బొల్లోజు రవి
ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టులకు స్ఫూర్తి ప్రదాత అయిన నిన్నటితరం గెరిల్లా యుద్ధ యోధుడు, మార్క్సిస్టు విప్లవవీరుడు చేగువేరా నేటి యువతరానికీ ఓ ఐకాన్. తండ్రి విప్లవ బాటను నిలువెల్లా నింపుకున్న ఆయన కుమార్తె, మానవ హక్కుల కార్యకర్త డాక్టర్ అలైదా గువేరా ‘సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకిద్దాం... ప్రపంచ శాంతిని కాపాడుకుందాం’అంటూ ప్రపంచమంతా చాటి చెబుతున్నారు. క్యూబా రాజధాని హవానాలోని విలియం సోలెర్ చిల్ర్డన్స్ హాస్పిటల్లో వైద్యురాలిగా పనిచేçస్తూనే ప్రపంచ దేశాల్లో జరిగే వివిధ కార్యక్రమాలకు ఆమె హాజరవుతుంటారు. క్యూబా సంఘీభావ యాత్రలో భాగంగా భారత్‌లో పర్యటిస్తున్న అలైదా గువేరా ఆదివారం తన కుమార్తె, చేగువేరా మనవరాలు ప్రొఫెసర్ ఎస్తిఫినా గువేరాతో కలసి హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్భంగా డాక్టర్ అలైదా గువేరా ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే...
నాన్నతో గడిపిన కాలం గుర్తుంది...
లాటిన్ అమెరికా దేశాల్లో విప్లవాన్ని రగిలించేందుకు వెళ్లిన నాన్నను బొలీవియాలో 1967లో అమెరికా అనుకూల బొలివీయా దళాలు కాల్చి చంపినప్పుడు నాకు సుమారు ఏడేళ్లు. అయినప్పటికీ ఆయనతో గడిపిన క్షణాలు నాకు ఇప్పటికీ మెరుపులా గుర్తున్నాయి. ఆయన ప్రతిరోజూ ఉదయం 5 గంటలకు నన్ను లేపేవారు. చెరకు తోటలకు తీసుకెళ్లేవారు. అక్కడ ఆయన పనిచేస్తుంటే నేను చెరకుగడలు తింటూ గడిపేదాన్ని. ఇతరులతో మాట్లాడుతూ నన్ను ఆడిస్తూ ఉండేవారు. ఆయన ఇంట్లో ఉన్నప్పుడు వీపుపై తిప్పుతూ ఆడించేవారు. నాకు, నా సోదరులకు జంతువుల కథలను ఎక్కువగా చెప్పేవారు. వారాంతాల్లో స్వచ్ఛంద పనులు చేసేవారు. ప్రపంచంలో అణిచివేతకు గురవుతున్న మానవ సమూహాలను ప్రేమించాలని చెప్పేవారు. సామాజిక సేవా కార్యక్రమాలకు తీసుకెళ్లేవారు. మాకు దూరంగా ఉన్నా ఉత్తరాలు రాసే వారు.
మరో తండ్రిలా క్యాస్ట్రో...
నాన్న చనిపోయాక క్యూబా కమ్యూనిస్టు పితామహుడు, అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమ నేతల్లో ఒకరైన ఫిడేల్ క్యాస్ట్రోనే అన్నీ తానై నన్ను చూసుకున్నారు. క్యాస్ట్రో మరో తండ్రిలాంటి వారు. ఆయనతో కలిసి గడిపిన కాలం ఎంతో ప్రత్యేకం. 1987లో నాకు పెళ్లయింది. పెళ్లి రాత్రి 11:30 గంటలకు జరిగింది. ఆయన రాకకోసం వేచిచూసి ఆ సమయంలో చేసుకున్నాం. నాకు కూతురు పుట్టినప్పుడు ఆయన ఆసుపత్రికి వచ్చారు. విక్టోరియా అనే పేరు పెట్టాలని సూచించారు. కానీ అప్పటికే నేను, మావారు ఒక పేరు నిర్ణయించాం. ఈ విషయం ఆయనకు చెప్పేసరికి కాస్తంత నొచ్చుకున్నారు. పాపను చూసి అమ్మలా నువ్వు ఉండొద్దు (నవ్వుతూ) అని అన్నారు.
ప్రపంచానికి మా దేశ వైద్య రంగం ఆదర్శం...
క్యూబా వైద్య రంగంలో ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది. కరోనా కాలంలోనూ వివిధ దేశాలకు వైద్య సాయం చేసింది. ఖతార్‌లోని ఒక ఆసుపత్రిలో పనిచేసే వారంతా క్యూబన్లే. వారికి ఆ దేశం వేతనాలు ఇస్తుంది. హైతీలోనూ ఒక ఆసుపత్రిలో క్యూబన్లు పనిచేస్తున్నా వారికి వేతనాలు ఇచ్చే పరిస్థితుల్లో ఆ దేశం లేదు. అందువల్ల ఖతార్‌లో వచ్చే ఆదాయాన్ని హైతీ ఆసుపత్రుల్లో పనిచేసే క్యూబన్ డాక్టర్లకు చెల్లిస్తున్నాం. అర్జెంటీనాలో స్మారక నేత్ర ఆసుపత్రి, బొలీవియాలో జనరల్ ఆసుపత్రి ఉన్నాయి. కరోనా కాలంలో ఫ్రాన్స్ కూడా క్యూబా వైద్య సాయం కోరింది. ఇటలీ, కెనాడాలకు వైద్య సాయం చేస్తున్నాం. మా దేశంలో చిన్నారులకు 14 రకాల టీకాలు ఇస్తుంటాం. క్యూబాలో ప్రస్తుతం శిశుమరణాల రేటు ప్రతి వెయ్యిలో ఐదుగా ఉంది.
క్యూబాలో స్త్రీ, పురుషులకు సమాన హక్కులు..
క్యూబాలో 100 శాతం స్త్రీ, పురుష సమానత్వం ఉంది. సమాన పనికి సమాన వేతనం ఇస్తున్నారు. మా దేశంలో మహిళా సంఘం ఉంది. అది అన్ని రకాలుగా మహిళల కోసం పనిచేస్తుంది. చినప్పటి నుంచే బాలబాలికలకు సమాన అవకాశాలు కల్పిస్తున్నాం. పైస్థాయిలోనూ సమాన అవకాశాలు ఉన్నాయి. అందుకే మహిళలు అన్ని రకాలుగా ముందున్నారు. అక్కడి చట్టాలు మహిళల హక్కులు కాపాడతాయి. మహిళా ఉద్యోగులకు ప్రసవానికి ముందు రెండు నెలలు, ప్రసవం తర్వాత 9 నెలలు వేతనంతో కూడిన సెలవులు ఇస్తున్నారు. ఆ తర్వాత ఎవరికైనా కూడా అదనపు సెలవులు కావాలంటే మరో మూడు నెలలు 75 శాతం వేతనంతో సెలవు ఇస్తున్నారు. త్వరలో ఏడాదిపాటు వేతనంతో కూడిన సెలవులు ఇచ్చేలా కొత్త చట్టం రానుంది. అంతేకాదు ఆరు నెలలు తల్లికి, మరో ఆరు నెలలు తండ్రికి పూర్తి వేతనంతో కూడిన సెలవులు ఇవ్వాలనుకుంటున్నారు. క్యూబాలో ఇప్పుడు మగవారు కూడా వారికొక సంఘం కోరుకుంటున్నారు (నవ్వుతూ). మా దేశంలో పిల్లలను కొట్టకూడదు. క్యూబా డాక్టర్లలో 72 శాతం మంది మహిళలే.
నాన్న కమ్యూనిస్టు...
నాన్న చేగువేరా పూర్తి కమ్యూనిస్టు. ఇరాన్ వంటి దేశాల్లోనూ ఆయన్ను ఆరాధిస్తారు. జీవితాంతం కమ్యూనిస్టు సిద్ధాంతంతోనే ఆయన పనిచేశారు. కమ్యూనిస్టుగానే ఆయన చనిపోయారు. క్యూబా ఒకప్పుడు అమెరికా కాలనీగా ఆ దేశ కనుసన్నల్లో బతికింది. 1950లలో విప్లవోద్యమంతో అమెరికా అనుకూల ప్రభుత్వాన్ని పడగొట్టి కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక దేశం అన్ని రంగంలో పురోగమించింది. అమెరికాకు ఇది మింగుడు పడడంలేదు. ఇప్పటికీ క్యూబాను నాశనం చేసేందుకు కుట్రలు చేస్తోంది.
పుస్తకం రాస్తున్నా..
నేను నాన్న గురించి ‘చేగువేరా–వైద్యం’అనే పుస్తకం రాస్తున్నా. అందుకోసం నాన్న రాసిన పుస్తకాలను లోతుగా అధ్యయనం చేస్తున్నా. బొలీవియన్ డైరీస్ పుస్తకం చదువుతుంటే గుండె బరువెక్కుతుంది. డైరీ చివరి పేజీ నన్ను కన్నీళ్లు పెట్టిస్తుంది. చివరి పేజీ ఆయన్ను చంపిన రోజు. ఒక పోరాట యోధుడి డైరీనే బొలివియన్ డైరీ. ఎన్ని కష్టాలు ఎదురైనా భవిష్యత్తు గురించి ఆందోళన చెందకూడదు.
చదవండి: అసెంబ్లీ సమావేశాల తర్వాతే.. జాతీయ స్థాయిలో బీఆర్‌ఎస్ విస్తరణ!
Comments
Please login to add a commentAdd a comment