న్యూఢిల్లీ: ఇంటర్నెట్ వినియోగదారుల బ్యాంకింగ్ వివరాలతో పాటు వారికి సంబంధించిన రహస్య సమాచారాన్ని తస్కరించే రెండు సైబర్ వైరస్‌లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయట. వర్చువల్ గర్ల్ ఫ్రెండ్, పాండా బ్యాంకర్ పేరిట ఉన్న వైరస్‌లతో జాగ్రత్తగా వ్యవహరించాలని సైబర్ సెక్యూరిటీ సంస్థ ఒకటి హెచ్చరిస్తోంది. తెలియకుండా వీటిని యాక్టివేట్ చేస్తే మొదటికే మోసం వస్తుందని, మనకు తెలియకుండా మొత్తం వ్యక్తిగత సమాచారం చోరీకి గురవుతుందని చెపుతోంది.
ఇందులో వ్యక్తిగత సమాచారాన్ని తస్కరించే వర్చువల్ గర్ల్‌ఫ్రెండ్ అత్యంత ప్రమాదకరమైనదని, ప్రముఖ సోషల్ మీడియా సైట్ ట్విట్టర్ ద్వారా ఈ వైరస్ వినియోగదారుల ఆండ్రాయిడ్ ఫోన్లలోకి ప్రవేశి స్తోందని తెలిపింది. ట్విట్టర్ ద్వారా అడల్ట్ గేమ్ అయిన వర్చువల్ గర్ల్‌ఫ్రెండ్ విస్తరిస్తోందని, ఈ ఆండ్రాయిడ్ మాల్‌వేర్ చాలా ప్రమాదకరమైనదని కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఆఫ్ ఇండియా (సీఈఆర్‌టీ–ఇన్) సంస్థ వెల్లడించింది.
భారత ఇంటర్నెట్ డొమైన్‌కి సంబంధించి హ్యాకింగ్, ఫిషింగ్, ఇతర సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన అంశాల్లో స్వతంత్రంగా పోరాటం చేస్తోంది. ట్విట్టర్ ద్వారా ఈ వైరస్ విస్తరిస్తోందని, అన్ ఇన్‌స్టాల్ చేసినా.. ఫోన్‌లోనే ఉంటూ సైలెంట్‌గా బ్యాక్‌గ్రౌండ్‌లో పని చేస్తోందని పేర్కొంది. ఆ తర్వాత ఆ ఆండ్రాయిడ్ ఫోన్ వినియోగదారుని మొబైల్ నంబర్, బ్యాంకు ఖాతా వివరాలు, ఇన్‌స్టాల్ అయిన అప్లికేషన్ల లిస్ట్, కాంటాక్ట్స్, ఎస్‌ఎంఎస్‌లు తస్కరిస్తోందని వివరించింది.
ఒకసారి వ్యక్తిగత సమాచారం చోరీకి గురైతే ఆ వ్యక్తి సైబర్ నేరగాళ్ల బారిన పడటం సులభం అవుతుందని, తద్వారా ఆ వ్యక్తి బ్యాంకు ఖాతా నుంచి నగదు చోరీకి గురవుతుందని తెలిపింది. పాండా బ్యాంకర్ కూడా ఇలాంటి వైరస్ అని, వీటితో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
Comments
Please login to add a commentAdd a comment