సాక్షి, చెన్నై: తమిళనాడు చలనచిత్ర దర్శకుడు పా. రంజిత్ గత కొన్ని నెలలుగా ఓ సమున్నత లక్ష్యంతో ఓ సంగీతం బ్యాండ్‌ను ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. రాష్ట్రంలోని రాజకీయ, సామాజిక అంశాలపై ఈ బ్యాండ్ పోరాటం సాగించేలా ఉండాలని భావించారు. ముఖ్యంగా రాష్ట్రంలో వేళ్లూనుకుపోయిన కుల వ్యవస్థను నిర్మూలించే దిశగా కషి చేయాలనుకున్నారు. చివరకు విజయం సాధించారు. 19 మంది సభ్యులతో ‘ది క్యాస్ట్‌లెస్ కలెక్టివ్’ పేరుతో సంగీత బందాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సంగీత బందంలో నలుగురు ర్యాపర్లు, ఏడుగురు వాయిద్యకారులు, ఎనిమిది మంది గాత్ర విద్వాంసులు, ప్రముఖ తమిళ జానపద కళాకరుడు ఉన్నారు. 19 మందిలో ఓ మహిళ ఉన్నారు. లేబుల్ మద్రాస్ రికార్డ్స్‌తో కొలాబరేషన్ ఉన్న నీలమ్ కల్చరల్ సెంటర్‌ను రంజిత్ ఎప్పటి నుంచో నిర్వహిస్తున్నారు. ఆ అనుభవం ఇప్పుడు ఈ మ్యూజిక్ బ్యాండ్‌ను ఏర్పాటు చేయడానికి ఆయనకు దోహదపడింది.
తమిళనాడులో కులాలకు వ్యతిరేకంగా పోరాడిన కార్యకర్త, రచయిత సీ. అయోతీ థాస్ రూపొందించిన పద బంధం ‘జాతి ఇలాతు తమిళరగల్’ స్ఫూర్తితో ఇంగ్లీషులో ‘ది క్యాస్ట్‌లెస్ కలెక్టివ్’ మ్యూజిక్ బ్యాండ్‌ను ఏర్పాటు చేసినట్లు రంజిత్ తెలిపారు. ఈ బ్యాండ్ తన మొదటి కచేరీని చెన్నైలోని కిల్పాక్‌లో జనవరి ఆరో తేదీన ఏర్పాటు చేయగా, ప్రేక్షకుల నుంచి మంది స్పందన వచ్చింది. ఆ నాటి కచేరీకి దాదాపు నాలుగువేల మంది ప్రేక్షకులు హాజరయ్యారు. కుల రహిత సమాజమే ప్రాతిపదికగా సొంతంగా బ్యాండ్ సభ్యుడు రాసిన పాటనే కచేరీలో పాడగా హర్షధ్వానాలు మిన్నంటాయి. ఈ బ్యాండ్ పాడిన పాటలు ఇప్పుడు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment