Tripura CM
-
తృణమూల్ కాంగ్రెస్ ఆ పార్టీకి కాపీ.. త్రిపుర సీఎం
అగర్తల: సార్వత్రిక ఎన్నికల హోరు జోరుగా సాగుతోంది. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వం మళ్ళీ అధిక సంఖ్యలో సీట్లు గెలవడానికి ప్రయతిస్తోంది. ఈ తరుణంలో త్రిపుర ముఖ్యమంత్రి 'మాణిక్ సాహా' తృణమూల్ కాంగ్రెస్ పార్టీపైన కీలక వ్యాఖ్యలు చేశారు. దక్షిణ త్రిపుర జిల్లా పరిధిలోని బెలోనియాలో జరిగిన బహిరంగ సభలో సాహా మాట్లాడుతూ.. బెంగాల్‌ను వరుసగా 34 ఏళ్లు పాలించిన సీపీఐఎంకు తృణమూల్ కాంగ్రెస్ కార్బన్ కాపీ అని వ్యాఖ్యానించారు. 'కమ్యూనిస్టు పార్టీ ఎక్కడ పాలించినా వారి అవశేషాలు దొరుకుతాయని పేర్కొన్నారు. బెంగాల్ ప్రజలు తృణమూల్‌ను నమ్మి ఓట్లు వేయడం దురదృష్టమని అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 18 సీట్లు గెలుచుకుంది. ఈ సారి మరింత మెరుగైన ఫలితాలు రానున్నట్లు మాణిక్ సాహా పేర్కొన్నారు. ఇప్పటికే వామపక్షాలకు చెందిన నా మిత్రులు బీజేపీకి ఫిర్యాదు చేశారు. మా పార్టీ ప్రజాస్వామ్యానికి విరుద్ధమని వారు ఆరోపిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికలు, ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికలను గురించి వివరిస్తూ.. అప్పట్లోనే బీజేపీ చారిత్రాత్మక విజయం సాధించిందని బాక్సానగర్, ధన్పూర్ వంటి ప్రాంతాల్లో మెజారిటీ స్థాయిలో ఓట్లను నమోదు చేసుకున్నట్లు పేర్కొన్నారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో కూడా బీజేపీ విజయం సాధిస్తుందని అన్నారు. -
Tripura: ఇంటింటికీ తిరుగుతున్న సీఎం
రానున్న లోక్‌సభ ఎన్నికలకు పార్టీల ప్రచార హడావుడి మొదలైపోయింది. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లో కీలక నేతలు ఎన్నికల ప్రచారంలో నిమగ్నమయ్యారు. త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా అయితే ఇంటింటికీ తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. గోలఘటి నియోజకవర్గంలోని కంచమాల గ్రామ పంచాయతీలో సీఎం మాణిక్ సాహా ఇంటింటికీ ప్రచారం నిర్వహించారు. బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం అమలు చేస్తున్న విభిన్న పథకాల గురించి త్రిపుర సీఎం ఆ ప్రాంత వాసులతో మాట్లాడుతూ కనిపించారు . 2023 త్రిపుర అసెంబ్లీ ఎన్నికలలో తిప్రా మోతా పార్టీకి చెందిన మనబ్ దెబ్బర్మ గోలఘటి నియోజకవర్గం నుండి గెలుపొందారు. తాజా రాజకీయ పరిణామాల్లో భాగంగా సీపీఎం, కాంగ్రెస్ , గణ మంచ్, ఆల్ త్రిపుర పీపుల్స్ పార్టీ, సీపీఐ, సీపీఐఎంఎల్ సహా ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ‘ఇండియా’ కూటమి కింద పొత్తు పెట్టుకోవడానికి చేతులు కలిపాయి. ఏప్రిల్ 19న నిర్వహించే మొదటి దశ లోక్‌సభ ఎన్నికలకు భారత ఎన్నికల సంఘం బుధవారం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. త్రిపురతోపాటు అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, రాజస్థాన్, సిక్కిం, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, అండమాన్-నికోబార్ దీవులు, జమ్మూ కాశ్మీర్, లక్షద్వీప్‌లకు మార్చి 27ను నామినేషన్ల దాఖలుకు చివరి తేదీగా ప్రకటిచింది. నామినేషన్ల పరిశీలన మార్చి 28న జరగనుంది. -
బీజేపీ ఎంపీకి తృటిలో తప్పిన పెను ప్రమాదం
ఛండీగఢ్: బీజేపీ నేత, త్రిపుర మాజీ సీఎం, రాజ్యసభ ఎంపీ విప్లవ్ దేబ్‌కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. బిప్లవ్ దేబ్ ప్రయాణిస్తున్న కారు.. మరో వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో విప్లవ్ దేబ్ సురక్షితంగా బయటపడ్డారు. దీంతో, అందరూ ఊపిరిపీల్చుకున్నారు. వివరాల ప్రకారం.. బిప్లవ్ దేబ్ ప్రయాణిస్తున్న కారు ఎదురుగా వస్తున్న మరో వాహనాన్ని ఢీకొట్టింది. ఈ సందర్భంగా కారు డ్రైవర్ సెక్షన వ్యవధిలో చాకచక్యంగా కారును పక్కకు తప్పించడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ రోడ్డు ప్రమాదంలో కారు ముందు భాగం బాగా దెబ్బతిన్నది. ఇక, ఈ ఘటన హర్యానాలోని పానిపట్‌లో ఉన్న జీటీ రోడ్డులో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. ఈ ప్రమాదం అనంతరం.. బిప్లవ్ దేబ్ మరో కారులో అక్కడి నుంచి వెళ్లిపోయారు. Former Tripura CM and Rajya Sabha MP Biplab Deb had a narrow escape after his car met with an accident on GT Road in Haryana's Panipat today: Office of Biplab Deb pic.twitter.com/c7FElT0cdi — ANI (@ANI) February 20, 2023 -
'బీజేపీ గంగానది లెక్క.. మా పార్టీలో చేరితే పాపాలన్నీ తొలగిపోతాయ్..'
అగర్తల: బీజేపీ గంగా నది లాంటిదని వ్యాఖ్యానించారు త్రిపుర సీఎం మాణిక్ సాహా. తమ పార్టీలో చేరితే పుణ్యస్నానం చేసినట్లేనని, పాపాలన్నీ తొలగిపోతాయని అన్నారు. దక్షిణ త్రిపుర కక్రాబన్‌లో ఆదివారం నిర్వహించిన ఓ ర్యాలీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 'ఇంకా స్టాలిన్, లెనిన్ సిద్ధాంతాలను నమ్ముతున్న వారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా.. మీరంతా బీజేపీలో చేరండి. మా పార్టీ గంగానది లెక్క. ఇందులో చేరితే గంగానదిలో పవిత్ర స్నానం చేసినట్లే. పాపాలు తొలగిపోతాయ్' అని అన్నారు. అలాగే ఈ ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తాము కచ్చితంగా మరోమారు అధికారంలోకి వస్తామని మాణిక్ సాహా ధీమా వ్యక్తం చేశారు. త్రిపురలో కమ్యూనిస్టుల పాలనలో ప్రజల హక్కులను అణచివేశారని ఆరోపించారు. చదవండి: 'మీ టీ నేను తాగను.. విషం కలిపి ఇస్తే? అఖిలేశ్ యాదవ్ వీడియో వైరల్ -
డస్ట్బిన్ల కోసం ఆ సీఎం సంచలన నిర్ణయం
అగర్తలా: త్రిపుర ముఖ్యమంత్రి బిప్లవ్ కుమార్ దేవ్ ఆసక్తికర నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని 1,100 గ్రామాలలో మార్కెట్లలో డస్ట్బిన్లను ఏర్పాటు చేసినందుకు తన ఆరు నెలల జీతాన్ని విరాళంగా ఇస్తానని ప్రకటించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రకటన చేశారు. ఈ సందర్భంగా చెత్త, ప్లాస్టిక్ రహిత త్రిపుర కోసం ప్రచారం ప్రారంభించాలని అన్ని గ్రామ ప్రధాన్‌లను కోరినట్లు దేబ్ చెప్పారు. సెప్టెంబర్ 17న ప్రధానమంత్రి నరేంద్రమోదీ పుట్టినరోజు సందర్భంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లోని బీజేపీ యూనిట్లు సెప్టెంబర్ 14 నుండి వారం రోజుల పాటు 'సేవా సప్తాహ్' లేదా సర్వీస్ వీక్ నిర్వహించాలని నిర్ణయించాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని 1,100 గ్రామాలలోని మార్కెట్లలో డస్ట్బిన్లను ఏర్పాటు చేసినందుకు తన ఆరు నెలల జీతం విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నానని త్రిపుర సీఎం వెల్లడించారు. అలాగే 'సేవా సప్తాహ్'లో భాగంగా పార్టీ కార్యకర్తలు రాష్ట్రంలోని వివిధ ప్రదేశాలలో రక్తదానం, ఆరోగ్య శిబిరాలను నిర్వహిస్తారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా అయిన దేవ్ తెలిపారు. -
నోబెల్‌ను టాగూర్ తిరస్కరించారట!
అగర్తలా: ఇటీవల తరచుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న త్రిపుర సీఎం విప్లవ్ దేవ్ మరోసారి నోరుజారి విమర్శలను ఎదుర్కొంటున్నారు. జాతీయ గీత రచయిత, ప్రముఖ కవి రవీంద్ర నాథ్ టాగూర్ అప్పట్లో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తన సాహిత్య నోబెల్ బహుమతిని వెనక్కు ఇచ్చారని విప్లవ్ దేవ్ అన్నారు. గీతాంజలి నవలకు 1913లో టాగూర్‌కు నోబెల్ ఇచ్చారు. వాస్తవానికి బ్రిటిష్ ప్రభుత్వం తనకు ఇచ్చిన ‘బ్రిటిష్ నైట్‌హుడ్’ బిరుదును జలియంవాలా బాగ్ ఊచకోతకు నిరసనగా 1919లో టాగూర్ వదిలేశారు. నోబెల్‌ను తిరస్కరించలేదు. కానీ విప్లవ్ దేవ్ మాత్రం బ్రిటిష్ పాలనకు నిరసనగా టాగూర్ నోబెల్‌నే వెనక్కు ఇచ్చారని చెప్పడం విమర్శలకు దారితీసింది. విప్లవ్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో సరదా వ్యాఖ్యలు వెల్లువెత్తుతున్నాయి. -
మరోసారి విప్లవ్ దేవ్ వివాదాస్పద వ్యాఖ్యలు
-
మళ్లీ వివాదం రాజేసిన విప్లవ్ దేవ్
గౌహతి : త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్ దేవ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బ్రిటిషర్లకు వ్యతిరేకంగా రవీంద్రనాథ్ ఠాగూర్ నోబెల్ బహుమతిని వెనక్కిఇచ్చేశారని అన్నారు. ఉదయ్‌పూర్‌లో జరిగిన రవీంద్ర జయంతి కార్యక్రమంలో పాల్గొన్న విప్లవ్ దేవ్ ఈ వ్యాఖ్యలు చేశారు. 1919లో జలియన్‌వాలాబాగ్ ఊచకోతకు నిరసనగా ఠాగూర్ తనకు బ్రిటన్ ప్రకటించిన సర్ టైటిల్‌ను నిరాకరించారు. 1913లో ఠాగూర్‌కు సాహిత్యంలో ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతి లభించింది. కాగా బీర్భంలోని శాంతినికేతన్ విశ్వభారతి యూనివర్సిటీ మ్యూజియం నుంచి ఆయన నోబెల్ బహుమతి, సైటేషన్ 2004లో చోరీకి గురైంది. దీనిపై అప్పటి బెంగాల్ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య సీబీఐకి కేసును అప్పగించగా, తగిన ఆధారాలు లేవంటూ 2009లో కేసును మూసివేసింది. 2009లో విచారణను మూసివేసిన క్రమంలో చోరీ కేసును పశ్చిమ బెంగాల్ దర్యాప్తు ఏజెన్సీకి ఎందుకు అప్పగించడం లేదంటూ కోల్‌కతా హైకోర్టు 2017లో సీబీఐని ప్రశ్నించింది. మరోవైపు విప్లవ్ దేవ్ గతంలోనూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. సివిల్ ఇంజనీర్లే సివిల్ సర్వీసు పరీక్షలు రాయాలని వ్యాఖ్యానించారు. మరో సందర్భంలో యువత ప్రభుత్వ ఉద్యోగాల కోసం వేచిచూడకుండా పాన్ షాపులు పెట్టుకోవాలని చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న విప్లవ్ దేవ్‌ను ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షా ఢిల్లీకి పిలిపించుకుని మందలించినా పరిస్థితిలో మార్పు లేకపోవడం గమనార్హం. -
ట్వీట్ల మీద ట్వీట్లు కుమ్ముతున్నారు...
సాక్షి, న్యూఢిల్లీ : మహాభారతం కాలం నుంచి ఇంటర్నెట్ సౌకర్యం మనకుందంటూ వాదించి నవ్వులపాలైన త్రిపుర బీజేపీ ముఖ్యమంత్రి బిప్లబ్ కుమార్ దేవ్ రోజుకో వ్యాఖ్యతో మనల్ని తెగ నవ్విస్తున్నారు. మెకానికల్ ఇంజనీర్లు కాకుండా సివిల్ ఇంజనీర్లు సివిల్ సర్వీసెస్ పరీక్షలను ఎంపిక చేసుకుంటే బాగుంటందని, ఎందుకంటే రెండింట్లో సివిల్ ఉందని, ఒక సివిల్ పట్ల ఉన్న అవగాహన రెండు సివిల్‌కు ఎంతో ఉపయోగపడుతుందని ఆయన తాజాగా చేసిన వ్యాఖ్య ట్విటర్లో నవ్వులు పూయిస్తోంది. ఎవరికివారు తమదైన శైలిలో ఆయన వ్యాఖ్యపై స్పందిస్తున్నారు. ‘మెకానికల్ ఇంజనీర్లు మెకానిక్స్, కెమికల్ ఇంజనీర్లు కేవలం కెమెస్ట్స్ కావాలి.....హయ్యర్ ఎడ్యుకేషన్ హిల్ స్టేషన్లలో మాత్రమే చేయాలి....సింగ్‌లు మాత్రమే సింగర్లు కావాలి....వర్జిన్స్ మాత్రమే వర్జిన్ ఏర్‌లైన్స్‌లో ప్రయాణించాలి......లీవ్స్ కోసం ట్రీస్ మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి....బస్టాప్‌లో బస్సు దొరికినప్పుడు, ఫుల్స్టాప్లో ఫుల్ ఎందుకు దొరకదు....ఇండియానా జోన్స్ ఇండియన్ ఎందుకు కాదు......హిప్సోస్కు మాత్రమే హిప్స్ ఉంటాయి. ...ఫిజిక్స్ డిగ్రీవారే ఫిజిషియన్లు అవుతారు.....జీబ్రాలు మాత్రమే బ్రాలు వేసుకోవాలి....అంటూ ట్వీట్ల మీద ట్వీట్లు కుమ్ముతున్నారు. -
త్రిపుర ముఖ్యమంత్రి ట్వీట్లతో సెటైర్లు..
-
మా జోలికొస్తే గోళ్లు కత్తిరిస్తా: ముఖ్యమంత్రి
న్యూఢిల్లీ : తరచుగా వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలవడం బాగా అలవాటయ్యింది త్రిపుర ముఖ్యమంత్రి బిప్లబ్ కుమార్ దేబ్. ఈయన ప్రతి రోజు ఏదో ఒక వివాదస్పద వ్యాఖ్యలు చేయడంతో నెటిజన్లు విప్లవ్‌ని, బీజేపీలను విపరీతంగా ట్రోల్ చేసేస్తున్నారు. మహాభారత కాలంలో శాటిలైట్ కమ్యూనికేషన్ ఉందంటూ మొదలైన ఆయన వ్యవహారం.. పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీకి మతి చెడిందంటూ వ్యాఖ్యలు... మాజీ మిస్ వరల్డ్ డయానా హెడెన్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు... సివిల్ సర్వీసెస్‌కు సివిల్ ఇంజనీరింగ్ చదివిన వాళ్లే సరితూగుతారని, మెకానికల్ వాళ్లు పనికి రారని ప్రకటన... చివరకు.. చదువుకోవటం కన్నా పాన్ షాపులు పెట్టుకోవటం, ఆవులు మేపుకోవటం ఉత్తమం అంటూ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించటం, ఇలా వరుస వివాదస్పద వ్యాఖ్యలతో రోజు మీడియాలో నిలుస్తున్నారు. తాజాగా బిప్లబ్ కుమార్ దేబ్ తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడేవారికి ప్రమాదం తప్పదు అని హెచ్చరిస్తున్న వీడియో ఒకటి వైరల్‌గా మారడంతో మరోసారి వార్తల్లో నిలిచారు. ఈ వీడియోలో తన ప్రభుత్వం జోలికి వస్తే ఎలాంటి పరిస్థితిలు ఎదురవుతాయో చెప్పడానికి ఆయన కూరగాయలు అమ్మే వ్యక్తిని ఉదాహరణగా తీసుకున్నాడు. ‘కూరగాయలు అమ్మే వ్యక్తి సొరకాయలను అమ్ముదామని ఉదయ 8 గంటల ప్రాంతంలో మార్కెట్‌కు వచ్చాడు. కానీ 9 గంటలకల్లా ఆ సొరకాయ చెడిపోయింది. కారణం... వచ్చిన వినియోగదారలందరూ సొరకాయను పరీక్షించడానికి తమ గోర్లతో నొక్కి చూసారు. అందువల్ల ఆ సొరకాయ చెడిపోయింది.’ అలానే ఎవరైన నా ప్రభుత్వ వ్యవహరాల్లో జోక్యం చేసుకున్న, నా ప్రభుత్వాన్ని హేళన చేస్తే... నేను వారి గోళ్లను కత్తిరిస్తాను. కాబట్టి జాగ్రత్త నా ప్రభుత్వాన్ని తాకే ప్రయత్నం కూడా చేయకండి అంటూ హెచ్చరించారు. బిప్లబ్ రోజు ఇలా ఏదో ఒక వివాదస్పద వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో అతని నోటికి అడ్డుకట్ట వేసేందుకు స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ రంగంలోకి దిగారు. బిప్లబ్‌ను తన ఎదుట హాజరు కావాల్సిందిగా ఆయన సమన్లు జారీ చేశారు. మే 2నఆయనను తమ ఎదుట హాజరు కావాలని ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ఆదేశించినట్లు సీనియర్ నేత ఒకరు మీడియాకు వెల్లడించారు. -
ఆ ముఖ్యమంత్రిని ఆడేసుకుంటున్న నెటిజన్లు
సాక్షి, హైదరాబాద్ : నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రాకులాడకుండా ఆవులను పెంచుకోండి, పాన్ షాపులు పెట్టుకోండంటూ హాస్యస్పద వ్యాఖ్యలు చేసిన త్రిపుర సీఎం విప్లవ్ దేవ్ సోషల్ మీడియోలో విపరితంగా జోకులు పేలుతున్నాయి. అలాగే సివిల్ ఇంజనీరింగ్ చదివిన వారే సివిల్స్ రాయలని, మెకానికల్ ఇంజనీరింగ్ చదివిన వారు రాయకుడదంటూ చేసిన వ్యాఖ్యలపై అయితే ఇంక ఎక్కువగా జోకులు పేలుతున్నాయి. టైగర్ బిస్కెట్లను కేవలం టైగర్స్ మాత్రమే తినాలని, గేట్ ఎగ్జామ్‌ను కేవలం గేట్ కిపర్స్ మాత్రమే రాయాలంటూ ముఖ్యమంత్రి విప్లవ్ దేవ్ ఫొటోలు పెట్టి ఆయనను తెగ ఆడేసుకుంటున్నారు. రాజకీయ నాయకులు, సెలబ్రెటిలు పప్పులో కాలేసి మాట్లాడిన మాటలే సామాజికి మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు ఎవర్ని వదిలిపెట్టట్లేదు. గతంలో టీడీపీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ చేసిన ‘బీకాంలో ఫిజిక్స్’ వ్యాఖ్యలు అప్పట్లో బాగా వైరల్ అయ్యాయి. దాంతో ఆయనకు ఎక్కడలేని పబ్లిసిటీ వచ్చేసింది. ఇప్పుడు త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్ దేవ్‌ని కూడా నెటిజన్లు తెగ ఆడేసుకుంటున్నారు. ఆయన గతంలో ఇంటర్నెట్ మహాభారత కాలంలోనే ఉందని అన్నారు. ఇలాంటి హాస్యస్పద వ్యాఖ్యలు చేసినందుకు ఆయనకు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి సమన్లు జారీ అయిన విషయం తెలిసిందే. -
‘ప్రభుత్వ ఉద్యోగం ఎందుకు.. పాన్ షాప్ పెట్టుకోండి’
సాక్షి, అగర్తలా : సివిల్ ఇంజనీర్లు మాత్రమే సివిల్ సర్వీసులు చేపట్టాలని ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసిన త్రిపుర సీఎం విప్లవ్ దేవ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. యువత ప్రభుత్వ ఉద్యోగాల కోసం రాజకీయ నేతల వెంటపడరాదని సూచించారు. చదువుకున్న యువత పాన్ షాపులు పెట్టుకుని స్వయం ఉపాధికి మొగ్గుచూపాలని సర్కారీ కొలువుల కోసం నేతలపై ఒత్తిడి పెంచవద్దన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం వేచిచూడకుండా ప్రధానమంత్రి ముద్ర యోజన కింద రుణాలు పొంది వివిధ వ్యాపారాలు చేపట్టేందుకు మొగ్గుచూపాలని సలహా ఇచ్చారు. త్రిపుర యువకులు ఏళ్ల తరబడి ప్రభుత్వ ఉద్యోగాల కోసం రాజకీయ పార్టీల చుట్టూ తిరిగి తమ విలువైన సమయం వృధా చేసుకుంటున్నారని, నేతల చుట్టూ తిరిగే బదులు సొంతంగా పాన్ షాపు పెట్టుకుని ఉంటే ఆయా యువకుల వద్ద ఈపాటికి రూ 5 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ ఉండేదని అన్నారు. రూ 75 వేల బ్యాంకు రుణంతో నిరుద్యోగ యువత నెలకు సులువుగా రూ 25,000 ఆర్జించవచ్చని చెప్పుకొచ్చారు. చదువుకున్న వారు వ్యవసాయం, పౌల్ర్టీ పనులు వంటివి చేయరాదనే చులకన భావం ప్రజల్లో నెలకొందని అన్నారు. స్టార్టప్ ప్రాజెక్టులకు ప్రధాని ప్రవేశపెట్టిన ముద్ర రుణంతో యువకులు గౌరవంగా స్వయం ఉపాధితో జీవించే అవకాశం ఉందని చెప్పారు. -
డయానాకు క్షమాపణలు చెప్పిన సీఎం!
-
వెనక్కి తగ్గి, క్షమాపణలు చెప్పిన సీఎం!
అగర్తలా: త్రిపుర ముఖ్యమంత్రి బిప్లబ్ కుమార్ దేబ్ తనపై చేసిన ‘బాడీ షేమింగ్’, వర్ణ వివక్ష పూరిత కామెంట్లపై 1997 ‘మిస్ వరల్డ్’, నటి డయానా హెడెన్ మండిపడ్డారు. ఏదైనా మాట్లాడే ముందు ఓసారి ఆలోచించుకోవాలని సీఎం బిప్లబ్‌కు సూచించారు. దాంతోపాటుగా మహిళలపై ఇలాంటి వ్యాఖ్యలు చేసి బుద్ధి చూపించారంటూ సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. కాగా, డయానా హెడెన్‌పై తాను చేసిన వ్యాఖ్యలపై బిప్లబ్ దేబ్ వెనక్కి తగ్గారు. స్త్రీలను అవమానపరచడం తన ఉద్దేశం కాదని, డయానాపై చేసిన వ్యాఖ్యలు కేవలం తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనంటూ క్షమాపణలు చెప్పారు. ఫ్యాషన్ ఇండస్ట్రీలో జరుగుతున్న మోసాలను వివరించే యత్నంలో ఆ కామెంట్లు చేసినట్లు తెలిపారు. వివాదం ఇది.. గత కొంతకాలం నుంచి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న త్రిపుర సీఎం బిప్లబ్ కుమార్ దేబ్ ఇటీవల మరో వివాదంలో చిక్కుకుని వెనక్కి తగ్గారు. మహా భారతం కాలంలోనే మనకు ఇంటర్నెట్ ఉండేదని, పాస్వర్డ్ కోసమే కురుక్షేత్ర యుద్ధం జరిగిందని ఆయన చెప్పిన మాటలను జోక్‌లా తీసుకుని నవ్వుకున్నారు. ఆపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి మతి చెడిందని, ఆమెను ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందించాలంటూ కామెంట్లు చేశారు. తాజాగా శుక్రవారం త్రిపుర రాజధాని అగర్తలాలో ఒక కార్యక్రమంలో పాల్గొన్న బిప్లబ్ ‘భారతీయ అందానికి ప్రతీక ఐశ్వర్యరాయ్ మాత్రమే. డయానా హైడన్‌ను అందగత్తె అంటారా ఎవరైనా? ఆమె మిస్ వరల్డ్ గెలిచిందంటే నవ్వొస్తుంది’ అని వ్యాఖ్యానించారు. కేవలం ‘సౌందర్య సాధనాల సంస్థలు మన దేశ మార్కెట్‌ను వశపరుచుకోవడానికి దేశ యువతులకు వరుసగా అందాల టైటిల్స్ ఇచ్చాయని అందులో భాగంగానే డాయానాకు సైతం మిస్ వరల్డ్ ఇచ్చారని ఆమెను కించపరిచే వ్యాఖ్యలు చేశారు. . డయానా ఏమన్నారంటే.. నేను చామన ఛాయ రంగుతో ఉన్నాందుకు గర్వపడుతున్నాను. విదేశీయులు సైతం భారతీయుల రంగును మెచ్చుకుంటున్నారు. అయితే నాకు మిస్ వరల్డ్ టైటిల్ ఎందుకు ఇచ్చారని ప్రశ్నించడం వరకు వారి వ్యక్తిగత అభిప్రాయమే. కానీ రంగు గురించి మాట్లాడి వివక్షపూరిత వ్యాఖ్యలు చేయడం త్రిపుర సీఎం బిప్లబ్‌కు సబబు కాదు. ఒకరిపై కామెంట్లు చేసే ముందు ఒకటికి పది సార్లు ఆలోచించుకుని కామెంట్ చేయడం మంచిదని హైదరాబాద్‌కు చెందిన డయానా హితవు పలికారు. -
మమతా బెనర్జీపై బీజేపీ సీఎం తీవ్ర వ్యాఖ్యలు
అగర్తల: బీజేపీ-తృణమూల్ కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. త్రిపుర సీఎం విప్లవ్ కుమార్ దేవ్.. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆమెకు మతి చెడిందని.. పిచ్చాసుపత్రిలో చేరాలంటూ విప్లవ్ వ్యాఖ్యానించారు. ‘మమతా బెనర్జీకి మతి చెడినట్లుంది. ఆమె ఆస్పత్రిలో చేరి చికిత్స చేయించుకుంటే మంచిది. ఆమె మాటలు తెలివితక్కువగా ఉన్నాయి’అని విప్లవ్ పేర్కొన్నారు. అంతేకాదు గుళ్లూ, గోపురాలు సందర్శిస్తే ఆమె మానసిక స్థితి బాగుపడొచ్చని వ్యంగ్యంగా మాట్లాడారు. ఈ వ్యాఖ్యలపై టీఎంసీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. కాగా, త్రిపుర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఓ ఇంటర్యూలో మమతా బెనర్జీ మాట్లాడుతూ.. ‘బీజేపీవంటి జాతీయ పార్టీ త్రిపుర లాంటి చిన్న రాష్ట్రంలో విజయం సాధించడంలో గొప్పేముందని.. అవి మున్సిపల్ ఎన్నికలు’ అని పేర్కొన్నారు. దీంతో విప్లవ్ ఆమెకు కౌంటర్ ఇచ్చారు. కాగా, త్రిపురలో రెండున్నర దశాబ్దాల కమ్యూనిస్టుల పాలనకు తెరదించుతూ ఫిబ్రవరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. 59 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో మొత్తం బీజేపీ 35 సీట్లను కైవసం చేసుకుంది. -
‘పాస్వర్డ్’ కోసమే కురుక్షేత్ర యుద్ధం
సాక్షి, న్యూఢిల్లీ : తెలుగునాట అత్యంత ప్రజాదరణ పొందిన ‘మాయాబజార్’ సినిమాలోని ‘ప్రియదర్శిని’ సన్నివేశం మనందరికి గుర్తుండే ఉంటుంది. అందులో శ్రీకష్ణుడు పెట్టెలాంటి ఓ ప్రియదర్శినిని తీసుకొచ్చి శశిరేఖకు కానుకగా ఇస్తాడు. ఆ పెట్టె తెరచి మూతను చూస్తే దానికో అద్దం ఉంటుంది. దానిముందు నిలబడి ఆ అద్దంలోకి ఎవరు చూస్తే వారికి తమకు ప్రియమైన వస్తువులు లేదా వ్యక్తులు కనిపిస్తారు. అందుకే దాన్ని ప్రియదర్శిని అన్నారు. లేకపోతే మాయాదర్పనం అనేవారు. ఆ ప్రియదర్శిని అద్దంలాంటి స్క్రీన్‌ను చూస్తే శశిరేఖ పాత్రధారి సావిత్రికి, తాను ప్రేమించిన అభిమన్యుడు, అంటే నాగేశ్వరరావు కనిపిస్తారు. బాలరాముడి భార్య రేవతి పాత్రధారి ఛాయాదేవీ ఆ ప్రియదర్శినిలోకి చూస్తే నగలు కనిపిస్తాయి. మరొకరు చూస్తే జరగబోయే కీడు కనిపిస్తుంది. వారు ఇంకా అలాగే చూస్తున్నట్లయితే త్రిపుర ముఖ్యమంత్రి బిప్లబ్ కుమార్ దేవ్ మంగళవారం అగర్తలో ప్రాచీన మహాభారతానికి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ముడిపెడుతూ చేసిన ప్రసంగం కనిపించేది. పాండవులు, కౌరవుల మధ్య జరిగిన యుద్ధం విశేషాలను ఎప్పటికప్పుడు కళ్లు కనిపించని ధృతరాష్ట్రుడికి ఆయన సలహాదారు సంజయ ఈ ప్రియదర్శిని లాంటి వీడియోలోకి చూస్తూ చెప్పారని బిప్లబ్ కుమార్ తెలిపారు. ‘అంటే, ఈ సాంకేతిక పరిజ్ఞానం అప్పటికే ఉంది. ఇంటర్నెట్ ఉంది. శాటిలైట్ ఉంది’ అని ఆయన వివరించారు. 950 సంవత్సరాల క్రీస్తు పూర్వం నుంచి 3,102 సంవత్సరాల క్రీస్తుపూర్వం మధ్యకాలంలో సంభవించిన ట్లు భావిస్తున్న మహాభారత కాలంలోనే ఇప్పుడు మనం ఉపయోగిస్తున్న ఇంటర్నెట్, వైఫై టెక్నాలజీ ఉందన్నమాట. మహాభారతానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి ముడిపెట్టడం కొత్త విషయమేమీ కాదు. ఎప్పటి నుంచో జరుగుతున్నదే. విమానాన్ని రైట్స్ సోదరులు కనిపెట్టడానికి వేల సంవత్సరాల క్రితమే మహాభారత కాలంలో పుష్పక విమానం ఉందని, ఆ విమానాన్ని కాపీ కొట్టే రైట్ సోదరులు ఆధునిక విమానాన్ని కనిపెట్టారని పిడి వాదులు వాదించారు. పుష్పక విమానం ఊహకుగానీ, నిజమైన విమానం ఊహకుగానీ మూలం ఒక్కటే పక్షులని ఎవరైనా ఊహించగలరు. ఇంక రైట్ సోదరులు కనిపెట్టిన విమానం లోహ రెక్కలు పక్షి రెక్కలకు కాస్త భిన్నంగా ఉంటాయి. మహాభారతంలో పేర్కొన్న పుష్పక విమానం రెక్కలు, పక్షి రెక్కలు కత్తిరించి అతికించినట్లు ఉంటాయి. పుష్పక విమానానికి దివ్య శక్తులు మినహా ఇంజన్ ఉన్నట్లు ఏ పుస్తకంలోనూ లేదు. అలాంటప్పుడు పుష్పక విమానానికి మన లోహ విమానానికి పోలిక ఎక్కడ? మన సాక్షాత్తు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీయే 2014లో ఓ ఎన్నికల సభలో మాట్లాడుతూ ప్రాచీన భారత దేశంలోనే ప్లాస్టిక్ సర్జరీ టెక్నాలజీ ఉందని, అందుకు ఉదాహరణే గణేశుడని చెప్పారు. అప్పుడు ఆయన మాటలకు సోషల్ మీడియా ఎలా స్పందించిందోగానీ, ఇప్పుడు బిప్లబ్ కుమార్ వ్యాఖ్యలకు సోషల్ మీడియా, ముఖ్యంగా ట్విట్టర్లో ట్వీట్లు టపాసుల్లా పేలుతున్నాయి. ‘సింహాసనం ఎక్కిన బాబర్ విద్యుత్ చార్జీలు చెల్లించడానికి నిరాకరించడంతో దేశంలో ఇంటర్నెట్ను కట్ చేశారు... పాండవులు తమ వైఫై పాస్‌వర్డ్‌ను కౌరవులతో షేర్ చేసుకొని ఉంటే కురుక్షేత్ర యుద్ధమే జరిగేది కాదు.... వాస్తవానికి కౌరవులు తమ వైఫై పాస్‌వర్డ్‌ను పాండవులతో షేరు చేసుకోక పోవడం వల్లనే మహాభారత యుద్ధం వచ్చింది. మొదట పాండవులు జియో కనెక్షన్ అడిగారు. అందుకు కౌరవులు తిరస్కరించారు. ఆ తర్వాత బీఎస్ఎన్ఎల్ 3జీ కనెక్షన్ గురించి అడిగారు. దానికి కౌరవులు తిరస్కరించారు.... మహాభారత్ సమయంలో ఫేస్బుక్ కూడా ఉంది. మన మార్క్ జుకర్‌బర్గ్ పూర్వికుడైన మార్కాండేయ చక్రవర్తి ‘ముఖ్ పుస్తక్’ను నడిపారు. అదే కాలక్రమంలో ఫేస్‌బుక్‌గా మారింది.... ద్రోణాచార్యుడు, ఏకలవ్యుడిని తన శిశ్యుడిగా చేసుకునేందుకు ఆయన ఆధార్ కార్డు అడిగాడు. ఇంటర్నెట్ స్లోగా ఉండడంతో అది ఆయన బొటన వేలు ముద్రను రిసీవ్ చేసుకోలేదు. దాంతో ఏకలవ్యుడు తన బొటన వేలును గురువుకు కోసిచ్చి తీరక ఉన్నప్పుడు చూసుకోమని చెప్పి వచ్చాడు.... రామాయణం సమయంలో కూడా ఇంటర్నెట్ ఉండి ఉంటే ఎంత బాగుండును! సంజీవిని కోసం హన్మంతుడికి పర్వతాన్ని పెకిలించుకొని తెచ్చే పని తప్పేది. ఎంచక్కా, గూగుల్ మ్యాప్‌లో సంజీవిని గుర్తించి తెచ్చేవాడు..... ఇలా ఎవరికి వారు తమదైన శైలిలో నవ్యులు పూయించారు. రాజకీయ నేతల్లో కూడా బిప్లబ్ కుమార్ లాంటి హాస్యప్రియులు ఉండబట్టి దేశంలో ఇంకా హాస్యం బతికి ఉన్నట్లుంది. -
భారతంలో ఇంటర్నెట్.. నిజమే!
అగర్తలా: మహాభారతం సమయంలోనే ఇంటర్నెట్, ఉపగ్రహ సమాచార వ్యవస్థ ఉందన్న త్రిపుర ముఖ్యమంత్రి వ్యాఖ్యలకు ఆ రాష్ట్ర గవర్నర్ తథాగత్ రాయ్ మద్దతు లభించింది. పురాణ కాలం నాటి విషయాలపై ముఖ్యమంత్రి సమయోచితంగా మాట్లాడారన్నారు. ఆ రోజుల్లో ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం లేకుండా దివ్య దృష్టి, పుష్పక రథం వంటివి సాధ్యం కావని ట్వీటర్లో తెలిపారు. మహాభారతం కాలం, ఆ తర్వాత ప్రస్తుతం సాంకేతిక విజ్ఞానం విస్తృతంగా వినియోగంలో ఉండగా మధ్యయుగాల్లో ఏమైందో మాత్రం తనకు తెలియదన్నారు. ఈ వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమాల్లో నిరసనలు వెల్లువెత్తాయి. -
త్రిపుర సీఎంగా విప్లవ్ ప్రమాణం
అగర్తలా: సుమారు పాతికేళ్ల కమ్యూనిస్టుల పాలన అనంతరం త్రిపురలో తొలిసారి బీజేపీ ప్రభుత్వం కొలువుదీరింది. రాష్ట్ర నూతన సీఎంగా విప్లవ్ కుమార్ దేవ్(48) శుక్రవారం ప్రమాణం చేశారు. అగర్తలాలో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ తథాగతరాయ్ విప్లవ్‌తో సీఎంగా ప్రమాణంచేయించారు. ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ , కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్, బీజేపీ నాయకులు అడ్వాణీ, ఎంఎం జోషి, తాజా మాజీ సీఎం మాణిక్ సర్కార్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. విప్లవ్‌తో పాటు బీజేపీకే చెందిన జిష్ణు దేవ్ వర్మన్ ఉప ముఖ్యమంత్రిగా, మరో ఏడుగురు మంత్రులుగా ప్రమాణం చేశారు. బీజేపీ సీఎంలు రూపానీ(గుజరాత్), శివరాజ్ సింగ్ చౌహాన్(మధ్యప్రదేశ్), సర్బానంద సోనోవాల్(అసోం), రఘువర్ దాస్(జార్ఖండ్)లూ కార్యక్రమంలో పాల్గొన్నారు. త్రిపురకు పూర్తి మద్దతు: మోదీ త్రిపుర సమగ్రాభివృద్ధి కోసం కొత్త ప్రభుత్వానికి కేంద్రం పూర్తిగా మద్దతిస్తుందని ప్రధాని మోదీ ప్రకటించారు. విప్లవ్ ప్రమాణ స్వీకారం చేశాక మోదీ ప్రసంగించారు. ఈశాన్య రాష్ట్రాలు అభివృద్ధి చెందడానికి అవకాశాలు అపారంగా ఉన్నాయని, వాటిని వెతికిపట్టుకోవాలని పిలుపునిచ్చారు. ‘ త్రిపుర ప్రజల జీవితాల్లో మార్పు రావాలంటే రాష్ట్రాన్ని అభివృద్ధిలో కొత్త శిఖరాలకు తీసుకెళ్లాలి. ప్రతి భారతీయుడు ఈశాన్య వాసులకు అండగా ఉంటాడు’ అని అన్నారు. ఆరెస్సెస్ నుంచి మరో సీఎం.. విప్లవ్ రాజకీయ ప్రస్థానం ఆరెస్సెస్‌తో∙మొదలైంది. గోమతి జిల్లా రాజ్‌ధార్ నగర్ గ్రామంలోని మధ్య తరగతి కుటుంబంలో 1971, నవంబర్ 25న విప్లవ్ జన్మించారు. ఆయన తండ్రి జనసంఘ్‌లో పనిచేశారు. డిగ్రీ పూర్తిచేసిన విప్లవ్ ఆరెస్సెస్‌లో చేరి సుమారు 16 ఏళ్లు సేవలందించారు. -
ఆ సీఎం యాంటీ ఇండియన్
అగర్తల: త్రిపుర సీఎం మాణిక్ సర్కార్... పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ లా మాట్లాడుతున్నారని తృణముల్ కాంగ్రెస్ ఘాటుగా విమర్శించింది. ఓ పారిశ్రామిక సదస్సులో మాణిక్ సర్కార్ మాట్లాడుతూ.. ఇండియా పొరుగు దేశాలతో ఘర్షణ పడకుండా పెద్దన్న తరహాలో వ్యవహరించాలని వ్యాఖ్యానించారు. దీంతో టీఎంసీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళలకు దిగారు. సీఎం దిష్టిబొమ్మలను దహనం చేశారు. టీఎంసీ నేత సుశాంత్ చౌదరీ సీఎంను దేశద్రోహి అని వ్యాఖ్యానించారు. సీపీఎం దేశద్రోహ భావాలను వదులుకోలేకపోతోందని తీవ్రస్థాయిలో విమర్శించారు. దీనిపై స్పందించిన సీపీఎమ్ నేత బిజన్ధర్ టీఎంసీ తీరును తప్పుబట్టారు. టీఎంసీ తమను అప్రతిష్టపాలు చేసేందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తోందని ఆరోపించారు. ఉడీ ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో ఇండియా, పాకిస్థాన్ ల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. -
మోదీతో మాణిక్ సర్కార్ భేటీ
