ప్రపంచ విప్లవ జ్వాల | Sakshi Guest Column On Che Guevara | Sakshi
Sakshi News home page

ప్రపంచ విప్లవ జ్వాల

Published Wed, Oct 9 2024 4:57 AM | Last Updated on Wed, Oct 9 2024 4:57 AM

Sakshi Guest Column On Che Guevara

ఇన్‌ బాక్స్‌ 

ప్రజల కోసం సర్వస్వం త్యజించిన విప్లవ నేత చే గువేరా! ఆయన అసలు పేరు ఎర్నెస్టో గెవారా! ఆయన పెట్టుబడిదారీ వ్యవస్థతో పాటు సామ్యవాదంలోని సంప్రదాయ వాదాన్ని కూడా వ్యతిరేకించాడు. అర్జెంటీనాలోని రొసారియా అనే పట్టణంలో 1928 జూన్‌ 14న ఒక మధ్య తరగతి కుటుంబంలో జన్మించాడు. 

1953లో బ్యూనస్‌ ఎయిర్స్‌ విశ్వవిద్యాలయం నుండి వైద్య విద్యలో పట్టా పొందాడు. ఆ తదుపరి మోటారు సైకిల్‌పై దక్షిణ అమెరికా ఖండమంతటా పర్యటిస్తున్న సమయంలో ప్రజల జీవన స్థితిగతుల గురించి తెలుసుకున్నాడు. విప్లవమొక్కటే సామాజిక అసమానతలను తొలగించగలదని భావించాడు. 

1954లో గౌటెమాలలో ప్రజాబాహుళ్యపు అభ్యున్నతికి కృషి చేస్తున్న సామ్యవాద అనుకూల ప్రభుత్వంతో కలిసి పనిచేశాడు. కానీ అదే సంవత్సరం అమెరికా సాయంతో జరిగిన కుట్ర మూలంగా ఆ ప్రభుత్వం కూలి పోయింది. అక్కడి నుంచి మెక్సికో వెళ్ళిపోయాడు. ఈ ఘటనతో అతని విప్లవ దృక్పథం మరింత బలపడింది. 

మెక్సికోలో ఫిడెల్‌ క్యాస్ట్రో నాయకత్వంలో అక్కడికి ప్రవాసం వచ్చిన క్యూబా విప్లవకారులతో చేతులు కలిపాడు. 1950వ దశకం చివరలో అప్పటి క్యూబా నియంత బాటిస్టాకు వ్యతిరేకంగా కాస్ట్రో ఆధ్వర్యంలో జరిగిన గెరిల్లా పోరాటం (1956–1959)లో చే గువేరా ముఖ్య పాత్ర పోషించాడు. డాక్టర్‌గా, మిలిటరీ కమాండర్‌గా అంకిత భావంతో సేవలందించాడు. 

పోరాటం విజయవంతమైన తరువాత, కాస్ట్రో 1959 జనవరిలో క్యూబా ప్రభు త్వాధికారాన్ని చేపట్టాడు. ఆ ప్రభుత్వంలో చే పరిశ్రమల మంత్రిగా, క్యూబా జాతీయ బ్యాంకు అధ్యక్షునిగా  పనిచేశాడు. క్యూబా ప్రతినిధిగా అనేక దేశాలు పర్యటించాడు. ఈ పర్యటనలలో భాగంగానే 1959 జూలై నెలలో భారతదేశంలో కూడా పర్యటించాడు. తన రచనలలో వర్ధమాన దేశాలలో రైతాంగ విప్లవోద్యమాలు నిర్మింపబడాలని కోరుకున్నాడు! 

పేద దేశాలలో విప్లవాన్ని వ్యాప్తిచేయ తలపెట్టి ఆయన 1965లో క్యూబాలో తన అత్యున్నత స్థానాన్ని, పలుకుబడిని వదలి పెట్టి కాస్ట్రో వారిస్తున్నా వినకుండా దేశం నుండి అదృశ్యమయ్యాడు. కొద్దిమంది అనుచరులతో రహస్యంగా ఆఫ్రికా దేశమైన కాంగోలో కొంతకాలం గడిపాడు. ఆ సమయంలో ఆ దేశం తూర్పు ప్రాంతంలో గెరిల్లా తిరుగుబాటుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. 

1966 చివరిలో మళ్ళీ దక్షిణ అమెరికాకు వచ్చాడు! బొలీవియా దేశంలో మిలిటరీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడు తున్న విప్లవకారులకు నాయకత్వం వహించాడు! ఈ సమయంలోనే బొలీవియన్‌ సైన్యానికి చిక్కాడు! 1967 అక్టోబర్‌ 9న వల్లెగ్రాండె అనే ప్రాంతంలో ఆ సైన్యం ఆయన్ని చంపివేసింది. అలా ఓ ప్రపంచ విప్లవ జ్వాల ఆరిపోయింది!

– ఎమ్‌డీ మునీర్, సీనియర్‌ జర్నలిస్ట్‌
(నేడు చే గువేరా వర్ధంతి) 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement