నెల రోజులు ఇంటర్నెట్ సేవలు బంద్
శ్రీనగర్: రాష్ట్రంలో హింసకు కారణమవుతున్న తీవ్రవాదులు, అసాంఘిక శక్తులను నియంత్రించేందుకు జమ్మూకాశ్మీర్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇటీవలి కాలంలో సోషల్ మీడియా వెబ్‌సైట్లు, వాట్సాప్ గ్రూపుల ద్వారా రాష‍్ట్రంలో గొడవలు సృష్టించిన వారిపై కొరడా ఝళిపించింది. నెల పాటు మోబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. వేర్పాటు వాదులకు ఆసరాగా నిలుస్తున్న 22 సోషల్ వెబ్‌సైట్లను నిలిపివేసింది. మళ్లీ ఉత్తర్వులు వెలువరించేందాకా ఈ నిషేదాజ్ఞలు అమల్లో ఉంటాయని తెలిపింది.
శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్‌కే గోయల్ వెల్లడించారు. అసాంఘిక శక్తులను, జాతి వ్యతిరేక వాదులను కట్టడిచేసేందుకు ఇంటర్‌నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసినట్లు వివరించారు. రాష్ట్రంలో అల్లర్లకు కారణమవుతూ అసత్యాలను, తప్పుడు వార్తలను పంపుతున్న 350వాట్సాప్ గ్రూపులను గుర్తించిన అధికారులు ఇప్పటికే 90 శాతం వరకు మూసివేయించారు. ఈనెల 17వ తేదీన కూడా ప్రభుత్వం మోబైల్ ఇంటర్నెట్ సేవలను నిలుపుచేసింది.