న్యూఢిల్లీ: త్రిపురకు ప్రత్యేక హోదా కల్పించడంతోపాటు ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి తోడ్పాలు అందించాలని త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు. మంగళవారం ఢిల్లీలో ప్రధాన మంత్రి కార్యాలయానికి వచ్చిన మాణిక్ సర్కార్ అరగంటకుపైగా మోదీతో సమావేశమయ్యారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఈశాన్య రాష్ట్రాలకు అందించే ప్రత్యేక నిధులలో ఎలాంటి కోతలు విధించవద్దని, అలాంటి చర్యలు తమ రాష్ట్రాలపాటిట శాపంగా మారుతాయని వివరించారు. ఈ విషయంలో పార్టీలకు అతీతంగా ఏడు ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒక్కతాటిపైకి వచ్చి కేంద్రాన్ని అభ్యర్థించాలని నిర్ణయించినట్లు మాణిక్ తెలియజేశారని పీఎంవో వర్గాలు పేర్కొన్నాయి. ఎన్డీఏ సర్కారు ఈశాన్య రాష్ట్రాలను చిన్నచూపు చూస్తున్నదని, ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ప్రధాని మోదీ కనీసం అపాంయింట్ మెంట్ కూడా ఇవ్వడంలేదని అసోం ముఖ్యమంత్రి తరుణ్ గొగాయ్ సోమవారం వ్యాఖ్యనించిన నేపథ్యంలో ప్రధానితో త్రిపుర ముఖ్యమంత్రి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. -
సాయుధ బలగాల చట్టం ఉపసంహరణ: సర్కార్
ఈశాన్య రాష్ట్రాలతో పాటు మరికొన్ని సమస్యాత్మక రాష్ట్రాల్లో అత్యంత వివాదాస్పదంగా ఉన్న సాయుధ బలగాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని తమ రాష్ట్రంలో ఉపసంహరించాలని త్రిపుర సర్కారు నిర్ణయించింది. ఉగ్రవాదుల చొరబాటును నిరోధించేందుకు గత 18 ఏళ్లుగా ఈ చట్టం ఆ రాష్ట్రంలో అమలవుతోంది. రాష్ట్రంలో హోం శాఖ బాధ్యతలను కూడా నిర్వర్తిస్తున్న ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్.. బుధవారం నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో సమస్యాత్మకంగా ఉన్న ప్రాంతాల పరిస్థితిని తాము సమీక్షించామని, రాష్ట్ర పోలీసులు, భద్రతా దళాలతో కూడా ఈ అంశంపై చర్చించామని మాణిక్ సర్కార్ చెప్పారు. ఇక ఇప్పుడు ఈ చట్టంతో అవసరం లేదనే అందరూ భావించారని ఆయన అన్నారు. దాంతో.. వివాదాస్పదంగా ఉన్న ఆ చట్టాన్ని ఎత్తేయాలని నిర్ణయించామని, త్వరలోనే దీనిపై గెజిట్ నోటిఫికేషన్ కూడా ఇస్తామని చెప్పారు. 1997 ఫిబ్రవరి 16 నుంచి త్రిపురలో ఈ చట్టం అమలవుతోంది. -
రాజకీయ లబ్ధి కోసమే ఆంధ్రప్రదేశ్ విభజన:త్రిపుర సీఎం
అగర్తల: త్రిపుర రాష్ట్ర విభజనకు సంబంధించి ఎలాంటి ప్రయత్నాలను అనుమతించేది లేదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ స్పష్టం చేశారు. అలాంటి విభజన ప్రయత్నాలను తనశక్తి కొలదీ అడ్డుకుంటానని చెప్పారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాలను ఆశించే ఆంధ్రప్రదేశ్‌ను విభజించి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడానికి నిర్ణయించిందని ఆయన విమర్శించారు. దీన్ని చూసి త్రిపుర విభజనకు ఒక చిన్న పార్టీ కూడా డిమాండ్ చేయడం మొదలు పెట్టిందన్నారు. అమర్పూర్లో 14వ గిరిజన యువత సమాఖ్య సమావేశం సందర్భంగా సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 40ఏళ్లుగా నెలకొన్న తీవ్రవాద సమస్యను తాము పరిష్కరించగలిగామని.. కానీ, కొంతమంది రాజకీయ ప్రయోజనాల కోసం తీవ్రావాదాన్ని పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. గిరిజన రాజకీయ పార్టీ అయిన త్రిపుర దేశీయ ప్రజాఫ్రంట్(ఐపీఎఫ్టీ) త్రిపురలో వెనుకబడ్డ గిరిజన ప్రాంతాలతో ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తోంది. ఈ నెల 10న ఢిల్లీలో నిరాహారదీక్ష కూడా నిర్వహించింది. కేంద్ర హోంశాఖకు తాము 8 పేజీల వినతి పత్రాన్ని ఇచ్చామని, తమకు కేంద్ర ప్రభుత్వానికి మధ్య చర్చలు జరుగుతున్నాయని ఐపీఎఫ్టీ అధ్యక్షుడు నరేంద్రచంద్ర దెబ్బర్మ ఆదివారం తెలిపారు. చిన్న ఈశాన్య రాష్ట్రమైన త్రిపుర విభజన డిమాండ్‌కు స్థానికంగా ఇతర రాజకీయ పార్టీల నుంచి ఏ మాత్రం మద్దతివ్వడం లేదు.