![నిరంతర విప్లవ స్ఫూర్తి](/styles/webp/s3/article_images/2017/09/3/51428202434_625x300.jpg.webp?itok=jDizGEJa)
నిరంతర విప్లవ స్ఫూర్తి
కొత్త కోణం
ప్రపంచ అగ్రరాజ్యం పక్కనే ఉన్న ఓ చిన్న దేశంలోని సోషలిజాన్ని కాపాడుకోవడం కోసం కాస్ట్రో చేసిన పోరాటం ప్రపంచాన్నే నివ్వెర పరచింది. క్యూబాలో కాస్ట్రో అమలు పరచిన సోషలిస్టు విధానాల ఫలితంగా ప్రజలందరికీ విద్య, వైద్యం అందుబాటులోకి వచ్చాయి. ఉత్పత్తిలో కూడా ప్రజలకు నిజమైన భాగస్వామ్యం లభించింది. ఫలితంగా పెట్టుబడిదారీ విధానాన్ని అమలుచేసే మార్కెట్ శక్తుల ప్రాబల్యం తగ్గింది. అంతేకాదు, వివిధ వర్గాల ప్రజల మధ్య అంతరాలు తగ్గడంతోపాటూ, పౌరహక్కులకు రక్షణ కూడా పెరిగింది.
‘‘ఈ దేశాన్ని సమూలంగా మార్చగలిగినప్పుడు నేను సంతోషిస్తాను. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని నా కోరిక. ప్రజల కోసం నేను కొన్ని వేలమంది ద్వేషాన్నైనా లెక్కచేయను. ఇందులో బంధువులు, స్నేహి తులు, నా సహచర విద్యార్థులు ఉన్నా భరిస్తాను.’’ క్యూబా విప్లవ నేత, మాజీ దేశాధ్యక్షుడు ఫిడెల్ కాస్ట్రో ఒకప్పుడు అన్న మాటలివి. వారం క్రితం కమ్యూనిస్టు కార్యకర్తలనుద్దేశించి మాట్లాడుతూ... ఇదే నా చివరి ఉపన్యాసం కావచ్చంటూ చేసిన సంక్షిప్త ప్రసంగంలోనూ ఆయన ప్రజల పట్ల అదే ప్రేమను వ్యక్త పరిచారు: ‘‘కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు మార్క్సిస్టు, సోష లిస్టు విలువలకు కట్టుబడి పనిచేయాలి. ఎటువంటి పరిస్థితుల్లోనూ వ్యక్తిగత జీవితాలకు ప్రాధాన్యం ఇవ్వరాదు. ప్రజాసంక్షేమమే ధ్యేయంగా ఉండాలి’’.
ఫిడెల్ కాస్ట్రో 20వ శతాబ్దపు విశిష్ట నాయకుడు. క్యూబా వంటి అతిచిన్న దేశం, అతి తక్కువ జనాభాతో ప్రపంచ సామ్రాజ్యవాద యుద్ధ పిపాసి అమె రికాతో తలపడటం అంటే మాటలు కాదు. అందుకు గుండె ధైర్యం కావాలి. గుండెనిండా ప్రజలపై ప్రేమ కావాలి. అన్నింటికీ మించి ప్రాణాలపై తెగింపు కావాలి. వీటన్నింటినీ కలగలుపుకొన్న వ్యక్తిత్వం ఫిడెల్ కాస్ట్రోది. మార్క్సి జాన్ని ఆయుధంగా, దిక్సూచిగా చేసుకొని విప్లవ వీరుడిగానేగాక, అత్యంత సమర్థ పరిపాలకునిగా కాస్ట్రో అరుదైన శక్తి సామర్థ్యాలను ప్రదర్శించాడు. చాలా మంది విప్లవ నాయకుల జీవితాలు విప్లవ విజయంతోనో లేదా కొన్నేళ్లు ప్రభుత్వాన్ని నడపడంతోనో ముగుస్తాయి. కానీ విప్లవానంతరం దాదాపు ఆరు దశాబ్దాలు ప్రభుత్వాధినేతగా ఉండటం అనూహ్యం. ఆయన ప్రభుత్వాన్ని ప్రజలకు చేరువగా చేయడమే కాదు, విద్య, వైద్యాలను ప్రజలందరికీ అందుబాటులోనికి తీసుకొచ్చి క్యూబా చరిత్రను తిరగరాశారు. ఫిడెల్ తండ్రి ఏంజల్ కాస్ట్రోకు ఏడుగురు సంతానం.
ఆరేళ్ల ప్రాయంలో పాఠశాలలో చేరిన ఫిడెల్, పందొమ్మిదేళ్ళ వయస్సులో హవానాలోని ప్రతిష్టాత్మకమైన ఒక క్రైస్తవ కళాశాలలో చేరాడు. ఆ తదుపరి హవానా విశ్వ విద్యాలయ న్యాయశాస్త్ర విద్యార్థిగా ఉండగా క్రమంగా విద్యార్థి ఉద్యమ రాజ కీయాలవైపు దృష్టి మరల్చాడు. ముఖ్యంగా అమెరికా సామ్రాజ్యవాద పెత్తనానికి వ్యతిరేకంగా విద్యార్థుల్లో చైతన్యాన్ని నింపడానికి ప్రయత్నిం చాడు. క్యూబా అధ్యక్షుడు రమోన్ గ్రావ్ హింసాయుత రాజ్యానికి, అవినీతి పాలనకు వ్యతిరేకంగా 1946లో కాస్ట్రో చేసిన ఉపన్యాసం ఆనాటి పత్రికల్లో ప్రముఖంగా ప్రచురితమైంది. ప్రముఖ రాజకీయ నాయకుడు ఎడ్వర్డొ చిబాస్ స్థాపించిన క్యూబా పీపుల్స్ పార్టీ నుంచి ఆహ్వానం అందడంతో కాస్ట్రో ఆ పార్టీలో సభ్యునిగా చేరారు. కాస్ట్రో ఆ పార్టీలో క్రియాశీల నేతగా కొనసాగారు.
క్యూబా విప్లవ చుక్కాని
అదేసమయంలో 1947 జూన్‌లో డొమినికన్ రిపబ్లిక్ నియంత రాఫెల్ ట్రుజిల్లో ప్రభుత్వాన్ని కూలదోసేందుకు సాగుతున్న పోరాటంలో పాల్గొ నాలని కాస్ట్రో ప్రయత్నించారు. డొమినికన్ రిపబ్లిక్‌కు బయలుదేరబోతున్న కాస్ట్రో వంటి తిరుగుబాటుదార్లను అమెరికా కనుసన్నల్లోని క్యూబా ప్రభుత్వం ముందే నిర్బంధంలోకి తీసుకుంది. అయినా విద్యార్థి ఉద్యమా లలో కాస్ట్రో కృషి కొనసాగింది. 1948 ఏప్రిల్‌లో బొగోటా, కొలంబియాలలో పర్యటించిన ఫిడెల్ అక్కడి విద్యార్థుల సభల్లో పాల్గొన్నారు. అదే ఏడాది ఆయన మిర్టా డియాజ్ బలార్ట్‌ను పెళ్లి చేసుకున్నాడు.
నిరంతర కార్యాచరణ మధ్య 1950లో ఆయన న్యాయ శాస్త్రంలో డిగ్రీ పొందారు. ఫుల్‌జెన్సియో బాటిస్టా నాయకత్వాన 1952, మార్చి 10 న ప్రభుత్వ వ్యతిరేక సైనిక తిరుగుబాటు జరిగింది. బాటిస్టా దుర్మార్గ నిరంకుశ ప్రభుత్వానికి వ్యతి రేకంగా 1953, జూలై 26న కాస్ట్రో నాయకత్వంలో శాంటియాగో డి క్యూబా లోని మంకోడా సైనిక దుర్గంపై జరిగిన దాడి విఫలమైంది. కాస్ట్రోతో పాటు మరో 24 మందిని ప్రభుత్వం అరెస్టు చేసి, జైలు శిక్ష విధించింది. ఆ దాడి తర్వాత 60 మంది విప్లవకారులను బాటిస్టా ప్రభుత్వం హత్య చేసింది. అప్పటి నుంచి కాస్ట్రో నడిపిన ఉద్యమాన్ని జూలై 25 ఉద్యమంగా పిలవ సాగారు.
ప్రజా ఉద్యమాల ఫలితంగా 1955 ఏప్రిల్‌లో కాస్ట్రో సహా తిరుగు బాటు నేతలంతా విడుదలయ్యారు. క్యూబాలోని విప్లవ కార్యక్రమాలపై ప్రభుత్వ నిర్బంధం పెరిగినందువల్ల కాస్ట్రో తన కార్య స్థానాన్ని మెక్సికోకు మార్చి, అక్కడి నుంచే సాయుధ గెరిల్లా పోరాటానికి సన్నాహాలు ప్రారంభిం చాడు. ఆయన సోదరుడు, ప్రస్తుత క్యూబా అధ్యక్షుడు రవుల్, ప్రపంచ యువ శక్తికి నేటికీ తలమానికమై నిలుస్తున్న చేగువేరా కూడా కాస్ట్రో బృందంలో ఉన్నారు. 81 మంది విప్లవకారులతో కాస్ట్రో ఒక నౌకలో 1950 డిసెంబర్ 2న క్యూబా చేరుకున్నాడు. రెండేళ్ళ పాటు కాస్ట్రో నాయకత్వంలోని రెడ్ ఆర్మీ ఎన్నో ఎదురుదెబ్బలు తిన్నప్పటికీ, 1959, జనవరి 1 నాటికి నియంత బాటిస్టాను క్యూబా నుంచి పారదోలింది. 1959 ఫిబ్రవరి 10న కాస్ట్రో క్యూబాకు మొదటి ప్రధాన మంత్రి అయ్యారు. దాదాపు ఆరేళ్ల తర్వాత 1965లో క్యూబా కమ్యూనిస్టు పార్టీని స్థాపించారు. అప్పటి నుంచి 2008 వరకు ఆయనే పార్టీకి, ప్రభుత్వానికి అధినేతగా ఉన్నారు.
చేగువేరాతో స్నేహం
అర్జెంటీనాకు చెందిన చేగువేరాకు 1955లో ఫిడెల్ కాస్ట్రోతో పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ దాదాపు పన్నెండేళ్లు విప్లవ పోరాటంలో కలిసి నడి చారు. క్యూబా విముక్తిలో భాగమయ్యారు. చేగువేరా కొంత కాలం పాటు క్యూబా ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసినప్పటికీ... 1962లో లాటిన్ అమెరి కాలోని మిగిలిన దేశాలకు విప్లవాన్ని విస్తరింపజేయాలని క్యూబా పౌరస త్వాన్ని, ప్రభుత్వ హోదాలను వదులుకున్నారు. కాస్ట్రో, చేగువేరా మధ్య అనేక సిద్ధాంత రాజకీయ చర్చలు జరిగేవి. అయితే ప్రభుత్వాన్ని నడపడంలో ఉన్న సమస్యలు, పరిమితులు చేగువేరాను కాస్ట్రోకు దూరం చేశాయి.
ముఖ్యంగా విప్లవ సిద్ధాంతం విషయంలో కూడా ఇద్దరి మధ్య విభేదాలేర్పడ్డాయి. ఎన్ని విభేదాలున్నా కాస్ట్రో పట్ల చేగువేరా స్నేహపూర్వకమైన వైఖరితోనే ఉండేవాడు. ‘‘ఒకరాత్రంతా నేను ఫిడెల్ కాస్ట్రోతో మాట్లాడాను. ఆ రోజే ఆయన ఒక ఆసాధారణ వ్యక్తిగా నన్ను ఆకర్షించాడు. అసాధారణమైన పనులను సుసాధ్యం చేసే ఆయన సామర్థ్యం నన్ను ఎంతగానో ప్రభావితం చేసింది. క్యూబాకు చేరుకొని నియంత బాటిస్టాకు వ్యతిరేకంగా పోరాడి విజయం సాధించి దేశాన్ని విముక్తి చేస్తాననే విషయంలో కాస్ట్రోకు అచంచలమైన విశ్వాసం ఉండేది. చివరికి అది సాధించి చూపించారు’’ అని చేగువేరా ప్రముఖ రచయిత రికార్డోతో అన్నారు.
అగ్రరాజ్యానికి కంటికి నిద్ర కరువు
బ్రిటన్‌లోని ఛానల్ 4 రూపొందించిన డాక్యుమెంటరీ ప్రకారం అమెరికా, కాస్ట్రోపై 638 హత్యా ప్రయత్నాలు చేసిందని వెల్లడయ్యింది. అమెరికా గూడఛార సంస్థ అయిన సెంట్రల్ ఇంటలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ)ఈ దాడులకు రూపకర్తని కూడా ఆ డాక్యుమెంటరీ వెల్లడించింది. సిగరె ట్ల ద్వారా, లో దుస్తుల ద్వారా, భోజనంలో విషం కలిపి, పడక గదిలో ఇలా సీఐఏ కాస్ట్రోకు సకల యత్నాలూ చేసింది. అనేక మంది ప్రత్యక్ష సాక్షులను, చివరకు మాజీ సీఐఏ ఏజెంట్లను కూడా ఇంటర్వ్యూ చేసి ఈ డాక్యుమెంటరీని రూపొం దించారు. దాదాపు 50 ఏళ్లపాటు పలువురు అమెరికా అధ్యక్షులు ఈ కుట్రలో భాగస్వాములైన వైనాన్ని చానల్ 4 బయట పెట్టింది. ఇన్ని దాడులను ఎదుర్కొంటూ కూడా క్యూబాను పేదలు, కార్మిక వర్గ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా గల సోషలిస్టు దేశంగా నిలబెట్టడంలో ఫిడెల్ కాస్ట్రో తిరుగులేని విజయం సాధించారనేది సత్యం.
క్యూబాలో కాస్ట్రో అమలు పరచిన సోషలిస్టు విధానాల ఫలితంగా ప్రజ లందరికీ విద్య, వైద్యం అందుబాటులోకి రావడమే కాదు, దేశంలో జరిగే ఉత్పత్తిలో కూడా ప్రజలకు నిజమైన భాగస్వామ్యం లభించింది. ఫలితంగా పెట్టుబడిదారీ విధానాన్ని అమలు చేసే మార్కెట్ శ క్తుల ప్రాబల్యం గణనీ యంగా తగ్గింది. అంతేకాదు, వివిధ వర్గాల ప్రజల మధ్య అంతరాలు తగ్గడం తోపాటూ, పౌరహక్కులకు రక్షణ కూడా పెరిగింది. కేంద్రీకృత పరిపాలనా విధానాలను అవలంబించడం వల్ల సరైన ఫలితాలను సాధించినప్పటికీ... పాలనలో ప్రజాస్వామ్యం లక్షణాలు కొరవడ్డాయన్న విమర్శను ఫిడెల్ కాస్ట్రో ఎదుర్కోవాల్సి వచ్చింది. ప్రపంచ అగ్రరాజ్యం పక్కనే ఉన్న ఓ చిన్న దేశం లోని సోషలిజాన్ని కాపాడుకోవడం కోసం కాస్ట్రో చేసిన దశాబ్దాల పోరాటం ప్రపంచాన్నే నివ్వెర పరిచింది.
అది విశ్వవ్యాప్తంగా విప్లవ శక్తులకు ఊత మిచ్చింది. అమెరికాను ఎదిరించినిలిచే శక్తి ప్రపంచంలో ఇంకా మిగిలే ఉందని నిరూపించింది. పెద్ద పెద్ద దేశాల సార్వభౌమత్వాలనే పాదాక్రాంతం చేసుకున్న అగ్రరాజ్యానికి కంటి మీద కునుకులేకుండా చేసిన ఘనత క్యూబాది. ఆ విప్లవ పోరాటానికి ప్రపంచమే సలామంది. నికార్సయిన వర్గ ధృక్పథానికి, అలుపెరుగని విప్లవ కార్యదీక్షకు కాస్ట్రో జీవితమే ఉత్తమోత్తమ ఉదాహరణ. వారం క్రితం చేసినదే కాస్ట్రో చివరి ఉపన్యాసం అయితే కావచ్చు నేమో. కానీ, ప్రపంచ పెత్తందారీ దేశాలను గజగజలాడించిన అసంఖ్యా కమైన ఆయన ఉపన్యాసాలు, ఆయన పోరాటాలు నిరంతరం, తరం తరం పీడిత ప్రజలను మేల్కొల్పుతూనే ఉంటాయన్నది సత్యం.
మల్లెపల్లి లక్ష్మయ్య,
వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు మొబైల్: 97055 66213