కమ్యూనిజం, సోషలిజం, లెనినిజంల పోరాటం
రాముడు, కృష్ణుడు, శివుడు, బ్రహ్మ తదితరులు ఒకరిపై మరొకరు పోటీకి దిగారు గతంలో. ఇప్పుడు కమ్యూనిజయం, సోషలిజం, లెనినిజంలు ఒకే లక్ష్యంతో మూకుమ్మడిగా పోరాటం చేస్తున్నారు. మొదటి సంఘటన గతేడాది జరిగిన బిహార్ ఎన్నికల్లో చోటుచేసుకున్నదైతే, తాజాగా 'ఇజాల' పోరాటం తమిళనాడులో జరుగుతోంది. అసలింతకీ ఏమిటీ ఇజమ్స్..?
సేలం జిల్లాకు చెందిన 48 ఏళ్ల మోహన్ కరడుగట్టిన వామపక్షవాది. ఆయన రక్తమేకాదు, మాట, చూపు, పని.. అన్నీ ఎరుపే. ఎరుపు కండువా లేనిదే ఇల్లు కదలడు. తన ముగ్గురు కొడుకులకు కూడా కమ్యూనిజం, సోషలిజం, లెనినిజం అని పేర్లు పెట్టుకున్నాడు. ఏళ్లుగా పార్టీకి చేసిన సేవలను దృష్టిలో పెట్టుకుని భారత కమ్యూనిస్ట్ పార్టీ (సీపీఐ) ఆయనకు వీరపాండి అసెంబ్లీ టికెట్ ఇచ్చింది. తండ్రి విజయం కోసం ఆ ముగ్గురు కొడుకులూ ప్రచారం నిర్వహిస్తున్నారు. పేరులోని వైవిధ్యత ఆ ముగ్గురికీ ఇప్పటికే విస్తృతమైన పరిచయాలున్నాయి. అలా తెలిసిన వాళ్లందరినీ కలిసి, 'కంకి కొడవలి' గుర్తుకు ఓటేయాల్సిందిగా అభ్యర్థిస్తూ తండ్రి విజయానికి కృషిచేస్తున్నారు కమ్యూనిజం, సోషలిజం, లెనినిజంలు.
స్థానికంగా ఉంటూ గడిచిన ఏడాది కాలంగా లాయర్ గా ప్రాక్టీస్ చేస్తున్నాడు మోహన్ పెద్దకొడుకు కమ్యూనిజం. 'వెరైటీగా ఉండే నా పేరంటే నాకు చాలా గర్వం. పేరు చెప్పగానే చాలా మంది ఆశ్చర్యపోతారు. ఎందుకీ పేరు పెట్టారని ఆరాతీస్తారు. మా సీనియర్ లాయర్ నన్ను జూనియర్ గా చేర్చుకున్నది కూడా నా పేరు వల్లే'అని పేరు బలాన్ని మాటల్లో ప్రదర్శిస్తాడు కమ్యూనిజం. ఇక సోషలిజం, లెనినిజంలు ఆభరణాల తయారుచేసే వృత్తిలో కొనసాగుతున్నారు. తండ్రి గెలుపుకోసం ఇజాలు చేస్తున్న పోరాటం తమిళనాడు ఎన్నికల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.