అదే రోజు రాష్ట్రానికి చెందిన మరో ఆరుగురు ఎంపీలకూ సత్కారం
8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, రాజ్యసభ సభ్యునికి కూడా
‘సెల్యూట్ తెలంగాణ’ పేరిట సన్మాన కార్యక్రమం
బేగంపేట నుంచి నాంపల్లి పార్టీ కార్యాలయం వరకు ర్యాలీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి చెందిన ఇద్దరు కేంద్రమంత్రులు, మరో ఆరుగురు బీజేపీ ఎంపీల సన్మాన కార్యక్రమంలో స్వల్పమార్పులు చోటుచేసుకున్నాయి. తొలుత ఈ నెల 19న వారికి సన్మాన కార్యక్రమం జరపాలని రాష్ట్ర పార్టీ నిర్ణయించిది. అయితే ఈ కార్యక్రమాన్ని 20 వతేదీ సాయంత్రానికి వాయిదా వేసినట్టుగా పార్టీ ముఖ్య నేతల సమాచారం. ఈ నెల 19న ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన నూతన కేబినెట్ తొలిసమావేశం జరగనుండడంతో ఈ మార్పు జరిగినట్టు తెలుస్తోంది.
ఈ భేటీకి కేబినెట్ మంత్రి హోదాలో బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి తప్పనిసరిగా పాల్గొనాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సన్మాన కార్యక్రమం 19వ తేదీకి బదులు 20వ తేదీకి వాయిదా వేసినట్టు పార్టీవర్గాల సమాచారం. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండిసంజయ్‌కుమార్ 19న నగరానికి చేరుకుని కరీంనగర్‌కు వెళ్తారు. 20వ తేదీ సాయంత్రం తిరిగి ఆయన బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుని, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, మిగతా ఎంపీలతో కలిసి ఓపెన్‌టాప్ జీప్‌లో ర్యాలీగా పార్టీ ఆఫీసుకు చేరుకుంటారని తెలుస్తోంది.
సన్మాన కార్యక్రమం ఇలా...
గురువారం (20న) సాయంత్రం 4గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి నాంపల్లిలోని పార్టీ కార్యాలయం వరకు కేంద్రమంత్రులు, ఎంపీలను ర్యాలీగా తీసుకు రానున్నారు. అనంతరం పార్టీ కార్యాలయం వద్ద ‘సెల్యూట్ తెలంగాణ’పేరిట సన్మాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రం నుంచి గెలిచిన 8 మంది ఎంపీలు, అసెంబ్లీకి గెలిచిన 8 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ ఏవీఎన్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు డా.కె.లక్ష్మణ్ (యూపీ నుంచి ప్రాతినిధ్యం)ను ఘనంగా సన్మానించనున్నారు. బేగంపేట నుంచి ఓపెన్‌టాప్ జీప్‌లలో వారిని కార్యాలయం వరకు వాహనాల కాన్వాయ్‌లో మేళతాళాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో ఊరేగింపుగా తీసుకురానున్నారు.
మోదీకి ధన్యవాద సభ
ఇక రాష్ఠ్రం నుంచి ఎనిమది మంది ఎంపీలను గెలుచుకోవడం పట్ల.. ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలుపుతూ ధన్యవాద సభ నిర్వహించనున్నారు. అనంతరం చార్మినార్ శ్రీభాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. కాగా, కొద్దిరోజుల తర్వాత పార్టీ జాతీయనేతల ఆధ్వర్యంలో, రాష్ట్రంలో పెద్దఎత్తున మోదీ ధన్యవాద సభ’నిర్వహించాలని నిర్ణయించారు. సోమవారం బీజేపీ కార్యాలయంలో జరిగిన రాష్ట్ర పదాధికారు ల, రాష్ట్ర కార్యదర్శుల, జిల్లా అధ్యక్షుల సమావేశంలో ఎంపీలకు స్వాగత ఏర్పాట్లపై చర్చించారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రధా న కార్యదర్శులు (సంస్థాగత) చంద్రశేఖర్ తివారీ, డా.కాసం వెంకటేశ్వర్లు యాదవ్, ఉపాధ్యక్షుడు చింతల రామచంద్రారెడ్డి, వివిధ మోర్చాల అధ్యక్షులు పాల్గొన్నారు.
21న అన్ని మండలాల్లో యోగా డే
కాసం వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడు తూ, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ‘సెల్యూట్ తెలంగాణ’ర్యాలీని విజయవంతం చేయాలని కోరారు. ఈ నెల 21న ఇంటర్నేషనల్ యోగా డేను పురస్కరించుకుని, రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో యోగా దినోత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించామన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో (2028) రాష్ట్రంలో 88 సీట్లలో గెలుపే లక్ష్యంగా ఇప్పటి నుంచే ముందుకు సాగాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్టు కాసం తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment