గల్లీ నాయకులకే ఈ రోజుల్లో కోట్లు విలువ చేసే భవంతుల్లో ఉంటుంటే.. ఒక రాష్ట్రానికి 20 సంవత్సరాలకు పైగా ముఖ్యమంత్రిగా సేవలందించిన మాణిక్ సర్కార్ మాత్రం పార్టీ ఆఫీసునే తన ఇంటిగా మార్చుకున్నారు. త్రిపురను రెండు దశాబ్దాలుగా ఏలి, అసాధారణ సీఎంగా పేరు తెచ్చుకున్న మాణిక్, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చేతిలో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఈ ఓటమి అనంతరం తన స్వగృహాన్ని పార్టీ ఆఫీసులోకి మార్చుకున్నారు. రెండు రోజుల క్రితమే మాణిక్ తన పుస్తకాలు, వస్తువులను పార్టీ ఆఫీసులోకి మార్చుకున్నారని ఆఫీస్ సిబ్బంది తెలిపారు. పార్టీ ఆఫీసు గెస్ట్ హౌస్‌లో తన భార్య పంచాలి భట్టాచార్యతో కలిసి సింగిల్ రూమ్‌లో నివాసం ఉంటున్నట్టు పార్టీ కార్యదర్శి బిజాన్ ధార్ చెప్పారు. మార్క్స్-ఎంగెల్స్ సరణిలో ఉన్న త్రిపుర ముఖ్యమంత్రి అధికారిక నివాసాన్ని మాణిక్ సర్కార్ గురువారం సాయంత్రం ఖాళీ చేశారని.. దీనికి 500 మీటర్ల దూరంలో ఉండే మెలార్మత్‌లో దశరత్ దేవ్ భవన్ పార్టీ కార్యాలయానికి సిఫ్ట్ అయ్యారని తెలిపారు.
పార్టీ ఆఫీసు కిచెన్‌లో వండే వంటనే ఆయనే తింటున్నారని సీపీఐ(ఎం) ఆఫీసు కార్యదర్శి హరిపద దాస్ చెప్పారు. ఇప్పటికే ఆయన పలు పుస్తకాలను, వస్త్రాలను, కొన్ని సీడీలను పార్టీ ఆఫీసుకు ఇచ్చేశారని, కొత్త ప్రభుత్వం ఆయనకు క్వార్టర్ ఇచ్చాక, మాణిక్ అక్కడికి సిఫ్ట్ అవుతారని తెలిపారు. మార్క్సిస్ట్ సాహిత్యానికి చెందిన పుస్తకాలను, నవలలను తాను కూడా పార్టీ ఆఫీసు లైబ్రరీకి, అగర్తలలో ఉన్న బిర్‌చంద్ర సెంట్రల్ లైబ్రరీకి విరాళంగా అందించినట్టు మాణిక్ భార్య చెప్పారు. సాధారణ కమ్యూనిస్టుగా ఉండే మాణిక్ సర్కార్, 20 ఏళ్లు నిరంతరాయంగా త్రిపురను పాలించిన సంగతి తెలిసిందే. ప్రజలే తన బిడ్డలనుకున్న ఆయన, తనకు సంతానం కూడా వద్దనుకున్నారు. మాణిక్ భార్య పంచాలి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి. కృష్ణనగర్ ప్రాంతంలో ఆమెకు చిన్న ఫ్లాట్ మాత్రమే ఉంది. ఈ ఫ్లాట్‌లోనే ఆమె సోదరీమణులు కూడా ఉంటున్నారు. అయితే మాణిక్ అక్కడ నివసించడానికి విముఖత వ్యక్తం చేయడంతో, ప్రస్తుతం పార్టీ కార్యాలయంలో వారు నివాసముంటున్నారు. దేశంలో అత్యంత తక్కువ ఆస్తులు కలిగిన ముఖ్యమంత్రి మాణిక్ సర్కారే.
Comments
Please login to add a commentAdd a comment