సన్యసించి విప్లవకారులుగా మారిన ఇద్దరే ఇద్దరు యోధులు భారతీయ స్వాతంత్య్ర సమరంలో కనిపిస్తారు. అందులో ఒకరు అరవింద్ ఘోష్ అయితే, మరొకరు విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు. అమాయకులైన ఆదివాసీలపై బ్రిటిష్ ప్రభుత్వ అధికారులు చేస్తున్న దోపిడీ రాజును కదిలించింది. ఇల్లు వదలి సన్యాసిలా దేశాటన చేసి వచ్చిన సీతారామరాజు చివరికి మన్యంలో విప్లవ శంఖాన్ని పూరించిన వైనం అపూర్వం. అటువంటి వీరుని 125 జయంతి ఉత్సవాలను ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభిస్తున్నారు. ఇదే సందర్భంలో భీమవరంలో 30 అడుగుల సీతారామరాజు విగ్రహాన్ని స్వహస్తాలతో ఆవిష్కరించి ఘనమైన నివాళి అర్పిస్తున్నారు.
రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన అల్లూరి సీతారామరాజు గొప్ప దేశభక్తుడు. ఛత్రపతి శివాజీ, రాణా ప్రతాప్‌ల కోవకు చెందిన మహావీరుడు. అమాయకులు, విద్యా విహీనులైన కొండ జాతి ప్రజ లను ఒక్క తాటిపై నిలిపి, వారిని విప్లవ వీరులుగా తీర్చిదిద్ది, బ్రిటిష్ ప్రభుత్వంపై యుద్ధం చేసిన అల్లూరి వంటివారు భారత విప్లవ చరిత్రలో మరొకరు కానరారు.
సీతారామరాజు విప్లవం విజయ వంతం కాకపోయినా, ఆయన ధైర్యసాహసాలు, ప్రాణత్యాగం ఎందరో భారతీయులను ఉత్తేజపరచి, వారిలో జాతీయతా భావాన్నీ, దేశభక్తినీ పురిగొల్పాయి. సన్యాసి జీవితం గడిపిన రాజు, తన స్వీయ ముక్తి కంటే, అణగారిన ప్రజల సాంఘిక, ఆర్థిక విముక్తికి కృషి చేయ డమే తన విద్యుక్త ధర్మమని భావించాడు. భారతదేశ చరిత్రలో సన్యసించి, విప్లవ కారునిగా మారిన వారు అరుదు. అరవింద్ ఘోష్, అల్లూరి సీతారామరాజు మాత్రమే మనకు కనిపిస్తారు. నేడు సీతా రామరాజు 125వ జయంతి. ఈ సందర్భంగా ఆయన 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని ప్రధాన మంత్రి నేడు ఆవిష్కరిస్తున్నారు.
పశ్చిమగోదావరి జిల్లా మోగల్లు గ్రామ వాస్తవ్యులు అల్లూరి వెంకట రామరాజు, సూర్యనారాయణమ్మ మొదటి సంతానంగా 1897 జూలై 4వ తేదీన రాజు జన్మించారు. ఈయన అసలుపేరు శ్రీరామరాజు. ఆయన తండ్రి రాజమండ్రిలో ఫొటోగ్రాఫర్‌గా స్థిర పడ్డారు. రాజమండ్రిలో గోదావరి పుష్కరాలు జరుగుతున్న సమ యంలో 1908లో ఆయన కలరా వ్యాధితో మరణించాడు. అప్పటి నుంచి సీతారామరాజు తాసీల్దారైన పినతండ్రి రామకృష్ణంరాజు సంరక్షణలో పెరిగాడు.
చదువుపై కన్నా ఆయనకు సన్యాసం, ప్రజాసేవ పట్ల ఆసక్తి ఎక్కువగా ఉండేది. అందుకే పినతండ్రి మందలించాడు. దీంతో ఆయన ఇల్లు వదలి వెళ్లిపోయాడు. పలువురిని ఆశ్రయించి జ్యోతిషం, వాస్తు శాస్త్రం అభ్యసించాడు. సంస్కృత భాషపై పట్టు సాధించాడు. ఇచ్ఛాపురం నుండి కాలినడకన కలకత్తా చేరాడు. కలకత్తా వీధుల్లో వెళుతుండగా అప్పటి అగ్ర స్వాతంత్య్ర సమర యోధుల్లో ఒకరు సురేంద్రనాథ్ బెనర్జీ నిత్యార్చన చేసి, తనతో సహపంక్తి భోజనం చేసే ఒక అతిథి కొరకు ఇంటి బయటికి వచ్చి వెతుకుతుండగా ఎదురుగా రాజు కనిపించాడు.
సీతారామరాజును భోజనానికి ఆహ్వానించాడు. అక్కడే 10 రోజులు బెనర్జీ కోరిక మేరకు రాజు ఉండిపోయాడు. ఆ సమయంలో బెనర్జీ ఇంటికి వచ్చిన మోతీలాల్ నెహ్రూ వంటి జాతీయ నాయకులతో రాజు దేశ పరిస్థితుల గురించి చర్చించాడు. అక్కడినుండి కాశీ, హరిద్వార్, రుషీకేశ్, బద్రీనాథ్ వంటి పుణ్య క్షేత్రాలు దర్శించి 1917 జూలై 24న విశాఖ జిల్లా కృష్ణదేవిపేట చేరాడు. దారకొండపై తపస్సుకు వెళ్తున్న రాజును చిటికెల భాస్కరుడు అనే గ్రామ పెద్ద చూసి, విషయం తెలుసుకుని తపస్సుకు ఆ గ్రామంలోనే అన్ని ఏర్పాట్లు చేశాడు.
ప్రజలకు జ్యోతిషం, పురాణాలు, ఆయుర్వేద వైద్యంతో దగ్గరయ్యాడు. అధికారుల దోపిడీని ఎదుర్కొనమని వారిని ప్రోత్సహిం చాడు. వారిలో జాతీయతాభావం రగుల్కొలిపి, ప్రభుత్వ కోర్టులకు పోవద్దనీ, పంచాయతీ కోర్టులు ఏర్పాటు చేసి అక్కడే తగవులు తీర్చుకోమనీ; మద్యం సేవించరాదనీ, ఖద్దరు బట్టలనే ధరించమనీ బోధించాడు. డిప్యూటీ తాసీల్దారు బాస్టియన్, ఓవర్సీరు సంతానం పిళ్ళై చేస్తున్న అరాచకాలను పై అధికారులకు మహజర్ల రూపంలో పంపేవాడు.
ఈ మన్య ప్రాంతంలో గతంలో కొన్ని పితూరీలు, దోపిడీలు జరిగాయి. దానితో ప్రభుత్వానికి రాజుపై అను మానం కలిగి డివిజనల్ మేజిస్ట్రేట్ ఫజులుల్లా ఖాన్‌ను ఎంక్వయిరీ చేయమని పంపారు. రాజు పినతండ్రికి ఖాన్ సహోద్యోగి. సీతారామరాజును నర్సీపట్నం తీసుకుని వెళ్లి తాసీల్దారు ఇంటిలో పెట్టి కృష్ణదేవిపేట వెళ్లవద్దని సలహా ఇచ్చాడు. ఉద్యోగం గానీ, వ్యవసాయ భూమి గానీ తీసుకోమని ఒత్తిడి చేశాడు. సీతారామరాజు ప్రభుత్వ దృష్టిని మళ్ళించటానికి ‘పైడిపుట్ట’లో ఇచ్చిన భూమిని తీసుకున్నాడు.
ప్రజల సమస్యలు తీర్చటానికి తిరుగుబాటే ఏకైక మార్గమని భావించి దానికి రహస్యంగా తగిన ఏర్పాట్లు చేయసాగాడు. ప్రభు త్వంపై తిరుగుబాటుకు ఉత్సాహం చూపించిన సుమారు 200 మంది యువకులను 1922 ఆగస్టు 15న శరభన్నపాలెంలో సమావేశపరచి వారిచే ప్రమాణం చేయించాడు. ఆగస్టు 22న చింతపల్లి పోలీస్ స్టేషన్‌పై దాడితో ప్రారంభమైన విప్లవం 1924 మే నెల వరకు అనేక విజయాలతో, బహుకొద్ది అపజయాలతో కొనసాగింది. ప్రభుత్వం 20 మంది యూరోపియన్ ఉన్నతాధికారులను, 1,500 మంది పైగా ఈస్ట్ కోస్ట్ స్పెషల్ పోలీసు, మలబారు స్పెషల్ పోలీసులను నియ మించి ఉద్య మాన్ని అణచే ప్రయత్నం చేసింది.
ఆనాడు జిల్లా యంత్రాంగం– మద్రాస్ ప్రభుత్వం – ఢిల్లీకి మధ్య జరిగిన రహస్య తంతివార్తలు కొన్ని గమనిస్తే విప్లవం గురించి ప్రభుత్వం చెందిన ఆందోళన తెలుస్తుంది. ఢిల్లీ హోమ్ సెక్రటరీకి మద్రాస్ చీఫ్ సెక్రటరీ రాస్తూ, ‘‘రాజు నాయకత్వాన ప్రారంభమైన విప్లవం 18 నెలలు జరిగినా... అనేక రిజర్వు దళాలను పంపి కూడా అణచలేక పోయాం. సమీపంలో అంతమవుతుందని నమ్మకం లేదు. ఉన్నత న్యాయస్థానం కూడా దీనిని బ్రిటిష్ చక్రవర్తిపై యుద్ధంగానే గుర్తిం చింది’’ అని వాపోయాడు.
ఏజెన్సీ కమిషనర్ స్టీవర్ట్ 1922 అక్టోబర్ 24న మద్రాస్‌కు తంతి పంపుతూ, ‘‘సీతారామరాజు గూఢచర్య చర్యలు అమోఘం. మన దళం బయలుదేరిన వెంటనే ఆ సమాచారం అతనికి చేరుతోంది. మనకు అందే సమాచారమంతా మనల్ని తప్పుదోవ పట్టించడానికి రాజు పంపుతున్న వార్తలే’’ అని పేర్కొన్నాడు. మద్రాస్ స్టాఫ్ కెప్టెన్ బిషప్, ఢిల్లీ హోం సెక్రటరీకి రాస్తూ... ‘‘రెండేళ్ల నుంచి విప్లవం నిరా ఘాటంగా సాగుతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే ఇంకా పదేళ్లయినా కొనసాగుతుంది.
అకస్మాత్తుగా అనుకోని పరిస్థితులు విప్లవకారులకు ఎదురైతే తప్ప ఈ విప్లవం ఆగడం కలలోని మాట. అందువల్ల వెంటనే మార్షల్ లా గానీ, గవర్నర్ జనరల్ ఆర్డినెన్స్ గానీ ప్రకటిం చాలి’’ అని చెప్పాడు. ఈ విధంగా ప్రభుత్వం ఆందోళన చెందుతున్న సమయంలో రూథర్‌ఫర్డ్ అనే నరరూప రాక్షసుడిని ఏజెన్సీ కమిషనర్‌గా నియ మించారు. అతను రాజుకు సహాయం చేస్తున్న వారిని అనుమానించి 58 మంది గ్రామ మునసబులనూ, ముఠాదారులనూ అరెస్టు చేసి రుషికొండ జైలులో బంధించాడు. రాజు ఆచూకీ తెలపండని స్త్రీలను, పిల్లలను చిత్రహింసలు పెట్టించాడు.
1924 మే మొదటి వారంలో కృష్ణదేవి పేటలో రూథర్‌ఫర్డ్ మీటింగ్ పెట్టి పరిసర గ్రామ పెద్దలను హెచ్చరిస్తూ, వారం రోజులలో రాజు దళాన్ని పట్టి ఇవ్వకపోతే కృష్ణ దేవిపేటతోపాటు అనేక గ్రామాలను తగులబెడు తామనీ, చిటికెల భాస్కరుడితో సహా, పెద్దలను జైళ్లలో వేస్తామనీ హెచ్చరించాడు. రాజుకు కృష్ణదేవిపేట అన్నా, చిటికెల భాస్కర్ కుటుంబం అన్నా ఎన లేని అభిమానం అని రూథర్‌ఫర్డ్‌కు తెలిసే ఈ హెచ్చరిక చేశాడు. ప్రభుత్వం తనను ఎదుర్కొనలేక, ప్రజలను పెడుతున్న బాధలను చూసి రాజు బాధపడ్డాడు. అందుకే 1924 మే7వ తేదీన కుంచు మీనన్ నాయకత్వంలోని స్పెషల్ పోలీసు దళానికి ఒక బాలుని ద్వారా కబురు పంపి ‘మంప’ గ్రామంలో లొంగి పోయాడు.
సీతారామరాజును బంధించి కొయ్యూరులో ఉన్న మేజర్ గుడాల్ దగ్గరకు తీసుకువెళ్లారు. రాజుతో గూడాల్ ఘర్షణపడి రాజును తుపాకీతో కాల్చి చంపాడు. ఆ విధంగా ఒక మహోద్యమం పరిసమాప్తం అయింది. సీతారామరాజు దేశభక్తి, పోరాట స్ఫూర్తి ఎప్పటికీ జాతిని మేల్కొలుపుతూనే ఉంటుంది.
వ్యాసకర్త: జి. కిషన్ రెడ్డి కేంద్ర సాంస్కృతిక, పర్యాటకామాత్యులు
Comments
Please login to add a commentAdd a comment