సాక్షి, న్యూఢిల్లీ : తెలుగునాట అత్యంత ప్రజాదరణ పొందిన ‘మాయాబజార్’ సినిమాలోని ‘ప్రియదర్శిని’ సన్నివేశం మనందరికి గుర్తుండే ఉంటుంది. అందులో శ్రీకష్ణుడు పెట్టెలాంటి ఓ ప్రియదర్శినిని తీసుకొచ్చి శశిరేఖకు కానుకగా ఇస్తాడు. ఆ పెట్టె తెరచి మూతను చూస్తే దానికో అద్దం ఉంటుంది. దానిముందు నిలబడి ఆ అద్దంలోకి ఎవరు చూస్తే వారికి తమకు ప్రియమైన వస్తువులు లేదా వ్యక్తులు కనిపిస్తారు. అందుకే దాన్ని ప్రియదర్శిని అన్నారు. లేకపోతే మాయాదర్పనం అనేవారు.
ఆ ప్రియదర్శిని అద్దంలాంటి స్క్రీన్‌ను చూస్తే శశిరేఖ పాత్రధారి సావిత్రికి, తాను ప్రేమించిన అభిమన్యుడు, అంటే నాగేశ్వరరావు కనిపిస్తారు. బాలరాముడి భార్య రేవతి పాత్రధారి ఛాయాదేవీ ఆ ప్రియదర్శినిలోకి చూస్తే నగలు కనిపిస్తాయి. మరొకరు చూస్తే జరగబోయే కీడు కనిపిస్తుంది. వారు ఇంకా అలాగే చూస్తున్నట్లయితే త్రిపుర ముఖ్యమంత్రి బిప్లబ్ కుమార్ దేవ్ మంగళవారం అగర్తలో ప్రాచీన మహాభారతానికి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ముడిపెడుతూ చేసిన ప్రసంగం కనిపించేది.
పాండవులు, కౌరవుల మధ్య జరిగిన యుద్ధం విశేషాలను ఎప్పటికప్పుడు కళ్లు కనిపించని ధృతరాష్ట్రుడికి ఆయన సలహాదారు సంజయ ఈ ప్రియదర్శిని లాంటి వీడియోలోకి చూస్తూ చెప్పారని బిప్లబ్ కుమార్ తెలిపారు. ‘అంటే, ఈ సాంకేతిక పరిజ్ఞానం అప్పటికే ఉంది. ఇంటర్నెట్ ఉంది. శాటిలైట్ ఉంది’ అని ఆయన వివరించారు. 950 సంవత్సరాల క్రీస్తు పూర్వం నుంచి 3,102 సంవత్సరాల క్రీస్తుపూర్వం మధ్యకాలంలో సంభవించిన ట్లు భావిస్తున్న మహాభారత కాలంలోనే ఇప్పుడు మనం ఉపయోగిస్తున్న ఇంటర్నెట్, వైఫై టెక్నాలజీ ఉందన్నమాట.
మహాభారతానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి ముడిపెట్టడం కొత్త విషయమేమీ కాదు. ఎప్పటి నుంచో జరుగుతున్నదే. విమానాన్ని రైట్స్ సోదరులు కనిపెట్టడానికి వేల సంవత్సరాల క్రితమే మహాభారత కాలంలో పుష్పక విమానం ఉందని, ఆ విమానాన్ని కాపీ కొట్టే రైట్ సోదరులు ఆధునిక విమానాన్ని కనిపెట్టారని పిడి వాదులు వాదించారు. పుష్పక విమానం ఊహకుగానీ, నిజమైన విమానం ఊహకుగానీ మూలం ఒక్కటే పక్షులని ఎవరైనా ఊహించగలరు.
ఇంక రైట్ సోదరులు కనిపెట్టిన విమానం లోహ రెక్కలు పక్షి రెక్కలకు కాస్త భిన్నంగా ఉంటాయి. మహాభారతంలో పేర్కొన్న పుష్పక విమానం రెక్కలు, పక్షి రెక్కలు కత్తిరించి అతికించినట్లు ఉంటాయి. పుష్పక విమానానికి దివ్య శక్తులు మినహా ఇంజన్ ఉన్నట్లు ఏ పుస్తకంలోనూ లేదు. అలాంటప్పుడు పుష్పక విమానానికి మన లోహ విమానానికి పోలిక ఎక్కడ? మన సాక్షాత్తు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీయే 2014లో ఓ ఎన్నికల సభలో మాట్లాడుతూ ప్రాచీన భారత దేశంలోనే ప్లాస్టిక్ సర్జరీ టెక్నాలజీ ఉందని, అందుకు ఉదాహరణే గణేశుడని చెప్పారు. అప్పుడు ఆయన మాటలకు సోషల్ మీడియా ఎలా స్పందించిందోగానీ, ఇప్పుడు బిప్లబ్ కుమార్ వ్యాఖ్యలకు సోషల్ మీడియా, ముఖ్యంగా ట్విట్టర్‌లో ట్వీట్లు టపాసుల్లా పేలుతున్నాయి.
‘సింహాసనం ఎక్కిన బాబర్ విద్యుత్ చార్జీలు చెల్లించడానికి నిరాకరించడంతో దేశంలో ఇంటర్నెట్‌ను కట్ చేశారు... పాండవులు తమ వైఫై పాస్‌వర్డ్‌ను కౌరవులతో షేర్ చేసుకొని ఉంటే కురుక్షేత్ర యుద్ధమే జరిగేది కాదు.... వాస్తవానికి కౌరవులు తమ వైఫై పాస్‌వర్డ్‌ను పాండవులతో షేరు చేసుకోక పోవడం వల్లనే మహాభారత యుద్ధం వచ్చింది. మొదట పాండవులు జియో కనెక్షన్ అడిగారు. అందుకు కౌరవులు తిరస్కరించారు.
ఆ తర్వాత బీఎస్‌ఎన్‌ఎల్ 3జీ కనెక్షన్ గురించి అడిగారు. దానికి కౌరవులు తిరస్కరించారు.... మహాభారత్ సమయంలో ఫేస్‌బుక్ కూడా ఉంది. మన మార్క్ జుకర్‌బర్గ్ పూర్వికుడైన మార్కాండేయ చక్రవర్తి ‘ముఖ్ పుస్తక్’ను నడిపారు. అదే కాలక్రమంలో ఫేస్‌బుక్‌గా మారింది.... ద్రోణాచార్యుడు, ఏకలవ్యుడిని తన శిశ్యుడిగా చేసుకునేందుకు ఆయన ఆధార్ కార్డు అడిగాడు. ఇంటర్నెట్ స్లోగా ఉండడంతో అది ఆయన బొటన వేలు ముద్రను రిసీవ్ చేసుకోలేదు.
దాంతో ఏకలవ్యుడు తన బొటన వేలును గురువుకు కోసిచ్చి తీరక ఉన్నప్పుడు చూసుకోమని చెప్పి వచ్చాడు.... రామాయణం సమయంలో కూడా ఇంటర్నెట్ ఉండి ఉంటే ఎంత బాగుండును! సంజీవిని కోసం హన్మంతుడికి పర్వతాన్ని పెకిలించుకొని తెచ్చే పని తప్పేది. ఎంచక్కా, గూగుల్ మ్యాప్‌లో సంజీవిని గుర్తించి తెచ్చేవాడు..... ఇలా ఎవరికి వారు తమదైన శైలిలో నవ్యులు పూయించారు. రాజకీయ నేతల్లో కూడా బిప్లబ్ కుమార్ లాంటి హాస్యప్రియులు ఉండబట్టి దేశంలో ఇంకా హాస్యం బతికి ఉన్నట్లుంది.
Comments
Please login to add a commentAdd a comment