రౌల్ క్యాస్ట్రో, మిగుల్ డియాజ్ కెనాల్ బెర్ముడెజ్
సాక్షి, న్యూఢిల్లీ : కమ్యూనిస్టు పాలనలో ఉన్న లాటిన్ అమెరికా దేశం క్యూబాలో క్యాస్ట్రోల ఆరు దశాబ్దాల పాలనకు గురువారం తెరపడింది. ఫిడెల్ క్యాస్ట్రో అనంతరం 12 సంవత్సరాల క్రితం దేశాధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన ఆయన సోదరుడు రౌల్ క్యాస్ట్రో తన పదవికి స్వస్తి చెప్పారు. దేశ కమ్యూనిస్టు పార్టీ అధ్యక్షుడిగా ఆయనే కొనసాగుతారు కనుక ప్రభుత్వంపై కూడా ఆయన పట్టు కొనసాగుతుంది. రెండు పర్యాయాలు నిరాటంకంగా దేశాధ్యక్ష బాధ్యతలు నిర్వహించిన రౌల్ క్యాస్ట్రో (86) ఆర్థిక సంస్కరణలు చేపట్టి ప్రైవేటు రంగానికి ప్రవేశం కల్పించారు. ఆగర్భ శత్రువైన అమెరికాతో సంబంధాలు నెలకొల్పారు. 2015లో అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మొట్టమొదటిసారిగా క్యూబాను సందర్శించడంతో ఇరు దేశాల మధ్య సాధారణ పౌర సంబంధాలు ఏర్పడ్డాయి. అయితే డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైన నాటి నుంచి ఇరు దేశాల మధ్య సంబంధాలు అంతగా కొనసాగడం లేదు.
ఫిడెల్ క్యాస్ట్రో నాయకత్వాన 1959లో క్యూబాలో విప్లవం విజయవంతం అవడం, ఆ తర్వాత క్యాస్ట్రో ప్రధాన మంత్రిగా దేశ నాయకత్వ బాధ్యతలు స్వీకరించడం తెల్సిందే. 1976 వరకు అదే పదవిలో కొనసాగిన ఆయన 1976లో రాజ్యాంగ సవరణ ద్వారా దేశాధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. నాలుగు దశాబ్దాలపాటు పదవిలో కొనసాగిన ఫిడెల్ క్యాస్ట్రో.. అనారోగ్య కారణాల వల్ల 2006లో దేశాధ్యక్ష బాధ్యతలను తన సోదరుడు రౌల్ క్యాస్ట్రోకు అప్పగించారు. అన్నతోపాటు రౌల్ క్యాస్ట్రో క్యూబా విప్లవంలో క్రియాశీలక పాత్ర పోషించారు. దాదాపు 60 ఏళ్లు ఇద్దరు క్యాస్ట్రోలే దేశాన్ని పాలించారు. రౌల్ క్యాస్ట్రో స్థానంలో క్యూబా కమ్యూనిస్టు పార్టీ స్టేట్ కౌన్సిల్ పార్టీ విధేయుడైన మిగుల్ డియాజ్ కెనాల్ బెర్ముడెజ్ (58)ను ఎన్నుకొంది. గురువారం నాడు దేశాధ్యక్షుడిగా రౌల్ క్యాస్ట్రో దిగిపోవాలనే, ఇదే రోజున దేశాధ్యక్షుడిగా మిగుల్ డియాజ్ బాధ్యతలు స్వీకరించాలని ముందుగా నిర్ణయించారు. ఇందుకు ఓ కారణం ఉంది.
1961లో అప్పటి ప్రధాన మంత్రి ఫిడెల్ క్యాస్ట్రోను దించేందుకు అమెరికా మద్దతుతో 1400 మంది తిరుగుబాటుదారులు కుట్ర చేశారు. ‘బే ఆఫ్ పిగ్ ఇన్వేషన్’గా పేర్కొన్న ఆ కుట్ర విఫలమైన వార్షికోత్సవ రోజు గురువారం. అంతేకాకుండా డియాజ్ కెనాల్ ఈ రోజునే 58వ ఏట అడుగుపెట్టారు. క్యూబాలో ఆర్థిక సంస్కరణలు ఊపందుకొని ప్రైవేటు పెట్టుబడులు పెరుగుతున్న సమయంలో రౌల్ క్యాస్ట్రో దిగిపోయారు. కొత్త తరానికి నాయకత్వం అప్పగించారు. డియాజ్ కెనాల్ చాలాకాలంగా దేశ ఉపాధ్యక్షుడిగా ఉంటూ రౌల్ క్యాస్ట్రోకు అండగా ఉన్నారు. ఆయన అమెరికా నటుడు రిచర్డ్ గేర్‌లా ఉన్నారంటారు. ఆయన ‘ది బీటిల్స్’ రాక్ బ్యాండ్‌కు వీరాభిమాని.
Comments
Please login to add a commentAdd a comment