గత రెండేళ్ల క్రితం నుంచి నవంబర్ 15 నాడు బిర్సా ముండా జయంతిని ‘జన్ జాతీయ గౌరవ్ దివస్’గా పాటిస్తున్నాం. ఇన్నేళ్లకైనా విస్మృత పోరాట యోధుణ్ణి స్మరించుకోవడం ఆనందదాయకం. ఆదివాసీల్లో పోరాట భావాలను రగిలించిన తొలి వీరుడు బిర్సా ముండా. నాటి బెంగాల్ ప్రావిన్స్‌లోని బిహార్ (నేటి జార్ఖండ్)లో ఆదివాసీల రాజ్యాన్ని తేవటానికి సమరశంఖం పూరించాడు. ఆయన తన ఆదివాసీ ప్రజలకు ‘రాణి రాజ్యానికి అంతం పలుకుదాం–మన రాజ్యాన్ని స్థాపిద్దాం’ అనే నినాదం ఇచ్చాడు. ఈ నినాదం ప్రజలను తిరుగుబాటు వైపుకు నడిపించింది.
ముండా తెగకు చెందిన సుగుణ, కార్మిహాలు దంపతులకు 1875 నవంబర్ 15న ఛోటానాగపూర్ సమీప చెల్కడ ప్రాంతంలోని బాబా గ్రామంలో ఆయన జన్మించాడు. ప్రాథమిక విద్యను కొద్దికాలం అభ్యసించిన తర్వాత ఒక జర్మన్ మిషనరీ స్కూల్లో చేరాడు. ఆ పాఠశాలలో చేరాలంటే క్రైస్తవుడై ఉండాలన్న నిబంధన ఉండడం వల్ల ఆయన మత మార్పిడి చేసుకున్నాడు. అయితే కొన్నేళ్లలోనే స్కూల్ నుంచి బయటికి వచ్చి క్రైస్తవాన్ని త్యజించి తన సొంత ఆదివాసీ ఆచారాలనే ఆచరించడం ప్రారంభించాడు. ఆదివాసీలందరినీ స్థానిక విశ్వాసాలనే అనుసరించమని బోధించాడు. తాను తన జాతీయులను ఉద్ధరించడానికి అవతరించినట్లు ప్రకటించాడు. ఆయన బోధనలు ప్రజలను తీవ్రంగా ప్రభావితం చేశాయి.
ముండా ప్రజలు ఆయన్ని దేవునిగా భావించి ‘భగవాన్’ అని పిలవడం ప్రారంభించారు. అయితే బిర్సా ముండాను అనుసరించనివారు ఊచకోతకు గురవుతారనే గాలివార్త ప్రచారంలోకి రావడంతో ఆయన్ని బ్రిటిష్‌వాళ్లు ఛోటానాగపూర్ ప్రాంతంలో 1895 ఆగస్టులో అరెస్ట్ చేసి రెండేళ్లకు పైగా జైల్లో ఉంచారు. దీంతో ఆయన విడుదల కోరుతూ జాతీయోద్యమకారులు పెద్దఎత్తున బ్రిటిషర్లపై ఒత్తిడి తెచ్చారు. ప్రభుత్వం ఎట్టకేలకు 1897 నవంబర్‌లో బిర్సాని విడుదల చేసింది.
ఆ రోజుల్లో బ్రిటిష్‌వాళ్లు, వాళ్ల తాబేదార్లు ఆదివాసీల సాగు భూములపై పన్నులు విధిస్తూ... వాటిని కట్టకపోతే ఆ భూములను జమీందారీ భూములుగా మార్చేవారు. దీంతో చాలా మంది ప్రజలు అస్సాంలోని తేయాకు తోటల్లో కూలి పనుల కోసం వలస వెళ్లేవారు. దీన్ని గమనించిన బిర్సా... వన జీవులందరినీ సమావేశపరిచి, బ్రిటిష్‌వాళ్లకు కప్పాలు కట్టవద్దనీ, వాళ్లను తరిమి కొట్టాలనీ పిలుపునిచ్చాడు. అనుచరులతో కలిసి బాణాలు ధరించి 1899 డిసెంబర్‌లో భారీ ‘ఉల్’ గులాన్’ (తిరుగుబాటు ర్యాలీ) నిర్వహించాడు.
చదవండి: ‘మేమున్నాం మీ వెంట’ అనే భరోసా ఇచ్చేదెవరు?
ఈ చర్యలను గమనించిన బ్రిటిష్ ప్రభుత్వం కుట్ర పన్ని 1900 ఫిబ్రవరి 3న బంధించి రాంచీ జైలుకు తరలించింది. కేసు విచారణలో ఉన్న కాలంలో జూన్ 9న జైల్లోనే ఆయన తుది శ్వాస విడిచాడు. చివరికి 1908లో బిటిష్ ప్రభుత్వం ఆదివాసీల భూములను ఆదివాసీలు కానివారికి బదిలీ చేయడాన్ని నిషేధిస్తూ ‘ది ఛోటానాగపూర్ టెనెన్సీ యాక్ట్’ను తీసుకువచ్చింది. అనంతర కాలంలో బిర్సా స్ఫూర్తితో ముండా, ఒరియాన్, సంతాల్ తెగలు తమ హక్కులను సాధించుకున్నాయి.
– గుమ్మడి లక్ష్మీనారాయణ, ఆదివాసీ రచయితల వేదిక వ్యవస్థాపక కార్యదర్శి, తెలంగాణ
(2024, నవంబర్ 15న బిర్సాముండా 150వ జయంతి ప్రారంభం)
Comments
Please login to add a commentAdd a comment