మోదీని గద్దె దించితేనే ప్రజాస్వామ్య పరిరక్షణ | CPM Jan Chaitanyatra started from Hanumakonda | Sakshi
Sakshi News home page

మోదీని గద్దె దించితేనే ప్రజాస్వామ్య పరిరక్షణ

Published Sat, Mar 18 2023 1:34 AM | Last Updated on Sat, Mar 18 2023 1:34 AM

CPM Jan Chaitanyatra started from Hanumakonda - Sakshi

సాక్షిప్రతినిధి, వరంగల్‌: ‘దేశంలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగహక్కులపై దాడులు జరుగుతున్నాయి.. మతోన్మాద రాజకీయాలు, కార్పొరేట్‌ల దోపిడీతో ప్రజలు అల్లాడుతున్నారు.. నరేంద్రమోదీ ప్రభుత్వాన్ని గద్దె దింపితేనే ప్రజాస్వామ్యం పరిరక్షణ జరుగుతుంది. ప్రగతిశీల శక్తులను కూడగట్టి ప్రజా ఉద్యమాలతోనే హక్కులను సాధించుకుందాం’అని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పిలుపునిచ్చారు. దాడులను తిప్పికొట్టేందుకు ప్రజలు, ప్రజాస్వామికవాదులు సంఘటితం కావాలని కోరారు. శుక్రవారం వరంగల్, హనుమకొండలలో జరిగిన పలు కార్యక్రమాల్లో సీతారాం ఏచూరి పాల్గొన్నారు.

సీపీఎం ఆధ్వర్యంలో ఈ నెల 29 వరకు సాగే రాష్ట్రవ్యాప్త జన చైతన్యయాత్రలను ప్రారంభించారు. కాకతీయ యూనివర్సిటీలో పీవీ నరసింహారావు విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ‘‘చేంజింగ్‌ సినారియో ఆఫ్‌ ఇండియన్‌ ఫెడరలిజం’’అనే అంశంపై నిర్వహించిన సింపోజియంలో మాట్లాడారు. వరంగల్‌లోని అజంజాహి మిల్‌ (ఓ సిటీ) మైదానంలో జరిగిన బహిరంగసభలో సీతారాం ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ కేంద్రం హిందుత్వ ఎజెండాను తెరపైకి తీసుకొస్తుందని, అత్యంత బలమైన కేంద్రంగా రాష్ట్రాల హక్కులను కాలరాస్తూ ఫెడరలిజంను దెబ్బతీస్తుందని ఆరోపించారు. కేంద్రం గవర్నర్ల వ్యవస్థ ద్వారా రాష్ట్రాలపై అధికారం చెలాయిస్తూ, ప్రభుత్వాలను కూలదోసిన ఘటలను ఆయన ఉదహరించారు.  

మోదీ ప్రభుత్వంలో మతోన్మాద రాజకీయాలు, కార్పొరేట్‌ సంస్థల దోపిడీ కవల పిల్లలుగా తయారయ్యాయని విమర్శించారు.  ప్రశ్నించిన వారిపై దేశద్రోహులనే ముద్రవేసి సీబీఐ, ఈడీలతో దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో గవర్నర్‌లను ఉపయోగించుకుంటూ ప్రభుత్వాలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని నిందించారు. సీఎం కేసీఆర్‌ కూతురు ఎమ్మెల్సీ కవిత మద్యం పాలసీలో తప్పు చేసినట్లు  రుజువైతే జైలు శిక్షలు వేసినా తమ పార్టీలు తప్పు పట్టవని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. 

వరంగల్‌ నుంచి ప్రజాచైతన్యయాత్ర ప్రారంభం.. 
రాష్ట్రవ్యాప్తంగా మూడు ప్రజాచైతన్య యాత్రలు ప్రారంభంకానుండగా తొలుత వరంగల్‌లో సీతారాం ఏచూరి శుక్రవారం ప్రారంభించారు. ఇందులో భాగంగా మొదట కాజీపేటనుంచి బైక్‌ర్యాలీ, హనుమకొండ ‘కుడా’మైదానం, వరంగల్‌ జిల్లా ఆజంజాహి మిల్లు మైదానం కేంద్రాల్లో బహిరంగ సభలు నిర్వహించారు. కాగా ఈ యాత్రకు సంఘీభావం తెలుపుతూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు బహిరంగసభలో  ప్రసంగించారు.

కార్యక్రమంలో సీపీఎం కేంద్ర కమిటీ నాయకులు జి.నాగయ్య, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు, కేంద్ర కమిటీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, ఐద్వా రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మి, రాష్ట్ర కమిటీ సభ్యులు జగదీష్, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పాలడుగు భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement