Socialism
-
బాట మార్చుకున్న మానవతావాది
దేశానికి స్వాతంత్య్రం వచ్చాక శాంతి యుత పరివర్తన రావాల్సింది పోయి, ఎక్కడికక్కడ ఉద్యమాలు తలెత్తాయి. కేంద్రం, రాష్ట్రాల నుండి బ్రిటిష్ పాలకులు వైదొలిగారు. కానీ గ్రామీణ వ్యవస్థలు మారలేదు. భూమిపై ఉన్న హక్కులు రద్దు కాలేదు. దాంతో భూస్వాముల వర్గం అన్ని రంగా ల్లోనూ ఎదుగుతూ వచ్చింది. అంబేడ్కర్ భూమిని జాతీయం చేయాలన్నారు. ప్రజాస్వామ్యం ద్వారా సోషలిజాన్ని బహుళ పార్టీ వ్యవస్థలో సాధించడం ఎలాగో రోడ్ మ్యాప్ వేశారు. కానీ అది జరగలేదు. పర్యవ సానంగా ప్రజలు భూమి కోసం ఉద్యమ బాట పట్టారు. ప్రభు త్వాలు సమస్యను పరిష్కరించే బదులు బల ప్రయోగంతో అణిచి వేయాలని చూశాయి.రాజ్యాంగం మహోన్నత లక్ష్యా లతో రాయబడింది గానీ ప్రజలకు దాన్ని అందించలేదు, వివరించలేదు, చదివించలేదు. ఏదో రష్యాలో, చైనాలో గొప్పగా వుందట అని చెపితే జనం నమ్మారు. మార్క్సిజం సిద్ధాంతాలు చెప్తే బాగుందనుకున్నారు. ఆదర్శ సమాజం అనే భావన ఆకర్షించింది. ఆ బాటలో సాగిన గద్దర్ తన ప్రత్యేకతను చాటుకున్నాడు. అంటరాని కులంలో పుట్టి, ప్రభుత్వ హాస్టల్లో ఉండి చదివి, బ్యాంకులో ఉద్యోగం చేసి, తాను నమ్మిన కళ కోసం, సాంస్కృతిక విప్లవం కోసం ఉద్యోగాన్ని వదిలి,దిగంతాలకు ఎదిగిన మహా కళాకారుడయ్యాడు. అరుదైన గాయకుడిగా, ప్రజా కవిగా విప్లవోద్యమానికి ఊపిరులు ఊదాడు. ప్రజా వాగ్గేయ కారుడిగా విశ్వ వ్యాప్తం అవుతూ వచ్చాడు. గద్దర్ ఆట, పాట, కాలి అందెల సవ్వడి జనాన్ని ఉర్రూతలూగించి వేలాదిమంది యువకులను ఉద్యమాల బాట పట్టించింది. భారతదేశ చరిత్రలో ఒక గొప్ప విప్లవో ద్యమానికి ఊపిరులు ఊదిన గద్దర్ ఫలితాలు రాక, విస్తరణ కోల్పోయిన ఉద్యమ దశను కళ్లారా చూశాడు. ఆశలు అడియాసలై, ఆత్మావలోకం చేసుకొని ఉద్యమకారులు అజ్ఞా తంలో ఉండి సాధించేది శూన్యం అని గుర్తెరిగి ప్రజాస్వామ్యం వైపు పరివర్తన చెందాడు.అనుభవం నేర్పిన పాఠాలతో ఉద్యమాల బాట సాధించేది ఏమీలేదనీ, ప్రజాస్వామ్య బాటనే భేష్ అనీ భారత రాజ్యాంగాన్ని ఆలస్యంగా అధ్యయనం చేయడం ప్రారంభించాడు. అప్పటికి జరగరాని నష్టం జరిగిపోయింది. వేలాది మంది యువకులు నేలకొరిగారు. నడిచిన దారి తప్పు అని చెప్తే ఒక బాధ, చెప్పకపోతే ఇంకొక బాధ. ఈ రెండింటి మధ్య గద్దర్ చాలాకాలం నలిగి పోయాడు. ఈలోపు మలి తెలంగాణ ఉద్యమం రాజు కోవడంతో ఉవ్వెత్తున లేచాడు. చంద్రబాబు ప్రభుత్వ కాలంలో గద్దర్‌పై కాల్పులు జరిగాయి. 6 తూటాలు దిగాయి. అయినా తెలంగాణ కోసమే బతికినట్టయింది. ఆ మధ్య ఒక విలేఖరి ఇలా ప్రశ్నించాడు: ‘‘మీరు భారత రాజ్యాంగం, దాని మౌలిక లక్ష్యాలు చదవకుండా, రాజ్యాంగ ఆచరణతో సమాజంలో, జీవితాల్లో వచ్చిన మార్పులు పరిశీ లించకుండా మార్క్సిజం, మావో యిజం కరెక్టు అని ఎలా అనుకున్నారు? సాయుధ విప్లవంలో ఎందుకు చేరారు?’’ ‘‘రాజ్యాంగంలో ఎన్నో గొప్ప విషయాలు ఉన్నాయని మాకె వరూ చెప్పలేదు. సోషలిజం సాయుధ పోరాటంతోనే వస్తుందనుకున్నాం. భారత రాజ్యాంగం చదవకుండా విప్లవం చేయాలనుకోవడం తప్పే. సోషలిస్టు రష్యాలో, పీపుల్స్ చైనాలో ప్రజల హక్కులు, ప్రభుత్వ నిర్వహణ, న్యాయ వ్యవస్థ ఎలా ఉన్నాయో తెలుసుకోకుండా విప్లవం చేయాలనుకోవడం పొరపాటే. అందుకే ఇపుడు భారత రాజ్యాంగ మౌలిక లక్ష్యాల సాధన, రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రజలను చైతన్యవంతం చేస్తున్నాం’’ అని చెప్పాను. గద్దర్ ఆశయం ప్రజాస్వామ్య సోషలిజం సాధన.బౌద్ధం, అంబేడ్కరిజం, భారత రాజ్యాంగ మౌలిక లక్ష్యాల సాధన అంతిమ లక్ష్యం. అంటరానితనం, అసమానతలు, దోపిడీ, మనిషి పై మనిషి ఆధిపత్యం చేసే సంస్కృతి పోవడం గద్దర్‌తో పాటు మన లక్ష్యం కూడా కావాలి. అదే గద్దర్‌కు నిజమైన నివాళి.బి.ఎస్. రాములు వ్యాసకర్త తెలంగాణ బీసీ కమిషన్ తొలి చైర్మన్(నేడు గద్దర్ తొలి వర్ధంతి) -
బ్రేక్ ఇవ్వండి..ఎవరు ఇడియట్స్ అనేది తేలుద్దాం: బైడెన్ ఫైర్
తన విధానాలను సోషలిజంగా పేర్కొంటూ ఇడియట్స్గా ముద్రవేస్తున్నారంటూ మండిపడ్డారు అమెరికా అధ్యక్షడు జో బైడెన్. ఈ మేరకు ఆయన ఇల్లినాయిస్లోని జోలియెట్లో ఒక ప్రాథమిక పాఠశాలలో చేసిన ప్రసంగంలో ఈ వ్యాఖ్యలు చేశారు. తాను చేస్తున్న సామజిక సేవలను విమర్శిస్తూ సోషలిజంగా పేర్కొంటున్నారని అన్నారు. రిపబ్లికన్లు ప్రజలకు సామాజిక భద్రత కల్పించే సేవ కార్యక్రమాలను హరిస్తున్నారంటూ ధ్వజమెత్తారు. ప్రజల హక్కులు, సంక్షేమానికి సంబంధించిన సోషలిజాన్ని మట్టుబెట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. తాను అధ్యక్షుడిగా వచ్చినప్పుడే సోషలిజం సంకేతాలు వినిపించాయి అందుకే దాన్ని ప్రేమించాను అందులోకి వచ్చానని దృఢంగా చెప్పారు. ఐనా రిపబ్లికన్లు సామాజిక భద్రత, వైద్య సంరక్షణ వంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలను నాశనం చేయాలని చూశారంటూ బైడెన్ మాటాల తుటాలు పేల్చారు. కష్టపడి పనిచేయండి, సహకరిచండి అప్పుడు మీకు ఈ విషయాలు సులభంగా అర్థమవుతాయంటూ గట్టి కౌంటరిచ్చారు. ఇవి నిబద్ధతతో కూడిన హామిలు, దీన్ని అమెరికన్ ప్రజలు గుర్తిస్తున్నారు కాబట్టే బాగా పనిచేస్తుంన్నారు. రిపబ్లికన్లను ఉద్దేశిస్తూ...దయచేసి కాస్త బ్రేక్ ఇవ్వండి కచ్చితంగా ఎవరు ఇడియట్స్ అనేది తేలిపోదుంగి అని వ్యగ్యంగా అన్నారు. బైడెన్ వ్యాఖ్యలతో సభా ప్రాంగణం ఒక్కసారిగా నవ్వులు, చప్పట్లతో మారు మ్రోగిపోయింది. (చదవండి: జెలెన్స్కీ తరుపై అసహనం...అత్యాశకు పోతే అంతే!) -
అంబేడ్కర్ చూపుతోనే సోషలిజం!
ఇవ్వాళ కమ్యూనిస్టులైనా, సోషలిస్టులైనా, మత తత్త్వ వాదులైనా అంబేడ్కర్‌ను స్మరించడం సాధారణ దృశ్యమయ్యింది. సంఘ్ పరివార్ శక్తులతోపాటూ... కాంగ్రెస్‌లో ఉన్న హిందూ తత్త్వం ఒంటబట్టించుకున్న అనేక మంది నాయకులూ అంబేడ్కర్ బతికున్న కాలంలోనూ అనేక సందర్భాల్లో ఆయన్ని వ్యతిరేకించినవారే. భారత్‌లో వర్గం అంటే కులమేననీ... కుల వ్యవస్థ నశిస్తే కానీ వర్గ వ్యవస్థ కనుమరుగు కాదనీ, అప్పుడుకానీ సామ్యవాద సమాజ స్థాపన సాధ్యంకాదనీ అంబేడ్కర్ అన్న మాటలను కమ్యూనిస్టులూ, సోషలిస్టులూ పట్టించుకోలేదు. ప్రముఖ సోషలిస్ట్ నాయకుడూ, బీసీ నేత ములాయం సింగ్ యాదవ్ తుది శ్వాస విడిచిన ఈ తరుణంలో మరొకసారి ఈ దిశలో చర్చ జరగవలసిన అవసరం ఉంది. భారతదేశ రాజకీయాల్లో రామ్ మనోహర్ లోహియా ప్రతినిధిగా రాజకీయాల్లో జీవిం చిన ప్రముఖ నాయకుడు ములాయం సింగ్ యాదవ్. అక్టోబర్ 11న ఆయనకు తుది వీడ్కోలు పలకడం భారతదేశానికి ఒక విషాద ఘట్టమే. మహాత్మాగాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ చనిపోయినప్పుడు ఇచ్చిన ప్రాధాన్యత ఒక సోషలిస్ట్ బీసీ రాజకీయ నాయకుడు చనిపోయినప్పుడు ఇవ్వకపోవడం బ్రాహ్మణవాద భావజాలమే ఇంకా నడుస్తుందనడానికి ఒక నిద ర్శనం. ఇది చాలా బాధాకరమైన విషయం. భారతీయ సోషలిస్ట్ విధానాన్ని రూపొందించిన రావ్‌ు మనోహర్ లోహియా ఒక మార్వాడీ కులం నుండి వచ్చారు. కానీ ఆయన బీసీ లకు రాజకీయ అధికారం కావాలని నినదించారు. ఆ స్ఫూర్తి నుండి వచ్చిన వారే లాలూ ప్రసాద్ యాదవ్, శరద్ యాదవ్, రాంవిలాస్ పాశ్వాన్, ములాయం సింగ్ యాదవ్ వంటివారు. ఇంకా ఎందరో రాజకీయ నాయకులు లోహియా ప్రభావంతో రాజకీయాల్లో బ్రాహ్మణవాద రాజకీయాలకు ఎదురు నిలబడ్డారు. ఈరోజు బీజేపీ అనే ఒక పార్టీ ఏర్పడిందంటే ఆరోజు వాళ్ల కాంగ్రెస్‌కు వ్యతిరేక పోరాటాలే అనేది మరువరాదు. మండల్ కమిషన్ నివేదిక అమలు జరపాలని లోహియా స్ఫూర్తితో వీపీ సింగ్ ముందుకు వచ్చేటప్పటికి జనతా పార్టీ చీలిపోయి మతోన్మాద బీజేపీ ఏర్పడింది. కమ్యూనిస్టులు, కార్ల్ మార్క్స్ వర్గ సిద్ధాంతాన్ని భారతదేశానికి అన్వయం చేయలేకపోయారు. అలా అన్వయం చేసి వుంటే భారత దేశంలో నిజమైన వైరుధ్యం కులం అని గుర్తించేవారు. అమానవీయ అస్పృశ్యతా నిర్మూలన ద్వారానే కుల నిర్మూలనా సాధ్యమనే లోహియా వాదులూ దీనిని విస్మరించారు. మొదటి నుండి లోహియా వర్గంలో సోషలిస్టులు అగ్ర వర్ణాలకు సంబంధించినవారే ఎక్కువ. లోహియాకి గాంధీ మీద అపారమైన గౌరవం వుంది. కానీ ఇద్దరి అభిప్రాయాలూ చాలా భిన్నమైనవి. లోహియాకు దేవుడిపై విశ్వాసం లేదు. ఆయన నాస్తికుడు. గాంధీజీ దేవుడు, సత్యం, అంతర్వాణి వంటి విషయాలకు ప్రాధాన్యం ఇచ్చారు. అయినా గాంధీజీతో లోహియా చాలా సన్నిహితంగా మెలుగుతూ వచ్చాడు. 1948 జనవరి 28న గాంధీజీ లోహియాతో ‘నీతో చాలా విషయాలు వివరంగా మాట్లాడాలని వుంది. కానీ నాకు సమయం దొరకటం లేదు. నా గదిలోనే నీవు కూడా పడుకో. మనం రాత్రికి మాట్లాడు కుందాం’ అన్నాడు. లోహియా గాంధీతో పాటు ఆయన గదిలోనే పడుకున్న ప్పటికీ గాంధీజీ లోహియా నిద్రకు భంగం కలిగించలేక పోయాడు. మరుసటి రోజు లోహియాతో గాంధీజీ, ‘నేను చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలని, సోషలిస్టు పార్టీ గురించీ, కాంగ్రెస్ గురించీ ఏదో ఒకటి నిర్ణయించాలని అందువల్ల మరుసటి రోజు (జనవరి 30) సాయంత్రం తప్పకరావాలని’ అన్నాడు. కానీ ఆ రోజే ఆయన మతోన్మాది చేతుల్లో హత్యకు గురైన సంగతి తెలిసిందే. లోహియా అనుచరులంతా ఆయన భావజాలాన్ని తీసుకోలేదు. గాంధీ భావాలే లాలూప్రసాద్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్, ఇతర సోష లిస్టుల్లోనూ ఎక్కువగా వున్నాయి. అందుకే వీరు బీజేపీని ఎదిరించలేక పోతున్నారు. ఇకపోతే అస్పృశ్యుల జీవితాలు చూసి అంబేడ్కర్ తన జీవితంలో ఎన్నోసార్లు కంటతడి పెట్టాడు. ఈ సమాజంలో తన ప్రజలు ఎందుకు అస్పృశ్యులుగా జీవిస్తున్నారు. ఈ హిందువులు కుక్కలకు సబ్బుపెట్టి స్నానం చేయిస్తూ, వాటికి పసుపు రాస్తూ వాటిని గౌరవిస్తూ... సాటి మనిషిని నువ్వు అంటరాని వాడివి అంటూ ఎందుకు హింస చేస్తు న్నారు? అని ఎంతో మథనపడ్డాడు. ఆ మథనం నుండే ఆయన వ్యక్తిత్వం రూపొందింది. కొలంబియా యూనివర్సిటీలో పీహెచ్డీ తీసుకున్న మేధావికి బరోడాలో ఒక మామూలు బంట్రోతు మంచి నీళ్ళు ఇవ్వకుండా నిరాకరించినందుకు ఆయన తపన చెందాడు. ఆ తపన నుండే ఆయన ఉద్యమాన్ని సృష్టించాడు. తన లక్ష్య సాధన కోసం, అస్పృశ్యుల సమస్యలను ప్రభుత్వం ముందు వుంచడం కోసం, వారి కష్టాలను తొలగించడం కోసం ఒక కేంద్ర వ్యవస్థ ఏర్పాటుపై అభిప్రాయాలను తెలుసుకోవడం కోసం 1924 మార్చి 9వ తేదీన బొంబాయిలోని దామోదర్ హాల్లో ఒక సమావేశం ఏర్పాటు చేశారు. తీవ్రమైన చర్చోపచర్చల తర్వాత ఒక వ్యవస్థ ఏర్పాటు చేయాలని తీర్మానించారు. తదనుగుణంగా జూలై 20వ తేదీన ‘బహిష్కృతకారిణి సభ’ను 1860 చట్టం కింద నమోదు చేశారు. దళితుల చరిత్రను రూపొందించడంలో అంబేడ్కర్ త్యాగపూరిత మైన కృషిని నిర్వహించారు. భారత సామాజిక వ్యవస్థలో కులం, అస్పృశ్యత ఎలా ఏర్పడ్డాయో తెలియకుండా భారతదేశంలో నూతన వ్యక్తిత్వ నిర్మాణం జరగడం సాధ్యం కాదు. ఇప్పుడు మనకు కులంలేని మనుషులు కావాలి. కుల జీవితం భారతదేశంలో ఒక నిబద్ధతగా మారిపోయింది. అందుకే అంబేడ్కర్ కులం గురించి తన కుల నిర్మూ లనా గ్రంథంలో ‘హిందూ సమాజం ఒక కులాల సమ్మేళనం. ప్రతి కులమూ అదొక పరిమిత సంస్థ కాగా అందులోకి క్రొత్తవాడికి ప్రవేశం లేదు. ఇతర మతాల వాళ్ళను, జాతులను తమ మతంలో కలుపుకొని తద్వారా తమ మతాన్నీ, తమ సమాజాన్నీ విస్తరింపజేసుకొనే అవ కాశం హిందువులకు లేకుండా పోవడానికి కారణం కేవలం కులవ్యవస్థే’ అని పేర్కొన్నాడు. అంబేడ్కర్‌ను పూర్తిగా వ్యతిరేకించాలనే బీజేపీ వ్యూహం సామాజిక న్యాయం వైపుకు నడవడంలేదు. దళితులపై ద్వేషాన్ని ప్రకటిస్తుంది. ఆవు పేరు చెప్పి ఎంతోమంది దళితులను వేటాడారు. ముస్లివ్ులపై ద్వేషాన్ని కుమ్మరించారు. తేజస్వినీ యాదవ్, శరద్ యాదవ్, మమతా బెనర్జీ వంటివారంతా దళితులపై అణచివేతను నివారించడానికి గొప్ప ఉద్యమం నడపలేకపోయారు. మధ్యతరగతి రైతులు, మధ్య తరగతి భూస్వాములుగా వ్యవహరించారు. వీళ్ళకు అంబేడ్కర్ భావజాలం ఒంటబట్టే వరకూ బీజేపీకి ప్రత్యామ్నాయం కాలేరు. ఆ పార్టీకీ వీళ్ళకు సన్నని గీత మాత్రమే తేడా వుంది. అంబే డ్కర్ భావజాల స్ఫూర్తిలో బౌద్ధం దాగి వుంది. ముఖ్యంగా స్త్రీ విముక్తి పోరాటంలో కూడా వీరు అంబేడ్కర్ ఆలోచనలను తీసు కోలేదు. కనీసం మహాత్మాఫూలే, సావిత్రీబాయి ఫూలే స్ఫూర్తి కూడా వీరి దగ్గర లేదు. అంబేడ్కర్ భార్య చనిపోయిన తరువాత కూడా కామతృష్ణకు గురికాకుండా జీవించాడు. గాంధీ, నెహ్రూల స్త్రీలకు సంబంధించిన కథనాలు లాంటివి అంబేడ్కర్‌కు లేవు. ఆయన మరో బుద్ధుడిలా జీవించాడు. స్త్రీ వ్యామోహం అనేక మంది నాయకుల్ని పతనావస్థకు తీసుకెళ్ళింది. వ్యక్తిత్వం అనేది వ్యామోహ రహితమైన దైతే కానీ విశ్వవ్యాపితమైన ప్రేమను అందించ లేరు. అంబేడ్కర్ స్త్రీల పట్ల గౌరవంగా వుండడమే గాక ‘హిందూ కోడ్ బిల్’ ద్వారా వారి హక్కులను సాధించిన మహోన్నత వ్యక్తి. ఏ నాయకుడైతే స్త్రీల చేత గౌరవించబడతారో ఆ నాయకుడే ప్రపంచ వ్యాపిత కీర్తిని ఆర్జిస్తాడు. స్త్రీలు నిశ్శబ్ద ప్రచారకులు. వారొక వ్యక్తిత్వాన్ని గౌరవిస్తే దాన్ని మౌఖికంగా ప్రచారం చేస్తారు. అంబే డ్కర్కి విపరీతమైన స్త్రీల ఫాలోయింగ్ వుండేది. బ్రాహ్మణ స్త్రీల దగ్గర నుండి దళిత స్త్రీల వరకు వారి విముక్తి కోసం ఆయన తన మంత్రి పదవికే రాజీనామా ఇచ్చాడు. స్త్రీలలో ప్రేమనూ, దుఃఖాన్నీ, వ్యధనీ చూశాడు. స్త్రీల అభ్యున్నతి కోసం మథన పడ్డాడు. లోహియా భావాలు కూడా సామ్యవాద భావాలే. అయితే ఇప్పుడున్న సోషలిస్టులు సామాజిక న్యాయ సాధనలో అస్పృశ్యతా నివారణ, కుల నిర్మూలన కోసం సామాజిక సాంస్కృతిక విప్లవ భావాలతో ముందుకు రావాల్సివుంది. బహుజన, దళిత, మైనార్టీల విముక్తి కోసం కొత్త రాజకీయ ఎజెండాతో ముందుకు నడవవలసిన బాధ్యత అందరి మీదా ఉంది. ములాయం సింగ్ స్మృతిలో లోహియా భావాల పునరుజ్జీవనమే గాక... అంబేడ్కర్ ఆలోచనలతో వాటిని సమన్వయం చేసుకోవడం అవసరం. ఈనాటి రాజకీయాలకు ఈ సమన్వయం అవసరం. అప్పుడే భారత్‌లో సామ్యవాద, సాంఘిక వాద రాజకీయ పునరుజ్జీవనం జరుగుతుంది. ఆ దిశగా నడుద్దాం. డా‘‘ కత్తి పద్మారావు వ్యాసకర్త దళితోద్యమ నాయకుడు ‘ 98497 41695 -
మమతా బెనర్జీ, సోషలిజం పెళ్లి చేసుకుంటున్నారు
రేపు ఆ పెళ్లి మంటపంలో వామపక్ష వాదాలన్నీ మనుషుల రూపంలో తిరగనున్నాయి. అవును. మమతా బెనర్జీ అనే అమ్మాయిని సోషలిజం అనే అబ్బాయి రేపు పెళ్లి చేసుకుంటున్నాడు. కమ్యూనిజం, లెనినిజం అనే ఇద్దరు బావగార్లు ఈ పెళ్లికి పెద్దలు. ‘మార్క్సిజం’ అనే పేరున్న బుజ్జి మనవడు కూడా ఈ పెళ్లిలో హల్చల్ చేయనున్నాడు. తమిళనాడు సేలంలో జరగనున్న ఈ పెళ్లి భారీగా వార్తల్లో ఉంది. ‘మా ఇంట్లో ఇప్పటి వరకూ ఆడపిల్ల పుట్టలేదు. పుడితే ‘క్యూబాయిజం’ అని పేరు పెట్టడానికి రెడీగా ఉన్నా’ అని అంటాడు మోహన్. భుజం పై ఎర్ర కండువా వేసుకొని రేపు (జూన్ 13)న తన ఇంట జరగనున్న పెళ్లి పనుల హడావిడిలో ఉంటూనే అతడు పత్రికల వారికి టెలిఫోన్ ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఏంటి విశేషం అంటే? అతని ఇంట్లో ఆ పేర్లే విశేషం. ముగ్గురు కొడుకులు తమిళనాడు సేలంలో నివాసం ఉండే మోహన్ ఆ జిల్లా సిపిఐ సమితి కార్యదర్శి. ‘నేనే కాదు మా ఇళ్లల్లో నేను నివాసం ఉండే చోట మేమందరం దాదాపు 70 ఏళ్లుగా కమ్యూనిస్టులం’ అంటాడు మోహన్. ఇతనికి ముగ్గురు కొడుకులు. వాళ్ల పేర్లు కమ్యూనిజం, లెనినిజం, సోషలిజం అని పెట్టాడు. ‘1990ల కాలంలో సోవియెట్ కుప్పకూలడం నాకు బాధ కలిగించింది. కమ్యూనిజం అమలు విఫలమైందేమోగాని సిద్ధాంతంగా అదెప్పుడూ విఫలం కాలేదు. పెళ్లికాక ముందు నుంచే నేను గట్టిగా అనుకున్నాను నా పిల్లలకు వామపక్ష పేర్లు పెట్టాలని. అలాగే పెట్టాను’ అంటాడు మోహన్. ‘మా ఇంట్లోనే కాదు... సేలంలో మేము నివాసం ఉన్నచోట చెకోస్లావేకియా, వియత్నాం వంటి పేర్లున్న మనుషులు కనిపిస్తారు. పెరియార్ రష్యా వెళ్లి వచ్చాక తన పిల్లలకు మాస్కో, రష్యా అనే పేర్లు పెట్టడం కూడా ఒక స్ఫూర్తే’ అంటాడు మోహన్. మమతా బెనర్జీతో పెళ్లి సేలంలో వామపక్ష అభిమానులు నివాసం ఉన్న చోటే కాంగ్రెస్ అభిమానుల నివాసాలు కూడా ఉన్నాయి. అలాంటి ఒక కాంగ్రెస్ అభిమాని కుమార్తెనే ఇప్పుడు మోహన్ తన కోడలిగా చేసుకోబోతున్నాడు. ఆ అమ్మాయి పేరు మమతా బెనర్జీ. ‘ఈ పెళ్లికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి ముత్తరాసన్, అదే పార్టీ ఉపకార్యదర్శి– పార్లమెంటు సభ్యుడు అయిన సుబ్బరాయన్ హాజరవుతున్నారు’ అని సంతోషంగా చెప్పాడు మోహన్. అతని పెద్దకొడుకు కమ్యూనిజంకు పెళ్లయ్యింది. కొడుకు పుట్టాడు. వాడి పేరు మార్క్సిజం. ‘నా కొడుకులు వాళ్లకు పెట్టిన పేర్ల వల్ల ఎప్పుడూ ఇబ్బంది పడలేదు. పైగా ప్రత్యేక గుర్తింపు పొందారు. నా పెద్దకొడుకు లాయర్. వాడి పేరు కమ్యూనిజం కావడంతో జడ్జిలు ప్రత్యేకంగా చూస్తారు’ అన్నాడు మోహన్. ‘నా ముగ్గురు పిల్లల్ని కమ్యూనిస్టు భావాలతోనే పెంచాను. వాళ్లకు ప్రజల పక్షం ఉండటం తెలుసు’ అన్నాడు మోహన్. సేలంలో జరగనున్న ఈ పెళ్లి కార్డు బయటకు రాగానే సోషల్ మీడియాలో హోరెత్తింది. ఆ పెళ్లి కార్డులో ఉన్న పేర్లకు ఏదో ఒక మేరకు ఆదర్శం, ధిక్కారం ఉన్నాయి. అందుకే ఆ హోరు. శతకోటి మందిలో ఒకరుగా ఉండటం కంటే భిన్నంగా, ఆదర్శంగా ఉండటమూ లేదా ఆదర్శభావాన్ని కలిగి ఉండటం ఎప్పుడూ సమాజంలో గుర్తింపు కలిగే పనే. అందుకే ఈ పెళ్లికి అంత గుర్తింపు. అన్నట్టు ఈ పెళ్లిలో అక్షింతలు ఉండకపోవచ్చు. షేక్ హ్యాండ్ ఇచ్చి శుభాభినందనలు తెలపడమే. విష్ యూ హ్యాపీ మేరీడ్ లైఫ్ మమతా బెనర్జీ అండ్ సోషలిజం. -
నెరవేరిన ప్రణబ్, ఆర్ఎస్ఎస్ లక్ష్యం
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని తన కార్యాలయానికి ఆహ్వానించడం ద్వారా.. తాను అనుకున్న లక్ష్యాన్ని ఆర్ఎస్ఎస్ సాధించింది. ఆది నుంచి వివాదాస్పదమైన ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయడం ద్వారా అనుకున్నట్లుగానే వీలైనంత ప్రచారం పొందింది. ఇక ప్రణబ్ ముఖర్జీ కూడా తెలివిగా తాను చెప్పాలనుకున్న విషయాన్ని నొప్పించక.. తానొవ్వక అన్న రీతిలో బయటపెట్టడంలో విజయం సాధించారు. పైకి చెప్పకపోయినా.. ప్రణబ్ ప్రసంగం ఆర్ఎస్ఎస్ పెద్దలకు అంతగా రుచించనట్లే కనిపించింది. ఏ సాంస్కృతిక, సామాజిక, రాజకీయ సంస్థ.. దేశాన్ని విచ్ఛిన్నం చేయలేదని తెలివిగా మనసులో మాటను ప్రణబ్ వెల్లడించారు. ఆర్ఎస్ఎస్ భావజాలం క్షుణ్నంగా తెలిసిన ప్రణబ్.. దానిని పరోక్షంగా విమర్శించేందుకు నెహ్రూ సోషలిజంను చాటిచెప్పే ప్రయత్నం చేశారు. బౌద్ధం ఆవిర్భావం నుంచి ఎంత విధ్వంసం జరిగినా దేశం చెక్కుచెదరకుండా ఎలా కొనసాగిందో ప్రణబ్ చాటి చెప్పారు. సాంస్కృతిక ఐక్యమత్యంపై సర్వేపల్లి రాధాకృష్ణన్ చెప్పిన అంశాల్ని ప్రస్తావించిన ప్రణబ్.. అదే సమయంలో నెహ్రూ ‘డిస్కవరీ ఆఫ్ ఇండియా’ను ప్రస్తావిస్తూ జాతీయవాదం, దేశభక్తికి అర్థాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. ఎప్పటిలానే తన సొంత ధోరణిలో ప్రణబ్ ప్రసంగం కొనసాగింది. ఈ కార్యక్రమాన్ని రాజకీయ పునరావాసంగా వాడుకునేందుకు ప్రణబ్ ఏమాత్రం ప్రయత్నించలేదన్న విషయం ఆయన ప్రసంగంతో స్పష్టమైంది. గొప్ప రాజనీతిజ్ఞతను ప్రదర్శిస్తూ హుందాగావ్యవహరించారు. కాంగ్రెస్ సెల్ఫ్‌గోల్ గతంలో ఐదుగురు భారత రాష్ట్రపతులు ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలకు హాజరైనా.. ఈ స్థాయిలో ఎన్నడూ ప్రచారం లభించలేదు. ఈ కార్యక్రమ ప్రచార బాధ్యతలు మొత్తం కాంగ్రెస్ పార్టీనే తీసుకుంది. ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి ప్రణబ్ హాజరుపై ఆ పార్టీ అతిగా స్పందించిందని విమర్శలు వినిపించాయి. కాంగ్రెస్ పార్టీ అధికారికంగా స్పందించకపోయినా.. ప్రణబ్ కుమార్తె శర్మిష్ట ముఖర్జీతో పాటు పలువురు సీనియర్ నేతలతో విమర్శలు చేయించింది. సొంత చరిత్రను గుర్తుచేయాల్సింది: లెఫ్ట్ న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రసంగాన్ని వామపక్షాలు స్వాగతించాయి. ఈ విషయమై సీపీఎం జాతీయ ప్రధానకార్యదర్శి సీతారాం ఏచూరి స్పందిస్తూ..‘ఆరెస్సెస్ ప్రధానకార్యాలయంలో ప్రణబ్ ఇచ్చిన ప్రసంగంలో మహత్మాగాంధీ హత్య వివరాలు అదృశ్యమయ్యాయి. గాంధీ హత్య అనంతరం అప్పటి హోంమంత్రి పటేల్ అరెస్సెస్‌పై నిషేధం విధించడం, బాపూ హత్యతో అప్పటి ఆరెస్సెస్ శ్రేణులు సంబరాలు చేసుకోవడం.. ఇలాంటి సొంత చరిత్రను ఆరెస్సెస్‌కు ఈ భేటీలో ప్రణబ్ మరింత గట్టిగా గుర్తుచేయాల్సింది’ అని ట్వీట్ చేశారు. కాగా తాము ఊహించినట్లే ప్రణబ్ మాట్లాడారనీ, ఏదేమైనా అయన ఆరెస్సెస్ ప్రధాన కార్యాలయానికి వెళ్లాల్సింది కాదని సీపీఐ వ్యాఖ్యానించింది. -
మార్క్సిజంపై ఈ వక్రీకరణలు ఎందుకు?
కారల్ మార్క్సు 200వ జయంతి నాడు భారత కమ్యూనిస్టు పార్టీలో అత్యున్నత స్థానాన్ని అలంకరించిన మన తెలుగు బిడ్డ సుధాకర రెడ్డి గారు ఓ వ్యాసం రాశారు. అత్యధిక సర్క్యులేషను కల మూడు తెలుగు పత్రికల్లో రెండు పత్రికలు ఆయన వ్యాసాన్ని ప్రచురించాయి. దానిని బట్టి ఆ పత్రికలు ఆయనకి ఇచ్చిన ప్రాధాన్యాన్ని అర్థం చేసుకోవచ్చు. ఆ వ్యాసంలో ప్రతి వాక్యమూ ఒక ఆణిముత్యమని నేను కూడా గ్రహించాను. అయితే అన్ని ముత్యాలమీదా మాట్లాడతానంటే సంపాదకులు నాకంత చోటివ్వలేరు అనే ఇంగితం తెలిసినవాడిని కనుక కొన్ని ముత్యాలకే నేనిక్కడ పరిమితమవుతాను. ‘‘సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైన తరువాత’’ సామ్రాజ్యవాదులు అనేక వక్రీకరణలకు పాల్పడ్డారు అంటారు రచయిత. అంటే సుమారు రెండున్నర దశాబ్దాలుగానే వక్రీకరణలు చోటు చేసుకొన్నాయా? అంతకుముందు మార్క్సిజం వక్రీకరణలకు గురి కాలేదా? పైగా వక్రీకరించినవాళ్లు కేవలం సామ్రాజ్యవాదులేనా? సంగతేమంటే మార్క్సిజం పుట్టిన క్షణం నుంచీ వక్రీకరణలకీ గురైంది. దాడులకూ గురైంది. మరో నిజమేమిటంటే దానిని శత్రువులు ఎంతగా వక్రీరించారో అంతకుమించి కమ్యూనిస్టులం అని పేరు తగిలించుకొన్నవాళ్లు వక్రీకరించారు. కొందరు తెలిసీ మరికొందరు తెలియకా ఆ పని చేశారు.‘‘మార్క్స్ ప్రతిపాదించిన సిద్ధాంతం వైఫల్యం చెందిందని (సోవియట్ యూనియన్ కూలిపోయాక) సామ్రాజ్యవాదులు విస్తృత ప్రచారం’’ చేశారంటారు రచయిత. నిజమే. మార్క్సిజం ఆచరణలో రుజువయింది అని చెప్పడానికి సోవియట్ యూనియన్ బతికున్నంత కాలం దానినే కమ్యూనిస్టు నాయకులు ఉదాహరణగా చూపారు. మరి అది కూలిపోయినప్పుడు మార్క్సిజం కూడా విఫలమైందని సామాన్యులు అర్థం చేసుకోవడంలో తప్పేముంది? ఆ పరిస్థితినే శత్రువులు వాడుకొంటున్నారు. సుధాకర్జీ, మీకు రెండే మార్గాలు. ఒకటి, సోవియట్ యూనియన్‌లో ఉండింది మార్క్స్ ప్రతిపాదించిన సోషలిజమే అని మీరు డబాయిస్తే, మార్క్సిజం విఫలమైందని ఒప్పుకోక తప్పదు. లేదంటే సోవియట్ ‘‘సోషలిజం’’ మార్క్స్ ఊహించిన సోషలిజం కాదని గ్రహించాలి. సోవియట్ సోషలిజమూ శభాష్, మార్క్సూ శభాష్ అంటే కుదరదు. ఇదే చైనాకూ వర్తిస్తుంది. మిగతా ‘‘సోషలిస్టు’’ దేశాలకూ ఇదే వర్తిస్తుంది. ‘‘సామ్రాజ్యవాదులకు ... విమర్శించే హక్కు లేదు’’ అని ఆయన ఫర్మానా జారీ చేశారు. అది సరే. కాని విమర్శించేవాళ్లందరూ సామ్రాజ్యవాదులేనా అన్నది ప్రశ్న. ఒకరడిగినా అడగకపోయినా వివరణ ఇవ్వాల్సిన బాధ్యత కమ్యూనిస్టు అగ్ర నాయకులకు ఉండనే ఉండదా? ఎవరికీ జవాబు చెప్పకపోయినా మీ సొంత స్పష్టత కోసమైనా పొరపాటు ఎక్కడ జరిగిందో శోధించాల్సిన పనిలేదా? ఆ పని చెయ్యాలంటే మార్క్సునీ ఆశ్రయించాలి. చరిత్రనీ ఆశ్రయించాలి. ఆ దిశగా మీరు రెండడుగులయినా వేశారా, చెప్పండి. ‘‘1978 తదనంతరం మావో వారసుడు డెంగజియావో పింగ్ నాయకత్వంలో అనేక సంస్కరణలను తీసుకురావడం జరిగింది. తత్ఫలితంగా 80 కోట్ల ప్రజలు పేదరికం నుంచి విముక్తి పొందారు.’’ అంటారు సుధాకర్జీ. అంటే ఆ 80 కోట్ల మంది మావో నాయకత్వంలో మూడు దశాబ్దాలపాటు దరిద్రంలో మగ్గారనేనా? సుధాకర్జీ అంతమాట అనలేరు. ఈ వ్యాసంలోనే మావో లాంగ్ మార్చ్‌కూ మార్క్సే ప్రేరణ అన్నారు రచయిత. ఇక్కడేమో డెంగ్కీ మార్క్సిజమే ప్రేరణ అంటున్నారు. ప్రపంచంలో నయా ఉదారవాదాన్ని అధికారికంగా ప్రారంభించిన ముగ్గురు మొనగాళ్లలో డెంగ్ జియావో పింగ్ ఒకడు. సంస్కరణ అనే ముద్దు పేరుతోనే వారు దాన్ని ప్రవేశపెట్టారు. మిగతా ఇద్దరిలో ఒకరు మార్గరెట్ థాచర్. రెండోవాడు రొనాల్డ్ రీగన్. దానినే అదే ముద్దు పేరుతో ఇక్కడ ఇండియాలో పివి నరశింహారావు, మన్మోహన్ సింగ్ జంట సుమారు పుష్కరకాలం తర్వాత ప్రవేశపెట్టింది. సుధాకర రెడ్డిగారి పార్టీ ఇక్కడ ఆ సదరు జంటనూ వ్యతిరేకించింది. అంతర్జాతీయంగా థాచర్నీ రీగన్నీ సంస్కరణల పేరెత్తినవారందరినీ వ్యతిరేకించింది. చైనాలో ఆ ‘సంస్కరణ’లను తెచ్చిపెట్టిన డెంగ్ జియావో పింగ్‌ని మాత్రం సుధాకర్జీ పొగుడుతున్నారు. బహుశా ‘కమ్యూనిస్టు’ అనే పేరుతో ఏ పని చేసినా సమర్ధించాలన్న ‘‘జ్ఞానమే’’ అందులో ఉన్న తర్కం కావచ్చు. ఇక్కడ ఒక్కమాట. ఈ సంస్కరణల వల్ల చైనాలో సంపద అపారంగా పెరిగింది, నిజమే. మిలియనీర్లు, బిలియనీర్లూ తామరతంపరగా పెరిగారు. అదీ నిజమే. అయితే అదే స్థాయిలో అసమానతలూ పెరిగాయి. పని గంటలు అపారంగా పెరిగాయి. ఇంతకుముందు లేని నిరుద్యోగ సమస్య మళ్లీ వచ్చి పడింది. అడుగున పేదరికం కూడా అంతులేకుండా పెరిగింది. సామాజిక భద్రత అన్నది క్రమంగా తగ్గిపోతూ ఉంది. ‘‘సోవియట్ ప్రభుత్వం భూమిలేని పేదలకు భూములను పంచింది. బాంకులను పరిశ్రమలని జాతీయం చేసి అనేక విజయాలను సాధించింది.’’ సుధాకర్జీ చెప్పారు. ఇంతకీ సోవియట్ ప్రభుత్వం భూముల్ని పంచిందా, లేదా రైతులతో సమష్టి క్షేత్రాలూ ప్రభుత్వ క్షేత్రాలూ నిర్మించిందా? గుర్తు తెచ్చుకోండి. రష్యాలో చైనాలో పరిశ్రమలూ వగైరాలను జాతీయం చేయడానికీ మార్క్సే ప్రేరణ, చైనాలో డెంగ్ జియావో పింగ్ ప్రభుత్వ ఆస్తులను సొంత ఆస్తులుగా మార్చడానికీ మార్క్సే ప్రేరణ అంటే ఎలా సుధాకర్జీ. ఇంత నిలకడ లేని మనిషా మార్క్స్? అందుకేనేమో మార్క్సిజం పిడివాదం కాదనీ అది పరిస్థితులకు అనుగుణంగా మారుతూనే ఉంటుందనీ మార్క్స్ చెప్పాడనీ సుధాకరరెడ్డి గారు శలవిచ్చారు. అంటే దానిలో మారని మౌలిక అంశాలంటూ ఏమీ లేవా సార్. అవేమిటో ఏమైనా గుర్తున్నాయా? ఒక విద్య ఉంది. ఏమీ చెప్పకుండానే కొన్ని పదాలతో కొన్ని శబ్దాలతో ఘనమైనదేదో చెప్పినట్టు భ్రమ కల్పించే విద్య. అది కమ్యూనిస్టు నాయకులకు తెలిసినంతగా మరెవరికీ తెలియదు. చూడండి. ‘‘తాను రాసిన కార్మికవర్గ సిద్ధాంతాలను అమలుపరచడానికి ఇంగ్గండులో పారిశ్రామిక విప్లవ నేపధ్యంలో కార్మిక వర్గ పరిస్థితులను అధ్యయనం చేసి వారి సంఘాలు పెట్టడం ప్రారంభించాడు.... ప్రపంచ కార్మికవర్గానికి వర్గపోరాటాలను సునిశితం చేయాలని దిశా నిర్దేశం చేశాడు, దోపిడీ సిద్ధాంతాన్ని వివరించారు.’’ ఈ వాక్యంలో మార్క్స్ ఏంచేశాడో కనుక్కోండి చూద్దాం. ‘‘దక్షిణ అమెరికా ఖండంలో వెనిజులా బొలీవియా నికరాగువా మరికొన్ని దేశాలు ప్రపంచ బాంకు, అంతర్జాతీయ ద్రవ్య సంస్థల ... ఒత్తిడులకు లొంగకుండా తన స్వంత బాంకును నిర్మించుకొన్నాయి’’ అన్నారు రచయిత. అయితే తర్వాత ఏం జరిగిందో రచయితకు తెలుసా? 1998 లో వెనిజులా నాయకుడు చావెజ్ మొదటిసారి బాంకు ప్రతిపాదన చేశాడు. పైన చెప్పిన రెండు సంస్థలూ రుణాలు మంజూరు చేయడానికి అనేక షరతులు పెడుతున్నాయి. రుణం తీసుకొనే దేశం ‘సంస్కరణలు’ అమలుచేయాలి. అంటే ప్రభుత్వ సంస్థలను వరసగా సొంత ఆస్తులుగా మార్చాలి. ఇది ఒక ప్రధానమైన షరతు. ఈ అన్యాయాన్ని ఎదిరించడానికి దక్షిణ అమెరికా బ్యాంకు ఒకటి పెట్టాలన్నది ఆలోచన. 2009నాటికి అర్జంటీనా బ్రెజిల్ దేశాలు కూడా ఈ ప్రతిపాదనకు ఒప్పుకొన్నాయి. చిన్న దేశాల్లో బొలీవియా పెరాగ్వే ఉరుగ్వే కూడా ముందుకొచ్చాయి. ఆ తర్వాత ఇంకొన్ని దేశాలు ఉత్సాహం చూపాయి. కాని విచారకరమైన విషయం ఏమంటే సమావేశాలు చాలా జరిగాయి కాని ఇంతవరకూ బాంక్‌కి డిపాజిట్లు కట్టాల్సిన దేశాలు కట్టనే లేదు. ఇంతవరకూ ఆ బాంకు చేయాల్సిన అసలు పని మొదలే కాలేదు. మూలిగే నక్క మీద తాటి పండు అన్నట్టుగా పోయిన ఏడాది వెనిజులా మీద ఉరుగ్వే అనేక ఆరోపను చేసింది. పైగా బయటికి పోతానని బెదిరించింది. ఇంకో ఆణిముత్యం చూడండి: ‘ఈ నేపధ్యంలోనే రష్యాతో సహా అనేక తూర్పు యూరపు దేశాల్లో కమ్యూనిస్టులు ముందుకు సాగుతూనే ఉన్నారు’. అక్కడ కమ్యూనిస్టులు ముందుకు సాగుతున్నారా? ఈ అభినవ రిప్ వాన్ వింకిల్ నిద్ర లేచి ఎంత కాలమైంది? ఇంకో మాట చూడండి: ‘‘అమెరికా గ్రంధాలయాల్లో మార్క్సిస్టు గ్రంధాలను ఎంతగా నిషేధించినప్పటికీ’’ ... అంటారు సుధాకర్జీ. అమెరికాలో కమ్యూనిజాన్ని ఒక బూచిగా చూపించే మాట నిజమే కాని పుస్తకాలు నిషేధించింది ఎక్కడ? ప్రపంచంలో అత్యధిక ధనవంతుడైన జెఫ్ బేజోస్ నడిపే ఎమెజాన్ లోనే మీరు పెట్టుబడి గ్రంథాన్ని కొనుక్కోవచ్చు. సామ్రాజ్యవాదం చేసిన చేస్తున్న నేరాలనూ ఘోరాలనూ ఎండగట్టడానికి అబద్ధాలు అవసరమా? ‘తింటానికి తిండి, కట్టుకోవడానికి బట్ట ఉండడానికి ఇల్లు, చేయడానికి ఒక గౌరవప్రదమైన ఉద్యోగం దొరికేటటువంటి ఒక నూతన సోషలిస్టు సమాజం ఏర్పడింది’ అన్నారు రచయిత. ఆ వ్యాసంలోనే మరో చోట... ‘సమానమైన పనికి సమానమైన వేతనం కోసం పోరాటం’ గురించి రాశారాయన. సోషలిజం అంటే ఇదేనా? సుధాకర రెడ్డి గారు మార్క్సిజం ఓనమాలు మర్చిపోయినట్టున్నారు. ఇల్లలకగానే పండగ కానట్టే సొంత ఆస్తులను జాతీయం చేయడమే సోషలిజం కాదని మార్క్స్ స్పష్టం చేశాడని సుధాకర్జీ కి తెలుసా? కార్మికవర్గ పోరాటం అంతిమ లక్ష్యం న్యాయమైన పనికి న్యాయమైన వేతనం కాదని వారు తేల్చి చెప్పాడనీ వేతన వ్యవస్థని రద్దు చేయడమే లక్ష్యం అన్నారనీ తెలుసా? అంటే ఏమిటి? ఆ వ్యవస్థలో కూలి ఇచ్చే యజమానీ ఉండడు. దాన్ని దేబిరించాల్సిన కూలీ ఉండడు. అక్కడ పని చేేసవాడే యజమాని. అధికారం పనిచేసేవాళ్ల చేతుల్లోనే ఉంటుంది. అటువంటి వ్యవస్థ సోవియట్ యూనియన్‌లో గాని చైనాలో గాని ఇంక ఎక్కడా గాని ఏర్పడలేదు. దాదాపు అన్ని చోట్లా ప్రజల చేతుల్లోకి చేరాల్సిన అధికారాన్ని బ్యూరోక్రాట్లు తన్నుకుపోయారు. అలా ఎందుకు జరిగిందో, సోషలిజం పేరుతో అన్నేళ్లపాటు నడిచిన దేశాల్లో మార్క్సిస్టు మౌలిక సూత్రాలు ఎందుకు అమలుకాలేదో శోధించి తమని తాము సరిదిద్దుకోవాల్సిన ‘అధికార’ కమ్యూనిస్టులు ఆదర్శంగా తీసుకొన్నది, మార్క్స్నా, గానుగెద్దునా అన్నది ప్రశ్న. ఆర్థిక సంక్షభాలు వచ్చిన ప్రతి సందర్భంలోనూ పెట్టుబడిదారీ బృందాల్లో దూరం చూడగలిగిన వారంతా మార్క్సుని తలుచుకొంటున్నారు. ఉలిక్కిపడుతున్నారు. అక్కడ ఆయన సజీవంగా ఉన్నాడు. అధికార కమ్యూనిస్టు బృందాలు మాత్రం మార్క్స్ విగ్రహాలను పూజిస్తున్నారు. ఆ పూజకు అర్థం లేదు. ఆ విగ్రహంలో ప్రాణం లేదు. అదే విడ్డూరం. అదే విషాదం. (మే 5న సాక్షి దినపత్రిక సంపాదకపేజీలో వచ్చిన సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి “గమ్యం గమనం మార్క్సిజమే” వ్యాసంపై స్పందన) ఎ. గాంధీ, సంపాదకుడు, పీకాక్ క్లాసిక్స్ మొబైల్ : 91605 20830 మార్క్సిజంపై ఏబీకే ప్రసాద్ గారు రాసిన వ్యాపం కోసం ఇక్కడ క్లిక్ చేయండి : మార్క్స్ ఎందుకు అజేయుడు?! -
వందేళ్ల వసంతం
అదొక మహత్తరమైన మలుపు. ప్రపంచాన్ని గడగడలాడించిన ఘటన. కార్మికవర్గ విప్లవంతో సమసమాజ స్థాపన జరుగుతుందన్నాడు కార్ల్ మార్క్స్. ఆ సిద్ధాంతాన్ని లెనిన్ ఆచరణలో పెట్టిన సందర్భమది. ప్రపంచంలో తొలిసారిగా కార్మికులు రాజ్యాధికారం చేజిక్కించుకున్న ఉదంతం. తొలి సోషలిస్టు దేశం ఆవిర్భవించిన చరిత్ర. అదే అక్టోబర్ విప్లవం! రష్యా విప్లవం! బోల్షివిక్ విప్లవం! యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్టు రష్యా! 1917 లో సంభవించిన ఆ మహా విప్లవానికి ఈ నవంబర్ 7వ తేదీతో వందేళ్లు నిండుతున్నాయి. కానీ ఇప్పుడు సోషలిస్టు రష్యా లేదు. పాతికేళ్ల కిందటే రద్దయింది! 1991లో సోషలిజాన్ని అధికారికంగా రద్దు చేసుకుని రష్యా సమాఖ్యగా మారింది. కానీ సోషలిస్టు రష్యా మనుగడ సాగించిన 75 ఏళ్లలో ప్రపంచగతిని సమూలంగా మార్చేసింది. మరిన్ని దేశాలు సోషలిస్టు దేశాలుగా అవతరించాయి. ఆ సమయంలో ప్రపంచం రెండు భిన్న ధృవాలుగా చీలిపోయింది. ఆ ధృవాల మధ్య వైరం ఎప్పుడు విస్ఫోటనమవుతుందోనన్న భయాందోళనలు సర్వత్రా నెలకొని ఉండేవి. కానీ.. సోవియట్ రష్యా విచ్ఛిన్నంతో ప్రపంచం ఏకధృవంగా మారిపోయింది. మార్క్స్ సిద్ధాంతానికి కాలం చెల్లిపోయింది, సోషలిజం సాక్షాత్కారానికి ఆస్కారం లేదు, పెట్టుబడిదారీ వ్యవస్థ, స్వేచ్ఛా విపణి సమాజమే అంతిమం అనే వాదనలు, విశ్లేషణలు వెల్లువెత్తాయి. కానీ.. కార్మికవర్గానికి, సోషలిస్టు వాదులకు అక్టోబర్ విప్లవం ఎప్పటికీ మార్గదర్శిగానే నిలిచిపోయింది. సోవియట్ రష్యా కూలిపోవడానికి కారణం లెనిన్ అనంతర ఆర్థిక, రాజకీయ కార్యక్రమాల్లో లోపాలే కానీ.. అంతటితో సోషలిజం అంతం కాలేదని నమ్మేవారూ ప్రపంచ వ్యాప్తంగా బలంగానే ఉన్నారు. సోషలిస్టు రష్యాలో అక్టోబర్ విప్లవ దినోత్సవాన్ని ఏటా అధికారికంగా ఎంతో ఘనంగా నిర్వహించేవారు. అది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వామపక్ష శక్తులకు కూడా పండగగానే ఉండేది. ఇప్పుడు అక్టోబర్ వందేళ్ల విప్లవ ఉత్సవాన్ని రష్యాలో అధికారికంగా నిర్వహిస్తారా లేదా అన్నది అటుంచితే.. ప్రపంచ వ్యాప్తంగా వామపక్ష పార్టీలు, మేధావులు తమ పునరేకీకరణకు, మరింత లోతైన అధ్యయనానికి ఈ సందర్భాన్ని ఒక వేదికగా మలచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రష్యా విప్లవంపై ‘సాక్షి’ ఫోకస్... - సెంట్రల్ డెస్క్ రష్యా సోషలిస్టు విప్లవానికి శతాబ్దం పూర్తి ప్రపంచ చరిత్రను మలుపు తిప్పిన అక్టోబర్ విప్లవం మార్క్స్ ‘కార్మిక విప్లవా’న్ని ఆచరణలో పెట్టిన లెనిన్ - ప్రపంచంలో తొలి కార్మికవర్గ రాజ్యంగా అవతరణం - ఎన్నో దేశాల్లో కమ్యూనిస్టు విప్లవాలకు స్ఫూర్తి ప్రదాత - రెండు భిన్న ధృవాలుగా చీలిపోయిన ప్రపంచ దేశాలు - రష్యా, అమెరికాలు ‘సూపర్ పవర్’లుగా ఆవిర్భావం - ఇరువురి మధ్య అర్ధ శతాబ్దం పాటు ప్రచ్ఛన్న యుద్ధం - పాతికేళ్ల కిందట పతనమైన సోవియట్ సోషలిస్ట్ రష్యా బ్లడీ సండే: తొలి సోవియట్ ఆవిర్భావం రష్యాలో 1917లో సోషలిస్టు విప్లవం రావడానికి అది విజయవంతం కావడానికి ఎన్నో చారిత్రక కారణాలున్నాయి. జార్ రాచరిక నిరంకుశ పాలనలోని రష్యాలో 1905 లోనే ఈ విప్లవానికి పునాదులు పడ్డాయి. పట్టణాల్లోని కార్మికవర్గం అవధులు లేని పనిగంటలతో సతమతమవుతుండేది. పెట్రోగ్రాడ్ (ఇప్పుడు సెయింట్ పీటర్స్బర్గ్.. అప్పటి రష్యా రాజధాని)లో జనవరి 22వ తేదీన (ఆదివారం) కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం చక్రవర్తి (జార్) నికొలస్-2కు వినతిపత్రం ఇవ్వడం కోసం నిరాయుధంగా, శాంతియుతంగా ప్రదర్శనగా వెళుతున్నపుడు సైనికులు వారిపై కాల్పులు జరిపారు. ఆ ఘటనలో 1000 నుంచి 4000 మంది వరకూ చనిపోవడం, గాయపడటం జరిగిందని భిన్న అంచనాలు ఉన్నాయి. ‘బ్లడీ సండే’గా పేర్కొనే ఈ సంఘటనతో దేశవ్యాప్తంగా కార్మికవర్గ నిరసనలు, సమ్మెలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో కార్మికులు తొలి సోవియట్ (సహకార మండలి)ని స్థాపించారు. అక్కడి నుంచి దాదాపు అన్ని నగరాల్లోనూ ఈ సోవియట్లు ఏర్పడ్డాయి. కమ్యూనిస్టు రాజకీయ నిరసన అప్పుడే మొదలైంది. రెడ్ అక్టోబర్... ఫిబ్రవరి విప్లవం విజయవంతం కావడంతో అప్పటివరకూ స్విట్జర్లాండ్‌లో ప్రవాసంలో ఉన్న అతివాద బోల్షివిక్ నాయకుడు లెనిన్ తదితరులు ఏప్రిల్‌లో రష్యా చేరుకున్నారు. పెట్రోగార్డ్ సోవియట్‌లో బోల్షివిక్ల కన్నా మితవాద మెన్షెవిక్‌లు, సోషలిస్టు విప్లవవాదులు బలంగా ఉండేవారు. అయితే.. తాత్కాలిక ప్రభుత్వంలో డ్యూమాకు సోవియట్‌కు మధ్య విభేదాలు తలెత్తాయి. అక్టోబర్ నాటికి ఈ విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఈ పరిస్థితులు సోషలిస్టు విప్లవానికి అనుకూలంగా ఉన్నాయని లెనిన్ గుర్తించాడు. లెనిన్ రాకతో అంతకంతకూ పుంజుకుంటూ వచ్చిన బోల్షివిక్‌లు విప్లవం లేవదీశారు. అప్పటికే పెట్రోగార్డ్ సోవియట్‌కు అనుబంధంగా నిర్మించిన రెడ్ గార్డ్స్ సాయంతో అక్టోబర్ 25వ తేదీన (కొత్త క్యాలెండర్ ప్రకారం నవంబర్ 7) ప్రభుత్వాన్ని తమ స్వాధీనం చేసుకున్నారు. దేశ వ్యాప్తంగా కార్మికుల సోవియట్ల చేతుల్లోకి అధికారాన్ని తీసుకోవడం మొదలైంది. ఈ విప్లవంలో ఏ వైపూ ఒక్కరు కూడా చనిపోలేదు. అందుకే ఇది రక్తపాత రహిత విప్లవంగా చరిత్రలో నమోదయింది. లెనిన్ సారథ్యంలో రష్యా కమ్యూనిస్టు పార్టీ అధికారం చేపట్టింది. ప్రపంచ చరిత్రలో సరికొత్త శకం ఆరంభమైంది. అంతర్యుద్ధం..: కానీ.. విప్లవం అంతటితో పూర్తవలేదు. అక్టోబర్ విప్లవం తర్వాత అంతర్యుద్ధం రాజుకుంది. సోవియట్లను, సోషలిస్టు వ్యవస్థను వ్యతిరేకించే వర్గాలు, జార్ రాచరిక అనుకూల వర్గాలతో పాటు.. అతివాద బోల్షివిక్లను వ్యతిరేకించే సోషలిస్టు రివల్యూషనరీలు ఒకవైపు.. బోల్ష్విక్లు మరొకవైపుగా అంతర్యుద్ధం జరిగింది. ఈ యుద్ధం కోసం రెండు పక్షాల వారూ కార్మికులు, రైతులను బలవంతంగా సైన్యంలో చేర్చేవారు. 1918లో జార్ కుటుంబాన్ని బోల్షివిక్‌లు చంపేశారు. కమ్యూనిస్టు పార్టీ అధికారంలోకి రాగానే మొదటి ప్రపంచ యుద్ధం నుంచి రష్యా వైదొలగినా.. అమెరికాతో కూడిన మిత్రరాజ్యాలు అంతర్యుద్ధంలో జోక్యం చేసుకోవటంతో సోవియట్ల రెడ్ ఆర్మీ వారితోనూ పోరాడింది. నాలుగేళ్ల పాటు సాగిన ఈ అంతర్యుద్ధంలో లక్షలాది మంది చనిపోయారు. చివరికి రెడ్ గెలిచిన తర్వాత 1922 డిసెంబర్ 29న సోవియట్ రష్యా ఆవిర్భవించింది. విప్లవ కెరటాలు రష్యా విప్లవం స్ఫూర్తితో అదే సమయంలో జర్మనీలో, హంగరీ, ఇటలీ, ఫిన్లాండ్, వంటి పలు దేశాల్లో కమ్యూనిస్టు విప్లవాలు తలెత్తాయి. కానీ.. పెద్దగా విజయాలు సాధించలేదు. కొన్నిచోట్ల విజయవంతమైనా కూడా ఎంతో కాలం నిలువలేదు. అయితే అంతర్జాతీయ కమ్యూనిస్టు విప్లవం లక్ష్యంగా ప్రపంచ వ్యాప్తంగా కమ్యూనిస్టు ఉద్యమాలు బలపడ్డాయి. అందులో రష్యా కమ్యూనిస్టు పార్టీ పాత్ర, సాయం కూడా ఉంది. అనంతర కాలంలోనూ చైనా, వియత్నాం, ఉత్తర కొరియా, క్యూబా తదితర దేశాల్లో కమ్యూనిస్టు విప్లవాలు విజయవంతమయ్యాయి. భారత్ సహా చాలా దేశాల్లో కమ్యూనిస్టులు కొందరు సాయుధ విప్లవ పంథా ఎంచుకోవడానికి రష్యా, చైనా విప్లవాలు మార్గదర్శిగా నిలిచాయి. ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు విప్లవ ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి. సోషలిజం నిర్మాణ ప్రయత్నాలు... సోషలిస్టు రష్యాలో ఎన్నో విప్లవాత్మక మార్పులు సంభవించాయి. కార్మికులకు 8 గంటల పనిదినం, రైతులకు భూముల పంపిణీ, బ్యాంకులు, పరిశ్రమల జాతీయీకరణ వంటి కార్మికవర్గ అనుకూల సంస్కరణలు జరిగాయి. సామూహిక వ్యవసాయం అమలు చేశారు. అందరికీ విద్యా హక్కు కల్పించారు. పారిశ్రామికీకరణ వేగవంతమైంది. అందరికీ పని అందించేందుకు కృషి చేశారు. దేశంలో పితృస్వామ్యం ఆధిపత్యాన్ని తగ్గించేందుకు కృషి జరిగింది. మహిళలకు, జాతిపరంగా మైనారిటీలకు సమాన హక్కులు కల్పించారు. వ్యవస్థీకృత మతాన్ని వ్యతిరేకించారు. ఇంట్లో మినహా అన్నిచోట్లా మత బోధనను నిషేధించారు. హేతువాద భావజాలాన్ని ప్రోత్సహించారు. విద్యను చర్చి నుంచి వేరుచేశారు. హేతువాదంతో కూడిన విద్యను అమలు చేశారు. అభివృద్ధిలో చాలా వెనుకబడిన దేశంలో సోషలిస్టు సమాజం నిర్మాణానికి ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. పంచవర్ష ప్రణాళికలతో సోవియట్ రష్యా అనతి కాలంలోనే ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. భారత్ సహా అభివృద్ధి చెందుతున్న, తృతీయ ప్రపంచ దేశాలకు డ్యాములు, పరిశ్రమల నిర్మాణం, ఆయుధాల సరఫరా వంటి వాటితో సహా ఆర్థికంగా, సాంకేతికంగా ఎంతో సాయం అందించింది. ప్రచ్ఛన్న యుద్ధం... మరోవైపు.. అదే సమయంలో అధికార కమ్యూనిస్టు పార్టీలో అంతర్గత పోరూ మొదలైంది. 1924లో లెనిన్ చనిపోయాక స్టాలిన్ అధికారం చేపట్టాడు. స్టాలిన్ విధానాలను వ్యతిరేకించిన రెడ్ ఆర్మీ వ్యవస్థాపకుడు ట్రాట్స్కీ దేశబహిష్కరణకు గురయ్యాడు. ఇదే సమయంలో రెండో ప్రపంచ యుద్ధం సంభవించింది. ఆ యుద్ధంలో హిట్లర్ సారథ్యంలోని నాజీ జర్మనీని రష్యా ఓడించింది. ప్రపంచ చరిత్రలో అది మరింత కీలకమైన మలుపు. కానీ యుద్ధంలో 2.6 కోట్ల మంది రష్యా ప్రజలు చనిపోయారు. అయితే.. యుద్ధం ముగిసిన తర్వాత రష్యా, అమెరికా ప్రయోజనాలు పరస్పరం విరుద్ధమైనవి కావడంతో వాటి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం మొదలైంది. తూర్పు యూరప్ మధ్య ఆధిపత్యం అంశంపై విభేదాలు తీవ్రమయ్యాయి. అణ్వాయుధాల తయారీ సహా రెండు దేశాల మధ్యా అన్ని రంగాల్లో పోటీ పెరిగిపోయింది. రష్యా, అమెరికాలు రెండూ ‘సూపర్ పవర్‘లుగా నిలిచాయి. దాదాపు ప్రపంచం మొత్తం ఈ రెండు దేశాల వెనుకా రెండు ధృవాలుగా విడిపోయింది. వాటి మధ్య ఎప్పుడైనా మూడో ప్రపంచ యుద్ధం జరగవచ్చన్నంత ఉత్కంఠగా పరిస్థితి మారిపోయింది. ఫిబ్రవరి విప్లవం... ఇక మొదటి ప్రపంచ యుద్ధం కూడా రష్యా ప్రజల్లో జార్‌పై, ఆయన పరిపాలనపై వ్యతిరేకతను పెంచింది. జార్ తన సామ్రాజ్యాన్ని విస్తరించుకునే లక్ష్యంతో రైతాంగాన్ని యుద్ధరంగంలోకి పంపించాడు. కానీ.. తన కన్నా పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన జర్మనీ చేతిలో రష్యా తీవ్రంగా నష్టపోయింది. వేలాది మంది యుద్ధరంగంలో నేలకూలుతున్నారు. మరోవైపు.. యుద్ధం కోసం భారీగా కరెన్సీ నోట్లు ముద్రించటంతో దేశంలో ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. 1917 వచ్చేసరికి ధరలు నాలుగేళ్లలో నాలుగు రెట్లు పెరిగాయి. రైతులకు గిట్టుబాటు ధరలు లభించలేదు. పట్టణాల్లో పరిశ్రమలు సగానికి సగం మూతపడ్డాయి. నిరుద్యోగం అమాంతంగా పెరిగిపోయింది. కార్మికులకు రొట్టెలు దొరకటం గగనమైపోయింది. ఇంకోవైపు ఉన్న పరిశ్రమల్లో కార్మికులు పన్నెండు గంటలకు పైగా వెట్టిచాకిరి చేయాల్సిన దుస్థితి. అందులో మహిళలూ అధిక సంఖ్యలో ఉన్నారు. ప్రభుత్వ విధానాలను సరళం చేయాలన్న డ్యూమా (పార్లమెంటు)ను జార్ రద్దు చేశాడు. ఈ పరిస్థితుల్లో యుద్ధం ఆపాలని, శాంతి కావాలని, రొట్టెలు కావాలనే డిమాండ్లతో పెట్రోగార్డ్లో కార్మికులు సమ్మెకు దిగారు. భారీ స్థాయిలో నిరసన ప్రదర్శనలు మొదలయ్యాయి. ప్రవాసంలో ఉన్న కమ్యూనిస్టు నాయకులు ఈ సమ్మెలకు, ఆందోళనలకు మద్దతు తెలిపారు. ఈ ఆందోళనలను అణచివేయాలని జార్ తన సైన్యాన్ని ఆదేశించాడు. కానీ అప్పటికే యుద్ధంలో దెబ్బతిని ఉన్న సైన్యంలో అధిక భాగం కార్మికులకు మద్దతుగా నిలిచారు. చాలా మంది పారిపోయారు. ఇక గత్యంతరం లేక 1917 మార్చి 2న (కొత్త క్యాలెండర్ ప్రకారం మార్చి 15న) జార్ నికొలస్-2 చక్రవర్తి పీఠాన్ని త్యజించాడు. ఆయన సోదరుడు ఆ పీఠం స్వీకరించేందుకు నిరాకరించాడు. దీంతో రాచరిక డ్యూమా, పెట్రోగార్డ్ సోవియట్ కలిసి తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. రాజ్యాంగ శాసనసభకు ఎన్నికలు నిర్వహించడం ఈ సర్కారు ముఖ్య లక్ష్యం. సోవియట్ పతనం... 1953లో స్టాలిన్ మరణంతో రష్యాలో అధికారం కోసం అంతర్గత పోరాటం మొదలైంది. కృశ్చేవ్ అధికారం చేపట్టి తన పట్టు బిగించాడు. ఆయన విఫలమయ్యాడంటూ కమ్యూనిస్టు పార్టీ స్వయంగా 1964లో తొలగించింది. ఆ తర్వాత బెద్నేవ్, కోసిజిన్, పోద్గోర్నీలు ఉమ్మడిగా నాయకత్వం వహించారు. అనంతరం బ్రెజ్నేవ్ నాయకత్వం చేపట్టాడు. కృశ్చేవ్, బ్రెజ్నేవ్ల హయాంలో రష్యా పారిశ్రామిక, అంతరిక్ష రంగాల్లో శిఖరస్థాయికి చేరుకుంది. కానీ.. ఆ సమయంలో వేగంగా సాగుతున్న ఆధునికీకరణ, కంప్యూటరీకరణల్లో రష్యా అంతకంతకూ వెనుకబడిపోయింది. రష్యా ఆర్థిక వ్యవస్థలో కీలక భాగమైన చమురు ధరలు ఎగుడుదిగుళ్లు కావడంతో సమస్యలు మొదలయ్యాయి. ఆండ్రపోవ్, చెరెన్కోల తర్వాత అధికారం చేపట్టిన గోర్బచేవ్.. రష్యా కమ్యూనిస్టు పార్టీని ఆధునీకరించే పని మొదలుపెట్టాడు. అధికారంలో పార్టీ పట్టును సడలించాడు. సామాజిక సమస్యలపై ప్రజలు దృష్టి సారించడం పెరిగింది. ఈ క్రమంలో గోర్బచేవ్, పార్టీ నాయకుడు ఎల్సిన్ల మధ్య అధికార పోరు తీవ్రమైంది. అనేక నాటకీయ పరిణామాల తర్వాత 1991 డిసెంబర్ 26న సోవియట్ యూనియన్ రద్దయింది. రష్యా ఫెడరేషన్ అవతరించింది. రష్యా సూపర్ పవర్ హోదా కోల్పోయింది. కమ్యూనిజం భవిష్యత్? సోవియట్ రష్యా పతనం ప్రపంచ వ్యాప్తంగా వామపక్ష వాదులను ఎంతో నిస్పృహకు లోను చేసింది. ఇక మార్క్సిజం, కమ్యూనిజాలు విఫలమయ్యాయన్న వాదనలు వ్యతిరేక వర్గం నుంచి వెల్లువెత్తాయి. సరళీకృత స్వేచ్ఛా మార్కెట్ వ్యవస్థే ప్రపంచానికి అంతిమ పరిష్కారమన్న సూత్రీకరణలు జరిగాయి. అయితే వామపక్ష వాదులు అది కేవలం విప్లవానికి ఒక ఎదురు దెబ్బేనని, సోషలిస్టు స్థాపనకు నిరంతర ప్రయత్నం సాగుతూనే ఉంటుందని విశ్వసిస్తున్నారు. నవంబర్‌లో అక్టోబర్ విప్లవం..! రష్యా సోషలిస్టు విప్లవానికి అక్టోబర్ విప్లవం అని పేరు. కానీ.. ఆ విప్లవం సంభవించింది ప్రస్తుత కేలండర్లో నవంబర్ 7వ తేదీ. విప్లవం వచ్చే సమయానికి రష్యాలో జూలియన్ కేలండర్ ఉపయోగించేవారు. ఆ కేలండర్ ప్రకారం.. అక్టోబర్ 25వ తేదీన ఈ విప్లవం సంభవించింది. ఆ తర్వాతి నుంచి ఉపయోగిస్తున్న గ్రెగోరియన్ కేలండర్లో అది నవంబర్ 7వ తేదీ అయింది. అందుకే అక్టోబర్ విప్లవం ఉత్సవాన్ని నవంబర్‌లో నిర్వహించుకుంటారు. -
శత వసంతాల ‘అక్టోబర్’
విశ్లేషణ ప్రపంచంలో స్వేచ్ఛ, స్వాతంత్య్రాల కోసం జరిగే జాతీయ విముక్తి ఉద్యమాలకు సోవియట్ యూనియన్ ఆప్తమిత్రునిగా నిలిచింది. నూతనంగా స్వాతంత్య్రం పొందిన దేశాల పురోగమ నానికి, స్వతంత్ర శక్తిగా నిలబడేందుకు నాటి సోవియట్ సహకారం అనితరసాధ్యం. ఈ నవంబరు 7వ తేదీ ఒకప్పటి సోవియట్ రష్యా శత జయంతి. ఆనాటి సోషలిస్టు విప్లవం మార్క్సిజంలోని వాస్తవికతను రేఖామాత్రంగా ప్రపంచానికి దర్శనీయం చేసేందుకు నాందీ ప్రస్తావన జరిగిన రోజు. ఆ తొలి అడుగు మానవుడు మున్నెన్నడూ ఎరుగని దిశలు పడిన రోజు ఇది. విముక్తి పొందిన నూతన సోషలిస్టు రష్యా నాటి ప్రపంచ శ్రమజీవులందరి కలల పంట. విప్లవనేత లెనిన్ వాగ్దానం చేసినట్లు – వివిధ జాతుల కారా గారంగా ఉండిన రష్యాలో అన్ని జాతులకూ విముక్తి కల్పించి, అవి స్వచ్ఛందంగా ఏర్పరచుకున్న యునైటెడ్ సోవియట్ సోషలిస్టు రిపబ్లిక్ (యూఎస్ఎస్ఆర్)గా అవతరించింది. రెండో ప్రపంచ యుద్ధానంతరం స్టాలిన్ మార్గదర్శకత్వంలో చైనా, వియత్నాం, క్యూబా విముక్తితో సోషలిస్టు శిబిరం ఏర్పడింది. అయితే నాటి యూఎస్ఎస్ఆర్ నేటి ప్రపంచ చిత్రపటంలో కాన రాదు. తూర్పు యూరప్ రాజ్యాలలో సైతం సోషలిజం కనుమరుగ య్యింది. నాడు మావో నేతృత్వాన సాధించిన విముక్తి మార్గాన నేటి చైనాలో కమ్యూనిస్టు పార్టీ అధికారంలో ఉండినా పయనం సాగు తున్నదా? లేదా? అక్కడ నేడు కమ్యూనిస్టు పార్టీ పేరు కొనసాగుతు న్నప్పటికీ పెట్టుబడిదారీ విధానానికి మార్గం పునర్నిర్మితమౌతు న్నదా? అన్నది ప్రపంచ కమ్యూనిస్టు పార్టీలలో చర్చనీయాంశం. ప్రపంచ శ్రమజీవుల ప్రాణస్పదంగా ఉండిన సోషలిస్టు శిబిరం ఇలా ఎందుకు పతనమయింది? అందుకు గల కారణాలేమిటి? ఈ పతనం ఆయా దేశాల ఆచరణాత్మక తప్పిదాల ఫలితమా? నేటి భౌతిక వాస్తవిక పరిస్థితి కారణమా? ఈ పతనం వెనుక కమ్యూనిస్టు వ్యతిరేక సామ్రాజ్యవాద గుత్తాధిపతుల కుట్రల ఫలితమా? ఇలాంటి ప్రశ్నలు ఎన్నో తలెత్తడం సహజం. అసలు కమ్యూనిజమే మానవ నైజానికి విరుద్ధం, ‘సోషలిజం’ మార్క్స్ అనే ఒక స్వాప్నికుని స్వప్నం, పెట్టుబడిదారీ విధానమే శాశ్వతమైనది అని ప్రచారం చేసే మేధా వులకూ కొదవ లేకుండా పోయింది. కానీ ఆ యూఎస్ఎస్ఆర్ ఎంతటి మహత్తర మానవత్వ కర్తవ్యాలనూ అంతర్జాతీయంగానూ తన దేశంలోనూ ఆచరించి ప్రపంచానికి చూపిందో చూద్దాం. తొలి సంస్కరణగా దున్నుకునే వారికే భూమినిచ్చే అతి మౌలిక మైన సంస్కరణ చేపట్టి రైతులను, గ్రామీణ పేదలను సోవియట్ ఆదుకున్నది. ప్రతి రంగంలోనూ రాజకీయంగా శ్రామికవర్గ పాత్ర పెంచింది. మహిళలకు ఆత్మగౌరవాన్ని, రాజకీయ, ఆర్థిక, సామాజిక స్థాయి అందించింది. విద్య, వైద్యం, గృహవసతి, దుస్తులు సామాన్య ప్రజలకు దాదాపుగా ఉచితంగా లభింపజేశారు. 40 ఏళ్లపాటు యూఎస్ఎస్ఆర్లో నిత్యావసరాల ధరల పెరుగుదల లేదు. సోష లిస్టు శిబిరంలోని దేశాలకు, నూతనంగా స్వాతంత్య్రం పొందిన దేశాల పురోగమనానికి నాటి సోవియట్ సహకారం అనితరసాధ్యం. మనదేశాన్నే తీసుకుందాం. పాశ్చాత్య దేశాలు ‘డాలర్ల’తో వ్యాపార లావాదేవీలు సాగిస్తుండగా మనకు సులభమైన రీతిలో రూపాయ లలో వ్యాపార వాణిజ్య సంబంధాలు కొనసాగించింది. మనదేశ ఆర్థిక ప్రగతికి ‘ఉక్కు’ కర్మాగారం నిర్మించమని మనం కోరితే ఇంగ్లండ్ వంటి దేశాలు ‘మీకు ఒక్క ఫ్యాక్టరీ దేనికి? సైనిక ఫ్యాక్టరీ పెట్టుకోమని హేళన’ చేశాయి. భిలాయ్‌లో ప్రభుత్వ రంగంలో ఉక్కు పరిశ్రమకు నాంది పలికే సహకారం అందించింది సోవియట్ యూనియన్. నాటి యూఎస్ఎస్ఆర్ సోషలిస్టు శిబిరం నేడు లేదు. నేడు ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిజానికి వ్యతిరేక వాతావరణం గమని స్తున్నాం. సృష్టిలో మారనిది అంటూ ఏదైనా ఉంటే అది మార్పు అన్నారు మార్క్స్. అందువలన భౌతిక వాస్తవిక పరిస్థితిలో వస్తున్న మార్పులేమిటి? వాటి ప్రభావం శ్రామిక వర్గంపైన వాటి రాజకీయ పార్టీలపైన ప్రభావం ఏమిటి? నిర్దుష్టంగా ఆ మార్పుల కనుగుణంగా ఏ చర్యలు చేపట్టాలి? అన్నవి పరిశీలనార్హం. ఇక మనదేశంలో మాత్రం చాతుర్వర్ణ వ్యవస్థ అనే నిచ్చెనమెట్ల వంటి కుల అణచివేత హిందూమత సిద్ధాంతాలలో ముఖ్యమైనదిగా ఉంది. దేశంలో వచ్చిన ఆర్థిక, రాజకీయ, మార్పుల ఫలితంగా శూద్ర కులాలే ఆధిపత్య కులాలుగా, అన్ని రంగాల్లో ఆధిపత్యం చలాయిస్తు న్నాయి. వర్ణవివక్ష, అంటరానితనం, అత్యంత వెనుకబడిన కులాలపై అణచివేత, స్త్రీలను హీనంగా చూడటం, వీరిపై అన్నిరకాల దోపిడీ, దౌర్జన్యం, అత్యాచారాలు నేటికీ కొనసాగుతున్నాయి. ఈ దశలో లెనిన్వలే సృజనాత్మకంగా మౌలికమైన శ్రమ దోపిడీని వ్యతిరేకించ డంతోపాటు కమ్యూనిస్టులు, ఆ సామాజిక శక్తులతో మమేకమై, ద్విముఖ పోరాటాన్ని నిర్వహించాలి. ‘కొటేషన్లదేముందయ్యా, మార్క్స్, ఎంగెల్స్, లెనిన్.. వంటి నేతల రచనల నుంచి ఎన్నైనా ఇవ్వ వచ్చు. కావలసింది ప్రత్యేక పరిస్థితులకు వానిని అన్వయించడం’ అని సుందరయ్య అనేవారు. మనకాలంలో మనిషిని మనిషి దోచుకునే రూపం మారింది కానీ మానవ సమాజ దోపిడీ మాత్రం మరో రూపంలో మరింత నాజూకు గానైనా, అధికంగా సాగుతున్నది. నగ్నంగానే కలవారు, లేనివారు అనే భేదం మున్నెన్నడూ లేనంతగా స్పష్టంగా కానవస్తున్నది. గతంలో వలెనే, నేడు కూడా వ్యవస్థకు వ్యతిరేకంగా శ్రామికులూ, పీడితులు, అణచివేతకు గురవుతున్న వారు అందరూ కలసి పోరాడక తప్పదు. నేడు దేశవ్యాప్తంగా ఎన్నో పోరాటాలు చూస్తున్నాము. మావోయిస్టుల సాయుధ పోరాటం గానీ, కమ్యూనిస్టుపార్టీల పార్ల మెంటరీ, పార్లమెంటరీయేతర పోరాటాలు కానీ ఆ ద్విముఖ పోరా టంలో భాగమే. వివిధ కారణాలతో ఈ పోరాటంలో ముందు వెను కలు ఉండవచ్చు. కానీ చరిత్ర నిర్మాతలైన ప్రజలు తమ ఆధిపత్యాన్ని నిలుపుకుని నూతన సోషలిస్టు వ్యవస్థకు దారి తీస్తారు. అమెరికాలో రెండేళ్ల క్రితం వచ్చిన వాల్ స్ట్రీట్‌పై దాడి ఉద్యమ ప్రథమ నినాదం ఏమిటి? మేము (సామాన్య ప్రజానీకం, కష్టజీవులూ అణిచివేతకు గురవుతున్న వాళ్లం) 99 శాతం, మీరు దోపిడీదారులు, ప్రగతి నిరో ధకులు కలిపి 1 శాతం! అదీ వాస్తవం! నవంబర్ 7 సోవియట్ యూనియన్ శతజయంతి సందర్భంగా, ఆ చారిత్రక పరిణామ దిశా దశల ఆధారంగా ఈ మహత్తర గుణాత్మక మార్పులో మనమూ భాగస్వాములు అవగలమని ఆశిద్దాం! (నవంబర్ 7న సోవియట్ రష్యా విప్లవ దినోత్సవ శత జయంతి) ఏపీ విఠల్ వ్యాసకర్త మార్క్సిస్టు విమర్శకులు ‘ 98480 69720 -
నిరంతర విప్లవ స్ఫూర్తి
కొత్త కోణం ప్రపంచ అగ్రరాజ్యం పక్కనే ఉన్న ఓ చిన్న దేశంలోని సోషలిజాన్ని కాపాడుకోవడం కోసం కాస్ట్రో చేసిన పోరాటం ప్రపంచాన్నే నివ్వెర పరచింది. క్యూబాలో కాస్ట్రో అమలు పరచిన సోషలిస్టు విధానాల ఫలితంగా ప్రజలందరికీ విద్య, వైద్యం అందుబాటులోకి వచ్చాయి. ఉత్పత్తిలో కూడా ప్రజలకు నిజమైన భాగస్వామ్యం లభించింది. ఫలితంగా పెట్టుబడిదారీ విధానాన్ని అమలుచేసే మార్కెట్ శక్తుల ప్రాబల్యం తగ్గింది. అంతేకాదు, వివిధ వర్గాల ప్రజల మధ్య అంతరాలు తగ్గడంతోపాటూ, పౌరహక్కులకు రక్షణ కూడా పెరిగింది. ‘‘ఈ దేశాన్ని సమూలంగా మార్చగలిగినప్పుడు నేను సంతోషిస్తాను. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని నా కోరిక. ప్రజల కోసం నేను కొన్ని వేలమంది ద్వేషాన్నైనా లెక్కచేయను. ఇందులో బంధువులు, స్నేహి తులు, నా సహచర విద్యార్థులు ఉన్నా భరిస్తాను.’’ క్యూబా విప్లవ నేత, మాజీ దేశాధ్యక్షుడు ఫిడెల్ కాస్ట్రో ఒకప్పుడు అన్న మాటలివి. వారం క్రితం కమ్యూనిస్టు కార్యకర్తలనుద్దేశించి మాట్లాడుతూ... ఇదే నా చివరి ఉపన్యాసం కావచ్చంటూ చేసిన సంక్షిప్త ప్రసంగంలోనూ ఆయన ప్రజల పట్ల అదే ప్రేమను వ్యక్త పరిచారు: ‘‘కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు మార్క్సిస్టు, సోష లిస్టు విలువలకు కట్టుబడి పనిచేయాలి. ఎటువంటి పరిస్థితుల్లోనూ వ్యక్తిగత జీవితాలకు ప్రాధాన్యం ఇవ్వరాదు. ప్రజాసంక్షేమమే ధ్యేయంగా ఉండాలి’’. ఫిడెల్ కాస్ట్రో 20వ శతాబ్దపు విశిష్ట నాయకుడు. క్యూబా వంటి అతిచిన్న దేశం, అతి తక్కువ జనాభాతో ప్రపంచ సామ్రాజ్యవాద యుద్ధ పిపాసి అమె రికాతో తలపడటం అంటే మాటలు కాదు. అందుకు గుండె ధైర్యం కావాలి. గుండెనిండా ప్రజలపై ప్రేమ కావాలి. అన్నింటికీ మించి ప్రాణాలపై తెగింపు కావాలి. వీటన్నింటినీ కలగలుపుకొన్న వ్యక్తిత్వం ఫిడెల్ కాస్ట్రోది. మార్క్సి జాన్ని ఆయుధంగా, దిక్సూచిగా చేసుకొని విప్లవ వీరుడిగానేగాక, అత్యంత సమర్థ పరిపాలకునిగా కాస్ట్రో అరుదైన శక్తి సామర్థ్యాలను ప్రదర్శించాడు. చాలా మంది విప్లవ నాయకుల జీవితాలు విప్లవ విజయంతోనో లేదా కొన్నేళ్లు ప్రభుత్వాన్ని నడపడంతోనో ముగుస్తాయి. కానీ విప్లవానంతరం దాదాపు ఆరు దశాబ్దాలు ప్రభుత్వాధినేతగా ఉండటం అనూహ్యం. ఆయన ప్రభుత్వాన్ని ప్రజలకు చేరువగా చేయడమే కాదు, విద్య, వైద్యాలను ప్రజలందరికీ అందుబాటులోనికి తీసుకొచ్చి క్యూబా చరిత్రను తిరగరాశారు. ఫిడెల్ తండ్రి ఏంజల్ కాస్ట్రోకు ఏడుగురు సంతానం. ఆరేళ్ల ప్రాయంలో పాఠశాలలో చేరిన ఫిడెల్, పందొమ్మిదేళ్ళ వయస్సులో హవానాలోని ప్రతిష్టాత్మకమైన ఒక క్రైస్తవ కళాశాలలో చేరాడు. ఆ తదుపరి హవానా విశ్వ విద్యాలయ న్యాయశాస్త్ర విద్యార్థిగా ఉండగా క్రమంగా విద్యార్థి ఉద్యమ రాజ కీయాలవైపు దృష్టి మరల్చాడు. ముఖ్యంగా అమెరికా సామ్రాజ్యవాద పెత్తనానికి వ్యతిరేకంగా విద్యార్థుల్లో చైతన్యాన్ని నింపడానికి ప్రయత్నిం చాడు. క్యూబా అధ్యక్షుడు రమోన్ గ్రావ్ హింసాయుత రాజ్యానికి, అవినీతి పాలనకు వ్యతిరేకంగా 1946లో కాస్ట్రో చేసిన ఉపన్యాసం ఆనాటి పత్రికల్లో ప్రముఖంగా ప్రచురితమైంది. ప్రముఖ రాజకీయ నాయకుడు ఎడ్వర్డొ చిబాస్ స్థాపించిన క్యూబా పీపుల్స్ పార్టీ నుంచి ఆహ్వానం అందడంతో కాస్ట్రో ఆ పార్టీలో సభ్యునిగా చేరారు. కాస్ట్రో ఆ పార్టీలో క్రియాశీల నేతగా కొనసాగారు. క్యూబా విప్లవ చుక్కాని అదేసమయంలో 1947 జూన్‌లో డొమినికన్ రిపబ్లిక్ నియంత రాఫెల్ ట్రుజిల్లో ప్రభుత్వాన్ని కూలదోసేందుకు సాగుతున్న పోరాటంలో పాల్గొ నాలని కాస్ట్రో ప్రయత్నించారు. డొమినికన్ రిపబ్లిక్కు బయలుదేరబోతున్న కాస్ట్రో వంటి తిరుగుబాటుదార్లను అమెరికా కనుసన్నల్లోని క్యూబా ప్రభుత్వం ముందే నిర్బంధంలోకి తీసుకుంది. అయినా విద్యార్థి ఉద్యమా లలో కాస్ట్రో కృషి కొనసాగింది. 