ఫిడెల్ క్యాస్ట్రో సంచలన వ్యాఖ్యలు
హవానా: తనకు అంతిమ ఘడియలు సమీపించాయని, త్వరలోనే తాను మరణిస్తానని క్యూబా విప్లవ యోధుడు ఫిడెల్ క్యాస్ట్రో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మంగళవారం కమ్యూనిస్టు పార్టీని ఉద్దేశించి వీడ్కోలు ప్రసంగం చేశారు. 'త్వరలో నాకు 90 ఏళ్లు వస్తాయి. అందరికీ అంతిమ సమయం ఆసన్నమౌతుంది. నాకూ అంతే. అయితే, క్యూబా కమ్యూనిస్టుల భావాలు చరిత్రలో నిలిచిపోతాయి.. చిత్తశుద్ధితో పోరాడితే అవి ప్రజల అవసరాలు తీర్చగలవనేందుకు రుజువులుగా ఉంటాయి. దీనికోసం మనం అలుపెరగకుండా పోరాడాలి' అని కమ్యూస్టులకు క్యాస్ట్రో పిలుపునిచ్చారు.
తన చావుపై మాట్లాడే విషయంలో నిషేధం ఏమీ లేదని అభిమానులకు విజ్ఞప్తి చేశారు. ఇదే తన ఆఖరి సందేశం కావొచ్చునన్నారు. క్యూబా కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్ ముగింపు సమావేశాల సందర్భంగా ఫిదెల్ క్యాస్ట్రో తమ్ముడు, క్యూబా అధ్యక్షుడు రౌల్ కాస్ట్రో మళ్లీ కమ్యూనిస్టు పార్టీ పగ్గాలు చేపట్టారు. 2006లో ఫిడెల్ క్యాస్ట్రో తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో పార్టీ కార్యదర్శి పదవితోపాటు ఆ దేశ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి తమ్ముడు రౌల్‌కు బాధ్యతలు అప్పజెప్పారు.