ముగిసిన ‘కాస్ట్రోల’ శకం | Sakshi Editorial On Castro Era | Sakshi
Sakshi News home page

ముగిసిన ‘కాస్ట్రోల’ శకం

Published Tue, Apr 20 2021 12:42 AM | Last Updated on Thu, May 20 2021 3:46 PM

Sakshi Editorial On Castro Era

ఆరు దశాబ్దాలుగా అమెరికాకు కునుకు లేకుండా చేస్తున్న కాస్ట్రోల శకం క్యూబాలో ముగిసింది. అక్కడి పాలనా వ్యవస్థను నియంత్రించే కమ్యూనిస్టు పార్టీ చీఫ్‌ పదవి నుంచి మాజీ అధ్యక్షుడు రౌల్‌ కాస్ట్రో నిష్క్రమించారు. 1959లో అమెరికా ప్రాపకంతో క్యూబాను శాసిస్తున్న నియంత బాటిస్టాను ఫైడల్‌ కాస్ట్రో నాయకత్వంలోని విప్లవకారులు తిరుగుబాటులో సాగినంపిన నాటినుంచి దాంతో అమెరికాకు పొసగటం లేదు. 2014 డిసెంబర్‌లో అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా హయాంలో తొలిసారి ఇరు దేశాల సంబంధాలూ కొత్త మలుపు తిరిగాయి. ఆ దేశాన్ని సందర్శించిన అమెరికా తొలి అధినేతగా ఒబామా చరిత్రలో నిలిచారు. నిజానికి ప్రపంచాన్నే శాసిస్తున్న అమెరికాతో క్యూబాకు పోలికే లేదు. అగ్రరాజ్యం పొరుగునున్న అతి చిన్న దేశం క్యూబా. మామూలుగా అయితే క్యూబాను అమెరికా బేఖాతరు చేయొచ్చు. దాన్ని పట్టించు కోకుండా ఊరుకోవచ్చు. అలాగే ప్రపంచ వ్యాప్తంగా వున్న పౌరులు సైతం ఆ దేశంపై పెద్దగా దృష్టి పెట్టేవారు కాదు. అయితే అమెరికా ఆ చిన్న దేశంపట్ల అనుసరించిన ధోరణి, అది సవాలు విసిరిన ప్రతిసారీ క్యూబా పోట్ల గిత్త మాదిరి చెలరేగిన వైనం చూశాక అందరిలో ఆసక్తి పెరిగింది.

 ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు భిన్న రకాలైన ప్రజాస్వామిక వ్యవస్థలను నెలకొల్పుకున్నాయి. అన్ని దేశాలకూ ఆదర్శనీయమనదగ్గ లోపరహితమైన ప్రజాస్వామిక నమూనా ప్రపంచంలో ఎక్కడా లేదు. ‘అతి పురాతన ప్రజాస్వామ్య దేశం’గా కీర్తిప్రతిష్టలు ఆర్జించిన అమెరికా కూడా ఇందుకు మిన హాయింపు కాదు. ప్రస్తుతం చైనాలో, ఉత్తర కొరియాలో, చాన్నాళ్లక్రితం సోవియెట్‌ యూనియన్‌లో వున్నలాంటి ఏక పార్టీ పాలనే క్యూబాలో కూడా కొనసాగుతోంది. అక్కడ యావజ్జీవ పాలకపక్షం కమ్యూనిస్టు పార్టీయే. ఆ దేశంలో పరిపాలన గురించి, అక్కడ అమలయ్యే నియంతృత్వ విధానాల గురించి పాశ్చాత్య దేశాల్లో కథలు కథలుగా చెప్పుకునేవారు. ఆ దేశం నుంచి తప్పించుకొచ్చినవారి కథనాలు భయంగొలిపేవి. అయితే వీటికి సమాంతరంగా గణనీయమైన విజయాలు సాధించలేక పోయివుంటే క్యూబా గురించి చెప్పుకోవటానికి ఏమీ వుండేది కాదు. ముఖ్యంగా ప్రజారోగ్య రంగంలో ఆ దేశం ప్రశంసించదగ్గ విజయాలు సాధించింది. ఆ దేశ పౌరుల సగటు ఆయుఃప్రమాణం 79.13 ఏళ్లు. అమెరికా పౌరుల ఆయుఃప్రమాణం 78.64 ఏళ్లతో పోలిస్తే ఇది అధికమే. అక్కడ ప్రతి 155 మందికి ఒక డాక్టర్‌ వుంటారు. ప్రపంచంలో ఎక్కడ ఆరోగ్య సంక్షోభం తలెత్తినా ఆ దేశ వైద్యులు రెక్కలు కట్టుకుని వాలేందుకు సిద్ధపడతారు. సంక్షోభాలెన్ని చుట్టుముట్టినా విద్యకు బడ్జెట్‌లో 10 శాతాన్ని కేటాయించే దేశం క్యూబా. ప్రాథమిక స్థాయినుంచి విశ్వవిద్యాలయ విద్యవరకూ అంతా ఉచితం. అక్కడ పదిహేనేళ్లకు పైబడ్డవారిలో అక్షరాస్యత 99.8 శాతం. చెప్పాలంటే ఈ విషయంలో కూడా అమెరికా కాస్త వెనకబడేవుంది. ఆ దేశంలో అక్షరాస్యత 99 శాతం. ప్రాథమిక పాఠశాలల్లో తరగతికి 25 మంది, సెకండరీ స్థాయిలో తరగతికి 15 మంది పిల్లలు చొప్పున మాత్రమే వుంటారు. అక్కడ మెజారిటీ ప్రజలకు నచ్చకపోతే అంతక్రితం ఎన్నుకున్న ప్రతినిధిని రీకాల్‌ చేసే స్వేచ్ఛ వుంది. ఇవన్నీ నాణేనికి ఒకవైపు మాత్రమే. మరోపక్క అక్కడ దారిద్య్రం విలయతాండవం చేస్తుంటుంది. సగటు పౌరుడి నెల సంపాదన 30 డాలర్లు మించదు. అయితే వేరే దేశాలతో పోలిస్తే జీవన వ్యయం తక్కువే. బహుశా అమెరికా ఆర్థిక ఆంక్షలు విధించకపోతే, ఆ దేశం ఎవరూ వెళ్లరాదని నిషే«ధిం చకపోతే పరిస్థితి ఇంత దయనీయంగా వుండేది కాదు. పర్యాటకులు ఎగబడి సందర్శించే ప్రాంతాలు అక్కడ బోలెడున్నాయి. అలా మంచి ఆదాయం వచ్చేది. అయితే సోవియెట్‌ యూనియన్‌ ఉన్నన్నాళ్లూ క్యూబాను అన్నివిధాలా ఆదుకుంది. వెనిజులాలో హ్యూగో చావెజ్‌ వచ్చాక ఆ దేశం కూడా సాయపడుతూ వచ్చింది. సోవియెట్‌ కుప్పకూలాక పలు దేశాల్లోని సోషలిస్టు ప్రభుత్వాల్లాగే అది కూడా కుప్పకూలుతుందని అమెరికా అంచనా వేసింది. కానీ ఆ అంచనాను క్యూబా తలకిందులు చేసింది. ఎప్పటిలాగే ధైర్యంగా, నిటారుగా నిలబడింది. ఫైడల్‌ కాస్ట్రోను అంతం చేయడానికి అమెరికా చేయని ప్రయత్నమంటూ లేదు. సీఐఏలో పనిచేసి బయటికొచ్చినవారే కాస్ట్రోను అంతం చేయడానికి తమ ఏజెంట్ల ద్వారా, మాఫియా ముఠాల ద్వారా 638 సార్లు ప్రయత్నాలు జరిగాయని రాశారు. అలా ప్రయత్నించిన అమెరికాయే క్యూబాను 2011లో ఉగ్రవాద దేశంగా ప్రకటించటం ఒక వైచిత్రి.
రౌల్‌ కాస్ట్రోను 2006లో ఫైడల్‌ కాస్ట్రో తన తాత్కాలిక వారసుడిగా ప్రకటించి, 2008లో శాశ్వతంగా అధ్యక్ష స్థానాన్ని అప్పగించారు. 2018 వరకూ ఆయన ఆ పదవిలో వున్నారు. ఆ తర్వాత ప్రస్తుత అధ్యక్షుడు మిగూల్‌ దియాజ్‌ కెనెల్‌కు అధికార పగ్గాలు అప్పగించి కమ్యూనిస్టు పార్టీ బాధ్యతలకు పరిమితమయ్యారు. ఇప్పుడు 89 ఏళ్ల వయసులో ఆయన పార్టీ సారథ్యాన్ని కూడా వదులుకున్నారు. అలా క్యూబాలో కాస్ట్రోల శకం ముగిసింది. అమెరికా ఆశిస్తున్నట్టు అది సోషలి జానికి కూడా వీడ్కోలు చెబుతుందా? దియాజ్‌ వచ్చాక దేశంలో సంస్కరణల బీజాలు నాటారు. స్వేచ్ఛా మార్కెట్‌కు చోటిచ్చారు. క్యూబా పౌరులు సొంత వ్యాపారాలు పెట్టుకునేందుకు అనుమ తులిస్తారని కూడా అంటున్నారు. అంతమాత్రాన రౌల్‌తో ‘సమర్థ పాలకుడ’నిపించుకున్న దియాజ్‌ క్యూబా తలుపులు బార్లా తెరుస్తారని అనుకోలేం. ఏదేమైనా ఇకపై క్యూబాను ప్రపంచం మరింత నిశితంగా వీక్షిస్తుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement