
సమస్యల పరిష్కారంలో వైఫల్యం: మాణిక్ సర్కార్
కేంద్రంలో మోదీ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను అమలు చేస్తోందని, ఎన్నికల హామీలను నెరవేర్చడంలో ఘోరంగా విఫలమైందని త్రిపుర సీఎం మాణిక్ సర్కార్ ధ్వజమెత్తారు.
* మోదీ సర్కార్‌పై ధ్వజమెత్తిన త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్
* రాజకీయాల్లో వామపక్షాలే ప్రత్యామ్నాయమని వ్యాఖ్య
* సీపీఎం కేంద్ర కమిటీ సమావేశాల్లో మాణిక్ సర్కార్‌కు సన్మానం
* తెలంగాణలో పార్టీని బలోపేతం చేయాలని నేతల పిలుపు
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలో మోదీ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను అమలు చేస్తోందని, ఎన్నికల హామీలను నెరవేర్చడంలో ఘోరంగా విఫలమైందని త్రిపుర సీఎం మాణిక్ సర్కార్ ధ్వజమెత్తారు. కేంద్రం అనుసరిస్తున్న విధానాల ను ఆయన తూర్పారబట్టారు. వామపక్ష, ప్రజాతంత్ర శక్తులే దేశానికి రాజకీయ ప్రత్యామ్నాయాన్ని అందించగలవని విశ్వాసం వ్యక్తంచేశారు. హైదరాబాద్‌లోని ప్రగతినగర్‌లో జరుగుతున్న సీపీఎం కేంద్ర కమిటీ సమావేశాల్లో భాగంగా ‘‘మోదీ ప్రభుత్వ పాలన-ప్రజలపై ప్రభావం’’ అనే అంశంపై మంగళవారం జరిగిన సదస్సులో మాణిక్‌సర్కార్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయనను పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సీతారాం ఏచూరి, పార్టీ రాష్ర్ట కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తదితరులు సన్మానించారు.
ధరల త గ్గింపు, వ్యవసాయ సంక్షోభ నివారణ, రైతు ఆత్మహత్యల నివారణ, నిరుద్యోగ సమస్యను అధిగమించడం, నల్లధనాన్ని దేశానికి రప్పించడం వంటి అంశాల్లో కేంద్రం విఫలమైందని మాణిక్‌సర్కార్ విమర్శించారు. ఈ విషయాల్లో కేంద్రం శ్రద్ధ చూపడం లేదన్నారు. ఉపాధిహామీని నిర్వీర్యం చేసి పేదల పొట్టగొడుతున్నారని ధ్వజమెత్తారు. బీజేపీ వల్ల మతతత్వం పెరిగే ప్రమాదం ఏర్పడిందని ఆయన వ్యాఖ్యానించారు. కొత్త రాష్ట్రం తెలంగాణలో సీపీఎంను బలోపేతం చేసేందుకు సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కేంద్రం ఎన్ని సమస్యలను సృష్టించినా త్రిపుర ప్రజలు ఏమాత్రం తలవంచరని ఆయన అన్నారు. ప్రభుత్వరంగ సంస్థల్లో వాటాను కేంద్రం విచ్చలవిడిగా అమ్ముతోందని, ఇప్పటికే రూ.48 వేల కోట్లమేర వాటాలను అమ్మాలని నిర్ణయించిందని ఆరోపించారు.
సంపన్నులకు రూ. 5 లక్షల కోట్ల మేర రాయితీలు ఇచ్చి పేదలను మాత్రం తీవ్ర సమస్యల్లోకి నెడుతోందన్నారు. కాగా, కేంద్రం అడ్డదారుల్లో ఆర్డినెన్స్‌లను తీసుకొచ్చిందని సీతారం ఏచూరి ధ్వజమెత్తారు. రాజకీయ స్వార్థం కోసం మత ఘర్షణలను పెంచి పోషిస్తున్నారంటూ ఎన్డీయే నేతలపై మండిపడ్డారు. తెలంగాణ రైతాంగ పోరాట కాలంలో 4 వేల గ్రామాలను పాలించిన చరిత్ర కమ్యూనిస్టులదని, దీన్ని పునరావృతం చేయాల్సిన అవసరం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. నిజాం నవాబు బాటలో సీఎం కేసీఆర్ నడవడం దారుణమని సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. నిరంకుశ పాలనతో 4 వేల మందిని చంపిన నిజాంను కీర్తించడమంటే తెలంగాణను అవమానించడమేనన్నారు. తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు ప్రజలు తోడ్పాటునందించాలని కోరారు.