మొన్న నవంబర్ 9న రెండు చరిత్రాత్మకమైన పరిణామాలు సంభవించాయి. అయోధ్య తీర్పు వచ్చింది. కర్తార్‌పూర్ కారిడార్ ప్రారంభం అయింది. ఈ రెండు సందర్భాలలోనూ.. ముప్పై ఏళ్ల క్రితం ఇదే నవంబర్ 9న కుప్పకూలిన బెర్లిన్ గోడ ప్రస్తావన మన ప్రధాని నోటి నుంచి, పాక్ విదేశాంగ మంత్రి నోటి నుంచి వచ్చింది! బెర్లిన్ గోడలా అయోధ్య తీర్పు మనుషుల మధ్య అడ్డుగోడల్ని కూల్చేసిందని మన ప్రధాని అంటే.. బెర్లిన్ గోడలా కర్తార్‌పూర్.. దక్షిణాసియా దేశాల్ని కలుపుతుందని పాక్ మంత్రి అన్నారు. ఈ నేపథ్యంలో బెర్లిన్ గోడ గురించి క్లుప్తంగా కొన్ని వివరాలు, విశేషాలు.
రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జర్మనీ.. రష్యా, ఫ్రాన్స్, యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్‌డమ్‌ల ఆధిపత్యంలోకి వెళ్లింది. రష్యా అధీనంలో ఉన్న జర్మనీలో కమ్యూనిజం, మిగిలిన మూడు ప్రాంతాల్లోని జర్మనీలో క్యాపిటలిజం అభివృద్ధి చెందాయి. ఆ మూడు ప్రాంతాలు సంయుక్తంగా వెస్ట్ జర్మనీగా, మిగిలిన ప్రాంతం ఈస్ట్ జర్మనీగా ఉండిపోయింది. ఈస్ట్ జర్మనీ రాజధాని ఈస్ట్ బెర్లిన్, వెస్ట్ జర్మనీ రాజధాని వెస్ట్ బెర్లిన్ అయింది. క్రమంగా కమ్యూనిస్టు, క్యాపిటలిస్టు ప్రాంతాల మధ్య తీవ్రమైన భేదాలు మొదలయ్యాయి.
ప్రజల ఆదాయ మార్గాలు, జీవనశైలితో సహా అన్నింటిలోనూ వెస్ట్ జర్మనీ మెరుగయింది. క్యాపిటలిస్టుల అదీనంలోని ప్రదేశాలు సుసంపన్నం అయ్యాయి. దాంతో ఈస్ట్ జర్మనీ వాసులు, ఈస్ట్ బెర్లిన్ వాసులు... వెస్ట్ జర్మనీ, వెస్ట్ బెర్లిన్‌ల వైపు దృష్టి సారించారు. వెస్ట్ జర్మనీ కూడా తమ దేశానికి రావాలనుకుంటున్న వాళ్లకు అభ్యంతరం చెప్పలేదు. వెస్ట్ బెర్లిన్ భౌగోళికంగా ఈస్ట్ జర్మనీలో ఉన్నప్పటికీ వెస్ట్ బెర్లిన్ చేరగలిగితే ఆ తర్వాత వెస్ట్ జర్మనీ వాసులుగా స్థిరపడడం సులువయ్యేది. దాంతో ఈస్ట్ జర్మనీవాసులు ఏదో ఒక రకంగా వెస్ట్ బెర్లిన్‌కి చేరేవారు.
గోడను కట్టింది ఎవరు?
రోజూ లక్షల మంది ప్రజలు ఈస్ట్ బెర్లిన్ నుంచి వెస్ట్ బెర్లిన్‌కు వెళ్లేవాళ్లు. ఉద్యోగం, వినోదం ఏదైనా వెస్ట్ బెర్లిన్‌లోనే దొరికేవి. కమ్యూనిస్టు విధానాలు అమలులో ఉన్న ఈస్ట్ బెర్లిన్‌లో వినోదాలు, విలాసాలే కాదు సౌకర్యాలు కూడా సరిగా లేకపోవడంతో మహిళలు షాపింగ్‌కు కూడా వెస్ట్‌కు వెళ్లేవాళ్లు. దీంతో రష్యాలోని కమ్యూనిస్టు పాలకులు వలసలను నిరోధించడానికి గోడ కట్టడమే ప్రత్యామ్నాయం అనుకున్నారు.
మాస్కోలో 1961 ఆగస్టు మూడు నుంచి ఐదవ తేదీ వరకు జరిగిన సమావేశాల్లో ఈ నిర్ణయం తీసుకున్నారు.పన్నెండవ తేదీ రాత్రి సంతకాలయ్యాక 13వ తేదీన నిర్మాణం మొదలైంది. గోడను 12 అడుగుల ఎత్తున కట్టారు. నిత్యం మిలటరీ పహారాలో ఉండే అంత ఎత్తు గోడనూ దాటి వెళ్లడానికి అది కూలేనాటి వరకు ఐదువేల మంది ప్రయత్నించగా వారిలో రెండు వందల మంది తూటాలకు బలయ్యారు. ‘వాళ్లింటికి వెళ్లొద్దు’ అని ఎంత చెప్పినా పౌరులు వినకపోవడంతో అడ్డు గోడ కట్టడమే మార్గం అనుకుంది ప్రభుత్వం.
గోడను పడగొట్టింది ఎవరు?
నిజానికి బెర్లిన్ గోడ పతనం దాని నిర్మాణంతోనే మొదలయింది! అయితే అది పూర్తిగా ధ్వంసం కావడానికి సుమారు మూడు దశాబ్దాల సమయం పట్టింది. బెర్లిన్ గోడకు వ్యతిరేకంగా కొనసాగుతున్న మూకుమ్మడి నిరసన ప్రదర్శనలు 1989 సెప్టెంబర్ చివరినాటికి ముమ్మరమయ్యాయి. పర్యవసానంగా అక్టోబర్ 18న తూర్పు జర్మనీ కమ్యూనిస్టు పార్టీ అధినేత ఎరిక్ హోనేకర్ రాజీనామా చేయవలసి వచ్చింది. కొత్త ప్రభుత్వం పౌరులను పశ్చిమ జర్మనీలోకి అనుమతించడానికి ఒక కొత్త చట్టాన్ని సిద్ధం చేసింది. ఆ చట్టం 1989 నవంబర్ 9 రాత్రి 10.30 గంటలకు అమలులోకి వచ్చింది. బార్న్‌హాల్మర్ స్ట్రాస్ దగ్గర జనం గుమిగూడి సరిహద్దు ద్వారాలను తెరిపించారు.
►ఈస్ట్ బెర్లిన్‌లో వినోదాలు, విలాసాలే కాదు సౌకర్యాలు కూడా సరిగా లేకపోవడంతో మహిళలు షాపింగ్‌కు కూడా వెస్ట్ బెర్లిన్‌కు వెళ్లేవాళ్లు!
Comments
Please login to add a commentAdd a comment