పోరుబాటలో ఆయనది ఉక్కు సంకల్పం | Tamanampalli Amrutha Rao Birth Anniversary: Freedom Fighter, Vizag Steel Plant | Sakshi
Sakshi News home page

Tamanampalli Amrutha Rao: పోరుబాటలో ఆయనది ఉక్కు సంకల్పం

Published Thu, Oct 20 2022 7:48 PM | Last Updated on Thu, Oct 20 2022 7:48 PM

Tamanampalli Amrutha Rao Birth Anniversary: Freedom Fighter, Vizag Steel Plant - Sakshi

తమనంపల్లి అమృతరావు

స్వాతంత్య్రోద్యమంలో గర్జించిన గుంటూరు పోరాట కీర్తి.. పొట్టిశ్రీరాములు కంటే ముందే ఆంధ్రరాష్ట్రం కోసం గళమెత్తిన అమృతమూర్తి.. విశాఖ ఉక్కు కోసం పిడికిలెత్తిన ఉద్యమస్ఫూర్తి.. మహోజ్వలిత తేజం తమనంపల్లి అమృతరావు. ఆయన జీవితం ఆద్యంతం ఆదర్శనీయం. అక్టోబర్‌ 21న మహనీయుని జయంత్యుత్సవం సందర్భంగా ఆయన సేవా ప్రస్థానం స్మరణీయం..  

గుంటూరు: అమృతరావు గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం విశదల గ్రామంలో 1920 అక్టోబర్‌ 21న పేద దళిత కుటుంబంలో జన్మించారు. పేదరికం వల్ల విద్యను మధ్యలోనే ఆపేశారు. సామాజిక సేవలో నిమగ్నమయ్యారు. మహాత్మా గాంధీ పిలుపుతో 1940 దశకంలో స్వాతంత్య్రసమరంలోకి అడుగుపెట్టారు. 1942లో క్విట్‌ ఇండియా ఉద్యమంలో చురుగ్గా పాలుపంచుకున్నారు. గుంటూరులోని కొండా వెంకటప్పయ్య పంతులు ఇంటికి వచ్చినప్పుడు మహాత్మా గాంధీ అమృతరావును ప్రత్యేకంగా పిలిపించుకుని గంటకుపైగా మాట్లాడారట. ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించాలని సూచించారట. అమృతరావు కొండా వెంకటప్పయ్య పంతులు, ఉన్నవ లక్ష్మీనారాయణ, వింజమూరి భావనాచార్యులు, నడింపల్లి తదితరులతో కలిసి బ్రిటిష్‌ సేనలపై వీరోచితంగా పోరాడారు.   

ఆంధ్రరాష్ట్ర సాధన ఉద్యమానికి నాంది  
పొట్టి శ్రీరాములుకంటే ముందే అమృతరావు ఆంధ్రరాష్ట్ర సాధనకు నడుంకట్టారు. 1952 ఆగస్ట్‌ 2న మద్రాసు సెక్రటేరియెట్‌ ముందు ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. దీంతో స్పందించిన ప్రకాశం పంతులు ఇంత చిన్నవయసులో ఇంత పెద్ద ఉద్యమం వద్దని హితవు పలికి దీక్షను విరమింపజేశారు. ఆ తర్వాత  1952 అక్టోబర్‌లో పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్రం కోసం దీక్ష ప్రారంభించి ప్రాణత్యాగం చేశారు. అనంతరం మహాత్ముని సిద్ధాంతాల ప్రచారానికి అమృతరావు 1959లో గాంధీ మిషన్‌ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం దీనిని ఆయన వారసులు కొనసాగిస్తున్నారు.  


విశాఖ ఉద్యమంలో కీలకంగా..  

1964లో కేంద్ర ప్రభుత్వం విశాఖలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని ముందు ప్రకటించి ఆ తర్వాత వెనక్కుతగ్గింది. దీంతో అమృతరావు విశాఖపట్నం కలెక్టరేట్‌ ముందు నిరాహార దీక్ష చేపట్టారు. ‘విశాఖ ఉక్కు– ఆంధ్రుల హక్కు’ పేరుతో 21 రోజులపాటు దీక్షను నడపడం విశేషం. ఇది మహోద్యమంగా మారడంతో కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డిని ఢిల్లీకి పిలిపించుకుని స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు అంగీకారపత్రం అందజేశారు.  

► అనంతరం  1978–83 వరకు తాడికొండ  నియోజకవర్గం నుంచి అమృతరావు శాసన సభ్యుడిగా పనిచేశారు.

► అప్పట్లో జిల్లా కలెక్టర్‌ అమృతరావుకు ఇచ్చిన సుమారు 15 ఎకరాల భూమిని ఆయన పేదలకు పంచి పెట్టారు. ప్రస్తుతం పొట్టి శ్రీరాములు నగర్‌ ప్రాంతం అదే. స్వాతంత్య్ర సమరయోధుల కోటాలో ప్రభుత్వం ఇచ్చిన పింఛన్‌నూ తిరస్కరించిన నిజమైన దేశభక్తుడు అమృతరావు. ఆఖరుకు పేదరికంతోనే 1989 ఏప్రిల్‌ 27న 
ఆయన నెల్లూరులో కన్నుమూశారు.    


విశాఖలో విగ్రహం ఏర్పాటుచేసిన వైఎస్సార్‌  

అమృతరావు సేవలకు డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి అద్భుత గుర్తింపునిచ్చారు. వైఎస్సార్‌ ముఖ్యమంత్రిగా ఉండగా రూ.78 లక్షలతో విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ఆవరణలో అమృతరావు కాంస్య విగ్రహంతోపాటు ఆయన పేరుతో పార్క్‌నూ ఏర్పాటు చేశారు. 2008లో గుంటూరులోనూ అమృతరావు విగ్రహాన్ని ఏర్పాటుచేశారు.  


వైఎస్సార్‌ రుణం తీర్చుకోలేనిది 

తాతగారి ఉద్యమాలను, గొప్పదనాన్ని గుర్తించిన ఆనాటి ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి విశాఖలో కాంస్య  విగ్రహం ఏర్పాటు చేశారు. వైఎస్సార్‌ రుణం తీర్చుకోలేనిది. ప్రస్తుత ముఖ్యమంత్రి కూడా వైఎస్సార్‌ అడుగుజాడల్లోనే నడుస్తూ స్వాతంత్య్ర ఉద్యమకారులను గుర్తిస్తున్నారు. గుంటూరులోని సోషల్‌ వెల్ఫేర్‌ భవనానికి అమృతరావు పేరును పెట్టాలని కోరుతున్నాం.  
– తమనంపల్లి మోహన్‌ గాంధీ
గాంధీ మిషన్‌ అధ్యక్షులు (అమృతరావు మనవడు) 

 

గొప్ప నేతతో నా సాంగత్యం 

అమృతరావుతో నాకు సన్నిహిత సంబంధం ఉంది. ఆ రోజుల్లో ఆయన నిస్వార్థ ప్రజా సేవ ఎనలేనిది. ఆయన జ్ఞాపకార్థం 2008లో  స్థానిక అమరావతి రోడ్డులో అమృతరావు విగ్రహాన్ని వైఎస్సార్‌ ఏర్పాటు చేయడం అభినందనీయం. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా అమృతరావును స్మరించుకోవడం సంతోషంగా ఉంది. 
– వింజమూరి రాజగోపాలాచారి (బాబు), సీనియర్‌ న్యాయవాది

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement