దేశంలో కమ్యూనిజానికి స్థానం లేదు
సాక్షి, హైదరాబాద్: దేశ ప్రజల ఆలోచనకు కమ్యూనిజం సరిపోదని.. ఆ సిద్ధాంతాలకు ఇక్కడ స్థానం లేదని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. కమ్యూనిజానికి ఒకప్పుడు ఆకర్షణ ఉండేదని, ప్రస్తుతం నేషనలిజాన్నే యువత ఆచరిస్తున్నారని పేర్కొన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జయంతి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడారు. దేశం మానవతావాదం వల్లే అభివృద్ధి చెందుతుందని, జాతి పునరుజ్జీవనానికి దీన్‌దయాళ్ ఉపాధ్యాయ ఆనాడే బీజం వేశారని అన్నారు.
అట్టడుగు వర్గాలకు అభివృద్ధి ఫలాలు అందాలని సూచించిన మహనీయుడు దీన్‌దయాళ్ అని కొనియాడారు. ఆయన అడుగు జాడల్లో నడుస్తున్న బీజేపీ వైపు దేశమంతా ఆశగా ఎదురు చూస్తోందని చెప్పారు. కానీ కమ్యూనిస్టులు, కాంగ్రెస్ నేతలు కలిసి
‘సెక్యులరిజం’ అంటూ లేనిపోని ప్రచారాలు చేస్తున్నారని వెంకయ్యనాయుడు విమర్శించారు.కమ్యూనిస్టుసిద్ధాం తాలు మంచివి కాకపోయినా... ఆపార్టీలో పుచ్చలపల్లి సుందరయ్య, చండ్ర రాజేశ్వరరావు వంటి మంచి వ్యక్తులు ఉండేవారన్నారు. ఇప్పుడు కమ్యూనిస్టు పార్టీలకు చాలా రాష్ట్రాల్లో ప్రాతినిధ్యమే లేదన్నారు. ఒక చాయ్‌వాలా దేశ ప్రధానిగా ఎదిగి సూట్ వేసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఓర్వలేకపోతోందని.. మోదీ దేశాన్ని మరో పదేళ్లు పాలిస్తే సమూల మార్పులు తెచ్చి అన్ని వర్గాలకు న్యాయం చేస్తారన్నారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కె.లక్ష్మణ్, ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్, ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు, ఇంద్రసేనారెడ్డి, బద్దం బాల్‌రెడ్డి పాల్గొన్నారు.