నేడు అల్లూరి సీతారామరాజు జయంతి
భారత స్వాతంత్య్ర పోరాటంలో విప్లవ పథాన్ని అనుసరించి పోరాడిన వీరుల్లో అల్లూరి సీతారామరాజు అగ్రగణ్యుడు. విశాఖ జిల్లా పాండ్రంకిలో జన్మించిన ఆయన తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో సాధారణ విద్యతో పాటు యుద్ధ విద్య, జ్యోతిష్యం వంటివాటిని అభ్యసించాడు. తరువాత దేశ సంచారం చేసి దేశంలో ఉన్న పరిస్థితులను ఆకళింపు చేసుకుని విశాఖ జిల్లా కృష్ణదేవిపేట వచ్చి మన్యంలో తిరుగుబాటు మొదలుపెట్టాడు.
కవర్డు, హైటర్ వంటి అధికారులను సీతారామరాజును మట్టు పెట్టటానికి మన్యం పంపింది బ్రిటిష్ ప్రభుత్వం. లోతుగడ్డ వాగు దగ్గర సీతారామరాజు ఉన్నాడని తెలుసుకొని, 300 మంది పటాలంతో వాళ్లు బయలుదేరారు. ముందుగానే వారి రాకను పసిగట్టిన సీతా రామరాజు విలువిద్యలో ఆరితేరిన గోకిరి ఎర్రేసు, గాము గంటం దొర, మల్లు దొర, పడాలు అగ్గిరాజువంటి వారితో కలిసి గొరిల్లా యుద్ధానికి సిద్ధమయ్యాడు. ఇరుకైన మార్గంలో వస్తున్న కవర్డ్, హైటర్లు సీతారామరాజు దళం దెబ్బకు పిట్టల్లా రాలిపోయారు. ఇది రామరాజు మొదటి విజయం. దీంతో రామరాజు తలమీద బ్రిటిష్ గవర్నమెంట్ 10 వేల రివార్డు ప్రకటించింది.
అయితే ఈ దాడిలో మల్లు దొరకు తుపాకీ గుండు తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. అప్పుడు రామరాజు బ్రిటిష్ వారితో పోరాడాలంటే విల్లంబులు చాలవనీ, తుపాకులు కావాలనీ భావించాడు. తుపాకుల కోసం ఎవరి మీద దాడి చేయకుండా, పోలీస్ స్టేషన్‌లో తుపాకులను, మందుగుండు సామగ్రిని కొల్లగొట్టాలి అని నిర్ణయించుకున్నాడు. అన్నవరం, రాజవొమ్మంగి, అడ్డతీగల, నర్సీపట్నం పోలీస్ స్టేషన్లకు ఒకదాని తరువాత మరొకదానికి మిరపకాయ టపా పంపి తాను స్టేషన్‌పై దాడికి వస్తున్నట్లు తెలిపి మరీ తుపాకులను దోచుకున్నాడు. పోలీస్ రికార్డుల్లో తాను ఎన్ని తుపాకులు తీసుకువెళ్తున్నాడో ఆ వివరాలన్నీ రాసి కింద ‘శ్రీరామరాజు’ అని సంతకం చేశాడాయన.
గుంటూరు కలెక్టర్‌గా పనిచేస్తున్న రూథర్‌ఫర్డ్‌ను సీతారామరాజును అణచడానికి విశాఖ జిల్లాకు పంపించింది బ్రిటిష్ ప్రభుత్వం. ఇదే సమయంలో పరమ నీచుడైన బ్రిటిష్ మేజర్ గుడాల్, గిరిజన గూడేలపై పడి ఆడవాళ్ళపై అత్యాచారాలు చేస్తూ పసిపిల్లలను వధించటం, భార్యల ఎదుటే భర్తను చంపటం, గిరిజన గూడేలను తగలబెట్టడం లాంటి చర్యలకు ఒడిగట్టాడు. ఇది సీతారామరాజుకి తెలిసి, తన వల్ల అమాయకులైన గిరిజన జనం చనిపోవడం, ఇబ్బందులపాలు కావడం ఇష్టంలేక లొంగిపోవాలని నిర్ణయించుకున్నాడు. మార్గమధ్యలో గుడాల్ మాటు వేసి, తన సైన్యంతో సీతారామరాజును బంధించాడు. ఆయన్ని నులక మంచానికి కట్టి, నానా హింసలు పెట్టి, వీధుల్లో ఊరేగించి తుపాకీతో కాల్చి చంపాడు. ఆ విధంగా ఒక విప్లవ జ్యోతి అమరదీపమై దేశ స్వాతంత్రోద్యమానికి దారి చూపింది. – పొత్తూరి సీతారామరాజు, కాకినాడ (నేడు అల్లూరి సీతారామరాజు జయంతి)
Comments
Please login to add a commentAdd a comment