ఒబామాకు 58%.. ట్రంప్‌కు 40%
అమెరికా నాయకత్వంపై పలు ప్రపం చ దేశాల ప్రజల విశ్వాసం గణనీయంగా తగ్గిపోయింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పోకడలే ఇందుకు కారణమని ప్యూ రీసెర్చ్ సెంటర్ చేసిన సర్వేలో వెల్లడైంది. భారత్ సహా మొత్తం 37 దేశాల్లో ఈ సర్వే జరిగింది. భారత్ విషయానికి వస్తే అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామాతో పోలిస్తే ట్రంప్‌కు 18% మంది ప్రజల మద్దతు తగ్గింది. గతంలో ఇదే ప్యూ రీసెర్చ్ సెంటర్ చేసిన సర్వేలో 58% మంది భారతీయులు ఒబామాపై విశ్వాసం వ్యక్తం చేయగా ప్రస్తుతం 40% మంది ట్రంప్‌పై తమకు నమ్మకం ఉందన్నారు.
18% తగ్గినా చెప్పుకోదగ్గ స్థాయిలోనే ట్రంప్‌కు భారత ప్రజల నుంచి మద్దతు లభించడం గమనార్హం. 37 దేశాల్లోనూ కలిపి చూస్తే కేవలం 22% మందే ట్రంప్ సమర్థుడనీ, ప్రపంచానికి మంచి చేస్తాడని విశ్వసిస్తున్నారు. అదే ఒబామాపై 64%మంది ప్రజలకు నమ్మకం ఉన్నట్లు గత సర్వేలో తేలింది. రష్యా, ఇజ్రాయెల్ దేశాల ప్రజలు మాత్ర మే ట్రంప్‌ను నమ్ముతున్నారు. మిగతా అన్ని దేశాల ప్రజలూ ట్రంప్‌ను దురహం కారిగా, ప్రమాదకారిగా, అసహనపరుడిగా, అధ్యక్ష పదవికి అర్హత లేనివాడిగా భావిస్తున్నారు.