సాక్షి, హైదరాబాద్: కేంద్రంలో మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో దేశంలో సామాన్యుడు జీవించే పరిస్థితి లేకుండా పోయిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆందోళన వ్యక్తం చేశారు. ధరాభారంతో సగటు పౌరుడు విలవిలలాడుతున్నాడని, సామాన్యులను దోచుకుని కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టే విధంగా పాలన సాగుతోందని ఆయన విమర్శించారు. మోదీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని, అందుకు అన్ని ప్రతిపక్ష పార్టీలు ఐక్య ఉద్యమాన్ని చేపట్టాలన్నారు.
శనివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో వివిధ ప్రతిపక్ష పార్టీల నేతలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఈనెల 22న ఉదయం 11గంటలకు ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా నిర్వహిస్తున్నట్లు తమ్మినేని వెల్లడించారు. అదేవిధంగా 27న సంయుక్త కిసాన్ మోర్చా తలపెట్టిన భారత్‌బంద్‌ను విజయవంతం చేయాలని కోరారు. టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి మాట్లాడుతూ 18న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించి కార్యాచరణ ప్రకటించనున్నట్లు చెప్పారు. టీజేఎస్ అధ్యక్షుడు కోదం డరాం మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment