Raul Castro
-
ముగిసిన ‘కాస్ట్రోల’ శకం
ఆరు దశాబ్దాలుగా అమెరికాకు కునుకు లేకుండా చేస్తున్న కాస్ట్రోల శకం క్యూబాలో ముగిసింది. అక్కడి పాలనా వ్యవస్థను నియంత్రించే కమ్యూనిస్టు పార్టీ చీఫ్ పదవి నుంచి మాజీ అధ్యక్షుడు రౌల్ కాస్ట్రో నిష్క్రమించారు. 1959లో అమెరికా ప్రాపకంతో క్యూబాను శాసిస్తున్న నియంత బాటిస్టాను ఫైడల్ కాస్ట్రో నాయకత్వంలోని విప్లవకారులు తిరుగుబాటులో సాగినంపిన నాటినుంచి దాంతో అమెరికాకు పొసగటం లేదు. 2014 డిసెంబర్లో అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా హయాంలో తొలిసారి ఇరు దేశాల సంబంధాలూ కొత్త మలుపు తిరిగాయి. ఆ దేశాన్ని సందర్శించిన అమెరికా తొలి అధినేతగా ఒబామా చరిత్రలో నిలిచారు. నిజానికి ప్రపంచాన్నే శాసిస్తున్న అమెరికాతో క్యూబాకు పోలికే లేదు. అగ్రరాజ్యం పొరుగునున్న అతి చిన్న దేశం క్యూబా. మామూలుగా అయితే క్యూబాను అమెరికా బేఖాతరు చేయొచ్చు. దాన్ని పట్టించు కోకుండా ఊరుకోవచ్చు. అలాగే ప్రపంచ వ్యాప్తంగా వున్న పౌరులు సైతం ఆ దేశంపై పెద్దగా దృష్టి పెట్టేవారు కాదు. అయితే అమెరికా ఆ చిన్న దేశంపట్ల అనుసరించిన ధోరణి, అది సవాలు విసిరిన ప్రతిసారీ క్యూబా పోట్ల గిత్త మాదిరి చెలరేగిన వైనం చూశాక అందరిలో ఆసక్తి పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు భిన్న రకాలైన ప్రజాస్వామిక వ్యవస్థలను నెలకొల్పుకున్నాయి. అన్ని దేశాలకూ ఆదర్శనీయమనదగ్గ లోపరహితమైన ప్రజాస్వామిక నమూనా ప్రపంచంలో ఎక్కడా లేదు. ‘అతి పురాతన ప్రజాస్వామ్య దేశం’గా కీర్తిప్రతిష్టలు ఆర్జించిన అమెరికా కూడా ఇందుకు మిన హాయింపు కాదు. ప్రస్తుతం చైనాలో, ఉత్తర కొరియాలో, చాన్నాళ్లక్రితం సోవియెట్ యూనియన్‌లో వున్నలాంటి ఏక పార్టీ పాలనే క్యూబాలో కూడా కొనసాగుతోంది. అక్కడ యావజ్జీవ పాలకపక్షం కమ్యూనిస్టు పార్టీయే. ఆ దేశంలో పరిపాలన గురించి, అక్కడ అమలయ్యే నియంతృత్వ విధానాల గురించి పాశ్చాత్య దేశాల్లో కథలు కథలుగా చెప్పుకునేవారు. ఆ దేశం నుంచి తప్పించుకొచ్చినవారి కథనాలు భయంగొలిపేవి. అయితే వీటికి సమాంతరంగా గణనీయమైన విజయాలు సాధించలేక పోయివుంటే క్యూబా గురించి చెప్పుకోవటానికి ఏమీ వుండేది కాదు. ముఖ్యంగా ప్రజారోగ్య రంగంలో ఆ దేశం ప్రశంసించదగ్గ విజయాలు సాధించింది. ఆ దేశ పౌరుల సగటు ఆయుఃప్రమాణం 79.13 ఏళ్లు. అమెరికా పౌరుల ఆయుఃప్రమాణం 78.64 ఏళ్లతో పోలిస్తే ఇది అధికమే. అక్కడ ప్రతి 155 మందికి ఒక డాక్టర్ వుంటారు. ప్రపంచంలో ఎక్కడ ఆరోగ్య సంక్షోభం తలెత్తినా ఆ దేశ వైద్యులు రెక్కలు కట్టుకుని వాలేందుకు సిద్ధపడతారు. సంక్షోభాలెన్ని చుట్టుముట్టినా విద్యకు బడ్జెట్లో 10 శాతాన్ని కేటాయించే దేశం క్యూబా. ప్రాథమిక స్థాయినుంచి విశ్వవిద్యాలయ విద్యవరకూ అంతా ఉచితం. అక్కడ పదిహేనేళ్లకు పైబడ్డవారిలో అక్షరాస్యత 99.8 శాతం. చెప్పాలంటే ఈ విషయంలో కూడా అమెరికా కాస్త వెనకబడేవుంది. ఆ దేశంలో అక్షరాస్యత 99 శాతం. ప్రాథమిక పాఠశాలల్లో తరగతికి 25 మంది, సెకండరీ స్థాయిలో తరగతికి 15 మంది పిల్లలు చొప్పున మాత్రమే వుంటారు. అక్కడ మెజారిటీ ప్రజలకు నచ్చకపోతే అంతక్రితం ఎన్నుకున్న ప్రతినిధిని రీకాల్ చేసే స్వేచ్ఛ వుంది. ఇవన్నీ నాణేనికి ఒకవైపు మాత్రమే. మరోపక్క అక్కడ దారిద్య్రం విలయతాండవం చేస్తుంటుంది. సగటు పౌరుడి నెల సంపాదన 30 డాలర్లు మించదు. అయితే వేరే దేశాలతో పోలిస్తే జీవన వ్యయం తక్కువే. బహుశా అమెరికా ఆర్థిక ఆంక్షలు విధించకపోతే, ఆ దేశం ఎవరూ వెళ్లరాదని నిషే«ధిం చకపోతే పరిస్థితి ఇంత దయనీయంగా వుండేది కాదు. పర్యాటకులు ఎగబడి సందర్శించే ప్రాంతాలు అక్కడ బోలెడున్నాయి. అలా మంచి ఆదాయం వచ్చేది. అయితే సోవియెట్ యూనియన్ ఉన్నన్నాళ్లూ క్యూబాను అన్నివిధాలా ఆదుకుంది. వెనిజులాలో హ్యూగో చావెజ్ వచ్చాక ఆ దేశం కూడా సాయపడుతూ వచ్చింది. సోవియెట్ కుప్పకూలాక పలు దేశాల్లోని సోషలిస్టు ప్రభుత్వాల్లాగే అది కూడా కుప్పకూలుతుందని అమెరికా అంచనా వేసింది. కానీ ఆ అంచనాను క్యూబా తలకిందులు చేసింది. ఎప్పటిలాగే ధైర్యంగా, నిటారుగా నిలబడింది. ఫైడల్ కాస్ట్రోను అంతం చేయడానికి అమెరికా చేయని ప్రయత్నమంటూ లేదు. సీఐఏలో పనిచేసి బయటికొచ్చినవారే కాస్ట్రోను అంతం చేయడానికి తమ ఏజెంట్ల ద్వారా, మాఫియా ముఠాల ద్వారా 638 సార్లు ప్రయత్నాలు జరిగాయని రాశారు. అలా ప్రయత్నించిన అమెరికాయే క్యూబాను 2011లో ఉగ్రవాద దేశంగా ప్రకటించటం ఒక వైచిత్రి. రౌల్ కాస్ట్రోను 2006లో ఫైడల్ కాస్ట్రో తన తాత్కాలిక వారసుడిగా ప్రకటించి, 2008లో శాశ్వతంగా అధ్యక్ష స్థానాన్ని అప్పగించారు. 2018 వరకూ ఆయన ఆ పదవిలో వున్నారు. ఆ తర్వాత ప్రస్తుత అధ్యక్షుడు మిగూల్ దియాజ్ కెనెల్కు అధికార పగ్గాలు అప్పగించి కమ్యూనిస్టు పార్టీ బాధ్యతలకు పరిమితమయ్యారు. ఇప్పుడు 89 ఏళ్ల వయసులో ఆయన పార్టీ సారథ్యాన్ని కూడా వదులుకున్నారు. అలా క్యూబాలో కాస్ట్రోల శకం ముగిసింది. అమెరికా ఆశిస్తున్నట్టు అది సోషలి జానికి కూడా వీడ్కోలు చెబుతుందా? దియాజ్ వచ్చాక దేశంలో సంస్కరణల బీజాలు నాటారు. స్వేచ్ఛా మార్కెట్‌కు చోటిచ్చారు. క్యూబా పౌరులు సొంత వ్యాపారాలు పెట్టుకునేందుకు అనుమ తులిస్తారని కూడా అంటున్నారు. అంతమాత్రాన రౌల్‌తో ‘సమర్థ పాలకుడ’నిపించుకున్న దియాజ్ క్యూబా తలుపులు బార్లా తెరుస్తారని అనుకోలేం. ఏదేమైనా ఇకపై క్యూబాను ప్రపంచం మరింత నిశితంగా వీక్షిస్తుంది. -
ట్రంప్‌పై ఫిర్యాదు.. తొక్కిపెట్టిన వైట్‌హౌజ్!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడనేందుకు ఆధారాలున్నాయని ఒక రహస్య విజిల్ బ్లోయర్ చేసిన ఫిర్యాదు వెల్లడించింది. వచ్చే సంవత్సరం జరిగే అధ్యక్ష ఎన్నికల్లో మరో దేశం జోక్యాన్ని ట్రంప్ కోరారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయాన్ని తొక్కిపట్టేందుకు వైట్‌హౌజ్ ప్రయత్నించిందని గురువారం వెలుగులోకి వచ్చిన ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. రానున్న అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్ పార్టీ తరఫున తన ప్రత్యర్థి కానున్న జో బిడెన్, ఆయన కుమారుడు హంటర్ బిడెన్ ఆర్థిక లావాదేవీలపై విచారణ జరపాలంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు వలొదిమిర్ జెలెన్స్కీపై డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడి తీసుకు వచ్చిన వివరాలను ఆ ఫిర్యాదులో పొందుపర్చారు. రౌల్ కాస్ట్రోపై అమెరికా ఆంక్షలు క్యూబా మాజీ అధ్యక్షుడు రౌల్ కాస్ట్రో, ఆయన కుటుంబసభ్యుల విదేశీ ప్రయాణాలపై అమెరికా ఆంక్షలు విధించింది. అధ్యక్ష పదవి నుంచి వైదొలగినప్పటికీ అధికార కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి హోదాలో రౌల్ కాస్ట్రో మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నారని ఆరోపించింది. ఏకపక్షంగా వేలాది మందిని నిర్బంధిస్తున్నారని, ప్రస్తుతం 100 మంది క్యూబన్లు రాజకీయ ఖైదీలుగా ఉన్నారని విమర్శించింది. దివంగత విప్లవ నేత సోదరుడైన రౌల్ కాస్ట్రో(88) ఆంక్షల కారణంగా అమెరికా వెళ్లడం వీలుకాదు. (చదవండి: ట్రంప్‌పై మళ్లీ అభిశంసన) -
క్యూబాలో క్యాస్ట్రో శకానికి తెర
-
60 ఏళ్ల క్యాస్ట్రోల శకానికి తెర
సాక్షి, న్యూఢిల్లీ : కమ్యూనిస్టు పాలనలో ఉన్న లాటిన్ అమెరికా దేశం క్యూబాలో క్యాస్ట్రోల ఆరు దశాబ్దాల పాలనకు గురువారం తెరపడింది. ఫిడెల్ క్యాస్ట్రో అనంతరం 12 సంవత్సరాల క్రితం దేశాధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన ఆయన సోదరుడు రౌల్ క్యాస్ట్రో తన పదవికి స్వస్తి చెప్పారు. దేశ కమ్యూనిస్టు పార్టీ అధ్యక్షుడిగా ఆయనే కొనసాగుతారు కనుక ప్రభుత్వంపై కూడా ఆయన పట్టు కొనసాగుతుంది. రెండు పర్యాయాలు నిరాటంకంగా దేశాధ్యక్ష బాధ్యతలు నిర్వహించిన రౌల్ క్యాస్ట్రో (86) ఆర్థిక సంస్కరణలు చేపట్టి ప్రైవేటు రంగానికి ప్రవేశం కల్పించారు. ఆగర్భ శత్రువైన అమెరికాతో సంబంధాలు నెలకొల్పారు. 2015లో అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మొట్టమొదటిసారిగా క్యూబాను సందర్శించడంతో ఇరు దేశాల మధ్య సాధారణ పౌర సంబంధాలు ఏర్పడ్డాయి. అయితే డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైన నాటి నుంచి ఇరు దేశాల మధ్య సంబంధాలు అంతగా కొనసాగడం లేదు. ఫిడెల్ క్యాస్ట్రో నాయకత్వాన 1959లో క్యూబాలో విప్లవం విజయవంతం అవడం, ఆ తర్వాత క్యాస్ట్రో ప్రధాన మంత్రిగా దేశ నాయకత్వ బాధ్యతలు స్వీకరించడం తెల్సిందే. 1976 వరకు అదే పదవిలో కొనసాగిన ఆయన 1976లో రాజ్యాంగ సవరణ ద్వారా దేశాధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. నాలుగు దశాబ్దాలపాటు పదవిలో కొనసాగిన ఫిడెల్ క్యాస్ట్రో.. అనారోగ్య కారణాల వల్ల 2006లో దేశాధ్యక్ష బాధ్యతలను తన సోదరుడు రౌల్ క్యాస్ట్రోకు అప్పగించారు. అన్నతోపాటు రౌల్ క్యాస్ట్రో క్యూబా విప్లవంలో క్రియాశీలక పాత్ర పోషించారు. దాదాపు 60 ఏళ్లు ఇద్దరు క్యాస్ట్రోలే దేశాన్ని పాలించారు. రౌల్ క్యాస్ట్రో స్థానంలో క్యూబా కమ్యూనిస్టు పార్టీ స్టేట్ కౌన్సిల్ పార్టీ విధేయుడైన మిగుల్ డియాజ్ కెనాల్ బెర్ముడెజ్ (58)ను ఎన్నుకొంది. గురువారం నాడు దేశాధ్యక్షుడిగా రౌల్ క్యాస్ట్రో దిగిపోవాలనే, ఇదే రోజున దేశాధ్యక్షుడిగా మిగుల్ డియాజ్ బాధ్యతలు స్వీకరించాలని ముందుగా నిర్ణయించారు. ఇందుకు ఓ కారణం ఉంది. 1961లో అప్పటి ప్రధాన మంత్రి ఫిడెల్ క్యాస్ట్రోను దించేందుకు అమెరికా మద్దతుతో 1400 మంది తిరుగుబాటుదారులు కుట్ర చేశారు. ‘బే ఆఫ్ పిగ్ ఇన్వేషన్’గా పేర్కొన్న ఆ కుట్ర విఫలమైన వార్షికోత్సవ రోజు గురువారం. అంతేకాకుండా డియాజ్ కెనాల్ ఈ రోజునే 58వ ఏట అడుగుపెట్టారు. క్యూబాలో ఆర్థిక సంస్కరణలు ఊపందుకొని ప్రైవేటు పెట్టుబడులు పెరుగుతున్న సమయంలో రౌల్ క్యాస్ట్రో దిగిపోయారు. కొత్త తరానికి నాయకత్వం అప్పగించారు. డియాజ్ కెనాల్ చాలాకాలంగా దేశ ఉపాధ్యక్షుడిగా ఉంటూ రౌల్ క్యాస్ట్రోకు అండగా ఉన్నారు. ఆయన అమెరికా నటుడు రిచర్డ్ గేర్‌లా ఉన్నారంటారు. ఆయన ‘ది బీటిల్స్’ రాక్ బ్యాండ్‌కు వీరాభిమాని. -
ఫిడెల్ క్యాస్ట్రో సంచలన వ్యాఖ్యలు
హవానా: తనకు అంతిమ ఘడియలు సమీపించాయని, త్వరలోనే తాను మరణిస్తానని క్యూబా విప్లవ యోధుడు ఫిడెల్ క్యాస్ట్రో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మంగళవారం కమ్యూనిస్టు పార్టీని ఉద్దేశించి వీడ్కోలు ప్రసంగం చేశారు. 'త్వరలో నాకు 90 ఏళ్లు వస్తాయి. అందరికీ అంతిమ సమయం ఆసన్నమౌతుంది. నాకూ అంతే. అయితే, క్యూబా కమ్యూనిస్టుల భావాలు చరిత్రలో నిలిచిపోతాయి.. చిత్తశుద్ధితో పోరాడితే అవి ప్రజల అవసరాలు తీర్చగలవనేందుకు రుజువులుగా ఉంటాయి. దీనికోసం మనం అలుపెరగకుండా పోరాడాలి' అని కమ్యూస్టులకు క్యాస్ట్రో పిలుపునిచ్చారు. తన చావుపై మాట్లాడే విషయంలో నిషేధం ఏమీ లేదని అభిమానులకు విజ్ఞప్తి చేశారు. ఇదే తన ఆఖరి సందేశం కావొచ్చునన్నారు. క్యూబా కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్ ముగింపు సమావేశాల సందర్భంగా ఫిదెల్ క్యాస్ట్రో తమ్ముడు, క్యూబా అధ్యక్షుడు రౌల్ కాస్ట్రో మళ్లీ కమ్యూనిస్టు పార్టీ పగ్గాలు చేపట్టారు. 2006లో ఫిడెల్ క్యాస్ట్రో తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో పార్టీ కార్యదర్శి పదవితోపాటు ఆ దేశ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి తమ్ముడు రౌల్‌కు బాధ్యతలు అప్పజెప్పారు. -
దూరం 90 మైళ్లు.. వెళ్లడానికి 88 ఏళ్లు!
అట్లాంటిక్ మహాసముద్రంలోకి చొచ్చుకుపోయినట్లుండే అమెరికా రాష్ట్రం ఫ్లోరిడా, క్యూబాల మధ్య దూరం 90 మైళ్లు. ఐదున్నర దశాబ్ధాలపాటు ఉప్పూ-నిప్పులా ఉన్న ఆ రెండు దేశాలు వైరం వీడి శాంతిబాటపట్టిన నేపథ్యంలో 88 ఏళ్ల తర్వాత ఓ చారిత్రక ఘట్టం ఆవిష్కృతం కానుంది. ఇప్పటికే దౌత్య, వాణిజ్యపరమైన సంబంధాలు పునరుద్ధరించుకున్నప్పటికీ దేశాధినేతల పర్యటన వెలితి అతి త్వరలో పూడనుంది. ఆ వెలితి పూడ్చబోయేది.. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా. సతీమణి మిషెల్లితోకలిసి ఒబామా మార్చి 21,22తేదీల్లో క్యూబాలో పర్యటిస్తారని శుక్రవారం వైట్ హౌస్ వర్గాలు తేల్చిచెప్పాయి. ఒక అమెరికా అధ్యక్షుడు చివరిసారిగా క్యూబా వెళ్లింది 1928లో. నాటి ప్రెసిడెంట్ కెల్విన్ కూలిడ్జ్ పర్యటన తర్వాత ఆ దేశాల సంబంధాలు అంతకంతకూ దిగజారాయి. ఇరాక్, అఫ్టానిస్థాన్ ల నుంచి సైన్యాన్ని వెనక్కి రప్పించడం, ఇరాన్ తో శాంతి ఒప్పందం తదితర చర్యలతో శాంతి కాముకుడిగా పేరుపొందిన ఒబామా 88 ఏళ్ల తర్వాత క్యూబాలో పర్యటించనున్న అమెరికా అధ్యక్షుడు కావటం ఆయనపొందిన నోబెల్ శాంతి పురస్కారానికి మరింత గౌరవాన్ని ఆపాదించినట్లవుతదని కొందరిభావన. 'ఇరుదేశాల మధ్య శాంతి, సుహృద్భావం పెంపొందించేందుకు క్యూబాకు వెళతానని 14 నెలల కిందటే చెప్పా. అందుకు తగిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. సుదీర్ఘకాలం తర్వాత 'క్యాస్ట్రో' గడ్డలోని దౌత్యకార్యాలయంపై అమెరికా జెండా రెపరెపలాడటాన్ని చూడాలని నా మనసు ఉవ్విళూరుతోంది' అని ఒబామా గురువారం ట్విట్టర్ లో స్పందించారు. శాంతి చర్చల ప్రక్రియ మొదలైనప్పటినుంచి క్యూబాకు అమెరికా టూరిస్టుల సంఖ్య గణనీయంగా పెరిగిందన్న ఒబామా.. ఇప్పటికీ పలు అంశాల్లో తీవ్రమైన విబేధాలున్నాయని, తన పర్యటనలో వాటిని ప్రస్తావిస్తానని, అయితే రెండు దేశాలు కలిసికట్టుగా సాగటం మాత్రం ఖాయమని స్పష్టం చేశారు. తన పర్యటన తప్పక క్యూబా అభ్యున్నతికి తోడ్పడుతుందని, తద్వారా హవానా ప్రజల జీవనప్రమాణాలు మరింత మెరుగవుతాయని ఒబామా పేర్కొన్నారు. రావుల్ క్యాస్ట్రో సహా పలువురు మంత్రులు, క్యూబన్ వాణిజ్యవేత్తలతో ఒబామా చర్చలు జరుపుతారు. అనంతరం అటునుంచే అర్జెంటీనా బయలుదేరి వెళతారు. -
చిగురించిన అమెరికా, క్యూబా స్నేహం
వాషింగ్టన్: దశాబ్దాలుగా ఉప్పూ-నిప్పులా ఉన్న అమెరికా, క్యూబా శాంతిమార్గం పట్టాయి. దాదాపు 54 ఏళ్ల సుదీర్ఘ కాలం తర్వాత ఈ దేశాల మధ్య దౌత్య సంబంధాలు మళ్లీ చిగురించాయి. రెండు దేశాల్లోని రాజధానుల్లో సోమవారం దౌత్య కార్యాలయాలు తెరుచుకున్నాయి. గతాన్ని పక్కనబెట్టి కలిసి పరస్పరం కలిసి పని చేయాలని కొద్ది నెలల కిందటే ఈ రెండు దేశాలు అధికారికంగా నిర్ణయించాయి. గతేడాది డిసెంబర్ 17న అమెరికా అధ్యక్షుడు ఒబామా.. క్యూబా అధ్యక్షుడు రౌల్ క్యాస్ట్రోతో చర్చలు జరిపారు. 1961 తర్వాత వాషింగ్టన్‌లోని రాయబార కార్యాలయంపై క్యూబా జెండా ఎగిరింది. దౌత్య బంధాలు మరింత మెరుగుపర్చుకునే క్రమంలో భాగంగా అమెరికా విదేశాంగ మంత్రి జాన్‌కెర్రీ క్యూబా విదేశాంగమంత్రి బ్రూనో రోడ్రిగుజ్తో చర్చలు జరపనున్నారు. అనంతరం ఇరువురు సంయుక్త సమావేశంలో మాట్లాడతారు. జనవరి 1, 1959: క్యూబా నియంత బాటిస్టా పారిపోవడంతో తిరుగుబాటు నేత ఫిడెల్ క్యాస్ట్రో అధికార పగ్గాలు చేపట్టారు. బాటిస్టా మద్దతుదారులపై మరణశిక్షలను అమెరికన్లు విమర్శించడంతో ఇరుదేశాల మధ్య సంబంధాలు చెడిపోయాయి. 1960: అమెరికాకు చెందిన ఆయిల్ రిఫైనరీలు, వాణిజ్యాలను క్యూబా జాతీయీకరణం చేసింది. జనవరి 1961: క్యూబా సోషలిస్టు దేశంగా క్యాస్ట్రో ప్రకటన. మరునాడే క్యాస్ట్రోను కూలదోసేందుకు అమెరికా ‘బే ఆఫ్ పిగ్స్’ కుట్ర. 1998: ఐదుగురు క్యూబా గూఢచారులను అరెస్టు చేసిన అమెరికా. 2006: అనారోగ్యానికి గురైన ఫిడెల్ క్యాస్ట్రో. అధికార పగ్గాలు చేపట్టిన ఆయన సోదరుడు రౌల్ క్యాస్ట్రో. డిసెంబరు 17, 2014: దౌత్య సంబంధాలను పునరుద్ధరిస్తున్నట్లు ఒబామా, రౌల్ క్యాస్ట్రోల ప్రకటన. 2014: ఉగ్రవాద జాబితా నుంచి క్యూబాను తొలగిం చిన ఒబామా సర్కారు. జూలై 20, 2015: రెండు దేశాల మధ్య సంబంధాల పునరుద్ధరణకు ఒప్పందం. -
క్యూబాతో కరచాలనం!
పదే పదే విఫలమవుతున్న విధానాలనే కొనసాగిద్దామనుకోవడం పిడివాదమే అవుతుంది. ఈ సంగతి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆలస్యంగానైనా గ్రహించినట్టున్నారు. అందువల్లే కావొచ్చు... పొరుగునున్న క్యూబాతో దౌత్య సంబంధాలు నెలకొల్పుకోవాలని నిర్ణయించినట్టు బుధవారం ప్రకటించారు. క్యూబా అధ్యక్షుడు రౌల్ కాస్ట్రో కూడా ఇదే మాదిరి ప్రకటన చేశారు. అంతక్రితం వారిద్దరూ దాదాపు గంటసేపు ఫోన్లో సంభాషించుకున్నారు. అమెరికా-క్యూబా సంబంధాల చరిత్ర తెలిసినవారికి ఇది సంభ్రమాశ్చర్యాలు కలిగించే పరిణామం. కెనడా చొరవతో, ఆ దేశమే వేదికగా పోప్ బెనెడిక్ట్ ఆశీస్సులతో ఏడాదిన్నరగా తెరవెనక సాగుతున్న సుదీర్ఘ మంత్రాంగం ఈ పరిణామానికి దోహదపడింది. అగ్రరాజ్యమైన అమెరికాతో పోలిస్తే క్యూబా చిట్టెలుక వంటిది. రెండింటినీ విడదీసేది చిన్న జలసంధి మాత్రమే! కానీ సంబంధాలరీత్యా చూస్తే వాటి మధ్య దూరం కొన్ని లక్షల యోజనాలుంటుంది. 1959లో అమెరికా మద్దతుతో క్యూబాలో రాజ్యమేలుతున్న నియంత బాటిస్టాను ఫైడల్ కాస్ట్రో నాయకత్వంలోని విప్లవకారులు కూల దోయడంతో రెండింటిమధ్యా విద్వేషాలు రాజుకున్నాయి. దేశాధినేతగా బాధ్యతలు స్వీకరించిన కాస్ట్రో తమది సోషలిస్టు విప్లవమని ప్రకటించగానే అమెరికా క్రోథంతో రగిలిపోయింది. 1961లో కాస్ట్రో వ్యతిరేకులకు సీఐఏ ద్వారా శిక్షణనిప్పించి, ఆయుధాలు అందజేసి క్యూబాలోని బే ఆఫ్ పిగ్స్ అనే చిన్న ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించింది. అది బెడిసికొట్టాక అంతంతమాత్రంగా ఉన్న సంబంధాలు కూడా దెబ్బతిన్నాయి. క్యూబాను ఏకాకిని చేసి, బలహీనపరిచి ఆ దేశాన్ని లొంగదీసుకోవాలని ఆనాటి అమెరికా అధ్యక్షుడు కెన్నెడీ ప్రారంభించిన ఆంక్షలు ఏమాత్రం ఫలితాన్నీయలేదు. ఈ ఆంక్షల కారణంగా క్యూబా కష్టాలు పడిన మాట వాస్తవమే. అయినా వాటన్నిటినీ పంటి బిగువున భరించింది. ‘పాహిమాం’ అనేదే లేదని నిక్కచ్చిగా చెప్పింది. అన్ని రంగాల్లోనూ స్వశక్తితో చిన్నగానైనా ఎదిగింది. వైద్యరంగంలో అయితే క్యూబా అగ్రగామి. కమ్యూనిస్టు సిద్ధాంతాలపై సంపూర్ణ విశ్వాసంగల ‘నియంతృత్వ, ఏకపక్ష’ ప్రభుత్వంవల్లనే ఇదంతా సాధ్యమైం దని అమెరికా కొట్టిపారేసి ఉండొచ్చుగానీ అది అర్థ సత్యం మాత్రమే! ప్రచ్ఛన్నయుద్ధ కాలంలో అప్పటి సోవియెట్ యూనియన్ సాయపడగా...తదనంతర కాలంలో వెనిజులా ఆసరాగా నిలిచింది. దౌత్య సంబంధాల పునరుద్ధరణపై చేసిన ప్రకటనలో ఒబామా చెప్పినట్టు క్యూబాను ఏకాకిని చేద్దామనుకున్న ప్రయత్నాలు వాస్తవానికి ఫలించలేదు. ఏ దేశమూ అందుకు సహకరించలేదు. ఆంక్షల కారణంగా అమెరికాలోని పారిశ్రామిక, వ్యాపార సంస్థలు మాత్రమే క్యూబాతో లావాదేవీలు జరపలేకపోయాయి. అమెరికా-క్యూబా మధ్య నెలకొన్న విద్వేషాల పర్యవసానాలు ఒక క్రైం థ్రిల్లర్‌ను తలపిస్తాయి. 1962లో క్యూబా భూభాగంపై సోవియెట్ అణు క్షిపణులు మోహరించి ఉన్నాయని అమెరికా...టర్కీలో ఉంచిన అణు క్షిపణుల మాటేమిటని సోవియెట్ ఆరోపణలు సంధించుకున్నప్పుడు పెను సంక్షోభం తలెత్తింది. మూడో ప్రపంచ యుద్ధం ముంచుకొస్తుందన్న భయాందోళనలు వ్యక్తమయ్యాయి. అయితే క్యూబాను దురాక్రమించబోనని అమెరికా హామీ ఇవ్వడం...ఎవరి క్షిపణులు వారు వెనక్కి తీసుకోవడానికి అంగీకరించడంతో పరిస్థితి చక్కబడింది. తమ కంట్లో నలుసులా మారిన క్యూబా అధినేత కాస్ట్రో అడ్డు తొలగించుకోవడానికి అమెరికా తన గూఢచార సంస్థ సీఐఏ ద్వారా చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కాదు. ‘కాస్ట్రోను హతమార్చడానికి 638 మార్గాలు’ అంటూ బ్రిటన్‌కు చెందిన చానెల్4 ఒక సీరియల్‌నే ప్రసారం చేసింది. అందులో కాస్ట్రో ప్రియురాలిని సీఐఏ లోబర్చుకుని ఆమె ద్వారా కోల్డ్ క్రీమ్‌లో విషాన్ని నింపడం, కాస్ట్రో కాల్చే సిగార్‌లో బాంబు ఉంచడం, బాల్ పాయింట్ పెన్నులో విషపూరిత ద్రవం ఉన్న సిరెంజ్ను ఉంచడంలాంటివెన్నో ఉన్నాయి. 1976లో 73మందితో వెళ్తున్న క్యూబా విమానాన్ని పేల్చేయడం, 1997లో క్యూబా రాజధాని హవానాలో పలు హోటళ్లలో బాంబులు పేలి అనేకులు గాయపడం, ఒక ఇటలీ పౌరుడు మరణించడంవంటివన్నీ సీఐఏ పనులేనంటారు. ఈ ఘటనలపై రహస్యంగా ఫ్లోరిడాలో సమాచారం సేకరిస్తున్న అయిదుగురు క్యూబా పౌరులను గూఢచర్యం సాగిస్తున్నారంటూ అమెరికా అరెస్టుచేసింది. క్యూబాతో వైరం పెంచుకోవడంలోని నిరర్థకతను గుర్తించడానికి అమెరికాకు ఇన్నేళ్లు పట్టడం నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది. తాను బాంబులతో వల్లకాడు చేసిన వియత్నాంతో సాధారణ సంబంధాలను పునరుద్ధరించుకుంది. సోవియెట్ యూని యన్ ముక్కచెక్కలయ్యాక ఏర్పడిన దేశాలతో చెలిమిచేసింది. ఆదినుంచీ తాను తెగనాడిన చైనాతో సైతం దౌత్య సంబంధాలు ఏర్పర్చుకుంది. జనాన్ని ఉక్కు పాదం తో అణిచేసే నియంతలతో సాన్నిహిత్యం నెరపింది. కానీ, పొరుగునున్న చిన్న దేశం తో కరచాలనం చేయడానికి మాత్రం చేతులు రాలేదు. ప్రచ్ఛన్నయుద్ధం ముగిసి పాతికేళ్లయ్యాకగానీ అమెరికాకు జ్ఞానోదయం కలగలేదు. ఇప్పటికీ ఒబామా తీసు కున్న నిర్ణయంపై రిపబ్లికన్లు కారాలు మిరియాలూ నూరుతున్నారు. వచ్చే నెలనుంచి తమ ఆధిపత్యంలోకి రానున్న అమెరికన్ కాంగ్రెస్‌లో దీన్ని గట్టిగా ప్రతిఘటిస్తామని హెచ్చరిస్తున్నారు. వాస్తవానికి ఒబామా నిర్ణయం ఇప్పటికిప్పుడు ఇరు దేశాలమధ్యా పూర్తి స్థాయి దౌత్య సంబంధాలకు దారితీసే అవకాశంలేదు. ఆర్థిక ఆంక్షలూ యథా తథంగా కొనసాగుతాయి. కాకపోతే రెండు దేశాలూ దౌత్య కార్యాలయాలు ప్రారం భించుకోవడం... వ్యాపార, పర్యాటకరంగాల్లో ఉన్న ఆంక్షలను సడలించడం... క్యూబాలో డె బిట్, క్రెడిట్ కార్డులు చెల్లుబాటయ్యేలా చూడటంవంటి స్వల్ప చర్యలకు వీలుకలుగుతుంది. సాకులు చెప్పి, కుట్రలు పన్ని ఏ దేశాన్నయినా ఏకాకిని చేయా లని, లొంగదీసుకోవాలని చూస్తే ఏమవుతుందో అమెరికా క్యూబాలో అనుభవ పూర్వకంగా తెలుసుకుంది. ఇది మెరుగైన దౌత్య నీతికి దోహదపడగలిగితే మంచిదే. -
క్యూబా, అమెరికా భాయి.. భాయి!
వాషింగ్టన్: క్యూబాతో దశాబ్దాల వైరానికి ముగింపు పలికే దిశగా అమెరికా పలు నిర్ణయాలు తీసుకుంది. క్యూబా రాజధాని హవానాలో అమెరికా రాయబార కార్యాలయ ఏర్పాటు, ఆ దేశంపై విధించిన వాణిజ్య, పర్యాటక ఆంక్షల సడలింపు, క్యూబాను ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశమని గతంలో చేసిన ప్రకటనపై పునఃపరిశీలన.. మొదలైన కీలక దౌత్య పరమైన నిర్ణయాలను అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తీసుకున్నారు. కాలం చెల్లిన వైఖరిని పక్కనబెట్టి.. పరస్పర ప్రయోజనాలు లక్ష్యంగా క్యూబాతో సంబంధాలను రూపొందించుకోవాలని నిర్ణయించినట్లు ఆయన ప్రకటించారు. అదే సమయంలో క్యూబా పౌరుల హక్కులకు అమెరికా మద్దతుంటుందని స్పష్టం చేశారు. క్యూబా అధ్యక్షుడు రౌల్ క్యాస్ట్రోతో కూడా తాను మాట్లాడానన్నారు. కాగా, అమెరికా నిర్ణయంపై భారత్ సహా పలు ప్రపంచ దేశాలు హర్షం వ్యక్తం చేశాయి.