మూడోఫ్రంట్ ముగిసిన ముచ్చట
⇒ వామపక్ష సంఘటనే లక్ష్యం
⇒ సీపీఎం ప్రధాన కార్యదర్శి కారత్ స్పష్టీకరణ
(విశాఖపట్నం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి): ఎన్నికలకోసం పార్టీలను ఏకం చేసే ప్రసక్తే లేదని సీపీఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ స్పష్టం చేశారు. ఎన్నికల ఎత్తుగడలనేవి తాత్కాలికమేగానీ, వాటికోసమే ఏమైనా చేయాలనుకోవట్లేదని తేల్చిచెప్పారు. సమసమాజం, కమ్యూనిజమే అంతిమలక్ష్యంగా పనిచేస్తాం తప్ప స్వల్పకాలిక ప్రయోజనాలకోసం పాకులాడబోమన్నారు. పార్టీ 21వ జాతీయ మహాసభల సందర్భంగా బుధవారమిక్కడ ఏపీ రాష్ట్ర కార్యదర్శి పి.మధుతో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు.
మహాసభలో చేసిన రెండు తీర్మానాల్ని విడుదల చేశారు. భూసేకరణ చట్టసవరణ బిల్లును వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా పోరాటం చేయాలని మహాసభ పిలుపునిస్తూ తీర్మానం చేసింది. మరో తీర్మానంలో అంబేడ్కర్ 125వ జయంతి సందర్భంగా దేశంలోని షెడ్యూల్డ్ కులాల సమస్యలపై చర్చించేందుకు ప్రత్యేక పార్లమెంటు సమావేశాన్ని నిర్వహించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. మీడియా సమావేశంలో కారత్ చెప్పిన అంశాలివీ..
అది గతించిన గతం..: 1998 నుంచి 2008 వరకు మూడో ప్రత్యామ్నాయంకోసం ప్రయత్నించాం. అది సాధ్యం కాదని తేలిపోయింది. అది గతించిన గతం. ఇప్పుడు మాముందున్న తక్షణ కర్తవ్యం వామపక్ష, ప్రజాతంత్ర శక్తుల ఐక్యత. పోరాటాలు, ఉద్యమాల ప్రాతిపదికన అది ఉంటుంది. గతంలోనూ వామపక్ష, ప్రజాతంత్ర శక్తుల ఐక్యసంఘటనకు పిలుపిచ్చాం. కొంతమేర కృషి జరిగింది. మధ్యలో అనేక అభిప్రాయాలొచ్చాయి.
ఇప్పుడు సరిదిద్దుకుంటున్నాం. అందులో తప్పేముంది? వామపక్ష పార్టీల్లో మాది పెద్ద పార్టీ. అంతమాత్రాన మేము చెప్పిందే నడవాలనుకోవట్లేదు. అన్ని వామపక్షాలనూ సంప్రదించాకే భవిష్యత్ కార్యక్రమాన్ని రూపొందిస్తాం. ఇప్పుడున్న ఆరు పార్టీలనే కాదు మరికొన్ని పార్టీలనూ వామపక్ష ఫ్రంట్‌లోకి తేవాలనుకుంటున్నాం.
అంబేడ్కర్ ఇప్పుడెందుకు గుర్తుకొచ్చారనేది అప్రస్తుతం
అంబేడ్కర్ ఇప్పుడెందుకు గుర్తుకొచ్చారనేది అప్రస్తుతం. ఏ పార్టీ ఒకే రీతిలో ఉండదు. మారుతూ ఉంటుంది. మేమూ అంతే. దళితులు, ఆదివాసీలు, బలహీన వర్గాల సమస్యలపై ప్రత్యేక దృష్టిపెట్టాం. దానిలో భాగంగా అంబేడ్కర్ 125వ జయంతి ఉత్సవాలను నిర్వహించాలనుకుంటున్నాం. మా పార్టీ కేంద్రకమిటీలో దళితులు లేరనడంలో నిజం లేదు. మా పొలిట్‌బ్యూరోలో దళితులు లేనిమాట నిజం. నేను కార్యదర్శిగా ఏమి చేశాననేది అప్రస్తుతం. వెనక్కు తిరిగి చూడాలనుకోవట్లేదు.