అగర్తల: త్రిపుర రాష్ట్ర విభజనకు సంబంధించి ఎలాంటి ప్రయత్నాలను అనుమతించేది లేదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ స్పష్టం చేశారు. అలాంటి విభజన ప్రయత్నాలను తనశక్తి కొలదీ అడ్డుకుంటానని చెప్పారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాలను ఆశించే ఆంధ్రప్రదేశ్‌ను విభజించి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడానికి నిర్ణయించిందని ఆయన విమర్శించారు. దీన్ని చూసి త్రిపుర విభజనకు ఒక చిన్న పార్టీ కూడా డిమాండ్ చేయడం మొదలు పెట్టిందన్నారు. అమర్‌పూర్‌లో 14వ గిరిజన యువత సమాఖ్య సమావేశం సందర్భంగా సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
40ఏళ్లుగా నెలకొన్న తీవ్రవాద సమస్యను తాము పరిష్కరించగలిగామని.. కానీ, కొంతమంది రాజకీయ ప్రయోజనాల కోసం తీవ్రావాదాన్ని పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. గిరిజన రాజకీయ పార్టీ అయిన త్రిపుర దేశీయ ప్రజాఫ్రంట్(ఐపీఎఫ్‌టీ) త్రిపురలో వెనుకబడ్డ గిరిజన ప్రాంతాలతో ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తోంది. ఈ నెల 10న ఢిల్లీలో నిరాహారదీక్ష కూడా నిర్వహించింది. కేంద్ర హోంశాఖకు తాము 8 పేజీల వినతి పత్రాన్ని ఇచ్చామని, తమకు కేంద్ర ప్రభుత్వానికి మధ్య చర్చలు జరుగుతున్నాయని ఐపీఎఫ్‌టీ అధ్యక్షుడు నరేంద్రచంద్ర దెబ్బర్మ ఆదివారం తెలిపారు. చిన్న ఈశాన్య రాష్ట్రమైన త్రిపుర విభజన డిమాండ్‌కు స్థానికంగా ఇతర రాజకీయ పార్టీల నుంచి ఏ మాత్రం మద్దతివ్వడం లేదు.