ఆ తల్లి మాటలు... జీవితంలో మరచిపోలేను!
దేవుడు అన్ని చోట్లా ఉండలేక తల్లిని సృష్టించాడంటారు. తల్లికి కూడా దేవుడిలా కనపడేవారే ఈ దేవుళ్లు. మనిషి నాడి సరిగా ఉందా లేదా అని తెలుసుకోడానికి డాక్టరు పేషెంటు పాదాన్ని పట్టుకుంటాడు. అలాంటి దేవుడు డాక్టర్! మనకు ప్రాణసేవ చేయడానికి పాదసేవ కూడా చేస్తాడు. అంత మహోన్నతమైన మనసు డాక్టర్లది. వర్ణం, మతం, కులం, స్తోమతలకు అతీతంగా సేవ చేస్తాడు. అలాంటి ఎందరో మహానుభావులకు ప్రతీకగా ఈ ఇద్దరు. ఇలాంటి వారందరికీ సాక్షి సలాం.
నా ఎంబీబీఎస్‌ను 1964లో పూర్తి చేసుకున్న తర్వాత కమ్యూనిజం పట్ల నాకున్న ఆసక్తితో నెల్లూరులోని డాక్టర్ రామచంద్రారెడ్డి పీపుల్స్ పాలీక్లినిక్‌లో శిక్షణ పొందాను. ఆదర్శ కమ్యూనిస్టు నాయకుడు పుచ్చలపల్లి సుందరయ్యగారి సోదరుడే డాక్టర్ రామచంద్రారెడ్డి. ప్రజావైద్యశాలల కాన్సెప్ట్‌కు ఆద్యుడూ, రూపకర్తా ఆయనే. మంచి వైద్యుడు, ప్రజల డాక్టర్ అని జనంలో ఆయనకు పెద్ద పేరుండేది.
శిక్షణ తర్వాత నల్గొండ జిల్లా సూర్యాపేటలో నేను ప్రజావైద్యశాల ప్రారంభించాను. నా జీవితాన్నే ఒక మలుపు తిప్పిన సంఘటన ఒకటి చెబతాను. మా హాస్పిటల్‌కు వచ్చిన ఒక మహిళ ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలను కన్నది. అప్పటికి అదో సంచలనం. పత్రికల్లోనూ ప్రచురితమైంది. ఆమెలోనూ, ఆ కుటుంబసభ్యుల్లోనూ పేదరికం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. విపరీతమైన రక్తహీనత (అనీమియా)తో బాధపడుతోందామె. ఆ ముగ్గురు పసికందుల ప్రాణాలనూ కాపాడటానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాను నేను. దాదాపు యాభై ఏళ్ల కింద ఆనాటి పరిస్థితుల్లో సూర్యాపేట లాంటి ఒక చిన్న పట్టణంలో ఉన్న అరకొర వైద్యసదుపాయాలతో ఆ పిల్లలను కాపాడటం నా పరిధిలో అసాధ్యమైన విషయం.
అయినా నేను చేయగల ప్రయత్న మంతా చేస్తూనే... హైదరాబాద్‌లోని నీలోఫర్ హాస్పిటల్‌కు తీసుకెళ్తే పిల్లలు తప్పక బతుకుతారనీ, వీలైనంత త్వరగా తీసుకెళ్లమని వారికి సలహా ఇచ్చా. అప్పుడు వారన్న మాటలను నేనెప్పటికీ మరచిపోను ‘‘పేటకు వచ్చే టప్పటికే... మా పానాలు (కను)గుడ్లల్లకొచ్చినయి. ఇక పట్నం యాడబోతం’’ అన్నారు వాళ్లు. ఆ పసికూనలను కాపాడటానికి నేను చేస్తున్న ప్రయత్నం, నేను పడుతున్న ఆరాటం చూసింది ఆ తల్లి. ఇంకా మగత కూడా వీడని తన గొంతుతో ఇలా అంది. ‘‘ఆళ్లని బతికించకయ్యా. ముగ్గురంటే నేను యాడ సాదుతా. నేను సాక లేను సారూ’’ అంది! విషణ్ణ వదనంతో అప్పుడామె అన్న మాటలతో నా కళ్ల నుంచి కన్నీరు చిప్పిల్లింది.
డాక్టర్ అన్నవాడు కేవలం వైద్యం చేయడమే కాదు. సేవాదృక్పథంతో సమాజానికి ఉపయోగడాలి. తన కన్నబిడ్డలు బతికేందుకు అవకాశం కల్పించలేని ఈ వ్యవస్థ కంతా వైద్యం చేయాల్సిందే. బిడ్డలు ఒకవేళ మృత్యుముఖం నుంచి బయటకు వచ్చి మనుగడ సాగిస్తే వారిని సాకలేమేమో అని వారి చావును సైతం ఆహ్వానించింది ఆ తల్లి. అలాంటి ఈ అసమానతలతో ఉన్న, అమానవీయ వ్యవస్థను మార్చాలనీ, ఆత్మగౌరవంతో, సుఖశాంతులతో ఉండే సమాజం కోసం జరిగే కృషిలో మా వైద్యులందరూ భాగస్వాములు కావాలనీ, అదే మా కర్తవ్యం అని తెలుసుకున్నాను.
నేను శిక్షణ పొందిన సమయంలో డాక్టర్ రామచంద్రారెడ్డిగారు చెప్పిన మాటలు మళ్లీ గుర్తుకు వచ్చాయి. ‘‘మీలో ఎంతమంది కమ్యూనిస్టులవుతారో, కమ్యూనిజాన్ని ఎంతగా ఆచరణలో చూపిస్తారో వేరే సంగతి. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి. రేపు మీరు మీ సొంత ప్రాక్టీస్ ప్రారంభిస్తారు కదా. అప్పుడు మన హాస్పిటల్‌కు వచ్చిన ఏ రోగి కూడా తన వద్ద తగినంత పైకం లేదు గనక తనకు వైద్యం దొరకదు అనే నిరాశతో ఎవరూ ఎప్పుడూ తిరిగి వెళ్లకూడదు. మంచి వైద్యునికి వృత్తిలో నిబద్ధత, శస్త్రచికిత్సలో నైపుణ్యం ఎంత అవసరమో, మానవతాదృక్పథంతో ఉండటమూ అంతే అవసరం’’ అని అన్నారాయన. నా జీవితంపై చెరగని ముద్రవేసిన డాక్టర్ రామచంద్రారెడ్డి ఉద్బోధలూ, నా అనుభవంలోకి వచ్చిన సంఘటనల స్ఫూర్తిని నా వైద్యచికిత్సలలో జీవితాంతం కొనసాగించా.
డాక్టర్ ఎ.పి. విఠల్
ప్రజావైద్యశాల వ్యవస్థాపకులు, సూర్యాపేట
ఫోన్: 9848069720