క్యూబాతో మైత్రికి ట్రంప్‌ తెర | Trump Reverses Pieces of Obama-Era Engagement With Cuba | Sakshi
Sakshi News home page

క్యూబాతో మైత్రికి ట్రంప్‌ తెర

Published Sun, Jun 18 2017 2:12 AM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

క్యూబాతో మైత్రికి ట్రంప్‌ తెర - Sakshi

క్యూబాతో మైత్రికి ట్రంప్‌ తెర

► ఒబామా హయాం నాటి ఒప్పందాన్ని రద్దు చేసిన ట్రంప్‌
► క్యాస్ట్రో మిలిటరీకి అమెరికా నిధులు బంద్‌


వాషింగ్టన్‌/మయామి: అమెరికా, క్యూబా సంబంధాల పరిస్థితి మళ్లీ మొదటకొచ్చింది. బరాక్‌ ఒబామా హయాంలో క్యూబాతో కుదిరిన మైత్రి ఒప్పందాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ శుక్రవారం రద్దు చేశారు. ఈ నిర్ణయాన్ని క్యూబా విమర్శించింది. ఈ విషయంలో అమెరికాతో సంప్రదింపులు జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొంది. క్యూబా అధ్యక్షుడు రౌల్‌ క్యాస్ట్రోతో కలిసి ఇరు దేశాల సంబంధాలను పునరుద్ధరిస్తున్నట్లు ఒబామా 2014 డిసెంబర్‌లో ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఒబామా క్యూబాతో చేసుకున్న ఒప్పందం ఏకపక్షంగా ఉందని, రౌల్‌  క్యాస్ట్రో సైనిక ఆధిపత్యానికి బలం చేకూర్చడానికి అమెరికా డాలర్లను సాయంగా అందించమని ట్రంప్‌ మయామిలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రకటించారు. ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుందని, దీనికి బదులుగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు నూతన విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. అమెరికా చట్టాలకు లోబడే కొత్త విధానంతో క్యూబా, అమెరికా ప్రజలకు ప్రయోజనం కలుగుతుందని ట్రంప్‌ పేర్కొన్నారు.

క్యూబా ప్రజలకే పెట్టుబడులు నేరుగా చేరేలా అమెరికా చర్యలు తీసుకుంటుందని, దాని వల్ల వారు సొంత వ్యాపారాలు ప్రారంభించి తమ దేశానికి గొప్ప భవిష్యత్తును తీర్చిదిద్దుకోవచ్చని తెలిపారు. క్యూబా ప్రభుత్వంపై కూడా ట్రంప్‌ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఉగ్రవాదులకు, హైజాకర్లకు, పోలీసులను హత్యచేసిన వారికి ఆశ్రయం కల్పించిందని ఆరోపించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement