విలేకరులతో మాట్లాడుతున్న సీతారాం ఏచూరి. చిత్రంలో తమ్మినేని వీరభద్రం
సాక్షి, హైదరాబాద్: మూడు రోజులపాటు కొనసాగే సీపీఎం కేంద్ర కమిటీ సమావేశాలు శుక్రవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞానకేంద్రంలో ప్రారంభమయ్యాయి. సమావేశాలకు ఆ పార్టీ ప్రధానకార్యదర్శి సీతారాం ఏచూరి, కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్, త్రిపుర మాజీ సీఎం మాణిక్ సర్కార్, పొలిట్ బ్యూరో సభ్యులు ప్రకాశ్ కారత్, బీవీ రాఘవులు, బృందాకారత్‌తోపాటు మిగతా పొలిట్‌బ్యూరో, కేంద్ర కమిటీ సభ్యులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా తనను కలిసిన విలేకరులతో ఏచూరి మాట్లాడుతూ తమ పార్టీ అఖిల భారత మహాసభలను ఏప్రిల్‌లో కేరళలోని కన్నూర్‌లో నిర్వహిస్తామన్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న కేంద్ర కమిటీ సమావేశాల్లో రాజకీయ ముసాయిదాపై చర్చిస్తామని, అనంతరం ప్రజలకు విడుదల చేస్తామని చెప్పారు. దీనికి సంబంధించిన సూచనలు, సవరణలు, అభిప్రాయాలను తమ పార్టీ సభ్యులందరూ కేంద్ర కమిటీకి తెలపొచ్చని అన్నారు.
ఇందుకోసం నెలరోజుల గడువు ఇస్తామని, ఇది సీపీఎం అంతర్గత ప్రజాస్వామ్యమని వివరించారు. సవరణల అనంతరం అఖిల భారత మహాసభలో రాజకీయ నివేదికను ప్రవేశపెడతామని తెలిపారు. త్వరలో జరగబోయే రాష్ట్రాల ఎన్నికల్లో అనుసరించబోయే వ్యూహంపై కూడా కేంద్ర కమిటీలో చర్చిస్తామని ఏచూరి ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ తెలంగాణ మలయాళీ అసోసియేషన్ శనివారం హైదరాబాద్‌లో నిర్వహించతలపెట్టిన సభ కోవిడ్ నిబంధనల దృష్ట్యా రద్దయిందని, అయితే ఇక్కడి కేరళవాసులు విజ్ఞప్తి మేరకు అదే రోజు సాయంత్రం ఆరు గంటలకు కేరళ సీఎం పినరయి విజయన్ వర్చువల్ పద్ధతిలో ప్రసంగించనున్నారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment