త్రిపుర సీఎం విప్లవ్‌కుమార్ దేవ్ (ఫైల్‌ఫోటో)
గౌహతి : త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్ దేవ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బ్రిటిషర్లకు వ్యతిరేకంగా రవీంద్రనాథ్ ఠాగూర్ నోబెల్ బహుమతిని వెనక్కిఇచ్చేశారని అన్నారు. ఉదయ్‌పూర్‌లో జరిగిన రవీంద్ర జయంతి కార్యక్రమంలో పాల్గొన్న విప్లవ్ దేవ్ ఈ వ్యాఖ్యలు చేశారు. 1919లో జలియన్‌వాలాబాగ్ ఊచకోతకు నిరసనగా ఠాగూర్ తనకు బ్రిటన్ ప్రకటించిన సర్ టైటిల్‌ను నిరాకరించారు. 1913లో ఠాగూర్‌కు సాహిత్యంలో ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతి లభించింది.
కాగా బీర్భంలోని శాంతినికేతన్ విశ్వభారతి యూనివర్సిటీ మ్యూజియం నుంచి ఆయన నోబెల్ బహుమతి, సైటేషన్ 2004లో చోరీకి గురైంది. దీనిపై అప్పటి బెంగాల్ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య సీబీఐకి కేసును అప్పగించగా, తగిన ఆధారాలు లేవంటూ 2009లో కేసును మూసివేసింది. 2009లో విచారణను మూసివేసిన క్రమంలో చోరీ కేసును పశ్చిమ బెంగాల్ దర్యాప్తు ఏజెన్సీకి ఎందుకు అప్పగించడం లేదంటూ కోల్‌కతా హైకోర్టు 2017లో సీబీఐని ప్రశ్నించింది.
మరోవైపు విప్లవ్ దేవ్ గతంలోనూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. సివిల్ ఇంజనీర్లే సివిల్ సర్వీసు పరీక్షలు రాయాలని వ్యాఖ్యానించారు. మరో సందర్భంలో యువత ప్రభుత్వ ఉద్యోగాల కోసం వేచిచూడకుండా పాన్ షాపులు పెట్టుకోవాలని చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న విప్లవ్ దేవ్‌ను ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షా ఢిల్లీకి పిలిపించుకుని మందలించినా పరిస్థితిలో మార్పు లేకపోవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment