నాడు బ్రిటీషర్ల అరాచకాలను ఎదిరించిన ఆదివాసీ యోధుడు బిర్సా ముండా జయంతి నేడు. తన పోరాట పటిమతో ఆంగ్లేయులకు చెమటలు పట్టించిన బిర్సా ముండా చిన్నవయసులోనే కన్నుమూసినా, పది కాలాల పాటు అందరూ గుర్తు పెట్టుకునేలా బ్రిటీషర్లతో పోరాటం సాగించాడు. ఆనాటి బ్రిటీష్ దాష్టీకాల్ని ఎండగట్టాడు. ఆదివాసీలను సమీకరించి, వారిని చైతన్యవంతులను చేశాడు. ఆదివాసీల సమూహాన్ని ఏర్పాటు చేసి, అడవి బిడ్డల ఆరాధ్య దైవంగా బిర్సా ముండా పేరొందాడు.
అటవీ ప్రాంతంలోని గిరిజనుల భూముల హక్కులను పరిరక్షించే చట్టాలను ప్రవేశ పెట్టాలంటూ బిర్సా ముండా పోరాటం సాగించాడు. కేవలం 25 ఏళ్లు మాత్రమే జీవించిన ఈ ఆదివాసీ యోధుడు గిరిజన నాయకునిగా, స్వాతంత్ర సమర యోధునిగా గుర్తింపు పొందాడు. బీహార్, జార్ఖండ్ చుట్టు పక్కల నివసించిన ఈయన జాతీయ ఉద్యమంపై ఎనలేని ప్రభావం చూపాడు. బిర్సా ముండా పుట్టిన రోజున 2000లో ఆయనకు తగిన గౌరవాన్ని అందజేస్తూ కేంద్ర ప్రభుత్వం జార్ఖండ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది.
1875, నవంబర్ 15న జన్మించిన బిర్సా ముండా 1900 జూన్ 9న ఈ లోకం నుంచి నిష్క్రమించాడు. క్రైస్తవ మతాన్ని స్వీకరించినప్పటికీ బిర్సాముండా 1886 నుండి 1890 వరకూ మిషనరీకి, ఆంగ్లేయుల ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం సాగించాడు. గిరిజనులకు తగిన శిక్షణ ఇచ్చి, వారిని బ్రిటీషర్లపై పోరాడే యోధులుగా తీర్చిదిద్దాడు. 1900, మార్చి 3న బిర్సా ముండా జామ్ కోపాయ్ అడవిలో నిద్రిస్తున్న సమయంలో బ్రిటీష్ సైనికులు అతనిని అరెస్ట్ చేశారు. బిర్సాముండాను జైలులో పెట్టిన కొద్ది రోజులకే కన్నుమూశాడు.
ఇది కూడా చదవండి: మొసళ్ళతో మాట్లాడేవాడు..
Comments
Please login to add a commentAdd a comment