1948 ఏప్రిల్‌లో బొగోటా, కొలంబియాలలో పర్యటించిన ఫిడెల్ అక్కడి విద్యార్థుల సభల్లో పాల్గొన్నారు. అదే ఏడాది ఆయన మిర్టా డియాజ్ బలార్ట్ను పెళ్లి చేసుకున్నాడు. నిరంతర కార్యాచరణ మధ్య 1950లో ఆయన న్యాయ శాస్త్రంలో డిగ్రీ పొందారు. ఫుల్జెన్సియో బాటిస్టా నాయకత్వాన 1952, మార్చి 10 న ప్రభుత్వ వ్యతిరేక సైనిక తిరుగుబాటు జరిగింది. బాటిస్టా దుర్మార్గ నిరంకుశ ప్రభుత్వానికి వ్యతి రేకంగా 1953, జూలై 26న కాస్ట్రో నాయకత్వంలో శాంటియాగో డి క్యూబా లోని మంకోడా సైనిక దుర్గంపై జరిగిన దాడి విఫలమైంది. కాస్ట్రోతో పాటు మరో 24 మందిని ప్రభుత్వం అరెస్టు చేసి, జైలు శిక్ష విధించింది. ఆ దాడి తర్వాత 60 మంది విప్లవకారులను బాటిస్టా ప్రభుత్వం హత్య చేసింది. అప్పటి నుంచి కాస్ట్రో నడిపిన ఉద్యమాన్ని జూలై 25 ఉద్యమంగా పిలవ సాగారు. ప్రజా ఉద్యమాల ఫలితంగా 1955 ఏప్రిల్‌లో కాస్ట్రో సహా తిరుగు బాటు నేతలంతా విడుదలయ్యారు. క్యూబాలోని విప్లవ కార్యక్రమాలపై ప్రభుత్వ నిర్బంధం పెరిగినందువల్ల కాస్ట్రో తన కార్య స్థానాన్ని మెక్సికోకు మార్చి, అక్కడి నుంచే సాయుధ గెరిల్లా పోరాటానికి సన్నాహాలు ప్రారంభిం చాడు. ఆయన సోదరుడు, ప్రస్తుత క్యూబా అధ్యక్షుడు రవుల్, ప్రపంచ యువ శక్తికి నేటికీ తలమానికమై నిలుస్తున్న చేగువేరా కూడా కాస్ట్రో బృందంలో ఉన్నారు. 81 మంది విప్లవకారులతో కాస్ట్రో ఒక నౌకలో 1950 డిసెంబర్ 2న క్యూబా చేరుకున్నాడు. రెండేళ్ళ పాటు కాస్ట్రో నాయకత్వంలోని రెడ్ ఆర్మీ ఎన్నో ఎదురుదెబ్బలు తిన్నప్పటికీ, 1959, జనవరి 1 నాటికి నియంత బాటిస్టాను క్యూబా నుంచి పారదోలింది. 1959 ఫిబ్రవరి 10న కాస్ట్రో క్యూబాకు మొదటి ప్రధాన మంత్రి అయ్యారు. దాదాపు ఆరేళ్ల తర్వాత 1965లో క్యూబా కమ్యూనిస్టు పార్టీని స్థాపించారు. అప్పటి నుంచి 2008 వరకు ఆయనే పార్టీకి, ప్రభుత్వానికి అధినేతగా ఉన్నారు. చేగువేరాతో స్నేహం అర్జెంటీనాకు చెందిన చేగువేరాకు 1955లో ఫిడెల్ కాస్ట్రోతో పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ దాదాపు పన్నెండేళ్లు విప్లవ పోరాటంలో కలిసి నడి చారు. క్యూబా విముక్తిలో భాగమయ్యారు. చేగువేరా కొంత కాలం పాటు క్యూబా ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసినప్పటికీ... 1962లో లాటిన్ అమెరి కాలోని మిగిలిన దేశాలకు విప్లవాన్ని విస్తరింపజేయాలని క్యూబా పౌరస త్వాన్ని, ప్రభుత్వ హోదాలను వదులుకున్నారు. కాస్ట్రో, చేగువేరా మధ్య అనేక సిద్ధాంత రాజకీయ చర్చలు జరిగేవి. అయితే ప్రభుత్వాన్ని నడపడంలో ఉన్న సమస్యలు, పరిమితులు చేగువేరాను కాస్ట్రోకు దూరం చేశాయి. ముఖ్యంగా విప్లవ సిద్ధాంతం విషయంలో కూడా ఇద్దరి మధ్య విభేదాలేర్పడ్డాయి. ఎన్ని విభేదాలున్నా కాస్ట్రో పట్ల చేగువేరా స్నేహపూర్వకమైన వైఖరితోనే ఉండేవాడు. ‘‘ఒకరాత్రంతా నేను ఫిడెల్ కాస్ట్రోతో మాట్లాడాను. ఆ రోజే ఆయన ఒక ఆసాధారణ వ్యక్తిగా నన్ను ఆకర్షించాడు. అసాధారణమైన పనులను సుసాధ్యం చేసే ఆయన సామర్థ్యం నన్ను ఎంతగానో ప్రభావితం చేసింది. క్యూబాకు చేరుకొని నియంత బాటిస్టాకు వ్యతిరేకంగా పోరాడి విజయం సాధించి దేశాన్ని విముక్తి చేస్తాననే విషయంలో కాస్ట్రోకు అచంచలమైన విశ్వాసం ఉండేది. చివరికి అది సాధించి చూపించారు’’ అని చేగువేరా ప్రముఖ రచయిత రికార్డోతో అన్నారు. అగ్రరాజ్యానికి కంటికి నిద్ర కరువు బ్రిటన్‌లోని ఛానల్ 4 రూపొందించిన డాక్యుమెంటరీ ప్రకారం అమెరికా, కాస్ట్రోపై 638 హత్యా ప్రయత్నాలు చేసిందని వెల్లడయ్యింది. అమెరికా గూడఛార సంస్థ అయిన సెంట్రల్ ఇంటలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ)ఈ దాడులకు రూపకర్తని కూడా ఆ డాక్యుమెంటరీ వెల్లడించింది. సిగరె ట్ల ద్వారా, లో దుస్తుల ద్వారా, భోజనంలో విషం కలిపి, పడక గదిలో ఇలా సీఐఏ కాస్ట్రోకు సకల యత్నాలూ చేసింది. అనేక మంది ప్రత్యక్ష సాక్షులను, చివరకు మాజీ సీఐఏ ఏజెంట్లను కూడా ఇంటర్వ్యూ చేసి ఈ డాక్యుమెంటరీని రూపొం దించారు. దాదాపు 50 ఏళ్లపాటు పలువురు అమెరికా అధ్యక్షులు ఈ కుట్రలో భాగస్వాములైన వైనాన్ని చానల్ 4 బయట పెట్టింది. ఇన్ని దాడులను ఎదుర్కొంటూ కూడా క్యూబాను పేదలు, కార్మిక వర్గ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా గల సోషలిస్టు దేశంగా నిలబెట్టడంలో ఫిడెల్ కాస్ట్రో తిరుగులేని విజయం సాధించారనేది సత్యం. క్యూబాలో కాస్ట్రో అమలు పరచిన సోషలిస్టు విధానాల ఫలితంగా ప్రజ లందరికీ విద్య, వైద్యం అందుబాటులోకి రావడమే కాదు, దేశంలో జరిగే ఉత్పత్తిలో కూడా ప్రజలకు నిజమైన భాగస్వామ్యం లభించింది. ఫలితంగా పెట్టుబడిదారీ విధానాన్ని అమలు చేసే మార్కెట్ శ క్తుల ప్రాబల్యం గణనీ యంగా తగ్గింది. అంతేకాదు, వివిధ వర్గాల ప్రజల మధ్య అంతరాలు తగ్గడం తోపాటూ, పౌరహక్కులకు రక్షణ కూడా పెరిగింది. కేంద్రీకృత పరిపాలనా విధానాలను అవలంబించడం వల్ల సరైన ఫలితాలను సాధించినప్పటికీ... పాలనలో ప్రజాస్వామ్యం లక్షణాలు కొరవడ్డాయన్న విమర్శను ఫిడెల్ కాస్ట్రో ఎదుర్కోవాల్సి వచ్చింది. ప్రపంచ అగ్రరాజ్యం పక్కనే ఉన్న ఓ చిన్న దేశం లోని సోషలిజాన్ని కాపాడుకోవడం కోసం కాస్ట్రో చేసిన దశాబ్దాల పోరాటం ప్రపంచాన్నే నివ్వెర పరిచింది. అది విశ్వవ్యాప్తంగా విప్లవ శక్తులకు ఊత మిచ్చింది. అమెరికాను ఎదిరించినిలిచే శక్తి ప్రపంచంలో ఇంకా మిగిలే ఉందని నిరూపించింది. పెద్ద పెద్ద దేశాల సార్వభౌమత్వాలనే పాదాక్రాంతం చేసుకున్న అగ్రరాజ్యానికి కంటి మీద కునుకులేకుండా చేసిన ఘనత క్యూబాది. ఆ విప్లవ పోరాటానికి ప్రపంచమే సలామంది. నికార్సయిన వర్గ ధృక్పథానికి, అలుపెరుగని విప్లవ కార్యదీక్షకు కాస్ట్రో జీవితమే ఉత్తమోత్తమ ఉదాహరణ. వారం క్రితం చేసినదే కాస్ట్రో చివరి ఉపన్యాసం అయితే కావచ్చు నేమో. కానీ, ప్రపంచ పెత్తందారీ దేశాలను గజగజలాడించిన అసంఖ్యా కమైన ఆయన ఉపన్యాసాలు, ఆయన పోరాటాలు నిరంతరం, తరం తరం పీడిత ప్రజలను మేల్కొల్పుతూనే ఉంటాయన్నది సత్యం. మల్లెపల్లి లక్ష్మయ్య, వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు మొబైల్: 97055 66213 -
కమ్యూనిజం, సోషలిజం, లెనినిజంల పోరాటం
రాముడు, కృష్ణుడు, శివుడు, బ్రహ్మ తదితరులు ఒకరిపై మరొకరు పోటీకి దిగారు గతంలో. ఇప్పుడు కమ్యూనిజయం, సోషలిజం, లెనినిజంలు ఒకే లక్ష్యంతో మూకుమ్మడిగా పోరాటం చేస్తున్నారు. మొదటి సంఘటన గతేడాది జరిగిన బిహార్ ఎన్నికల్లో చోటుచేసుకున్నదైతే, తాజాగా 'ఇజాల' పోరాటం తమిళనాడులో జరుగుతోంది. అసలింతకీ ఏమిటీ ఇజమ్స్..? సేలం జిల్లాకు చెందిన 48 ఏళ్ల మోహన్ కరడుగట్టిన వామపక్షవాది. ఆయన రక్తమేకాదు, మాట, చూపు, పని.. అన్నీ ఎరుపే. ఎరుపు కండువా లేనిదే ఇల్లు కదలడు. తన ముగ్గురు కొడుకులకు కూడా కమ్యూనిజం, సోషలిజం, లెనినిజం అని పేర్లు పెట్టుకున్నాడు. ఏళ్లుగా పార్టీకి చేసిన సేవలను దృష్టిలో పెట్టుకుని భారత కమ్యూనిస్ట్ పార్టీ (సీపీఐ) ఆయనకు వీరపాండి అసెంబ్లీ టికెట్ ఇచ్చింది. తండ్రి విజయం కోసం ఆ ముగ్గురు కొడుకులూ ప్రచారం నిర్వహిస్తున్నారు. పేరులోని వైవిధ్యత ఆ ముగ్గురికీ ఇప్పటికే విస్తృతమైన పరిచయాలున్నాయి. అలా తెలిసిన వాళ్లందరినీ కలిసి, 'కంకి కొడవలి' గుర్తుకు ఓటేయాల్సిందిగా అభ్యర్థిస్తూ తండ్రి విజయానికి కృషిచేస్తున్నారు కమ్యూనిజం, సోషలిజం, లెనినిజంలు. స్థానికంగా ఉంటూ గడిచిన ఏడాది కాలంగా లాయర్ గా ప్రాక్టీస్ చేస్తున్నాడు మోహన్ పెద్దకొడుకు కమ్యూనిజం. 'వెరైటీగా ఉండే నా పేరంటే నాకు చాలా గర్వం. పేరు చెప్పగానే చాలా మంది ఆశ్చర్యపోతారు. ఎందుకీ పేరు పెట్టారని ఆరాతీస్తారు. మా సీనియర్ లాయర్ నన్ను జూనియర్ గా చేర్చుకున్నది కూడా నా పేరు వల్లే'అని పేరు బలాన్ని మాటల్లో ప్రదర్శిస్తాడు కమ్యూనిజం. ఇక సోషలిజం, లెనినిజంలు ఆభరణాల తయారుచేసే వృత్తిలో కొనసాగుతున్నారు. తండ్రి గెలుపుకోసం ఇజాలు చేస్తున్న పోరాటం తమిళనాడు ఎన్నికల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. -
సమతా విప్లవ దార్శనికుడు
కొత్త కోణం దేశ వనరులపై సమాజానికి ప్రాతినిధ్యం వహించే ప్రభుత్వానికే హక్కులుండాలన్న అంబేడ్కర్‌కు పెట్టుబడిదారీ విధానంపై సైద్ధాంతిక స్పష్టత ఉన్నది. ప్రజలకు బ్రాహ్మణవాదం, పెట్టుబడిదారీ విధానం ఉమ్మడి శత్రువులనీ, రెండూ అసమానతలను పెంచి, పరిర క్షించేవేనని ఆయన స్పష్టం చేశారు. పెట్టుబడిదారీ విధానాన్ని కుల వ్యవస్థ మరింత క్రూరంగా అమలు చేస్తుందన్నారు. అదే నేడు రుజువైంది. నేటి బ్రాహ్మణవాదం కుల వ్యవస్థ, పెట్టుబడిదారీ విధానం కలగలిసిన ఆర్థిక ఆధిపత్య భావజాలం. ‘‘ప్రజాస్వామ్యం ఒక మనిషి-ఒక విలువ అన్న సూత్రానికి అనుగుణంగా నిలవాలంటే ఆర్థిక రంగాన్ని కూడా అలాగే నిర్వచించుకోవాలి. అనువైన వ్యవస్థను నిర్మించుకోవాలి. ప్రజాస్వామ్యం నిజమవ్వాలంటే ఆర్థిక వ్యవస్థ నిర్మాణాన్ని రాజ్యాంగంలో చేర్చుకోవాలి. పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని కొనసాగించడం, నియంతృత్వాన్ని తిరస్కరించడం, సామ్యవాదాన్ని స్థాపిం చడం దీనికి పరిష్కారం’’ అంటూ బాబాసాహెబ్ అంబేడ్కర్ తన ఆర్థిక విధా నాన్ని ప్రకటించారు. రాజకీయ ప్రజాస్వామ్యంతోనే సమానత్వం సాధ్యం కాదని, ప్రజల మధ్య ఆర్థిక అంతరాలను తొలగించాలని అంబేడ్కర్ చాలా సార్లు వివరించారు. అంబేడ్కర్ ఆలోచనా విధానాన్ని ప్రతిబింబించే ‘రాష్ట్రాలు-మైనారిటీలు’ (స్టేట్స్ అండ్ మైనారిటీస్) అనే డాక్యుమెంట్లో కూడా ఆయన ఇదే విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. అయితే ఇందులో ఉన్న చాలా అంశాలు భారత రాజ్యాంగంలో పొందుపరచడానికి వీలుకానివి. అటువంటి అంశాల్లో ముఖ్యమైనవి స్టేట్ సోషలిజం. పరిశ్ర మలు, సేవారంగం, ఆర్థిక సంస్కరణలు. భూమితో పాటూ ఇతర వనరుల న్నిటినీ ప్రభుత్వ ఆస్తులుగా ప్రకటించి, అదే వాటిని నిర్వహించాలనీ అప్పుడే ప్రజల మధ్య అంతరాల తొలగింపు సాధ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. దీనినే ‘అంబేడ్కర్ స్టేట్ సోషలిజం’గా పిలుస్తారు. అంబేడ్కర్ స్టేట్ సోషలిజం ఈ డాక్యుమెంటులోని నాలుగవ భాగంలో ఆర్థిక దోపిడీ నుంచి రక్షణలకు సంబంధించిన అంశాలను పొందుపరిచారు. అవి: 1. ప్రధాన పరిశ్రమలను నిర్వచించి, వాటినన్నిటినీ ప్రభుత్వ యాజమాన్యంలోనే నడపాలి. 2. మౌలిక పరిశ్రమలను ప్రభుత్వాలు లేదా అవి ఏర్పాటు చేసిన కార్పొరేషన్లు మాత్రమే నిర్వహించాలి. 3. బీమారంగాన్ని ప్రభుత్వాల ఆధీనంలోనే ఉంచి, వయోజనులంతా వారి సంపాదనకు సరిపోయేంతటి బీమా చేసేలా చట్టా లను రూపొందించాలి. 4. వ్యవసాయాన్ని పరిశ్రమగా మార్చాలి. అది ప్రభుత్వ హయాంలోనే కొనసాగాలి. అందుకుగాను భూమిని జాతీయం చేయాలి. ఇంతవరకు యజమానులుగా, కౌలుదార్లుగా, తన భూమిపైన హక్కులు అనుభవిస్తున్న ప్రైవేటు వ్యక్తులకు డిబెంచర్ల రూపంలో వారి హక్కులకు సరిపడా నష్టపరిహారం చెల్లించాలి. సమాజంలోని వనరులపైన సమాజానికి ప్రాతినిధ్యం వహించే ప్రభు త్వాలే హక్కులను కలిగి ఉండాలని అంబేడ్కర్ ప్రతిపాదించారు. వీటిని రాజ్యాంగంలో చేర్చడానికి నాటి రాజ్యాంగ సభ నాయకత్వం అంగీకరించ లేదు. అంబేడ్కర్ చెప్పినట్టుగా పరిశ్రమలు, బ్యాంకులు, బీమా సంస్థలను కొంతకాలం ప్రభుత్వాలు నడిపాయి. కాలక్రమేణా అవి కూడా ప్రైవేటుపరం అవుతున్నాయి. భూమికి సంబంధించిన ఆయన ఆలోచనలు ఏ ప్రభుత్వా లకూ పట్టలేదు. భూసంస్కరణల కోసం దున్నేవానికే భూమి నినాదాన్ని ఇచ్చిన కమ్యూనిస్టులు భూమి జాతీయీకరణను పట్టించుకోలేదు. పైగా దున్నేవానికే భూమి విధానం వల్ల అప్పటి వరకు జాగీర్దారులు, జమీందా రులు, భూస్వాముల చేతుల్లో ఉన్న భూమి కౌలుదారులుగా, వ్యవసాయదా రులుగా ఉన్న ఆధిపత్య కులాల చేతుల్లోకి వెళ్ళిపోయింది. అది నిచ్చెన మెట్ల కుల వ్యవస్థను మరింత పటిష్టం చేసింది. అంబేడ్కర్ కోరినట్లు భూమిని జాతీయం చేసి సమష్టి వ్యవసాయ విధానాన్ని కొనసాగించి ఉంటే... ప్రజల మధ్య అంతరాలు ఇంతగా పెరిగి ఉండేవి కాదనేది వాస్తవం. జాగీర్దారీ, జమీందారీ భూములపై యాజమాన్యం సాధించిన పై కులాలకు నీటి పారు దల సౌకర్యాలు, సబ్సిడీ ఎరువులు, పురుగు మందులు, బ్యాంకు రుణాలు అందుబాటులోకి రావడంతో సస్యవిప్లవం ద్వారా వారు సంపన్నులయ్యారు. ఆ సంపన్నులే క్రమంగా వ్యాపారాలు, సినిమాలు, కాంట్రాక్టులు తదితర రంగాల్లోకి విస్తరించి, రాజకీయ రంగాన్ని స్వాధీనం చేసుకొన్నారు. సామా జిక వ్యవస్థలో ఆధిపత్యంలో ఉన్న కులాలే ఆర్థిక రంగాన్ని సైతం ఆక్రమించి, రాజకీయ అధికారాన్ని హస్తగతం చేసుకున్నాయి. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆయా రాష్ట్రాల్లోని ఆధిపత్య కులాలే అధికారాన్ని చలాయిస్తున్నాయి. జాతీయీకరణే ఆర్థిక ప్రజాస్వామ్యానికి మార్గం ఈ పరిణామాలను ఊహించే అంబేడ్కర్ మౌలిక పరిశ్రమలు, కీలక ఆర్థిక సంస్థలతో పాటు భూమిని జాతీయం చేయాలన్నారు. దానికి అనుగుణంగానే ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని ప్రతిపాదించారు. మన రాజ్యాంగంలోని ఆర్టికల్ - 38ని ఆదేశిక సూత్రాలలో చేర్చడాన్ని ఆర్థిక ప్రజాస్వామ్య సాధనా కృషిలో భాగంగానే చూడాలి. 38వ ఆర్టికల్ క్లాజు-2లో పేర్కొన్నట్టు, ప్రజల ఆదా యాలలో ఉన్న అసమానతలను తొలగించానికీ, హోదాలు, సౌకర్యాలు, అవకాశాలలో ఉన్న అంతరాలను నిర్మూలించడానికీ రాజ్యం కృషి చేయా లనేది అంబేడ్కర్ లక్ష్యం. ‘‘మన లక్ష్యమైన ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని స్ఫూర్తిగా కలిగిన రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు చాలా విలువైనవని నా అభిప్రా యం. ఎందుకంటే, కేవలం పార్లమెంటరీ తరహా పాలన వల్ల మనం అనుకున్న లక్ష్యాలను సాధించలేం. ఆర్థిక రంగంలో సమానత్వం కోసమే రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలను పొందుపరిచాం’’ అన్న మాటలు అంబేడ్కర్ ఆర్థిక విధానానికి అద్దం పడతాయి. ‘‘స్టేట్ సోషలిజం భారత దేశపు సత్వర పారిశ్రామిక అభివృద్ధికి అత్య వసరం. ప్రైవేట్ వ్యాపార వర్గానికి అంతటి సామర్థ్యం లేదు. ఒకవేళ ప్రైవేట్ రంగానికి ప్రాముఖ్యత ఇచ్చినా దానివల్ల సంపదలో అసమానతలు పెరిగిపో తాయి. యూరప్‌లో ప్రైవేట్ పెట్టుబడులు సృష్టించిన అసమానతలు భారతీ యులకు గుణపాఠం కావాలి’’ అంటూ ఆనాడే అంబేడ్కర్ హెచ్చరించారు. ప్రైవేట్ రంగం ఆర్థిక వ్యవస్థను, పరిశ్రమలను, భూములను తమ గుప్పెట్లో పెట్టుకుంటే ఎటువంటి సమస్యలు వస్తాయో ఆనాడే సోదాహరణంగా వివరించారు. అవి ఈ రోజు మన కళ్ళ ముందు కనపడుతున్నాయి. ’’ప్రతి ఒక్కరూ ఏదో ఒక ఉద్యోగం సంపాదించుకోవాలనే ఆరాటం, సరిపడని జీతం, పరిమితిలేని పని గంటలు, కార్మిక సంఘాల్లో చేరే హక్కు మీద ఆంక్షలూ, కార్మిక కూలీ వర్గం భావప్రకటనా స్వేచ్ఛ, సంఘాన్ని ఏర్పర్చుకునే హక్కు, మత స్వేచ్ఛ వంటి వాటిపై దాడులూ జరుగుతుంటే మనుషులు ఏమైపోతారు’’ అన్న మాటలు నేటి ఉదారవాద ఆర్థిక విధానాలకు సరిగ్గా సరిపోతాయి. ప్రైవేటైజేషన్‌పై నాటి అంబేడ్కర్ అభిప్రాయాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. నేడు దేశంలో అమలులో ఉన్న పారిశ్రామిక విధానం, ప్రత్యేకించి స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఏర్పాటు తర్వాత కార్మికవర్గంలో అభద్రత నెలకొంది. స్టేట్ సోషలిజం వ్యక్తి స్వేచ్ఛకు భంగం కలిగించేది కాదని, నిజానికి అది వ్యక్తి స్వేచ్ఛను పరిరక్షిస్తుందనీ, ఇతరుల చేతుల్లో దోపిడీకి గురికావడం నుంచి కాపాడుతుందనీ ఆయన పేర్కొన్నారు. పెట్టుబడిదారీ దోపిడీని బలోపేతం చేసే కులం పెట్టుబడిదారీ విధానంపై అంబేడ్కర్‌కు సైద్ధాంతిక స్పష్టత ఉన్నది. భారత ప్రజలకు బ్రాహ్మణవాదం, పెట్టుబడిదారీ విధానం రెండూ ఉమ్మడి శత్రువులనీ, రెండింటిలో ఉన్న సామ్యం అసమానతలను పెంచి, పరిర క్షించడమని ఆయన స్పష్టం చేశారు. కుల వ్యవస్థ పెట్టుబడిదారీ విధానాన్ని మరింత క్రూరంగా, అవమానంగా అమలు చేస్తుందని అభిప్రాయపడ్డారు. అదే నేడు రుజువైంది. నేటి బ్రాహ్మణవాదం కుల వ్యవస్థ, పెట్టుబడిదారీ విధానం కలగ లిసిన ఆర్థిక ఆధిపత్య భావజాలం. ఇటీవల కొందరు దళిత పెట్టుబడి దారులనే వాదనను ముందుకు తెస్తూ, దాన్ని అంబేడ్కర్ సిద్ధాంతంగా ప్రచారం చేసుకుంటున్నారు. దళితుల ఆర్థిక సాధికారత అంటే గుప్పెడు మంది పురోగతి కాదు. ఇక ప్రపంచీకరణ వల్ల దళితులు అభివృద్ధి చెందు తారనే మాయావాదం పూర్తి సైద్ధాంతిక దౌర్భాగ్యం. ఒకరో, ఇద్దరో దళితులు పారిశ్రామికవేత్తలు కావచ్చునేమో... అంతమాత్రాన దానినే సార్వత్రిక సత్యంగా ప్రచారం చేయడం అంబేడ్కర్ పేరును తమ స్వార్థానికి వాడు కోవడం మాత్రమే. దేశంలోని కొన్ని కులాలు మాత్రమే పెట్టుబడిదారీ రంగం లోకి, పారిశ్రామిక వాణిజ్య వ్యవస్థలలోకి ప్రవేశిస్తున్నాయి. అసమానతకు పునాదిగా ఉన్న కుల వ్యవస్థకు పరిష్కారంగా అంబేడ్కర్ స్వేచ్ఛ, సమా నత్వం, సోదరత్వం లక్ష్యాలను ప్రతిపాదించారు. స్వేచ్ఛ, సమానత్వం లాంటి విషయాలపట్ల అంతర్జాతీయంగా ఒకే రకమైన భావన ఉంటుంది. అయితే మన దేశంలో సోదరత్వంతో పాటూ ఈ రెండూ ప్రత్యేక స్వభావంగలవే. అంబేడ్కర్ మాటల్లో చెప్పాలంటే, సోదరత్వానికి మరోపేరు ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యమంటే కేవలం ఒక పరిపాలనా విధానం, రాజకీయ వ్యవస్థ మాత్రమే కాదు. ప్రజాస్వామ్యం ప్రజల జీవితంలో భాగంగా ఉండాలి. అంతా సమానులేననే భావన అందరికీ ఉండాలి. అందుకే అంబేడ్కర్ సోదరత్వ సాధనకు కుల నిర్మూలనను ప్రతిపాదించారు. సోషలిజాన్ని, ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని సవివరంగా విశ్లేషించి, సకల రంగాల్లో ప్రజాస్వామ్యం నెలకొనాలని ఆశించిన అంబేడ్కర్‌ని సంఘసంస్కర్తగానో, పెట్టీ బూర్జువా గానో భావించడంలో అర్థం లేదు. ఆయన సమసమాజాన్ని స్వప్నించిన నిజమైన విప్లవకారుడు. నేడు బాబాసాహెబ్ అంబేడ్కర్ 125వ జయంతి మల్లెపల్లి లక్ష్మయ్య, వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు మొబైల్: 97055 66213 -
అమెరికాలో సోషలిజం! విప్లవం!!
పరస్పర విరుద్ధ భావజాల ప్రతినిధులైన బెర్నీ శాండర్స్, డొనాల్డ్ ట్రంప్‌లు అధ్యక్ష అభ్యర్థుల రేస్‌లో దూసుకు పోతుండటం విశేషం. అయితే ఆ ఇద్దరూ అతి కొద్ది మంది ప్రయోజనాల కోసమే పనిచేస్తున్న ప్రస్తుత వ్యవస్థ మరణాన్నే కోరుతున్నారు. అద్భుతాలు సంభవించడం ఎన్నటికీ ముగిసిపోదని ఒకటికి పదిసార్లు విన్నాం. బహుశా ఇప్పుడు మనం మాటలకందని అద్భుతమైన అద్భుతాన్ని చూస్తున్నాం. అమెరికా అధ్యక్ష పదవిని అందుకునే పరుగులో సోషలిస్టునని చెప్పుకునే బె ర్నీ శాండర్స్ విశ్వసనీయతగల అభ్యర్థిగా ఆవిర్భవించారు. విద్యావంతుని నడవడిక, 1970ల నాటి వామపక్షవాది మాటతీరు, ప్రవర్తనగల తల నెరసిన ఆయన, ఉత్సాహం తో సందడి చేస్తున్న శ్రోతలకు తన అభ్యర్థిత్వమే విప్లవానికి నాంది అని చెపుతున్నారు. సోషలిస్టు, విప్లవం! స్వేచ్ఛా విపణి పెట్టుబడిదారీ గడ్డ మీద, ధైర్యవంతుడైన పౌరుని దేశంలో ఏం జరుగుతోంది? సమాధానం క్లిష్టమైనదేమీ కాదు. యువత మరోసారి వెల్లువై విరుచుకుపడుతోంది. దేశ సంపదను విపరీత స్థాయిలో సొంతం చేసుకుంటున్న ఒక్క శాతం జనాభాకు అతిగా అనుకూలంగా ఉన్న ద్రవ్య వ్యవస్థతో వారు విసిగిపోయారు. ఒక్క దశాబ్దానికి ముందు అమెరికన్ రాజకీయవేత్త ఎవరైనా సోషలిజం అనే భయానక భావజాల వ్యాధి తనకు సోకిందని చేప్పేటంతటి మూర్ఖతాన్నిప్రదర్శిస్తే... రాజకీయ పిచ్చాసుపత్రికి సమానార్థక స్థానంలో ఇరుక్కుపోయేవారు. ప్రపంచంలోని అత్యంత ప్రబలమైన ఆర్థిక అగ్రదేశంలో వామపక్షమన్నది ఎన్నడూ లే దని దీనర్థం కాదు. దురదృష్టకరమైన 1970లు, 1980లలో రాల్ఫ్ నాదిర్ వంటి నేతలుండేవారు. కానీ వారు వినియోగదారుల కార్యకర్తలు, ట్రేడ్ యూనియనిస్టులు. వారిది పరిమిత ఎజెండా. జాతీయ అధ్యక్ష పోటీ స్థాయికి చేరగలిగినా, ఎన్నడూ వారికి రెండు శాతానికి మించి ఓట్లు రాలేదు. అయినా వారు, ఉత్పత్తులలో మెరుగుదలను, ఆచరణాత్మక సంస్కరణలను సాధించగలిగారు. దీంతో వారి ఉద్యమ లక్ష్యాలు పాక్షికంగా నెరవేరాయి. అయితే 20వ శతాబ్దంతో పాటే వారు కూడా తెరమరుగైపోయారు. వారి సాఫల్యమే వారికి కాలదోషం పట్టించేసింది. వాల్‌స్ట్రీట్ బడా బాబులు ఆర్థికారణ్యానికి అధిపతులుగానే మిగిలి.... చాకచక్యంతోనే కోటీశ్వరులు కావచ్చనే కలను మధ్యతరగతికి పంచి పెడుతున్నారు. తమ నాయకత్వానికి ముప్పు కలిగే పొరపాటు చేయకుండా, ప్రశాంతంగా పెట్టుబడిదారీ విధానాన్ని పునర్నిర్వచిస్తున్నారు. వారి మంత్రం పారింది. పెట్టుబడిదారీ విధానం అంటే జాతీయ జెండాకు సమానార్థకమనే ఆ పంథాను ఓటర్లు భారీ ఆధిక్యతతో ఆమోదించారు. ఇక వారు ఎవరిని తప్పు పట్టాలి? ఈ పంథా ఒక రికార్డును స్థాపించింది. అవకాశాలు, ఆదాయాల వృద్ధితో సామాన్యుల జీవితాలు మెరుగుపడటం ఇచ్చిన దన్నుతో ఆ మార్గం అమెరికాను ప్రపంచంలోనే సంపన్న దేశంగా మార్చింది. దీంతో అమెరికన్లు సోషలిజం అన్న మాట వినబడితేనే ముప్పుగా భావించే పరిస్థితి నిజంగానే ఏర్పడింది. రెండవ ప్రపంచ యుద్ధానంతర కాలపు రెండు తరాలు సోవియట్ యూనియన్ వ్యతిరేక ప్రచ్ఛన్న యుద్ధపు ముప్పును ఎదుర్కొన్నాయి. అది ఆ శతాబ్దపు ద్వితీయార్ధ భాగాన్ని నిర్వచించేది. అస్తిత్వవాద ఆందోళన భయం తప్ప మరేదీ కల్పించలేనంతటి ఉద్విగ్నతతో, ఉద్వేగంతో ఆ సంఘర్షణ సాగింది. అణు యుద్ధంతో మానవాళి అంతమైపోతుందనే భయం వెన్నాడుతుండేది. ప్రచ్ఛన్న యుద్ధంలో అమెరికా విజయం సాధించింది. ఇది పరాజయం పాలైన మార్కెట్ తాత్వికతపై నమ్మకాన్ని తార్కికంగా బలోపేతం చేసింది. ఇక అమెరికన్ మితవాద విజయమే దాని పతనానికి కారణమైంది. ఈ శతాబ్ది మొదటి దశాబ్దంలో ద్రవ్య వ్యవస్థ కుప్పకూలడమే ఆ కీలకమైన మలుపు. రోగ నిర్ధారణ జరిగింది. అది, దురాశ లేదా మరింత కచ్చితంగా చెప్పాలంటే నమ్మశక్యం కానంతటి ధన దుర్దాహం. అదాయ వ్యత్యాసాలు నిరాశాజనకమైన అత్యధిక స్థాయిలకు చేరాయి. గృహ రుణాల మార్కెట్ కుప్పకూలడంతో బాహాటంగానే పట్టుబడ్డా, బ్యాంకర్లు తప్పులకు అతీతులన్నారు. కుప్పకూలిన వ్యవస్థ నిర్మాతలను దానికి బాధ్యత వహించమనడానికి బదులు వాల్‌స్ట్రీట్‌కు ఉద్దీపనలను అందించారు. తక్షణమే దీనికి ప్రతిచర్య కలుగలేదు. కానీ అది రాక తప్పనిదే. మొదట పుస్తకాలు దాన్ని రుజువుచేశాయి, తర్వాత సినిమాలు కళ్లకు కట్టాయి. శతాబ్దం పాటూ హీరోగా చలామణి అయిన వాల్‌స్ట్రీట్ విలన్ అయింది. తాజా హిట్ ‘ద బిగ్ షార్ట్’, తమకు తామే చట్టంగా మారిన బ్యాంకర్ల అజరామర త్వాన్ని దుయ్యబట్టేదే. జనబాహుళ్యపు సంస్కృతిలో స్థిరపడ్డ పదం అర్థాన్ని మార్చడం తేలికేం కాదు. ‘సోషలిజం’ ప్రజా చర్చలో ఎలా ఆమోదాన్ని పొందగలుగుతుంది? ‘సీఎస్ఎస్’ టెలివిజన్ చర్చలో దీనికి సమాధానం దొరికింది. అమెరికన్ వార్తా కార్యక్రమాలు కఠినమైనవి. అదృష్టవశాత్తూ ఎవర్నీ కేకలు వేయనివ్వరు. సిగపట్లన్నిటినీ వీక్షకులకే వదిలేస్తాయి. ఎవరు ఏం మాట్లాడుతున్నారో మీరు నిజంగానే వినగలుగుతారు. ‘సోషలిస్టు’ పదం రాజకీయాల్లో శిఖరాగ్రానికి చేరినందుకు అత్యంత మితవాద రాజకీయ శిఖరమైన ‘ఫాక్స్ న్యూస్’ కు కృతజ్ఞతలు తెలుపుకోవాల్సి ఉన్నదని అత్యంత కుశాగ్రబుద్ధియైన ఒక వ్యాఖ్యాత ఒకరు అన్నారు. దాదాపు తొమ్మిదేళ్లుగా ఫాక్స్ న్యూస్ ఒబామానును తిట్టిపోస్తున్నానని అనుకుంటూ, సోషలిస్టుగా అభివర్ణిస్తోంది. కానీ వీక్షకులు మాత్రం ఒబామా చేస్తున్న పనులను మెచ్చుతున్నారు. ఇదే నిజంగా సోషలిజమైతే, దాంతో తమకే సమస్య లేదని భావిస్తున్నారు. అద్భుతం! ఆశ్చర్యకరంగా శాండర్స్‌తో పాటూ ఆయనకు పచ్చి వ్యతిరేకి డొనాల్డ్ ట్రంప్ సైతం ప్రాబల్యం పెంపొందించుకోవడం అత్యంత అసక్తికరమైన మలుపు. సంప్రదాయక అధికారాలకు, అత్యంత ప్రముఖమైన డబ్బు అధికారానికి అంటిపెట్టుకున్న వ్యవస్థకు వ్యతిరేకంగా వారిద్దరూ మధ్యతరగతిని, పేదలను రెచ్చగొడుతున్నారు. ట్రంప్ గావు కేకలు వేసేవాడు, శాండర్స్ మృదుభాషి,. ట్రంప్ జాత్యహంకారి, శాండర్స్ కలుపుకొనిపోయే బాపతు. అయితే ఒకరు మితవాద పక్ష తిరుగుబాటుకు నేతయితే, మరొకరు వామపక్ష తిరుగుబాటుకు నేతృత్వం వహిస్తున్నారు. అతి కొద్ది మంది ప్రయోజనాల కోసమే పనిచేస్తున్న ప్రస్తుత వ్యవస్థ మరణాన్నే ఇద్దరూ కోరుతున్నారు. పదిహేను రోజుల్లో ఈ పరిస్థితి ఎలా మారుతుందో ఎవరికీ తెలియదు. చివరికి ఏమౌతుందనేది అసలే తెలియదు. కానీ ఒక్కటి మాత్రం ఖాయం. అమెరికన్ మారాడు. రాజకీయాలూ తదనుగుణంగా మారాల్సిందే. - వ్యాసకర్త పార్లమెంటు సభ్యులు బీజేపీ అధికార ప్రతినిధి ఎం.జె. అక్బర్, సీనియర్ సంపాదకులు -
లౌకిక, సామ్యవాద పదాలను తొలగించం: కేంద్రం
న్యూఢిల్లీ: రాజ్యాంగ ప్రవేశికలోని లౌకిక, సామ్యవాద పదాలపై చర్చ జరగాలని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై మంగళవారం లోక్‌సభలో విపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. జీరో అవర్‌లో జ్యోతిరాదిత్య సింధియా(కాంగ్రెస్) ఈ అంశాన్ని లేవనె త్తారు. మంత్రి వెంక య్యనాయుడు స్పందిస్తూ.ఈ పదాలను తొలిగించే ప్రతిపాదనేదీ ప్రభుత్వం వద్ద లేదని స్పష్టం చేశారు. -
'సోషలిజాన్ని అనుసరించి ఉండాల్సింది'
సీతంపేట: దేశంలో రిజర్వేషన్ల అమలుకు చట్టబద్ధమైన వ్యవస్థ లేదని సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారత్ అన్నారు. విశాఖపట్నం జిల్లాలో సీపీఐ(ఎం) 21వ అఖిల భారత మహాసభలలో భాగంగా బుధవారం అంబేద్కర్ భవన్లో ‘ప్రైవేటు రంగం, రిజర్వేషన్లు’ అనే అంశంపై నిర్వహించిన సెమినార్లో ఆమె ప్రసంగించారు. స్వాతంత్య్రానంతరం పెట్టుబడిదారీ వ్యవస్థను కాకుండా సోషలిజాన్ని అనుసరించి ఉంటే కుల, మత, అసమానతలు లేని గొప్ప ప్రజాస్వామ్య భారతదేశం ఆవిష్కృతమయ్యేదని అభిప్రాయపడ్డారు. దేశంలో రిజర్వేషన్లు ఒక వివాదస్పదమైన అంశమని, ఎందుకు వివాదస్పదమైనదో సులువుగా అర్థం చేసుకోవచ్చన్నారు. శతాబ్దాల నుంచి దేశంలో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు అమలుచేస్తున్నా వారి పరిస్థితుల్లో పెద్దగా మార్పు కన్పించడం లేదని తెలిపారు. కేవలం పారిశుద్ధ్యం, చేతివృత్తులకే దళిత వర్గాలు పరిమితమయ్యాయని, అత్యున్నత స్థానాలు వారికి దక్కడం లేదని బృందా కారత్ ఆవేదన వ్యక్తంచేశారు. 2010లో ప్రభుత్వ సర్వేల ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో ఇతర కులస్థులు 41 శాతం ఉపాధి పొందగా, ఎస్సీ, ఎస్టీలు కేవలం 14 శాతం మాత్రమే ఉపాధి పొందారని స్పష్టమైందని ఆమె తెలిపారు. అలాగే పట్టణ ప్రాంతాల్లో ఇతర కులస్థులు 37 శాతం ఉపాధి పొందగా, దీనిలో మూడవ వంతు షెడ్యూల్ కులాలు ఉపాధి పొందుతున్నట్లు సర్వేలలో స్పష్టమైందన్నారు. ఈ పరిస్థితులలో మార్పు రావడానికి ప్రభుత్వాలు ప్రత్యేక వ్యవస్థ, విధానాలు అనుసరించాలని బృందా కారత్ కోరారు. -
కమ్యూనిస్టు ఐక్యతే విప్లవ మంత్రం
సోవియట్ యూనియన్‌లో సోషలిజం విచ్ఛిన్నం, చైనా పెట్టుబడిదారీ పంథాలో పోతున్నదన్న అవి శ్వాసం, ఏక ధ్రువ ప్రపంచంగా పెట్టుబడిదారీ విధానం విస్తరణ వంటి అంతర్జాతీయ పరిణామాలు కమ్యూనిజంపై చూపుతున్న ప్రభావం తక్కువ కాదు. జాతీయంగా ప్రపంచీకరణ, ఉదార ఆర్థిక విధా నాల పేరిట పెట్టుబడిదారులకు ఎర్రతివాచీ పరచే ధోరణి పెరిగింది. ఇవన్నీ కలసిన నేటి పరిస్థితులు కమ్యూనిజం పట్ల వ్యతిరిక్త ప్రభావాన్ని చూపుతున్నాయని విస్మరించలేం. 1964 చీలిక ఆ తర్వాత నక్సలైట్ల చీలికకు అవకాశం ఇచ్చింది. ఇకపై సీపీఎమ్ కమ్యూనిస్టు ఐక్యతకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ నిట్టనిలువుగా చీలిపోగా 1964 నవంబర్‌లో భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) ఏర్పడింది. ప్రధాన జాతీయ కమ్యూని స్టు పార్టీయైన సీపీఐఎమ్ ఈ నవంబర్ మాసంలో పార్టీ ఆవిర్భావ అర్ధ శతాబ్ది ఉత్సవాలను జరుపుకుంటోంది. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ, తప్పు టడుగులను వేస్తూ, భౌతిక పరిస్థితులకు ఎదురీదుతూ సాగింది దాని ప్రస్థానం. నేడు ఎంతగా బలహీనపడినా అదే దేశంలోని పెద్ద కమ్యూనిస్టు పార్టీ! ‘‘తీవ్ర ప్రతికూల పరిస్థితులలో కూడా జెండాను దించకుండా నిలబెట్టడమే ప్రధాన కర్తవ్యం, అభినందనీయం’’ అని ఏంగెల్స్ అన్నారు. సరిగ్గా అలాగే కృషి చేస్తున్న సీపీఎమ్ కార్యకర్తలకు పార్టీ 50వ జయంతి అభినందనలు! రష్యా మార్గమా? చైనా మార్గమా? 1964లో పార్టీ ఎందుకు చీలిపోవాల్సి వచ్చింది? ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ నేతృత్వంలో 1946-51 మధ్య సాగిన వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం పార్టీ చరిత్రలోని సువర్ణాధ్యాయం. ఆ సందర్భంగానే పోరాట నాయ కత్వానికి గతంలో ఎన్నడూ ఎరగని సైద్ధాంతిక, ఆచరణాత్మక సమస్యలు ఎదు రైనాయి. ఉదాహరణకు, నెహ్రూ సేనల ప్రవేశంతో నిజాం సంస్థానం భారత్‌లో విలీనమైన తదుపరి పరిస్థితులనే చెప్పుకోవచ్చు. నెహ్రూ సేనలు కమ్యూనిస్టు లను, వారి నేతృత్వంలోని రైతాంగ సాయుధ పోరాటాన్ని ప్రధాన శత్రువులుగా ఎంచి దమనకాండ సాగించాయి. ఆ దశలో సాయుధ పోరాటాన్ని కొనసాగిం చాలా? విరమించాలా? అనే తక్షణ ఆచరణాత్మక సమస్యతో పాటూ, భారత విప్లవ పంథా చైనాలో వలే ఉంటుందా? లేక రష్యాలో వలే ఉంటుందా? అనే ముఖ్య సైద్ధాంతిక సమస్య కూడా ముందుకొచ్చింది. పార్టీలో విభేదాలు తలెత్తాయి. ఆ అంతర్గత ఆ సమస్యలకు పరిష్కారం సాధించలేక నాటి పార్టీ నాయకత్వం ప్రపంచ విప్లవ కేంద్రమైన సోనియట్ యూనియన్ పార్టీని సంప్రదించడానికి మాస్కోకు ఒక రహస్య ప్రతినిధి బృందాన్ని పంపింది. స్టాలిన్ తదితర ముఖ్య పార్టీ నేతలతో సుదీర్ఘ చర్చల అనంతరం తెలంగాణ పోరాటంపై, ప్రత్యేకించి భారత విప్లవ మార్గంపై నాయకత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. అలా రూపొందినదే 1951 నాటి ‘ఎత్తుగడల పంథా’. అదే ‘‘కిషన్ డాక్యుమెంటు.’’ దాని ప్రకారం 1) భారత విప్లవ మార్గం శాంతియుతం కాదు. 2) అలా అని అది మక్కీకి మక్కీగా రష్యా మార్గమో, చైనా మార్గమో కాదు. 3) భారత ప్రత్యేక పరిస్థితులను, ప్రత్యేకించి నెహ్రూకు ఉన్న ప్రతిష్ట, దేశానికి కొత్తగా స్వాతంత్య్రం లభించడం వంటి పరిస్థితుల దృష్ట్యా... పార్లమెంటరీ పోరాటాలు,పార్లమెంటరీయేతర పోరాటాలు (సాయుధ పోరాటం సహా) రెంటినీ అవకాశాలు, అవసరాలకు అనుగుణంగా వినియోగించుకుంటూ సాగేదిగానే పార్టీ విప్లవ పంథా ఉంటుందని దాని సారాంశం. ఆశించినట్టు ‘ఎత్తుగడల పంథా’ పార్టీలో ఐక్యతను సాధించలేకపోయింది. చీలిక... ఆ పై మరో చీలిక విభేదాలు కొనసాగి, క్రమేమీ నాయకత్వంలో పరస్పర అవిశ్వాసం నెలకొంది. చివరికది పరస్పరం నిర్మాణపరమైన చర్యలను చేపట్టే స్థితికి దారితీసింది. నేడు సీపీఐగా ఉన్న వారి వాదన స్థూలంగా ఇదీ...‘‘భారతదేశం నేడు నెహ్రూ నేతృ త్వంలోని కొంత వరకు అభివృద్ధికాముకమైన, దేశభక్తియుతమైన జాతీయ పెట్టుబడిదారీ వర్గం చేతుల్లో ఉంది. అది అభివృద్ధి నిరోధక శక్తుల, సామ్రా జ్యవాదుల ఒత్తిళ్ల నుండి బయటపడి, పురోగమించేందుకు నెహ్రూ ప్రభుత్వానికి సహకరించాలి.’’ అందుకు భిన్నంగా ‘‘కాదు, నెహ్రూ ప్రభుత్వం విదేశీ పెట్టుబడులతో మిలాఖతైన గుత్తపెట్టుబడిదారీ నాయత్వంలోని భూస్వామ్య పెట్టుబడిదారీ ప్రభుత్వం. కార్మికవర్గ నేతృత్వంలో దాన్ని బలవంతంగా కూలదోయడం మినహా మరో మార్గం లేదు’’ అనేది నేడు సీపీఎమ్గా ఉన్నవారి వాదన. దీనికి తోడు అంతర్జాతీయంగా సోషలిస్టు దేశాలైన రష్యా, చైనాల మధ్య తీవ్ర సైద్ధాంతిక విభేదాలు తలెత్తాయి. భారత-చైనా సరిహద్దు వివాదం ముదిరి యుద్ధానికి దారితీసింది. ఆ యుద్ధంపై వైఖరిలోనూ అభిప్రాయభేదాలు వచ్చాయి. ఫలితంగా పార్టీలోనే రెండు శిబిరాలుగా పని చేస్తున్న వర్గాలు 1964లో చీలిపోయి, సీపీఐ, సీపీఎమ్లుగా ఆవిర్భావించాయి. ఆనాటికి బెంగాల్, కేరళ రాష్ట్రాల్లో సీపీఎమ్ పెద్ద పార్టీ. తొలి రెండు మూడేళ్లలో సీపీఎమ్ వడివడిగా అభివృద్ధి చెందింది. ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీగానే 1957లో కేరళలో తొలి కమ్యూనిస్టు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడింది. సీపీఎమ్ ఏర్పడిన తదుపరి అక్కడ వామపక్ష ప్రజా ప్రభుత్వం వస్తూ పోతూ ఉంది. ఇక బెంగాల్లో సీపీఎమ్ నేతృత్వంలోని వామపక్ష ప్రభుత్వం ఏకధాటిగా దాదాపు మూడున్నర దశాబ్దాలు అధికారంలో ఉంది. 1967లో బెంగాల్లో సీపీఎమ్ ప్రభుత్వం అధికారంలో ఉండగా ‘నక్సల్బరీ’ ప్రాంతంలోని స్థానిక సీపీఎమ్ నేత చారుమజుందార్ నేతృత్వంలో భూమి కోసం పోరాటం ప్రారంభమై, క్రమంగా అది ప్రభుత్వాన్ని సాయుధం గా ఎదుర్కునే స్థితికి చేరింది. శాంతిభద్రతలను పరిరక్షించే కర్తవ్యం’లో భాగంగా సీపీఎమ్ ప్రభుత్వం నక్సల్బరీ ఉద్యమాన్ని సాయుధ బలగాలతో అణచివేయబూనుకుంది. దీంతో ‘‘భారదేశంలో సోషలిజం సాధనా మార్గం శాంతియుతం కాదు’’ అంటూ సీపీఐ నుండి బయటపడ్డ సీపీఎమ్ తమ పార్టీ సభ్యులు, సానుభూతిపరుల నుండే తీవ్ర విమర్శలను ఎదుర్కోవల్సి వచ్చింది. ‘‘విప్లవమార్గమని కబుర్లు చెబుతూ, కేరళ, బెంగాల్ అంటూ, ఎన్నికల చుట్టూ తిరుగుతున్నారు. విప్లవ పార్టీ నిర్మాణానికి పూనుకోవడం లేదు. సీపీఐ వలెనే నయా రివిజనిస్టు పంథాలో నడుస్తున్నారు. మీరు నయా రివిజనిస్టులు’’ అని విమర్శిస్తూ చారుమజుందార్ నక్సలిజం సిద్ధాంతంతో ఒక కొత్త పార్టీ వచ్చింది. దేశవ్యాప్తంగా సీపీఎమ్‌లో వచ్చిన ఈ చీలిక మన రాష్ట్రంలో తీవ్ర నష్టాన్ని కలుగజేసింది. ఆ నక్సలిజం కూడా రెండు డజన్లకు పైగా గ్రూపులుగా చీలింది. సాయుధపోరాటమే ఏకైక మార్గమని జపం చేస్తూ మావోయిస్టులు మాత్రమే అక్కడక్కడా సాయుధ పోరాటం సాగిస్తున్నారు. కమ్యూనిస్టు ఐక్యత నేటి ఆవశ్యకత బెంగాల్, కేరళలలోని వామపక్ష ప్రభుత్వాలు తొలి నాళ్లలో ప్రజాభిమానాన్ని చూరగొన్నాయి. ప్రత్యేకించి బెంగాల్ ప్రభుత్వం మొదట్లో భూసంస్కరణలు, కౌలుదార్ల రక్షణ, కార్మిక హక్కుల పరిరక్షణ, స్థానిక స్వపరిపాలన, పంచాయితీలకు అధికారాలు, పారదర్శక పాలన, మతసామరస్య పరిరక్షణ వంటి ప్రజానుకూల, పురోగామి చర్యలతో ఆదర్శంగా నిలిచింది. దేశవ్యాప్తంగా కార్యకర్తలను ఉత్తేజితం చేసింది. కానీ సుదీర్ఘ కాలం పార్లమెంటరీ మార్గంలో ఎన్నికల ఎత్తుగడల పేరిట పెట్టుబడిదారీ, భూస్వామ్య పార్టీలతో సీపీఎమ్ పొత్తులు నెరపింది. ఆ పార్టీల్లోని అవలక్షణాలు పార్టీ కార్యకర్తలకూ సోకాయి. తమ పార్టీలో కూడా ‘‘స్వార్థం, పదవీ వ్యామోహం, అహంభావం, ఆడంబరం, ధనార్జనా కాంక్ష’’ కనిపిస్తున్నాయని సీపీఎమ్ బహిరంగంగా ఆత్మవిమర్శ చేసుకుంది కూడా! తొలి తరం నేతలకున్న ప్రతిష్ట, పలుకుబడి తర్వాతి తరం నేతలకు లేకపోవడం సహజమే. కానీ పార్టీలో నేడు కేంద్రీకృత ప్రజాస్వామ్యం పేరిట నాయకత్వ కేంద్రీకృత నియంతృత్వం చోటు చేసుకుంది. వీటన్నిటికి మించి సోవియట్ యూనియన్‌లో సోషలిజం విచ్ఛిన్నం కావడం, చైనా పెట్టుబడిదారీ పంథాలో పోతున్నదన్న అవిశ్వాసం, ఎదురులేని ఏక ధృవ ప్రపంచంగా పెట్టుబడిదారీ విధానం విస్తరణ వంటి అంతర్జాతీయ పరిణామాల ప్రభావం తక్కువ కాదు. జాతీయంగా ప్రపంచీకరణ, ఉదార ఆర్థిక విధానాల పేరిట పెట్టుబడిదారులకు ఎర్రతివాచీ పరచే ధోరణి పెరిగింది. ఇవన్నీ కలగలిసిన నేటి భౌతిక వాస్తవిక పరిస్థితులు కమ్యూనిజం పట్ల వ్యతిరిక్త ప్రభావాన్ని చూపుతున్న విషయం మరచిపోలేం. ‘‘చీలి ముక్కలు ముక్కలుగా ఉన్న కార్మిక వర్గం విప్లవాన్ని సాధించలేదు’’అని జర్మనీ గురించి మార్క్స్ ఒకప్పుడు చెప్పారు. 1964 పార్టీ చీలికే ఆ తర్వాత నక్సలైట్ల చీలికకు అవకాశం ఇచ్చింది. మరెన్నో చీలకలకు మార్గమైంది. కాబట్టి పార్టీ 50వ జయంతి సందర్భంగా ఇకపై సీపీఎమ్ కమ్యూనిస్టు పార్టీల ఐక్యతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. కనీసం సమరశీల ఐక్య కార్యాచరణకైనా దిగాలి. మహత్తర ప్రజా ఉద్యమమే ప్రస్తుత అనైక్యతకు మందు. అంబేద్కర్, ఫూలేల వంటి మహనీయుల ఆశయాలను ఇముడ్చుకుని కష్టజీవులు, దళితులు, గిరిజనులు, మహిళలు, మైనారిటీలు, తదితర అభివృద్ధి కాముకులను కలుపుకుని కమ్యూనిస్టులు పురోగమిస్తారనీ,‘‘1964’’ను పునరావృతం కానీయరని ఆశించవచ్చునా? (వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు, మొబైల్: 98480 69720) ఎ.పి.విఠల్