మరో వివాదాస్పద అంశంపై ట్రంప్ సంతకం
- క్లైమెట్‌చేంజ్‌పై ఒబామా నాటి ప్రమాణాలు మార్పు
- నూతన ఉద్యోగాల సృష్టి కోసమే
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలకమైన వివాదాస్పద అంశంపై సంతకం చేశారు. ఒబామా కాలంనాటి పర్యావరణ మార్పుల ప్రమాణాల్లో మార్పులను చేస్తూ ట్రంప్ సంతకం చేశారు. భూతాపంపై అంతర్జాతీయంగా చేస్తున్న పోరాటానికి పెద్ద దెబ్బగా ట్రంప్ సంతకాన్ని పరిగణిస్తున్నారు. బొగ్గు పరిశ్రమను కాపాడుతానంటూ ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకునేందుకే ట్రంప్ పర్యావరణ పరిరక్షణ ఏజెన్సీ (ఈపీఏ) పై సంతకం చేసినట్లు నిపుణులు చెబుతున్నారు.
‘ఒబామా నాటి పర్యావరణ ప్రమాణాలను మార్పు చేయడం ద్వారా ఉత్పత్తి, నూతన ఉద్యోగాల కల్పన శకం ప్రారంభమైనట్లేన’ని ఈ సందర్భంగా ట్రంప్ వ్యాఖ్యానించారు. అమెరికా ఇంధన శక్తిపై ఉన్న పరిమితులను ఎత్తివేసే చారిత్రాత్మక చర్యగా ట్రంప్ తన నిర్ణయాన్ని పేర్కొన్నారు. ‘అమెరికన్లకు ఉద్యోగాలు లభించడం వల్ల దేశ సంపద పెరుగుతుందని..తద్వారా మన దేశాన్ని తిరిగి పునర్ నిర్మించుకునే అవకాశం లభిస్తుంద’ని ట్రంప్ అన్నారు.