న్యూఢిల్లీ: కేంద్రపాలిత ప్రాంతం జమ్ముకశ్మీర్ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి.. ఆరేళ్ల తర్వాత జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో తొలిరోజే గందరగోళం నెలకొంది. నేటి సమావేశంలో భాగంగా పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ(పీడీపీ) ఎమ్మెల్యే వహీద్ పారా ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకిస్తూ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
పుల్వామా నుంచి అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహిస్తున్న పారా.. జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక హోదా కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు కొత్తగా ఎన్నికైన స్పీకర్ అబ్దుల్‌రహీమ్ రాథర్‌కు తీర్మానాన్ని సమర్పించారు. అయిదు రోజుల అసెంబ్లీ సెషన్ ఎజెండాలో ఈ అంశం లేకపోయినప్పటికీ ప్రజల కోరకు మేరకు స్పీకరర్‌గా తన అధికారాలను ఉపయోగించి దీనిపై చర్చించాలని ఆయన కోరారు.
అయితే ఈ తీర్మానంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ బీజేపీ సభ్యులు ఆందోళన చేపట్టారు. దీనిని అనుమతించకూడదని కాషాయ పార్టీకి చెందిన 28 మంది ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. అసెంబ్లీ నిబంధనలకు విరుద్ధంగా తీర్మానం తీసుకొచ్చినందుకు పారాను సస్పెండ్ చేయాలని బీజేపీ ఎమ్మెల్యే షామ్ లాల్ శర్మ డిమాండ్ చేశారు. నిరసన తెలుపుతున్న సభ్యులు తమ స్థానాల్లో కూర్చోవాలని స్పీకర్ పదేపదే అభ్యర్థించినప్పటికీ వారు తమ ఆందోళనను కొనసాగించారు. దీంతో కాసేపు అసెంబ్లీలో రగడ చోటుచేసుకుంది.
అనంతరం అధికారిక నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీకి చెందిన స్పీకర్ రహీమ్ రాథర్ మాట్లాడుతూ.. ఆర్టికల్ 370 రద్దు లాంటి తీర్మానాన్ని తాను ఇంకా అంగీకరించలేదని చెప్పారు. ఈ తీర్మానానికి ప్రాధాన్యత లేదని సీఎం ఒమర్ అబ్దుల్లా కూడా తేల్చిచెప్పారు. సభ ఎలా జరగాలనేది, ఏం చర్చించాలనే ఏ ఒక్క సభ్యులచే నిర్ణయించరాదని అన్నారు. 2019 ఆగస్టు 5న తీసుకున్న ఆర్టికల్ 370ని రద్దు నిర్ణయాన్ని జమ్ముకశ్మీర్ ప్రజలు ఆమోదించడం లేదని అన్నారు. అయితే రాష్ట్ర పునరుద్దరణకు తమ ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తుందని తెలిపారు.
ఇదిలా ఉండగా 2019లో జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని కేంద్రం రద్దు చేసింది. దీంతో, ఆ ప్రాంతం రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడిపోయింది. జమ్మూకశ్మీర్‌కు తిరిగి రాష్ట్ర హోదా కల్పించాలని ఫరూక్ అబ్దుల్లా నేతృత్వంలోని నేషనల్ కాన్ఫరెన్స్ డిమాండ్ చేస్తోంది. జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని కేంద్రాన్ని కోరుతూ ఇటీవల ఒమర్ మంత్రివర్గం తీర్మానం చేసింది. దానికి లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఆమోదం కూడా తెలిపారు. ఈ పునరుద్ధరణ ప్రక్రియను ప్రారంభించే యోచనలో కేంద్రం ఉందని, ఈమేరకు హామీ లభించిందని ప్రచారం జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment