అరుణతార అస్తమయం | Cuba ex president Fidel Castro is no more | Sakshi
Sakshi News home page

అరుణతార అస్తమయం

Published Sun, Nov 27 2016 2:16 AM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

అరుణతార అస్తమయం - Sakshi

అరుణతార అస్తమయం

  •  నేలకొరిగిన కమ్యూనిస్టు శిఖరం ఫిడెల్ క్యాస్ట్రో
  •  90 ఏళ్ల వయసులో అనారోగ్యంతో కన్నుమూత
  •  ముప్పై ఏళ్ల వయసులోనే విప్లవాగ్ని రగిల్చిన యోధుడు
  •  అగ్రరాజ్యం అమెరికాను ధిక్కరించి..  క్యూబాలో నియంత సర్కారును కూల్చి.. 1959లో దేశ పగ్గాలు చేపట్టిన సోషలిస్టు
  •  ఐదు దశాబ్దాలపాటు అప్రతిహత పాలన
  •  అనేక దేశాల్లో విప్లవోద్యమాలకు అండగా నిలిచిన క్యాస్ట్రో
  •  క్యూబాలో 9 రోజుల సంతాప దినాలు.. 4వ తేదీన అంత్యక్రియలు
  •  ప్రపంచ దేశాధినేతల సంతాపం.. అమెరికాలో మాత్రం సంబరాలు
  • హవానా: కమ్యూనిస్టు శిఖరం నేలకొరిగింది. విప్లవ యోధుడు అస్తమించాడు. అగ్రరాజ్యం అమెరికాను యాభై ఏళ్లపాటు వణికించిన ధీరుడు, క్యూబా ప్రజల ఆరాధ్యదైవం ఫిడెల్ క్యాస్ట్రో (90) తుదిశ్వాస విడిచారు. ఆయన తమ్ముడు, క్యూబా అధ్యక్షుడు రౌల్ క్యాస్ట్రో జాతీయ రేడియో ద్వారా ఫిడెల్ మరణవార్తను ప్రపంచానికి వెల్లడించారు. ‘క్యూబా విప్లవ కమాండర్ ఇన్ చీఫ్ ఇకలేరు’అంటూ గంభీర స్వరంతో ప్రకటించారు. క్యూబా కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి 10.30కి ఫిడేల్ కన్నుమూసినట్లు తెలిపారు. ఈ నెల 26 నుంచి తొమ్మిది రోజులను సంతాప దినాలుగా క్యూబా ప్రభుత్వం ప్రకటించింది. నాలుగురోజుల పాటు దేశమంతా క్యాస్ట్రో పార్థివదేహంతో యాత్ర జరిపి డిసెంబర్ 4న శాంటియాగోలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలిపింది. తమ అభిమాన నాయకుడి మరణవార్తతో క్యూబా శోకసంద్రంలో మునిగిపోరుుంది. చాలా చోట్ల ప్రజలు రోడ్లపైకి వచ్చి రోదించారు. ప్రధాని నరేంద్ర మోదీ సహా ప్రపంచ దేశాల నేతలు ఫిడెల్ మృతికి సంతాపం తెలిపారు. మరోవైపు అమెరికాలో ఫిడెల్ మృతితో ప్రజలు సంబరాలు జరుపుకున్నారు.
     
    విప్లవకారుల హీరో: సామాన్య పౌరులపై పెట్టుబడిదారుల ఆధిపత్యానికి ఫిడెల్ క్యాస్ట్రో బద్ధ వ్యతిరేకి. ఆయన్ను వ్యతిరేకించే వారికి మాత్రం క్రూరమైన నిరంకుశుడు. 1959కి ముందు క్యూబా నియంత ఫుల్జెనికో బటిస్టాపై ఫిడెల్ తిరుగుబాటు జెండా ఎగరేశారు. 32 ఏళ్ల వయసులోనే తన రెబల్ సైన్యంతో మిలటరీని చిత్తుచేసి విప్లవ నాయకుడిగా ఎదిగారు. ఐదు దశాబ్దాలపాటు 11 మంది అమెరికా అధ్యక్షులతో నేరుగా ఢీకొన్నారు. ఒకదశలో అణుయుద్ధం తప్పదనే పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. ఫిడెల్‌ను హత్య చేసేందుకు అమెరికా తన గూఢచార సంస్థ సీఐఏ ద్వారా ఏకంగా 638 సార్లు యత్నించి విఫలమైంది.
     
    1961లో అమెరికా చేపట్టిన క్యూబన్ మిసైల్ క్రైసిస్ (ప్రపంచ ప్రమాదరకమైన సర్జికల్ దాడుల్లో ఒకటి)ను తిప్పికొట్టిన అసామాన్య నేత క్యాస్ట్రో. ఎప్పుడూ నోట్లో సిగార్లతో కనిపించే క్యాస్ట్రో.. అనారోగ్యం బారిన పడిన తర్వాత డాక్టర్ల సూచన మేరకు పొగతాగటం మానేశారు. 2008లో కడుపు, పెద్దపేగులకు సంబంధించిన సమస్యల కారణంగా సోదరుడు రౌల్ క్యాస్ట్రోకు దేశాధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. ప్రపంచమంతా పాశ్చాత్య ప్రజాస్వామ్యాన్ని అమలుచేస్తున్నా.. తోటి కమ్యూనిస్టు దేశాలైన చైనా, వియత్నాంలు పెట్టుబడిదారీ విధానాన్ని స్వాగతించినా.. ‘సోషలిజం లేదా మరణం’లో ఏదో ఒకటి తేల్చుకోవాలని బలంగా నమ్మి ఆచరణలో పెట్టారు క్యాస్ట్రో.
     
    సోషలిజమే ఊపిరిగా..
    1926 ఆగస్టు 13న ఫిడెల్ క్యాస్ట్రో క్యూబాలో జన్మించారు. అంతకుముందే వీరి కుటుంబం స్పెయిన్ నుంచి క్యూబాకు వలస వచ్చింది. హవానా యూనివర్సిటీలో చదివిన క్యాస్ట్రో.. 1953లో శాంటియాగోలోని మొన్కాడా మిలటరీ బ్యారక్‌లపై దాడితో తన రెబల్ ప్రస్థానాన్ని ప్రారంభించారు. అనంతరం జైలుపాలయ్యారు. క్షమాభిక్షపై బయటకు వచ్చి మెక్సికో వెళ్లారు. 1959 జనవరి 8న బటిస్టా నియంత ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి విజయం సాధించారు. సోవియట్ యూనియన్ శిబిరంలోకి క్యూబా వెళ్లడాన్ని జీర్ణించుకోలేని అమెరికా.. క్యాస్ట్రోపై కక్ష గట్టింది. క్యూబాపై అనేక ఆంక్షలు పెట్టింది. 1956లో మొదటి భార్య మిర్తా దియాజ్‌తో క్యాస్ట్రో విడాకులు తీసుకున్నారు. అంతకుముందే వీరికి ఓ కుమారుడున్నాడు. ఆ తర్వాత నాలుగు దశాబ్దాలు దాలియా సోటో డెల్ వాల్లేతో సహజీవనం చేశారు. వీరికి ఐదుగురు సంతానం. 1980లో వీరి వివాహం రహస్యంగా జరిగింది.
     
    పేదలకు ఆపన్న హస్తం
    క్యూబాలోని విప్లవ గ్రూపులను ఏకం చేసి క్యూబన్ కమ్యూనిస్టు పార్టీని ఫిడెల్ ప్రారంభించారు. తర్వాత లాటిన్ అమెరికా దేశాల్లో నియంతృత్వాలపై పోరాటానికి విప్లవాన్ని రగిలించారు. ఆఫ్రికాలో పాశ్చాత్య దేశాల ప్రభావం కారణంగా ఇబ్బందులు పడుతున్నవారికి మద్దతుగా క్యూబన్ సైన్యాలను పంపించారు. అరుుతే సోవియట్ యూనియన్ పతనం క్యూబాపై తీవ్ర ప్రభావం చూపింది. ప్రచ్ఛన్నయుద్ధం ముగియడం, లాటిన్ అమెరికా, యురోపియన్ యూనియన్ దేశాల తోడ్పాటుతో క్యూబా కోలుకుంది. 50 ఏళ్ల పాటు క్యూబాను అప్రతిహతంగా పాలించి.. ప్రపంచంలో ఎక్కువకాలం ఒక దేశాన్ని పాలించిన నేతగా నిలిచారు ఫిడెల్. అనారోగ్యం కారణంగా తమ్ముడు రౌల్‌కు 2008లో దేశ పగ్గాలు అప్పగించారు. ఆరోగ్యం విషమించటంతో చాలా కాలంగా బయటకు రాలేదు. చివరి సారిగా 2016లో బహిరంగంగా కనిపించారు. ఐక్యరాజ్యసమితి సర్వ ప్రతినిధి సభలో క్యూబన్ల జీవితాల గురించి 1960లో 269 నిమిషాలసేపు (ఇదే అత్యధిక సమయం) క్యాస్ట్రో చేసిన ప్రసంగం ఇప్పటికీ రికార్డే.

    విప్లవోద్యమాలకు స్ఫూర్తిప్రదాత
    అగ్రరాజ్యం అమెరికాకు సమీపం నుంచే ఎదు రొడ్డి నిలబడిన క్యాస్ట్రో లాటిన్ అమెరికా, మధ్య అమెరికా ఆఫ్రికా దేశాల్లోని విప్లవ, జాతీయ విముక్తి పోరాటాలకు ఎనలేని స్ఫూర్తినం దించారు. క్యాస్ట్రో తన అభిమాన యోధుడని దక్షిణా ఫ్రికా నల్లజాతి సూరీడు నెల్సన్ మండేలా కొనియాడారు. మధ్య అమెరికాలోని నికరగువా, గ్వాటమాల ప్రజాపోరాటాలకు క్యాస్ట్రో మద్దతునందించారు. ముఖ్యంగా గ్వాటమాల నేత డేనియల్ ఆర్టెగాకు కీలకమైన మద్దతు అందించారు. అలాగే మరో లాటిన్ అమెరికా దేశం వెనెజువెలాలో హ్యూగో చావెజ్ నేతృత్వంలో వచ్చిన ప్రజాతంత్ర ప్రభుత్వం నిలబడడానికి క్యాస్ట్రో నుంచి అన్ని విధాలా నైతిక మద్దతు లభించింది. ఇంత సాయం అందించినందుకు బదులుగా క్యూబాకు కారుచౌకగా చావెజ్ ముడి చమురు సరఫరా చేశారు. అలాగే ఐరోపా వలస పాలన నుంచి విముక్తి కోసం ఆఫ్రికా దేశాల్లో వచ్చిన తిరుగుబాటు ఉద్యమాలకు కూడా క్యాో్ట్ర చేతనైనంత సాయం చేశారు. తన సుదీర్ఘ పాలనా కాలంలో పది మంది అమెరికా అధ్యక్షులను క్యాస్ట్రో చూడడమే కాదు వారి విధానాలను ధైర్యంగా ఎదుర్కొన్నారు. అమెరికా ఆధిపత్యానికి, దాని కీలుబొమ్మ సర్కార్లకు వ్యతిరేకంగా జరిగిన అన్ని ప్రజాపోరాటాలకు అండగా నిలిచారు.

     సామ్రాజ్యవాదంపై
     సామ్యవాద గర్జన నువ్వు..
     నియంతృత్వ రాజ్యంపై..
     నిప్పులుగక్కిన పిడుగు నువ్వు..
     ‘పెట్టుబడి’ పడగలపై..
     పెకైగిసిన పిడికిలి నువ్వు..
     అగ్రదేశం ఆదేశంపై..
     అరుణోదయ అస్త్రం నువ్వు..
     అన్నిటికీ మించి
     కాలగమనంపై ఎన్నటికీ కరగని
     కార్మికుల చెమట చుక్కవు నువ్వు
     ఎవరన్నారు కామ్రేడ్..
     నువ్వు అస్తమించావని..??
     వారికి తెలియదేమో...!
     రేపటి ఉదయాన
     లేలేత కిరణాలకు
     అరుణ వర్ణం అద్దుతూ
     మళ్లీ ఉదయిస్తావని...!!!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement