యం
  •  హాజరుకానున్న త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్‌సర్కార్
  •  మూడు రోజుల ప్రతినిధుల సభకు ఏర్పాట్లు పూర్తి  
  • వరంగల్: అఖిల  భారత వ్యవసాయ కార్మిక సంఘం 8వ జాతీయ మహాసభలకు ఓరుగల్లు ఆతిథ్యమివ్వబోతోంది. నాలుగు రోజుల పాటు జరిగే సభలు.. బుధవారం భారీ బహిరంగ సభతో ప్రారంభం కానున్నాయి. 31, 1, 2 తేదీల్లో హన్మకొండలోని నందనాగార్డెన్ (సుందరయ్యనగర్)లో ప్రతినిధుల సభ జరుగుతుంది. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి వెయ్యి మంది ప్రతి నిధులు ఈ మహాసభలకు హాజరవుతున్నారు. వరంగల్‌లోని ఓసిటీలో జరిగే బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు. సాయంత్రం 4గంటలకు సభ ప్రారంభమవుతుందని నిర్వాహకులు చెప్పారు.

    సభకు ముందు మధ్యాహ్నం 2గంట లకు వరంగల్ రైల్వేస్టేషన్ నుంచి చౌరస్తా, పోచమ్మమైదాన్, వెంకట్రామ థియేటర్ మీదుగా ఓసిటీ వరకు 25వేల మందితో ర్యాలీ నిర్వహించనున్నారు. ర్యాలీకి ముందు భాగంలో డప్పు కళాకారులు, ప్రజానాట్యమండలి కళాకారులు, విచిత్ర వేషధారణ, గిరిజన సంప్రదాయ ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నారు. ఈ సభకు తెలంగాణ, ఏపీలోని వివిధ జిల్లాల నుంచి లక్ష మందిని సమీకరిస్తున్నారు.

    ఈ బహిరంగ సభకు త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ ముఖ్యఅతిథిగా హాజరవుతున్నారు. బహిరంగ సభా ప్రాంగణానికి తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ ప్రాంగణంగా నామకరణం చేశారు. సభాస్థలం వద్ద అమరవీరులు దొడ్డి కొమురయ్య, ఏసీరెడ్డి నర్సింహారెడ్డిల పేరిట మహాద్వారాలు ఏర్పాటు చేశారు.   సభకు వ్యవసాయ కార్మిక సంఘం అఖిల భారత అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పాటూరి రామయ్య, విజయరాఘవన్, సంఘం నాయకులు బీవీ రాఘవులు, మల్లు స్వరాజ్యం, తమ్మినేని వీరభద్రం, సున్నం రాజయ్య, బి.వెంకట్, పిన్నమనేని మురళీకృష్ణ, వి.వెంకటేశ్వర్లు హాజరవుతారు.

    వ్యవసాయ కార్మిక సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షడు జి.నాగయ్య సభకు అధ్యక్షత వహిస్తారు. మహాసభల సందర్భంగా హన్మకొండ, చౌరస్తా, అంబేద్కర్ సెంటర్, పోచమ్మమైదాన్, రైల్వేస్టేషన్, వరంగల్ చౌరస్తా, వెంకట్రామ సెంటర్, ఎంజీఎం సెంటర్‌లలో తోరణాలు, బ్యానర్లతో అలంకరించారు. సుమారు 500 మంది వలంటీర్లు మహాసభల నిర్వహణలో పాల్గొంటున్నారు.
     
    రేపు మహాసభ ప్రారంభం
     
    హన్మకొండలోని నందనాగార్డెన్ (సుందరయ్యనగర్)లో గురువారం ఉదయం 11గంటలకు వ్యవసాయకార్మిక సం ఘం 8వ జాతీయ మహాసభలను ఆర్థికవేత్త, ఢిల్లీ యూనివర్సీటీ ప్రొఫెసర్ ప్రభాత్ పట్నాయక్ ప్రారంభిస్తారు. నగరంలోని ప్రముఖులు, ఉద్యోగ సంఘాల నాయకులు హాజరవుతారు. ఆగస్టు 1వ తేదీ సాయంత్రం 6 గంటలకు   హన్మకొం డ పబ్లిక్‌గార్డెన్‌లో ‘గ్రామీణ పేదలు-భారత దేశం’ అనే అంశంపై సెమినార్ ఏర్పాటు చేశారు.

    ఈ సెమినార్‌కు ప్రముఖ జర్నలిస్టు సాయినాథ్ హాజరవుతున్నారు. 2వ తేదీ న సంఘానికి సంబంధించిన వివిధ అంశాలు, ప్రణాళిక, కార్యక్రమాలపై చర్చించి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుం టారు. ఓ సిటీలో బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తయ్యూయని, సభకు సంఘీభావంగా నగర ప్రజలు హాజరై విజయవంతం చేయాలని సీఐటీయూ నేత మెట్టు శ్రీనివాస్ కోరారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement