
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీని తెలంగాణ ప్రజలు ఆదరిస్తున్నారని, అందుకు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలే నిదర్శనమన్నారు కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ఎమ్మెల్సీ ఎన్నికల విజయం.. తెలంగాణ సమాజానికి అంకితమన్న కిషన్ రెడ్డి.. ఈ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు.
‘పదేళ్లు అధికారంలో ఉంటామంటున్న కాంగ్రెస్ కు ఈ ఎన్నికల్లో కర్రకాల్చి వాత పెట్టారు. మా సంస్థాగత ఎన్నికలు కూడా పూర్తి కావొచ్చాయి. రానున్న రెండు నెలల్లో అన్ని కమిటీలు పూర్తి చేసుకుంటాం. రాష్ట్రంలో పూర్తి బలోపేతం దిశగా పని చేస్తాం. అసెంబ్లీలో ఈ ప్రభుత్వాన్ని ప్రజల తరపున అడుగడుగునా ప్రశ్నిస్తాం. తెలంగాణ ప్రజల గుండె చప్పుడు శాసన సభ, శాసన మండలిలో వినిపిస్తాం. త్రిశూలం మాదిరి మండలిలో ముగ్గురు సభ్యులు బీజేపీకి ఉన్నారు . కార్యకర్తల మీద కేసులు, కుట్రలు చేసినా బీజేపీ గెలిచింది. ఈ విజయంతో మేమేమి అతి ఉత్సాహం చూపించడం లేదు, మా బాధ్యత మరింత పెరిగింది.
ఈ ప్రభుత్వం మీద మరింత పోరాడాలని, ప్రశ్నించాలని బాధ్యత పెట్టారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటం చేస్తాం. రాష్ట్రంలో వ డబుల్ ఇంజిన్ సర్కారు రావాల్సిన అవసరం ఉంది బీజేపీ బలపడి తెలంగాణను రక్షించాలి. సేవ్ తెలంగాణ - సపోర్ట్ బీజేపీ మా నినాదం. రెఫరెండం అని ఎవరు అన్నారో వాళ్లే ఆత్మ పరిశీలన చేసుకోవాలి. తెలంగాణ ప్రజల మద్ధతు, ఉపాధ్యాయులు, గ్రాడ్యూయేట్ల, ఉద్యమకారుల సపోర్టుతో గెలిచాం.
ఆ రెండు బీఆర్ఎస్ కాంగ్రెస్సే కలిసాయి కానీ మేము ఎప్పుడు ఎవరిని కలవలేదు. ఎవరిని కలిసే ప్రసక్తే కూడా లేదు. సమస్యలపై ఎవరితోనైనా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నాం . పనికిమాలిన ఆరోపణలు చేస్తే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలాంటి తీర్పు వచ్చిందో అదే రిపీట్ అవుద్ది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న మూడు రాష్ట్రాల్లో ఓడించి తీరుతాం. ఖమ్మం, వరంగల్, నల్గొండ ఉమ్మడి జిల్లాల్లో పార్టీని బలోపేతం చేయడమే మా నెక్స్ట్ టార్గెట్’ అని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment