60 రోజుల గడువు ఇవ్వండి | Trump admin seeks 60 days to respond to case on H1B visa issue | Sakshi
Sakshi News home page

60 రోజుల గడువు ఇవ్వండి

Published Thu, Mar 9 2017 2:47 AM | Last Updated on Sat, Aug 25 2018 7:50 PM

60 రోజుల గడువు ఇవ్వండి - Sakshi

60 రోజుల గడువు ఇవ్వండి

హెచ్‌1బీ వీసాల కేసులో కోర్టును కోరిన ట్రంప్‌ ప్రభుత్వం
భారతీయుల్లో గుబులు


వాషింగ్టన్‌: అమెరికాలోని భారతీయుల్లో మళ్లీ అలజడి. హెచ్‌1బీ వీసాలున్న వారి జీవిత భాగస్వాములకు అమెరికాలో పనిచేసే అవకాశం కల్పించిన ఒబామా ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై స్పందించేందుకు 60 రోజుల గడువు కావాలని ట్రంప్‌ ప్రభుత్వం కోరింది. దీంతో వేలాది భారతీయుల్లో గుబులు మొదలైంది.

హెచ్‌4 వీసాదారులు, ముఖ్యంగా హెచ్‌1బీ వీసాలు కలిగిన వారి జీవిత భాగస్వాములు అమెరికాలో ఉద్యోగం చేసుకోవడానికి 2015లో ఒబామా ప్రభుత్వం అనుమతినిచ్చింది. దీన్ని వ్యతిరేకిస్తూ ‘సేవ్‌ జాబ్స్‌ యూఎస్‌ఏ’బృందం వాషింగ్టన్‌ డీసీ అప్పీల్స్‌ కోర్టులో పిటిషన్‌ వేసింది. ఈ సందర్భంగా కోర్టు అమెరికా ప్రభుత్వ స్పందన కోరింది. కొత్తగా ప్రభుత్వం ఏర్పాటైన క్రమంలో తమకు మరింత సమయం కావాలని ట్రంప్‌ సర్కారు కోర్టుకు విన్నవించింది. ఇప్పటికే ట్రంప్‌ అమెరికాలో విదేశీ ఉద్యోగులపై పలు ఆంక్షలు పెట్టారు. పైగా అటార్నీ జనరల్‌ జెఫ్‌ సెషన్స్‌ మొదటి నుంచీ హెచ్‌1బీ ప్రోగ్రామ్‌కు వ్యతిరేకి.

ఈ క్రమంలో హెచ్‌1బీ వీసాతో అమెరికా వెళ్లిన భారతీయులు ఆందోళన చెందుతున్నారు. కాగా... వేలాది హెచ్‌4, హెచ్‌1బీ వీసాలున్న వారి కుటుంబాలు, అమెరికన్‌ పౌరులైన వారి పిల్లల పరిరక్షణకు ఈ కేసులో తాము కూడా జోక్యం చేసుకొంటున్నట్టు ఇమిగ్రేషన్‌ వాయిస్‌ ప్రకటించింది. ఇది నిరాధారమైన కేసని కింది కోర్టులు ఇప్పటికే స్పష్టం చేశాయని ఇమిగ్రేషన్‌ వాయిస్‌ సహవ్యవస్థాపకుడు అమన్‌ కపూర్‌ వెల్లడించారు. హెచ్‌1బీ వీసాలతో అమెరికాలో ఉన్నవారిలో భారతీయులే అధికం.  

‘హెచ్‌1బీ’ సంస్కరణలకు అవకాశం
వాషింగ్టన్‌: భారత అమెరికన్లకు సంబంధించిన హెచ్‌1బీ వర్క్‌ వీసా, ఉపాధి ఆధారిత గ్రీన్‌ కార్డు విభాగాల్లో సంస్కరణలు జరిగే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు అత్యంత సన్నిహితుడైన సెనెటర్‌ టామ్‌ కాటన్‌ వెల్లడించారు. ప్రస్తుతమున్న విధానం వల్ల ఉన్నతమైన నైపుణ్యం రావటం లేదని అందువల్ల దీనిలో సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని ట్రంప్‌ భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. ‘హెచ్‌1బీ వీసా ద్వారా డేటా మేనేజ్‌మెంట్‌ వర్కర్లు మాత్రమే అమెరికాకు వస్తున్నారు. పీహెచ్‌డీ చేసిన వారు, కంప్యూటర్‌ సైంటిస్టులు రావటం లేదు. అందుకే డిస్నీ, సదరన్‌ కాలిఫోర్నియా ఎడిసన్‌ కంపెనీలు సాధారణ నైపుణ్యమున్న విదేశీ ఉద్యోగులను తొలగించి కొత్తవాళ్లను నియమించుకున్నాయి’ అని కాటన్‌ తెలిపారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement