
ప్రపంచ ప్రజలను ప్రభావితం చేసిన విప్లవ నాయకుడు చే గువేరా. అర్జెంటీనాకు చెందిన ఈ మార్క్సిస్ట్ విప్లవకారుడు... వైద్యుడు, రచయిత, మేధావి, గెరిల్లా నాయకుడు, సైనిక సిద్ధాంతకర్త, క్యూబన్ విప్లవంలో ముఖ్యుడు. ఆయన అసలు పేరు ఎర్నేస్తో ‘చే’ గువేరా. 1928 జూన్ 14న అర్జెంటీనాలోని రోసారియోలో జన్మించారు. ఆయనకు ఆస్తమా వ్యాధి వుండేది. ఆ వ్యాధితో బాధపడుతూనే విప్లవ పోరాటాలు చేశారు.
లాటిన్ అమెరికాలో పర్యటన సమయంలో అక్కడి పేదరికం చూసి చలించిపోయారు. దీనికి కారణం ఆర్థిక తారతమ్యాలు, ఏకస్వామ్య పెట్టుబడిదారీ వ్యవస్థ, నూతన వలసవాదం, సామ్రాజ్యవాదాలేనని భావించారు. సమకాలీన వ్యవస్థపై తిరుగుబాటు చేయడం ద్వారా సమస్యలను పరిష్కరించవచ్చని భావించారు. అందుకే విప్లవం బాట పట్టారు.
మెక్సికోలో ఉంటున్న సమయంలో రౌల్, ఫిడెల్ కాస్ట్రోలను కలిశారు. అప్పటి నుంచి వారితో భుజం భుజం కలిపి క్యూబాను బాటిస్టా పాలన నుంచి విముక్తి చేయడానికి పోరాడారు. విప్లవకారుల్లో ముఖ్యమైన వ్యక్తిగా, సైన్యంలో రెండవ స్థానానికి చేరుకుని, నియంతృత్వ బాటిస్టాపై జరిగిన గెరిల్లా పోరాటంలో కీలకపాత్ర పోషించారు. క్యూబా తిరుగుబాటు తర్వాత ఏర్పడిన ప్రభుత్వంలో అనేక ప్రధాన బాధ్యతలను స్వీకరించారు. మంచి వ్యవసాయ సంస్కరణలను ప్రవేశపెట్టారు. జాతీయ బ్యాంకు అధ్యక్షునిగా, క్యూబా సైనికదళాల బోధనా నిర్దేశకునిగా, క్యూబన్ సామ్యవాద దౌత్యవేత్తగా ప్రపంచ వ్యాప్తంగా పర్యటనలు చేశారు.
గెరిల్లా యుద్ధ తంత్రంపై ఆధార గ్రంథాన్ని రాశారు. దక్షిణ అమెరికాలో ఆయన జరిపిన యూత్ మోటార్ సైకిల్ యాత్ర జ్ఞాపకాల ఆధారంగా పుస్తకం రాశారు. గువేరా 1965లో క్యూబాను వదలి కాంగో కిన్షాసాలోనూ, బొలీవియాలోనూ యుద్ధాలకు నాయకత్వం వహించారు.
బొలీవియా యుద్ధంలో పాల్గొని, 1967 అక్టోబర్ 9న అక్కడి సైనికాధికారులకు పట్టుబడి కాల్చివేతకు గురయ్యారు. అలా తాను పుట్టిన దేశం వదలి ప్రపంచ పీడితుల పక్షాన వివిధ దేశాల్లో పోరాటాలు చేస్తూ అసువులు బాసి ఆధునిక విప్లవం మీద తనదైన ముద్ర వేశారు చే!
– ర్యాలి ప్రసాద్, కాకినాడ
(నేడు చే గువేరా జయంతి)