న్యూఢిల్లీ : జమ్మూకశ్మీర్‌లో సరైన సమయంలో ఇంటర్‌నెట్ సేవలను పునరుద్ధరిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా బుధవారం రాజ్యసభలో తెలిపారు. పొరుగు దేశం కార్యకలాపాలను పరిగణనలోకి తీసుకొని.. ఆచితూచి ఈ విషయంలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కాంగ్రెస్ నాయకుడు గులాం నబీ ఆజాద్ అడిగిన ప్రశ్నకు ఈ మేరకు ఆయన సమాధానం ఇచ్చారు.
‘ నేడు ఇంటర్‌నెట్ ముఖ్యమైన కమ్యూనికేషన్ సాధనంగా మారిన విషయాన్ని నేను అంగీకరిస్తాను. కానీ ఏది ముఖ్యం భద్రతనా? ఇంటర్‌నెట్టా? ప్రాధాన్యాలను నిర్ణయించాలి’ అని షా అభిప్రాయపడ్డారు. కశ్మీర్ లోయలో ఇప్పటివరకు ఎన్ని స్కూళ్లు తెరుచుకున్నాయో వివరంగా సభకు వివరించిన అమిత్ షా.. జమ్మూకశ్మీర్ ఇప్పుడు పూర్తిగా సాధారణ స్థితిలో ఉంది. ఔషధాలు అందుబాటులో ఉన్నాయి. స్కూళ్లు తెరుచుకున్నాయి.గత ఆగస్టు 5 నుంచి పోలీసు కాల్పుల్లో ఒకరు కూడా మరణించలేదు’ అని తెలిపారు. కశ్మీర్‌లో అన్ని దినపత్రికలు వస్తున్నాయి. అన్ని టీవీ చానెళ్లు పనిచేస్తున్నాయి. బ్యాంకులన్నీ సేవలందిస్తున్నాయి’ అని వివరించారు.
‘మొత్తం 20411 పాఠశాలలు తెరుచుకున్నాయి. 99.48శాతం తొమ్మిదో తరగతి విద్యార్థులు, 99.7శాతం పదో తరగతి, ఇంటర్ విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. మొత్తం 195 పోలీసు స్టేషన్ల పరిధిలో సెక్షన్ 144తోపాటు ఇతర ఆంక్షలను ఎత్తివేశాం. గత ఏడాది 802 రాళ్లు విసిరిన ఘటనలు చోటుచేసుకోగా.. ఈ ఏడాది అవి ఇప్పటివరకు 544 మాత్రమే జరిగాయి. శ్రీనగర్‌లోని ఆస్పత్రుల్లో 7.66 లక్షలమంది రోగులు ఓపీడీ సేవలను వినియోగించుకున్నారు. కశ్మీర్‌లో వైద్య సేవలకు ఎలాంటి ఆటంకం లేదని ఇది చాటుతోంది’ అని అమిత్ షా రాజ్యసభకు వివరించారు. గత ఆగస్టు 5వ తేదీన జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని కేంద్రం రద్దు చేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment