అగర్తల: త్రిపుర టీఎంసీ అధ్యక్షుడు సుబల్ భౌమిక్‌కు షాక్ ఇచ్చారు ఆ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ. ఆయనను పదవి నుంచి తప్పించారు. టీఎంసీ అధికారిక ట్విట్టర్ ఖాతా బుధవరం ఉదయం ఇందుకు సంబంధించిన ప్రకటన విడుదల చేసింది. అయితే సుబల్ భౌమిక్‌ను అధ్యక్ష బాధ్యతల నుంచి ఎందుకు తప్పించారనే విషయంపై మాత్రం ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. నూతన అధ్యక్ష బాధ్యతలు ఎవరికి అప్పగిస్తారనే విషయంపై కూడా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.
ఇకపై త్రిపురలో టీఎంసీ కార్యకలాపాలను రాష్ట్ర ఇన్‌ఛార్జ్ రాజీవ్ బెనర్జీ, పార్టీ రాజ్యసభ ఎంపీ సుష్మితా దేవ్ చూసుకోనున్నారు. అయితే త్రిపుర టీఎంసీ రాష్ట్ర కమిటీ, యూత్ కమిటీ, మహిళా కమిటీ, ఎస్సీ సెల్, ఎస్టీ సెల్ సభ్యులు తమ పదవుల్లో యథావిధిగా కొనసాగుతారని టీఎంసీ ప్రకటన పేర్కొంది.
కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే అయిన సుబల్ భౌమిక్ గతేడాది జులైలో టీఎంసీలో చేరారు. ఈ ఏడాది ఏప్రిల్ 29న ఆయను త్రిపుర టీఎంసీ అధ్యక్షుడిగా నియమించారు మమతా బెనర్జీ. మూడు నెలలకే ఆయనను పదవి నుంచి ఎందుకు తప్పించారనే విషయం చర్చనీయాంశమైంది.
అయితే సుబల్ భౌమిక్ బీజేపీలో చేరుతారాని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై ఆయన ఆ పార్టీతో సంప్రదింపులు జరుపుతున్నారని తెలుస్తోంది. మొదట బీజేపీలోనే ఉన్న ఆయన ఆ తర్వాత కాంగ్రెస్, గతేడాది టీఎంసీలోకి మారారు. మళ్లీ సొంత గూటికే వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలోనే ఆయనను మమత అధ్యక్ష పదవి నుంచి తొలగించి ఉంటారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
చదవండి: మరో ఐదారేళ్లలో బీజేపీ ఖేల్ ఖతం.. ఏఐయూడీఎఫ్ ఎమ్మెల్యే జోస్యం
Comments
Please login to add a commentAdd a comment