ఇంటర్నెట్‌ కోసం 100కి.మీ. వెళ్తున్నారు! | Internet Express : Kashmiris Travel 100KM For Internet | Sakshi
Sakshi News home page

‘ఇంటర్నెట్‌ ఎక్స్‌ప్రెస్‌’ల్లో రద్దీ

Published Tue, Jan 14 2020 3:42 PM | Last Updated on Tue, Jan 14 2020 7:08 PM

Internet Express : Kashmiris Travel 100KM For Internet - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : సుప్రీం కోర్టు ఆదేశించినప్పటికీ జమ్మూ కశ్మీర్‌లో ఇప్పటికీ బ్రాడ్‌బ్యాండ్, మొబైల్‌ నెట్‌ సర్వీసులను ప్రభుత్వం పునరుద్ధరించకపోవడంతో దాదాపు వెయ్యిమంది కశ్మీరీలు ప్రతిరోజు సుమారు వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న బనిహాల్‌ పట్టణానికి రైల్లో వెళుతున్నారు. దీంతో ప్రతి రోజూ ఇక్కడి రైళ్లు కిక్కిరిసిపోతున్నాయి. కేవలం నాలుగువేల మంది జనాభా కలిగిన బనిహాల్‌ పట్టణంలో బ్రాడ్‌బ్యాండ్‌ సర్వీసు కలిగిన ఆరు ఇంటర్నెట్‌ కేఫ్‌లు నడుస్తున్నాయి. ఈ కేఫ్‌లు ఒక్కో వినియోగదారుడి నుంచి గంటకు మూడు వందల రూపాయల చొప్పున వసూలు చేస్తున్నాయి.



ఎక్కువగా ఈ కేఫ్‌లకు విద్యార్థులు, ఉద్యోగం వేటలో ఉన్న నిరుద్యోగులు, ఆదాయం పన్ను శాఖ అధికారులు వస్తున్నారని కేఫ్‌ యజమానులు తెలిపారు. ‘ఉద్యోగం కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి వచ్చాను. ఈ అవకాశాన్ని నేను వదులుకోలేను’ అని కశ్మీర్‌ నుంచి బనిహాల్‌ పట్టణానికి వచ్చిన అహ్మద్‌ తెలిపారు. పరీక్షలకు సంబంధించిన మెటీరియల్‌ కోసం ఎక్కువగా ఇంటర్నెట్‌ కేఫ్‌లను ఆశ్రయించాల్సి వస్తోందని విద్యార్థులు తెలిపారు. ఆన్‌లైన్‌ ద్వారా ఉద్యోగం చేసే వారు కూడా ఈ కేఫ్‌లపైనే ఆధారపడుతున్నారు. మరికొన్ని రోజుల్లో కశ్మీర్‌ అంతటా ఇంటర్నెట్‌ సర్వీసులను పునరుద్ధరించకపోయినట్లయితే తాను ఉద్యోగాన్ని కోల్పోవాల్సి వస్తుందని కశ్మీర్‌ కొరియర్‌ సర్వీసులో పనిచేస్తున్న తౌసీఫ్‌ అహ్మద్‌ తెలిపారు. తమ కంపెనీలో ఇప్పటికే 50 మంది యువకులు ఉద్యోగాలు కోల్పోయారని తెలిపారు.



కశ్మీర్‌కున్న ప్రత్యేక హోదాను రద్దు చేసి, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన గత ఆగస్టు ఐదవ తేదీ నుంచి ఇంటర్నెట్‌ సర్వీసులను రద్దు చేసిన విషయం తెల్సిందే. ఫలితంగా రాష్ట్రంలో ఐదు లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారని కశ్మీర్‌ పరిశ్రమల మండలి ఉపాధ్యక్షుడు అబ్దుల్‌ మజీద్‌ మీర్‌ తెలిపారు. ప్రధానంగా పర్యాటకులపై ఆధారపడి బతుకుతున్న దాల్‌ లేక్‌ బోటు యజమానులు నాలుగువేల మంది ఉపాధి కోల్పోయారు. ఇంటర్నెట్‌ సర్వీసుల రద్దు వల్ల వివిధ పరిశ్రమలకు ఇప్పటికే దాదాపు 250 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. ఇంటర్నెట్‌ సర్వీసులు పౌరుల ప్రాథమిక హక్కుంటూ 2016లోనే ఐక్యరాజ్య సమతి ప్రకటించినప్పటికీ, వారం రోజుల్లో కశ్మీర్‌లో ఈ సర్వీసులను పునురుద్ధరించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం పరిధిలో పనిచేస్తున్న రాష్ట్ర అధికార యంత్రాంగం ఇప్పటికీ స్పందించలేదు. దీంతో కశ్మీరీలకు ‘ఇంటర్నెట్‌ ఎక్స్‌ప్రెస్‌’గా వ్యవహరిస్తున్న బనిహాల్‌ పట్టణానికి తీసుకెళ్లే రైళ్లే గతి అవుతున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement